పాక్‌లో హిందూ టెంపుల్ వివాదం.. ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇమ్రాన్ ప్రభుత్వం
posted on Nov 9, 2021 @ 5:00PM
అసలే పాకిస్తాన్. మత ఛాందస దేశం. హిందువులంటే ఫుల్ ధ్వేషం. అలాంటి పాక్ గడ్డపై ఐదేళ్ల క్రితం తొలిసారిగా మందిరం నిర్మాణానికి స్థలం కేటాయించింది అక్కడి ప్రభుత్వం. భూమి అయితే ఇచ్చారు కానీ.. అందులో టెంపుల్ కట్టనీయకుండా అనేక కొర్రీలు పెడుతూ వచ్చారు. పాక్ పౌరులు హిందూ టెంపుల్‌కు అనుకూలంగా ఉద్యమించారు. విషయం ఇస్లామాబాద్ హైకోర్టు వరకూ వెళ్లింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. చివరాఖరికి మందిరం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. పాకిస్తాన్‌లో అసలేం జరిగిందంటే...
ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా మందిర నిర్మాణం కోసం 2016లో అర ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇందులో మందిరంతో పాటు కమ్యూనిటీ సెంటర్, హిందూ స్మశాన వాటికను నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీడీఏ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. మందిర నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ) స్వాధీనం చేసుకుంది.
మందిర స్థలం స్వాధీనంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. ఇస్లామాబాద్‌లో నిరసనలు వ్యక్త మయ్యాయి. నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో సీడీఏ దిగిరాక తప్పలేదు. మందిరానికి కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు నిర్మాణాలకు సముఖత వ్యక్తం చేశారు.
ఈ విషయంపై ఇస్లామాబాద్ హైకోర్టు తాజాగా విచారణ చేపట్టింది. తాము ఎవరికీ వ్యతిరేకంగా వ్యవహరించలేదని, కొన్ని కారణాల దృష్ట్యా నిర్మాణాల్ని అడ్డుకున్నామని సీడీఏ చెప్పింది. విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలతో పాటు ప్రార్థనా మందిరాల నిర్మాణాలను కూడా నిలిపివేసినట్లు సీడీఏ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో ఆలయ నిర్మాణ స్థల వివాదం తొలగిపోయినట్టైంది.