దీపావళిపై వివక్ష.. వసూల్ రెడ్డి నిద్రలేవడా.. హరీష్ పై ఈటల యుద్ధం.. టాప్ న్యూస్@ 7PM
posted on Nov 4, 2021 @ 7:30PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా నియమించుకున్నారంటూ చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని ఫోటోలు ప్రదర్శించడంతో పాటు... గురజాల సంఘటనలపై వీడియోలు ప్రదర్శించారు.
------
గతంలో వివిధ కారణాలతో వాయిదా పడిన స్థానిక ఎన్నికలకు బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే గురువారం దీపావళి పండుగ అయినా నామినేషన్లు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. దీపావళి పండుగ రోజున ఎన్నికల ప్రక్రియ కొనసాగించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ ఎన్నికల సంఘం, ప్రభుత్వం తీరుపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
----
వసూల్‌రెడ్డి నిద్రలేచేది ఎప్పుడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్‌పై బాదుడు ఆపేది ఎప్పుడని ఆయన నిలదీశారు. కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించి అన్ని రాష్ట్రాల సీఎంలు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నారన్నారు. హర్యానా, యూపీ ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్‌పై రూ.12 తగ్గించాయని చెప్పారు. అస్సోం, గోవా, త్రిపుర, మణిపూర్, కర్ణాటక పెట్రోల్, డీజిల్‌పై రూ.7 తగ్గించాయని గుర్తు చేశారు
----------
ఏపీ ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. చెరకు రైతుల బాధలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? అని ప్రశ్నించారు. రైతు సమస్యను శాంతిభద్రతల సమస్యగా మార్చే తీరు సరికాదన్నారు. విజయనగరం జిల్లా లచ్చయ్యపేట ఎన్.సి.ఎస్. చక్కెర కర్మాగారం దగ్గర రైతులు ఆందోళనలు చేస్తున్నారని, ప్రభుత్వం సరిగా స్పందించలేదని తప్పుబట్టారు.
-----
రైతుల మహా పాదయాత్రకు హైకోర్టు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. నాల్గవ రోజు పాదయాత్రలో హైకోర్టు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులకు మహిళలు హరతులు ఇచ్చారు. న్యాయవాదులే దేవుళ్లు అంటూ మహిళలు హరతులు ఇచ్చారు. అమరావతి మహా పాదయాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ‘అమరావతి’ రాజధాని కోసం రైతులు చేపట్టిన మహా పాదయాత్ర నాలుగవ రోజు కొనసాగింది.
------
ప్రముఖ దేవాలయం చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని గవర్నర్ తమిళిసై దంపతులు దర్శించుకున్నారు. దీపావళి సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తారు. గవర్నర్ తమిళిసై, ఆమె భర్త సౌందర రాజన్‌తో కలిసి ఆలయానికి విచ్చేశారు. వారికి ఆలయ ట్రస్టీ శశికళ తదితరులు స్వాగతం పలికారు. ఈసందర్భంగా గవర్నర్ దంపతులు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
------
మంత్రి హరీశ్‌రావుపై ఎమ్మెల్యే ఈటల ఫైర్ అయ్యారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సిద్ధిపేట ప్రజలు హరీశ్‌రావును గెలిపిస్తే.. ఆయన అధర్మం, అన్యాయం, దౌర్జన్యం పక్షాన నిలబడ్డారని తప్పుబట్టారు. హరీశ్‌రావు ఏ కుట్రలను, డబ్బులను మద్యాన్ని, దాబాయింపులను నమ్ముకున్నాడో వాటికే ఆయన బలయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.దళిత బంధును తెలంగాణ అంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
-----------
వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మర్రిగూడ సమీపంలో బస చేస్తున్నారు. క్యాంప్‌కు సమీపంలో బైక్ రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు గాయాలతో రోడ్డుపై పడిపోయారు. ఈ విషయం షర్మిల దృష్టికి రాగానే ఆమె స్వయంగా 108 అంబులెన్స్‌కు కాల్ చేశారు. అయితే అరగంట దాటినా అంబులెన్స్ రాకపోవడంతో.. తన కాన్వాయ్‌లోని అంబెలెన్స్‌ను ఘటనాస్థలికి పంపి.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
--------
దీపావళి సందర్భంగా భారత్ - పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇదే తరహాలో అట్టారీ-వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్, రాజస్థాన్‌లో రెండు దేశాల సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది.
-------
దేశ సరిహద్దులను నిరంతరం కాపాడుతున్న భారత జవాన్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. మాతృభూమి రక్షణ కవచాలు మన వీర జవాన్లని అభినందించారు. భారత సైనికులు కంటికి రెప్ప వేయకుండా దేశాన్ని కాపాడుతున్నందువల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. జమ్మూకశ్మర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు.