నీలోఫర్ హాస్పిటల్ కు కేటీఆర్.. హుజురాబాద్ దెబ్బకు మైండ్ బ్లాంక్!
posted on Nov 3, 2021 @ 4:56PM
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తుందా? గులాబీ లీడర్ల మైండ్ బ్లాంక్ అయిందా? అంటే అవుననే సమాధానమే వస్తోంది. మొదటి నుంచి తమకు కంచుకోటగా ఉన్న హుజురాబాద్ లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా గెలవకపోవడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలు ఢీలా పడిపోయారు. కౌంటింగ్ తర్వాత ఏ కారు పార్టీ లీడర్ ను చూసినా అదే పరిస్థితి కనిపించింది. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఓ పని కూడా ఇందుకు బలాన్నిస్తోంది.
జర్మనీ పర్యటన నుంచి తిరిగొచ్చిన కేటీఆర్.. తన వైఖరికి భిన్నంగా వ్యవహరించారు. సాధారణంగా పరామర్శలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన కుమారుడు కేటీఆర్ దూరంగా ఉంటారన్న వాదన ఉంది. అయితే బుధవారం నీలోఫర్ హాస్పిటల్ వెళ్లారు మంత్రి కేటీఆర్. అక్కడ చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించారు. ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం, అల్మాస్ పూర్ గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప మీద టీఆర్ఎస్ కు చెందిన స్థానిక నేత ఒకరు అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాపకు వైద్యం చేయటానికి స్థానిక ఆసుపత్రి సిబ్బంది నిరాకరించటం.. దీనిపై విమర్శలు రావటంతో హైదరాబాద్ తరలించారు. ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన కాసేపటికే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నీలోఫర్ ఆసుపత్రిని సందర్శించి.. బాధిత పాపను పరామర్శించారు. చిన్నారి పాప బంగారు భవిష్యత్తును నాశనం చేశారంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
అత్యాచార ఘటన జరిగింది మంత్రి కేటీఆర్ నియోజకవర్గం కావడంతో దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. దీంతో విమర్శలకు అవకాశం ఇవ్వకుండా కేటీఆర్ పరామర్శకు వెళ్లారని అంటున్నారు. సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమని నిందితుడు ఎవరైనా కఠిన శిక్షపడాల్సిందేనని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పాపకి అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. అంతేకాదు హుజూరాబాద్ ఫలితాన్ని తాము పెద్దగా పట్టించుకోలేదన్న భావన కలిగేలా మంత్రి కేటీఆర్ తీరు ఉందంటున్నారు.
కేటీఆర్ తీరుతో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ అధినాయకత్వం మైండ్ సెట్ ను మారుస్తుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఆరేళ్ల బాలికకు పరామర్శ కంటే కూడా.. ఆరోపణలు ఉన్న సొంత పార్టీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు.