గెల్లుకు ఎమ్మెల్సీ.. కౌశిక్ రెడ్డికి మొండి చేయి! హుజురాబాద్ ఓటమితో కేసీఆర్ నయా ప్లాన్..
posted on Nov 3, 2021 @ 7:56PM
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీలో సెగలు రేపుతోంది. ఓటమిపై పోస్ట్ మార్టమ్ నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్.. ఎక్కడ తేడా కొట్టింది, ఎవరు హ్యాండిచ్చారు, ఓటర్లు ఏం ఆలోచించారు అన్న అంశాలపై ఆరా తీస్తున్నారట. విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లును.. ఈటల రాజేందర్ పై బరిలోకి దింపి అతన్ని బలి పశువు చేశారనే విమర్శలు జనాల నుంచి వస్తున్నాయని కొందరు టీఆర్ఎస్ నేతలు కేసీఆర్ కు చెప్పారని తెలుస్తోంది. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హుజురాబాద్ లో ఓడిపోతామని ముందే కేసీఆర్ కు తెలుసని, అందుకే ప్రచారానికి ఆయన రాలేదని, కేటీఆర్ ను కూడా పంపలేదనే ఆరోపణలు వస్తున్నాయి. తమ రాజకీయ క్రీడలో బీసీ నేతైన గెల్లును పావుగా వాడుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విపక్షాలు కూడా ఇవే ఆరోపణలు చేస్తుండటంతో గులాబీ బాస్ కొత్త ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
బీసీ వర్గాలను కూల్ చేసేలా హుజురాబాద్ లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయినా అతనిని శాసనమండలికి పంపాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. రెండు రోజుల క్రితమే ఎమ్మెల్యేల కోటాలో ఖాళీగా ఉన్న ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం ఆరు సీట్లు టీఆర్ఎస్ పార్టీకే దక్కనున్నాయి. దీంతో ఆరు పోస్టుల్లో ఒకటి బీసీ కోటాలో గెల్లుకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారని అంటున్నారు. గెల్లు ఓటమితో యాదవ సామాజిక వర్గంతో పాటు మరికొన్ని బీసీ సంఘాలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నాయి. గెల్లును మండలికి పంపాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో గెల్లును మండలికి పంపించడం ద్వారా ఆ వర్గాలను తమకు అనుకూలంగా మలుచుకోవచ్చని కేసీఆర్ భావిస్తున్నారని చెబుతున్నారు.
ఎమ్మెల్యేల కోటాలో వీలుకాకపోతే గవర్నర్ కోటాలోనూ గెల్లు శ్రీనివాస్ కు ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉంది. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని పాడి కౌశిక్ రెడ్డికి ఇస్తున్నట్లు గతంలో కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ లోనూ తీర్మానం చేసి గవర్నర్ కు పంపారు. అయితే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైల్ ను గవర్నర్ పెండింగులో పెట్టారు. కౌశిక్ రెడ్డిపై తొమ్మిది కేసులు ఉన్నాయని గవర్నర్ కు ఫిర్యాదులు వెళ్లాయని తెలుస్తోంది. దీంతో గవర్నర్ కోటాలో నేర చరిత్ర ఉన్నవారిని అపాయింట్ చేయకూడదనే భావనతోనే కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ ఫైలును తమిళి సై హోల్ట్ లో పెట్టారని అంటున్నారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ పై ప్రభుత్వం కూడా తర్వాత స్పందించలేదు. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డికి ఇవ్వాలనుకున్న ఎమ్మెల్సీ పోస్టును గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో భర్తీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక విషయంలో కౌశిక్ రెడ్డి తీరుపై సీఎం కేసీఆర్ కు ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తోంది. గెల్లు గెలుపు కోసం కౌశిక్ రెడ్డి మనస్పూర్తిగా పని చేయలేదని స్థానిక నేతలు పార్టీ పెద్దలకు చెప్పారని సమాచారం. ఈసారి గెల్లు శ్రీనివాస్ గెలిస్తే.. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇస్తారు కాబట్టి.. కౌశిక్‌రెడ్డి ముందుచూపుతో గెల్లు గెలుపు కోసం గట్టిగా ప్రయత్నించలేదని కూడా స్థానికంగా టాక్ నడుస్తోంది. ఇలా అన్ని అంశాలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.. కౌశిక్ రెడ్డికి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ పదవిని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు ఇవ్వాలని దాదాపుగా నిర్ణయించారని తెలుస్తోంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను మండలికి పంపిస్తే ఉద్యమకారుడికి సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని ,అది కూడా తమకు కలిసివస్తుందని గులాబీ బాస్ లెక్కలు వేస్తున్నట్లు చెబుతున్నారు.