మహా పాదయాత్రకు మహా మద్దతు.. ప్రముఖుల సంఘీభావం...
posted on Nov 5, 2021 @ 10:58AM
అమరావతి రైతుల మహా పాదయాత్రకు వివిధ పార్టీలు, వర్గాల నుంచి భారీ మద్దతు వస్తోంది. పాదయాత్ర ఏప్రాంతానికి చేరితే.. ఆ ప్రాంతంలో అపూర్వ స్వాగతం లభిస్తోంది. ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రైతులు చేస్తున్న పాదయాత్ర ఐదో రోజుకు చేరింది.
ఐదోరోజు ప్రత్తిపాడులో రైతుల పాదయాత్రకు ఘన స్వాగతం లభించింది. స్థానికులు ఎద్దులతో రైతులకు స్వాగతం పలికారు. జై అమరావతి నినాదాలు చేస్తూ.. దారి పొడవునా స్కూల్ స్టూడెంట్స్ పాదయాత్రకు ఉత్సాహం నింపారు.
అమరాతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు పలు పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. టీడీపీ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రైతులతో కలసి ధూళిపాళ్ల పాదయాత్ర చేస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం సైతం మహా పాదయాత్రలో భాగస్వామ్యమయ్యారు. అమరావతి కోసం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. అమరావతి రాజధానికి కాంగ్రెస్ కట్టుబడ్డి ఉందని జేడీ శీలం తెలిపారు.