బిగ్ బ్రేకింగ్ : హరీష్ రావుకు ఈటల రాజేందర్ శాఖ!
posted on Nov 9, 2021 @ 7:48PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంత్రివర్గంలో మార్పులు చేశారు. ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావుకు మరో కీలక శాఖ అప్పగించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిర్వహించిన వైద్య ఆరోగ్య శాఖను హరీష్ రావుకు అప్పగిస్తూ గవర్నర్ కు ఫైలు పంపారు సీఎం కేసీఆర్. ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ కూడా ఆమోద ముద్ర వేశారు. దీంతో ఆర్థిక శాఖతో పాటు వైద్య ఆరోగ్య శాఖను నిర్వహించనున్నారు హరీష్ రావు.
జూన్ లో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. దళితుల అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారనే ఆరోపణలతో ఈటలను తొలగించారు. తర్వాత ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరారు. ఇటీవలే జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించారు. ఉప ఎన్నికలో ఈటలను ఓడించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు హరీష్ రావు. ఇప్పుడు ఈటల నిర్వహించిన శాఖనే హరీష్ రావుకు ముఖ్యమంత్రి అప్పగించడం ఆసక్తిగా మారింది.