భారత్ సెమీస్ ఆశలు సజీవం.. ఆప్ఘనీస్తాన్ పై ఘన విజయం
posted on Nov 3, 2021 @ 10:31PM
టీట్వంటీ ప్రపంచకప్ లో టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. పేలవమైన ఆట తీరుతో వరుస రెండు పరాజయాలతో అప్రతిష్ట మూటగట్టుకున్న కోహ్లీసేన.. ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో విశ్వరూపం ప్రదర్శించింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆప్ఘనీస్తాన్ ముందు 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత జట్టు.. బౌలింగ్ లోనూ అదరగొట్టింది. షమి, బూమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఓపెనర్లను తక్కువ స్కోర్లకే పెవిలియన్ పంపారు. అశ్విన్ మిడిలార్డర్ పనిపట్టారు. దీంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయింది ఆప్ఘన్ జట్టు. చివరి ఓవర్లలో నబీ కొంత దూకుడుగా ఆడటంతో ఆప్ఘన్ స్కోర్ 130 పరుగులు దాటింది.
టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించారు నబీ. కాసేపటికే ఆ నిర్ణయం ఎంత తప్పో తెలిసిపోయింది. కోహ్లీసేన బ్యాట్‌తో నిప్పులు చెరిగింది. నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి ఏకంగా 210 పరుగులు చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్లు రాహుల్, రోహిత్ చెలరేగిపోయారు, ఇద్దరూ ఎడాపెడా షాట్లు కొడుతూ తొలి వికెట్‌కు ఏకంగా 140 పరుగులు జోడించారు. రాహుల్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 69 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్‌తో 74 పరుగులు చేశాడు.
రాహుల్, రోహిత్ అవుటైన తర్వాత వచ్చిన రిషభ్ పంత్ కూడా చెలరేగిపోయాడు. రిషబ్ 13 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 27 పరులుగు చేశాజు. ఇక హార్దిక్ పాండ్యా ఆప్ఘన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. కేవలం 13 బంతుల్లోనే 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 35 పరుగులు చేశాడు. దీంతో భారత స్కోరు జెట్ స్పీడుతో పరిగెత్తి 210 పరుగులకు చేరింది. ఆప్ఘనీస్తాన్ తో ఘన విజయం సాధించడంతో గ్రూప్ 2లో భారత్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.