కుప్పంలో బుల్లెట్ దాడి.. వైసీపీ ఆగడాలపై చంద్రబాబు సీరియస్
posted on Nov 9, 2021 @ 5:44PM
ప్రశాంతంగా ఉండే కుప్పంలో అలజడి సృష్టిస్తున్నారంటూ వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. గత స్థానిక సంస్థల ఎన్నికలను పోలీసుల సహకారంతో వైసీపీ ప్రహసనంగా మార్చి వేసిందన్నారు. ఈ సారి కూడా నామినేషన్లు, విత్ డ్రాలలో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.
‘‘కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదు.. ఇక్కడ గతంలో గొడవలు జరిగిన సందర్భం లేదు. టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వెంకటేశ్‌ను బుల్లెట్‌తో ఢీకొట్టి అతని వద్ద ఉన్న పత్రాలు లాక్కెళ్లారు. పోలీసుల సాయంతో రెండో రోజు నామినేషన్ వేశారు. కానీ, తుది అభ్యర్థుల జాబితాలో వెంకటేశ్ పేరు తీసేశారు. అమర్నాథ్‌రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి ఈడ్చుకెళ్లారు. తప్పు చేసింది కాక... మళ్ళీ టీడీపీ నేతలపై కేసులు పెడతారా.?. నాకు దండ వేశాడని పుంగనూరులో రమణా రెడ్డి అనే వ్యక్తి ప్రహరీ గోడను కూల్చి వేశారు. గోడ కూల్చిన వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మళ్లీ రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. చట్టాన్ని ఉల్లంఘించిన వారు ఎవరైనా సరే సాక్ష్యాధారాలతో దోషులుగా నిలబెడతాం’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
కుప్పంలో దళితులు, BC వర్గాలను ఎన్నికల్లో అడ్డుకున్నారని చంద్రబాబు చెప్పారు. అభ్యర్థుల సంతకాలు లేకుండా విత్ డ్రా అయినట్టు ఎలా ప్రకటిస్తారని.. నామినేషన్‌లు విత్ డ్రా తరువాత కుప్పంలో ఫైనల్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఇక, తాము నామినేషన్ వెనక్కి తీసుకోలేదని కుప్పం 14వ వార్డుకు నామినేషన్ వేసిన అభ్యర్థులు చంద్రబాబు సమక్షంలో ప్రకటించారు.
టీడీపీ నేతలు తమను కిడ్నాప్ చేశారనేది అవాస్తవమని 14వ వార్డు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన ఎం.ప్రకాశ్, అతని భార్య తిరుమగళ్ మీడియాకు వివరించారు. కుప్పం నుంచి మంగళగిరి వచ్చిన వారు చంద్రబాబును కలిశారు. కుప్పంలో తాము నామినేషన్లు విత్‌డ్రా చేసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘నామినేషన్ వేసిన తర్వాత మేం సొంత పనిపై ఊరెళ్లాం. మమ్మల్ని కిడ్నాప్ చేసినట్టు టీవీలో చూసి ఆశ్చర్యపోయాం. మమ్మల్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వీడియో మెసేజ్ ద్వారా తెలిపాం. అకారణంగా మా నామినేషన్లు తిరస్కరించారు. మాకు న్యాయం చేయాలి. మా కుటుంబాన్ని వైసీపీ నేతలు బెదిరించారు. అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తాం’’ అని 14 వార్డు అభ్యర్థులు తెలిపారు.