మళ్లీ ఉద్యమ నేతగా కేసీఆర్.. బీజేపీని తరిమి కొట్టేలా వ్యూహం!
posted on Nov 9, 2021 @ 4:37PM
రెండు ప్రెస్‌మీట్లు. రెండే రెండు ప్రెస్‌మీట్లతో కేసీఆర్‌లో మళ్లీ మునుపటి ఉద్యమ నేత కనిపించారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో మళ్లీ ఉద్యమిద్దామని పిలుపు ఇస్తున్నారు. రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని తరిమి కొడతామంటున్నారు. పెట్రో ధరలు పెంపునకు వ్యతిరేకంగా ధర్నాలతో దుమ్ము రేపేందుకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ ఏడేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కేసీఆర్ అసలు రూపం చూపిస్తున్నారని కేటీఆర్ అంటున్నారు. కేసీఆర్‌ను ఇలాగే చూడాలని రాష్ట్రంలోని అందరూ కోరుతున్నారని అన్నారు.
పక్క రాష్ట్రంలోని బీజేపీ నేతలకు మన అభివృద్ధి కనిపిస్తోందని కానీ.. మన పక్కనున్న వారికి తెలియడం లేదని మంత్రి కేటీఆర్ రాష్ట్ర బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కళ్లుండి చూడలేని కబోదులు ఇక్కడి బీజేపీ నేతలని మండిపడ్డారు. ఢిల్లీ బీజేపీ నేతలు వరి వేయొద్దంటారు కానీ, ఇక్కడి సిల్లీ బీజేపీ నేతలు వరి వేయాలంటారని కేటీఆర్ తప్పుబట్టారు.
పనిలో పనిగా కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు. కాంగ్రెస్‌కు 60 ఏళ్లు అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పళ్లు తోమారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని అనడానికి కాంగ్రెస్‌కు సిగ్గుండాలని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.