సీనియర్ల దూకుడు.. జూనియర్ల దేకుడు! టీడీపీ వారసులెక్కడ?
posted on Nov 10, 2021 @ 2:22PM
''నెత్తురు మండే, శక్తులు నిండే, సైనికులారా! రారండీ!'' అంటూ యువతకు పిలుపునిస్తాడు మహాకవి శ్రీశ్రీ. ''ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం'' అన్నారు స్వామి వివేకానందుడు. ప్రస్తుతం టీడీపీ సైతం ఇలాంటి నినాదమే ఇస్తోంది. నవతరం కదలిరావాల్సిన సమయం ఆసన్నమైందని అంటోంది. 153మంది ఎమ్మెల్యేల బలంతో విర్రవీగుతూ.. ఏపీలో అరాచక పాలన నడిపిస్తున్నారు జగన్‌రెడ్డి. రాష్ట్ర రాజధానిని మూడు ముక్కలు చేయడం మొదలు.. పనికిమాలిన మద్యం పాలసీ, రాలిపోతున్న నవరత్నాలు, అప్పులతో దివాళా అంచునకు చేరిన ఆర్థిక దుస్థితి.. ఇలా సైన్‌రైజ్ స్టేట్‌ను సన్‌సెట్ స్టేట్‌గా మార్చేసి.. అభివృద్ధిని అటకెక్కించేసిన ఘనుడు జగన్‌రెడ్డి. మరి, ఇలాంటి చేతగాని ప్రభుత్వంపై గట్టి పోరాటం చేయాల్సిన సమయంలో.. చేవ కలిగిన పసుపు సైన్యం ముందుకు రావాల్సిన తరుణంలో.. యువ నేతలంతా వెనకే ఉండటం దారుణం. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ డైనమిక్‌గా వ్యవహరిస్తూ.. జగన్ సర్కారుపై ఎంతో దూకుడుగా దాడి చేస్తున్నా.. ఆయనకు అండగా టీడీపీ యువ నాయకులు కలిసి రాకపోవడంపై సీనియర్లు మండిపడుతున్నారు. వారసులంతా ఏమైపోయారనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెంనాయుడు మైకు పట్టుకున్నారంటే.. వైసీపీ ప్రభుత్వం షేక్ అవ్వాల్సిందే. అందుకే, నోరున్న ఆ నేతను ఈఎస్ఐ కేసుతో నోరు మూయించే ప్రయత్నం చేసింది. అయినా, అచ్చెన్న అదరలేదు..బెదరలేదు..జోరు తగ్గించలేదు. అచ్చెన్నకు సమానంగా అయ్యన్న సైతం అదే జోరు కనబరుస్తున్నారు. అచ్చెన్న, అయ్యన్న అనే కాదు.. అనేక మంది టీడీపీ నేతలు జగన్‌రెడ్డి అడ్డగోలు పాలనపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. కుట్రలు, కేసులు, అరెస్టులకు అసలే మాత్రం భయపడటం లేదు. జైల్లో పెట్టిన.. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చి వైసీపీ సర్కారుతో యుద్ధమే చేస్తున్నారు. రివర్స్ టెండరింగ్, అక్రమ మైనింగ్‌పై దేవినేని ఉమా చేసిన, చేస్తున్న పోరాటానికి ఫలితం.. కేసులు, నోటీసులు.
ఇక ధూళిపాళ్ల నరేంద్రను జగన్ సర్కారు ఎంతగా వేధించిందో రాష్ట్ర మంతా చూసింది. అటు.. కొల్లు రవీంద్రను ఏకంగా మర్డర్ కేసులో ఇరికించడం.. చింతమనేని ప్రభాకర్‌పై కేసుల మీద కేసులు పెట్టడం.. జేసీ బ్రదర్స్ ఆర్థిక మూలాలను దొబ్బకొట్టి.. వరుసబెట్టి కేసులు పెట్టి.. టీడీపీ సీనియర్లను ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. రాజ్యం నుంచి ఎంతగా ప్రెజర్ పెరుగుతున్నా.. సీనియర్లు మాత్రం తగ్గేదే లే అంటూ సమరం కొనసాగిస్తున్నారు. ప్రజల తరఫున టీడీపీ వాయిస్‌ను బలంగా వినిపిస్తున్నారు. అయితే, సీనియర్లు ముందు వరుసలో పోరాడుతున్నా.. మద్దతుగా మరింత దూకుడుగా రాజకీయం చేయాల్సిన యువనేతలు మాత్రం పత్తా లేకుండా పోవడం టీడీపీకి మైనస్‌గా మారిందంటున్నారు.
మంత్రులు కొడాలి నానినో, అనిల్‌కుమారో నోరేసుకు పడుతుంటే.. వారి స్థాయికి దిగజారి అచ్చెన్న, అయ్యన్న లాంటి సీనియర్లు సమాధానం చెప్పడం కాస్త ఇబ్బందికరమే. హుందాగా రాజకీయం చేసే సీనియర్లు.. ఇలాంటి చిల్లర పాలిటిక్స్ చేయడం కాస్త కష్టమే. అదే టీడీపీ తరఫున ఫైర్‌బ్రాండ్ లాంటి యువనేతలు ముందుకొచ్చి.. వైసీపీ బూతులకు గట్టి సమాధానం చెబుతూ ఉంటే.. అధికార పార్టీకి ధీటుగా ఉండేది. కానీ, నెత్తురు మండే, శక్తులు నిండే.. యువనేతలు అడ్రస్ లేకుండా పోయారు. కొందరు మాత్రం యాక్టివ్‌గానే ఉన్నా.. చాలామంది సోదిలో లేకుండా పోయారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, పరిటాల శ్రీరామ్, చింతకాయల విజయ్..లాంటి వాళ్లు మాత్రమే ధీటుగా జవాబిస్తూ సత్తా చూపిస్తున్నారు. కానీ, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనయుడు భాను ప్రకాష్, కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం, జేసీ పవన్, గల్లా జయదేవ్ , భూమా అఖిలప్రియ లాంటి వాళ్లు యాక్టివ్‌గా లేకపోవడంపై విమర్శలు ఉన్నాయి.
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ఉన్న తండ్రులను చూసుకొని ఒకప్పుడు బాగా హడావుడి చేసిన యువ నాయకులు.. ఇప్పుడు పార్టీకి అవసరం అయినప్పుడు మాత్రం ముఖం చాటేయడంపై అధిష్టానం ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. మెజార్టీ యువనేతలు హైదరాబాద్ లోనే ఉంటూ.. వ్యాపారాలు చేసుకుంటున్నారే కానీ.. పార్టీ తరఫున ప్రభుత్వంపై గట్టిగా పోరాడేందుకు ముందుకు రాకపోవడంపై మండిపడుతున్నారు. ఏపీలో ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ఎక్కడ, ఏ కష్టం వచ్చినా.. వెంటనే నేనున్నానంటూ ముందుకు వస్తూ.. జగన్‌రెడ్డి ప్రభుత్వంపై దూకుడుగా దాడి చేస్తున్న నారా లోకేశ్‌ను స్పూర్తిగా తీసుకొని అయినా.. నెక్ట్స్ జనరేషన్ తమ నాయకత్వ పటిమను చాటుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి అవసరం ఉన్నప్పుడు పట్టించుకోకుండా.. రేపు అధికారంలోకి వచ్చాక తగదునమ్మా అంటూ పదవుల కోసం ముందుకొస్తే ఎలాంటి ఉపయోగం ఉండదు. టీడీపీకి యువ నేతల అవసరం ఇప్పుడే ఉంది.