డెంగీ డేంజర్ బెల్స్.. 9 రాష్ట్రాల్లో హైఅలర్ట్..
posted on Nov 3, 2021 @ 5:20PM
కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా పోనేలేదు. మూడో ముప్పు తొలిగి పోలేదు. ఉన్నవి సరిపోనట్టు.. కొత్తగా పాత రోగం డెంగీ విజృంభిస్తుండటం ఆందోళనకరంగా మారింది. సైలెంట్‌గా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా డెంగీ కలవరపెడుతోంది. ఒక్కసారిగా డెంగీ దోమలు రెచ్చిపోతున్నట్టున్నాయి. ఇటీవల భారీగా డెంగీ కేసులు నమోదవుతుండటంతో కేంద్రం సైతం ఉలిక్కిపడుతోంది. కొవిడ్ కట్టడిపై అంతా ఫోకస్ చేస్తున్న సమయంలో.. చాపకింద నీరులా డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తుండటం కలకలం రేపుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో డెంగీ కలవరపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హరియాణ, పంజాబ్, కేరళ, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. గతకొన్ని రోజులుగా ఢిల్లీ, యూపీ, హరియాణలో డెంగీతో చిన్నారులు చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో ఒక్క అక్టోబర్ నెలలోనే 1200 కేసులు వెలుగు చూశాయి.
అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం డెంగీ తీవ్రత ఎక్కువగా ఉన్న తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక బృందాలను పంపించింది. డెంగీ నివారణకు సాంకేతిక సహాయం అందించడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా రాష్ట్రాలకు ఈ బృందాలు సూచనలు చేయనున్నాయి. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సీడీసీ)తో పాటు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నిపుణులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు.
ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న 200 జిల్లాలను గుర్తించారు. డెంగీపై అవగాహన కార్యక్రమాల నిర్వహణతో పాటు.. వేగంగా వ్యాధి నిర్ధరణ పరీక్షలు జరిపేలా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలకు కేంద్ర బృందాలు సూచించనున్నాయి.