కుప్పంలో రచ్చ.. మంత్రికి సెగ.. గులాబీ గర్జన వాయిదా.. టాప్ న్యూస్@7PM
posted on Nov 9, 2021 @ 6:29PM
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. గురువారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే గవర్నర్ల సదస్సుకు బిశ్వభూషణ్ హాజరుకానున్నారు. బుధవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని గవర్నర్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు గవర్నర్ రానున్నారు.
-----------
వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. నామినేషన్లు వేయకుండా దారికాచి అడ్డుకున్నారని, ఇష్టానుసారం వ్యవహరిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ధ్వజమెత్తారు.
----
భువనేశ్వర్ లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రధానంగా మూడు అంశాలపై నవీన్ పట్నాయక్ తో చర్చించారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట, జంఝావతి ప్రాజెక్టు, సరిహద్దులోని కొఠియా గ్రామాలే అజెండాగా ఈ సమావేశం జరిగింది. సమస్యల పరిష్కారానికి ఉభయ రాష్ట్రాల సీఎస్ లతో జాయింట్ కమిటీ వేయాలని ఇరువురు సీఎంలు నిర్ణయించారు. ఈ మేరకు సీఎం జగన్, నవీన్ పట్నాయక్ సంయుక్త ప్రకటన చేశారు.
----
మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్‌మీట్‌ను విజయవాడలో విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. అనంతపురం ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. అనంతపురంలో విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేసారు. విద్యార్థులపై దాడికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసాయి. విద్యార్థి సంఘాలకు వివరణ ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నం చేసారు.
---------
రాష్ట్రంలో అధికారం రొటేషన్ పద్దతిలో ఉండాలని, రెండు సామాజిక వర్గాలకు పరిమితం కాకూడదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువులు రెట్లు మండిపోతున్నాయని ఆయన ఆరోపించారు. కారుచౌకగా హెరాయిన్ వంటి మత్తు పదార్ధాలు దొరుకుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు
---------
ఈ నెల 29న వరంగల్ లో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన విజయ గర్జన సభ మరోసారి వాయిదా పడింది. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడడంతో సభ వాయిదా పడింది. వాస్తవానికి ఈ నెల 15నే వరంగల్ లో విజయ గర్జన సభ నిర్వహించాలని భావించారు. అయితే దీక్షా దివస్ నేపథ్యంలో ఈ నెల 29కి వాయిదా వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇది కూడా వాయిదా పడింది.
------
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. దళితబంధు ఇవ్వకుంటే ప్రగతి భవన్‌లో చావు డప్పు తప్పదని ఈటల రాజేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరిగిన బీజేపీ డప్పు మోత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హుజురాబాద్ ఎన్నిక స్ఫూర్తితో దళితుల కోసం జరిగే ప్రతి పోరాటంలో పాల్గొంటానని ఈటల హామీ ఇచ్చారు
-----------
హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చుపై జయప్రకాష్ నారాయణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నాయన్నారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉభయ పార్టీలు పెట్టిన ఖర్చు కంటే... హుజురాబాద్‌లో పెట్టిన డబ్బులు ఎక్కువని విమర్శించారు. దళితబంధు తరహాలో ఎక్కడా ఇంత డబ్బు వృథా అవ్వలేదన్నారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాల్లో పెట్టాల్సిన డబ్బును.. ఇలా ఇవ్వడం అనైతికమన్నారు.
---------
రానున్న ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకు సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అత్తరును విడుదల చేశారు. 2022లో ఈ సెంటు అద్భుతాలు సృష్టిస్తుందని చెప్పారు. 22 సహజసిద్ధ సుగంధాలతో తయారు చేసిన దీనికి ‘సమాజ్‌వాదీ అత్తరు’ అని పేరు పెట్టారు. దీనిని ఎరుపు, ఆకుపచ్చ రంగులు కలిసిన గాజు సీసాలలో ఉంచి, పైన సైకిలు గుర్తును ముద్రించారు. దీని కవరుపై అఖిలేశ్ బొమ్మ కూడా ఉంది.
-------
జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్టు కోహ్లీ చెప్పాడు. కెప్టెన్‌గా గత ఆరేడేళ్లుగా విపరీతమైన భారం, పని ఒత్తిడి అనుభవించానని చెప్పాడు. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు. ఈ టోర్నీలో బాగా రాణించలేదని తెలుసని పేర్కొన్న కోహ్లీ.. తమ ఆటగాళ్లు మాత్రం అద్భుతంగా రాణించారంటూ ప్రశంసలు కురిపించాడు. తొలి రెండు ఓవర్లలో బాగా ఆడిన జట్టే పైచేయి సాధిస్తుందని, తొలి రెండు మ్యాచుల్లో అలా ఆడకపోవడమే తమ కొంప ముంచిందని అన్నాడు.