కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్సీ ఫసక్!.. కేసీఆర్ లెక్క తప్పిందా? ఆయన వల్లే ఓటమా?
posted on Nov 3, 2021 @ 4:34PM
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో నెంబర్ 1 బకరా హరీశ్‌రావు అయితే.. బకరా నెంబర్ 2 కౌశిక్‌రెడ్డినే అంటున్నారు. అవును మరి, ఎన్నికల ముందు అంతన్నారు..ఇంతన్నారు.. టీఆర్ఎస్‌ను ఒంటి చేత్తో గెలిపించే సత్తా ఉందన్నారు. మందీమార్బలాన్ని పోగేసుకొచ్చి.. తెలంగాణ భవన్‌లో అట్టహాసంగా గులాబీ కండువా కప్పుకున్నారు. నగరమంతా తన ఫ్లెక్సీలు కట్టించుకొని.. ఫైన్లు కూడా కట్టారు. గత ఎన్నికల్లో తాను గెలవకున్నా.. ఈసారి టీఆర్ఎస్‌ను గెలిపిస్తానంటూ ఫోజులు కొట్టారు. ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డినే సవాల్ చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు హుజురాబాద్‌లో ఘోర పరాభవం మూటగట్టుకున్నారు. ముఖం చూపించలేక హైదరాబాద్ పారిపోయారని అంటున్నారు. ఇదంతా సరే.. మరి, కౌశిక్‌రెడ్డి భవితవ్యం ఏంటి? ఆయన ఎమ్మెల్సీ పరిస్థితేంటి?
కేసీఆర్ ట్రాప్‌లో అందరికన్నా ముందు చిక్కింది కౌశిక్‌రెడ్డినే. ఎమ్మెల్సీ ఇస్తాననగానే.. అంతకంటే మహాభాగ్యమా అన్నట్టు ఎగిరెగిరి పడ్డారు. ఎలాగూ తాను ఎమ్మెల్యేగా గెలిచేది లేదు కాబట్టి.. కనీసం ఎమ్మెల్సీగానైనా అధ్యక్షా అందామనుకున్నారు. అందుకే, ఉన్నట్టుండి గోడ దూకేసి.. రేవంత్‌రెడ్డిని ధిక్కరించేసి.. గులాబీ గూటిలో చేరిపోయారు. హుజురాబాద్ ఎన్నికల్లో కారు గుర్తు కోసం కాళ్లు అరిగేలా తిరిగారు. టీఆర్ఎస్ ఓటమితో ఇప్పుడు కౌశిక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అంటున్నారు. కేసీఆర్‌ను నమ్మి కౌశిక్‌రెడ్డి నట్టేట్లో మునిగారని చెబుతున్నారు. ఇటు ఆయనకు రావలసిన ఎమ్మెల్సీ పోస్టును గవర్నర్ తొక్కిపెట్టారు. అటు హుజురాబాద్‌లో ఓటమితో కేసీఆర్ ఆయన్ను పక్కన పెట్టేశారు. దీంతో ఇటు, అటు, ఎటూ కాకుండా పోయారు కౌశిక్‌రెడ్డి.
మరోవైపు, కౌశిక్‌రెడ్డి విషయంలో కేసీఆరే లెక్క తప్పారనే వాదనా ఉంది. గత ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కౌశిక్‌రెడ్డి 60వేలకు పైగా ఓట్లు సాధించారు. లోకల్‌గా బలమైన నాయకుడిగా పేరుంది. ఆయన వ్యక్తిగత ఇమేజ్.. హస్తం గుర్తు వల్లే.. ఆయనకు అన్ని ఓట్లు వచ్చాయి. అదే కౌశిక్‌రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం.. ఆయన నేరుగా కేండిడేట్‌గా లేకపోవడం.. అధికారపార్టీపై తీవ్ర వ్యతిరేకత.. అంతా కలగలిసి కారును గ్యారేజ్‌కి పంపించేశారు.
అదే, కౌశిక్‌రెడ్డి కాంగ్రెస్‌లోనే ఉండి ఉంటే.. ఆయన హస్తం గుర్తుపై పోటీ చేసి ఉంటే.. ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు ఈటల రాజేందర్, కౌశిక్‌రెడ్డిల మధ్య చీలిపోయి ఉండేదని.. ఆ మేరకు టీఆర్ఎస్‌కు లాభం జరిగుండేదనే విశ్లేషణ కూడా వినిపిస్తోంది. ఈ లెక్కన కౌశిక్‌రెడ్డి విషయంలో కేసీఆర్ లెక్క తప్పిందని అంటున్నారు. మరోవైపు, ఈసారి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇస్తారు కాబట్టి.. కౌశిక్‌రెడ్డి ముందుచూపుతో గెల్లు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించలేదని కూడా స్థానికంగా టాక్ నడుస్తోంది. ఏదిఏమైనా హుజురాబాద్ ఓటమితో బలిపశువు అయ్యే వారి జాబితాలో కౌశిక్‌రెడ్డినే నెంబర్ 2 అంటున్నారు. ఇక, నెంబర్ 1 బలిపశువు హరీశ్‌రావునే అని అంతా భావిస్తున్నారు.