జగన్ కు గాయం.. పోలీసుల రచ్చ.. గులాబీ గర్జన.. టాప్ న్యూస్@1PM
posted on Nov 12, 2021 @ 11:45AM
కుప్పంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. బండ శెట్టిపల్లి ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొన్నారు. రెండున్నరేళ్లుగా కుప్పంను పట్టించుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు వచ్చి కుక్కల్లా మొరుగుతున్నారని విమర్శించారు. వైసీపీ రౌడీలు, గుండాలు, ఎర్ర చందనం స్మగ్లర్లు ప్రశాంతమైన కుప్పం వచ్చి అరాచకం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం బాటిల్ దగ్గర్నుంచి నిత్యం తినే పప్పు, ఉప్పు వరకు అన్ని రకాల ధరలను వైసీపీ అమాంతం పెంచేసిందన్నారు లోకేష్.
--------
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాయమైంది. ఆయన కుడి కాలుకు గాయం కావడంతో.. ఆయన చికిత్స కోసం తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ కు వెళ్లారు. సుమారు రెండు గంటల పాటు ఆయన అక్కడే ఉన్నారు. ఆసుపత్రిలోని ప్రత్యేక విశ్రాంతి గదిలో సీఎం జగన్‌కు చికిత్స నిర్వహించారు డాక్టర్లు. చికిత్స ముగిసిన తర్వాత మణిపాల్ ఆసుపత్రి నుంచి ఆయన తన నివాసానికి వెళ్లిపోయారు.
---
ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనానికి వ్యతిరేకంగా కాకినాడలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు ప్రతాపం చూపించారు. దొరికిన వారిని దొరికినట్లు విద్యార్థులను లాఠీలతో చితక్కొట్టారు. విద్యార్థులు కలెక్టరేట్ గేటును నెట్టి లోపలకు వెళ్లే ప్రయత్నం చెయ్యడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్రలు, లాఠీలతో మహిళా విద్యార్థులను కూడా పోలీసులు బాదేశారు. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
----
కేసుల ఉపసంహరణ వ్యవహారంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్యే ఉదయభానుపై 10 కేసులు ఉపసంహరించుకుంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ జేఎఫ్ అధ్యక్షుడు చెవుల కృష్ణాంజనేయులు హైకోర్టులో సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు. ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఉదయభాను, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
-------
అనంతపురం జిల్లాలో గుప్తనిధుల వేటగాళ్లు అరెస్ట్ అయ్యారు. రోళ్ల మండలం హొట్టేబెట్ట సమీపంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు సాగించారు. తవ్వకాలు నిర్వహిస్తున్న విషయం తెలుసుకుని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తవ్వకాలు సాగిస్తున్న ఆరుగురు గుప్తనిధి వేటగాళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని అరెస్టు చేశారు. ఒక కారు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.
---------
తిరుమల తిరుపతి దేవస్థానం లీగల్ అధికారిగా రెడ్డప్ప రెడ్డిని కొనసాగించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. లీగల్ అధికారిగా మాజీ న్యాయాధికారిని నియమించడంపై పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. లీగల్ అధికారిగా ప్రస్తుత న్యాయమూర్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
----
కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ ధర్నాలు నిర్వహించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాన్నో నిరసనలు జరిగాయి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్
ఇందిరాపార్క్ వద్ద అధికార టీఆర్ఎస్ పార్టీ ధర్నాకు దిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నాలో పాల్గొన్నారు. భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు హాజరయ్యారు.
------------
వడ్లు కొనుగోలు చేయబోమని తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వ వైఖరిపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం సర్వ నాశనం అయిపోతుందన్నారు. బండి సంజయ్ ఓ మెంటల్ సంజయ్ అని... ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని వ్యాఖ్యానించారు. సంజయ్ మగాడైతే కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేపించాలని మంత్రి మల్లారెడ్డి సవాల్ విసిరారు.
-------
వివాహ శుభకార్యాలకు ఆర్టీసీ బస్సు బుక్ చేసుకున్న పెళ్లి జంటకు కానుకలు ఇచ్చే కార్యక్రమానికి ఎండీ వీసీ సజ్జనార్ శ్రీకారం చుట్టారు. గురువారం యాదగిరిగుట్ట డిపో నుంచి రెండు బస్సులను అద్దెకు తీసుకుని కొంపల్లి వేదికగా పెళ్లి చేసుకున్న వరుడు ఆకుల భరత్‌కుమార్, వధువు సౌమ్యలకు డ్రైవర్లు ముత్యాల అంజనేయులు, పబ్బాటి గణేష్ జ్ఞాపికను బహూకరించి ఆశీర్వదించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
--------
దేశ స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని, 1947లో లభించింది 'భిక్ష' అనీ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆమె చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ నేత నవాబ్ మాలిక్ తీవ్ర స్థాయిలో ఖండించారు. మలానా క్రీమ్ మత్తు బాగా తలకెక్కినట్టు కనిపిస్తోందంటూ మండిపడ్డారు. వేలాది మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ఆమె అవమానించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును తక్షణం వెనక్కి తీసుకోవాలని, ఆమెను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
-----
ప్రపంచ ప్రథమ యోగా చాంపియన్‌షిప్‌కు భారత్ వేదిక కానుంది. వచ్చే ఏడాది జూన్‌లో ఈ చాంపియన్‌షి్‌పను నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ఉదిత్ శేత్ వెల్లడించారు.