సీఎం జగన్ బిచ్చం ఎత్తుకుంటున్నారు.. మంత్రి కామెంట్లతో కలకలం..
posted on Nov 12, 2021 @ 3:26PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. నెలనెలా వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తోంది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేశారని కేంద్ర సర్కార్ హెచ్చరిస్తున్నా... అప్పు లేకుండా పాలన నడవలేని పరిస్థితి నెలకొంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలన్న కొత్త రుణం తీసుకోవాల్సిందే. బ్యాంకుల నుంచి అప్పులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెడుతోంది జగన్ రెడ్డి సర్కార్.
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏపీ భవిష్యత్ ను ఆగమాగం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా జగన్ ప్రభుత్వం తీరుపై తెలంగాణ మంత్రి హాట్ కామెంట్స్ చేశారు. నిధులు లేక ఆంధ్రా సీఎం జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వస్తే.. అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే.. బిచ్చం ఎత్తుకుంటున్నారని చురకలు అంటించారు. టీఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన రైతుల ధర్నా కార్యక్రమంలో ప్రశాంత్ రెడ్డి ఈ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ లఫంగా, బట్టెబాజ్ గాళ్ళ కు ధర్నా చేయాలని ఎలా అనిపించిందని బీజేపీ నాయకులపై కూడా ఓ రేంజ్ లో రెచ్చిపోయారు ప్రశాంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు కావాలని… కేంద్రం ఒత్తిడి తో ఏపిలో రైతుల మోటర్లకు మీటర్లు పెట్టారన్నారు. దేశం మొత్తం రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలనే మోడీ ప్రయత్నం చేస్తున్నారని… తెలంగాణ లో మీటర్లు పెట్టబోమని స్పష్టం చేశారు. కేంద్రం రైతులకు చేస్తున్న మోసం పై బీజేపీ నేతలను అడుగడుగునా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.