ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్! జగన్ కు చంద్రబాబు వార్నింగ్..
posted on Nov 4, 2021 @ 4:51PM
ఆంధ్రప్రదేశ్ లో గతంలో వివిధ కారణాలతో నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే అధికార పార్టీకి మద్దతుగా కొందరు అధికారులు రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. వైసీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా నియమించుకున్నారంటూ చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని ఫోటోలు ప్రదర్శించడంతో పాటు... గురజాల సంఘటనలపై వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని అన్నారు. ఫిర్యాదులు ఉన్న అధికారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు సహకరిస్తోందని... ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకని తీరుతామని స్పష్టం చేశారు.
నామినేషన్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు.. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టాన్ని వేరే వాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని కాచవరం గ్రామంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వమని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలను కూడా ఫాలో కావడం లేదని చంద్రబాబు అన్నారు.
నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని... ఆర్వోలు డ్రామాలు ఆడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని... వెంటాడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో దాఖలు చేసే వెసులుబాటు కల్పించటంతో పాటు స్కాన్ చేసిన ప్రతిని ఆర్వోకు ఈమెయిల్ చేసే వెసులుబాటు కల్పించాలని కోరామని తెలిపారు. కొంత మంది ఆర్వోలు నామినేషన్లను చెల్లకుండా చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లను చించేసిన సంఘటనలు జరిగాయన్నారు. అభ్యర్ధులు నామినేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ల దాఖలుకు ముందు.. తర్వాత సోషల్ మీడియాలో నామినేషన్ పత్రాలను పెట్టాలని టీడీపీ అధినేత అన్నారు.
ఎన్నికలు పకడ్బంధీగా జరిగితే వైసీప గెలవలేదన్నారు చంద్రబాబు. డబ్బులు కూడా కొంతమేర పనిచేస్తాయని అనేక సంఘటనలు రుజువు చేశాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహించారని విమర్శించారు. ఉన్మాదులు తప్ప ఎవ్వరూ చేయని రీతిలో వ్యవహరించారన్నారు. ఈసారైనా ఎన్నికల ప్రక్రియ పకడ్బంధీగా జరగాలని ఇప్పటికే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాని అన్నారు. 16 పాయింట్లతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లిఖిత పూర్వకంగా వినతిపత్రం ఇచ్చిందని చెప్పారు. దొంగ ఓట్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు.