అనంతలో లోకేశ్.. ఈటల ఆగయా.. షర్మిల 72 గంటల దీక్ష.. టాప్‌న్యూస్ @1pm
posted on Nov 10, 2021 @ 11:51AM
1. అనంతపురం ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల దగ్గర విద్యార్థుల ఆందోళనతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. విద్యార్థులు కాలేజ్ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. విద్యార్థులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరోవైపు నారా లోకేష్‌కు అనంత జిల్లా సరిహద్దుల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
2. కుప్పంలో రాత్రి జరిగిన సంఘటన బ్లాక్ డే అని టీడీపీ విమర్శించింది. అర్ధరాత్రి దాటాక బలవంతంగా పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టు చేసి బయటకు గెంటి వేయడం దారుణమని మండిపడింది. పులివెందల రాజారెడ్డి రాజ్యాంగాన్ని జగన్‌మోహన్ రెడ్డి అమలు చేయడం, భయబ్రాంతులకు గురి చేయడం ప్రజలు సహించరన్నారు.
3. హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఈటల రాజేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో ఈటలతో స్పీకర్ పోచారం శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈటల వెంట జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, తుల ఉమ, ఏనుగు రవీందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు రాజేందర్.. గన్ పార్క్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు.
4. ప్రభుత్వ ఆస్పత్రిలో భద్రాద్రి కలెక్టర్ సతీమణి పురుడు పోసుకున్నారు. ఈ విషయం తెలిసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కలెక్టర్ దంపతులకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరువగైన సేవలు అందిస్తున్నాయని ట్విట్టర్‌లో మంత్రి హరీష్ తెలిపారు.
5. మంత్రి అవంతి శ్రీనివాస్ వాహనం ఢీ కొనడంతో సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి అవంతి ఇంటి ముందు నిరసనకు దిగారు. సీసీ పూటేజీలో మంత్రి వాహనమే ఢీ కొట్టినట్లు చూసామని మృతుని బంధువులు అంటున్నారు. తమ కుటుంబానికి ప్రభుత్వం తరఫున న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
6. ఇందిరా పార్క్ దగ్గర ఈనెల 12న రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆందోళనపై మంత్రి తలసాని సమాధానం దాటవేశారు. గతంలో ధర్నా చౌక్ వద్ద ప్రతిపక్షాల ఆందోళనలకు అనుమతి ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు టీఆర్ఎస్‌కు మాత్రం ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు పర్మిషన్ ఎలా ఇస్తుందని ప్రశ్నించగా మంత్రి సమాధానం ఇవ్వలేకపోయారు.
7. బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసై పోతారని హెచ్చరించారు. బీజేపీ నేతలు దళిత బంధు కోసం డప్పులు కొట్టడం దురదృష్టకరమన్నారు. బండి సంజయ్ దళిత బంధు వద్దని డప్పు కొడుతున్నట్లుగా ఉందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు ఉందా? అని మోత్కుపల్లి ప్రశ్నించారు.
8. రైతుల కోసం 72 గంటల దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటి యాసంగి పంటనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై నెపం మోపి తప్పించుకోవాలని చూస్తే వదలబోమని హెచ్చరించారు షర్మిల.
9. అమరావతి రాజధాని కోసం రైతులు చేపట్టిన మహాపాదయాత్ర పదవ రోజు కొనసాగుతోంది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు సమీప గ్రామాల మహిళలు భారీ ఎత్తున తరలి వచ్చారు.
10. మలాలా యూసఫ్ జాయ్. పాకిస్తాన్‌లో బాలికల విద్యా కోసం నినదించిన గొంతుక. తాలిబన్ల తూటాలకు బెదరని బాలిక. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత. తాజాగా, మలాలా వివాహ బంధంలో అడుగుపెట్టారు. పాక్ క్రికెట్ కోచ్ అస్సర్‌తో నిఖా చేసుకున్నారు. బ్రిటన్, బర్మింగ్‌హమ్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో షాదీ జరిగింది. 24 ఏళ్ల మలాలా తన పెళ్లి విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. భర్త అస్సర్‌తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.