కాంగ్రెస్ ఓట్లను రేవంత్ అమ్మేసుకున్నాడా?
posted on Nov 10, 2021 @ 1:58PM
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన వారం రోజులు దాటినా రాజకీయ కాక మాత్రం చల్లారడం లేదు. ఉపఎన్నికపై నాయకులు మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. విజయం ఇచ్చిన జోష్ లో ఉన్న కమలనాధులు సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ను మరింతగా టార్గెట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీకి కౌంటరిచ్చారు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు. బీజేపీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు మోత్కుపల్లి నర్సింహులు.దళితబంధు అమలైతే దళితులంతా కేసీఆర్ వెంట ఉంటారని భయపడుతున్నారని విమర్శించారు. బండి సంజయ్ దళిత బంధు ఉండాలనుకుంటున్నాడా లేదా వద్దనుకుంటున్నాడా అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా దళితబంధు లాంటి పథకం ఉందా అని ప్రశ్నించారు. ఒక దళితుడిగా బీజేపీ చర్యలను ఖండిస్తున్నానని చెప్పారు. 70 ఏండ్లలో దళితులకు ఏనాడూ న్యాయం జరగలేదన్నారు. అంబేద్కర్ ఆలోచనలు అమలుచేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని తేల్చిచెప్పారు.బండి సంజయ్‌కి సిగ్గులేదని, తమ కులం వెంట పడుతున్నాడని మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడిపోతారన్నారు.
కేంద్రం అన్ని రంగాలను ప్రైవేట్‌పరం చేస్తున్నదని, బడుగుబలహీన వర్గాలను బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని మోత్కుపల్లి నర్సింహులు ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరలను రోజూ పెంచితే ప్రజలు ఎట్ల బతుకుతారని ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. బీజేపీకి దమ్ముంటే దేశమంతా దళితబంధు అమలుచేయాలని సవాల్ విసిరారు. బీజేపీకి వ్యతిరేకంగా ఊరూరా నిరసనలు తెలుపుతామన్నారు. బండి సంజయ్ అరిచేదేదో ఢిల్లీకి వెళ్లి అరవాలని మోత్కుపల్లి సూచించారు.
బీజేపీ, కాంగ్రెస్ అపవిత్ర కలయిక వల్ల హుజురాబాద్ లో ఈటల గెలిచారని నర్సింహులు విమర్శించారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో మూడు వేల ఓట్లే వచ్చినా రేవంత్ రెడ్డి సిగ్గులేకుండా పీసీసీ చీఫ్‌గా కొనసాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ఓట్లను రేవంత్ రెడ్డి గుండుగుత్తగా ఈటలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. దొంగలకు సద్దికట్టే ప్రభుత్వం బీజేపీ అని విమర్శించారు. నీతిమంతులెవరూ బీజేపీలో ఉండలేరని చెప్పారు. పేదలు, దళితులంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు.