మలాలా నిఖా.. బ్రిటన్‌లో సింపుల్‌గా షాదీ..
posted on Nov 10, 2021 @ 11:09AM
మలాలా యూసఫ్ జాయ్. పాకిస్తాన్‌లో బాలికల విద్యా కోసం నినదించిన గొంతుక. తాలిబన్ల తూటాలకు బెదరని బాలిక. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. తాజాగా, మలాలా వివాహ బంధంలో అడుగుపెట్టారు. అస్సర్‌తో నిఖా చేసుకున్నారు. బ్రిటన్, బర్మింగ్‌హమ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో షాదీ జరిగింది. 24 ఏళ్ల మలాలా తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. భర్త అస్సర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.
‘‘ఈ రోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది. అస్సర్, నేను జీవిత భాగస్వాములు అయ్యాం. బర్మింగ్‌హమ్‌లోని మా ఇంట్లో ఇరు కుటుంబాల సమక్షంలో నిరాడంబరంగా నిఖా వేడుకను నిర్వహించాం. మీ ఆశీస్సులు మాకు అందించండి. భార్యభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నాం’’ అని మలాలా ట్వీట్ చేశారు.
పాకిస్థాన్‌లోని స్వాత్ లోయలో జన్మించిన మలాలా బాలికల విద్య కోసం, ఉగ్రవాదుల అరాచకాలపై గళమెత్తారు. దీంతో 2012లో తాలిబన్లు పాఠశాల బస్సులోకి చొరబడి ఆమెపై కాల్పులు జరిపారు. మలాలా ఎడమ కణతిపై, శరీరంపై తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను పెషావర్‌కు తరలించి చికిత్స అందించడంతో ఆమె ప్రాణాలు నిలిచాయి. అయితే బుల్లెట్ గాయాల కారణంగా ఉత్తమ చికిత్స కోసం బ్రిటన్‌కు తరలించారు. పలు శస్త్రచికిత్సల తర్వాత మలాలా కోలుకున్నారు. అప్పటి నుంచీ బ్రిటన్‌లోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు మలాలా.
మలాలాపై దాడి ఘటన తర్వాత పాకిస్తాన్ మొదటిసారి విద్యా హక్కు బిల్లును రూపొందించింది. మలాలా తనపై జరిగిన దాడి, దాని అనంతర పరిణామాల గురించి ‘ఐ యామ్ మలాలా’ అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. పదహారేళ్ల వయసులోనే విద్యలో లింగ సమానత్వం ఆవశ్యకతపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రసంగించారు. మలాలా బాలికల విద్య కోసం పోరాడుతూనే ఉన్నారు. మలాలా ఫండ్ పేరుతో బాలికల విద్య కోసం ఛారిటీ సంస్థను నెలకొల్పారు. ఆమె సేవలను గుర్తించి 2014లో మలాలాకు నోబెల్ శాంతి బహుమతి వరించింది. 17 ఏళ్ల అతిపిన్న వయస్కురాలిగా నోబెల్ శాంతి బహుమతి అందుకున్న వ్యక్తిగా మాలాలా వార్తల్లో నిలిచారు. 2020లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. అప్ఘానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో మహిళలు పడుతున్న ఇబ్బందులపై మలాలా ఆందోళన వ్యక్తం చేశారు.