తెలంగాణలో మరో ‘జై భీమ్’ ఘటన.. పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి..?
posted on Nov 12, 2021 @ 1:20PM
జై భీమ్ సినిమాలో గిరిజనుడిపై పోలీసులు ధర్డ్ డిగ్రీ ప్రయోగించిన సీన్ చూసి అంతా కన్నీళ్లు కార్చారు. పోలీసులు ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా అన్న చర్చ జరిగింది. అయితే జై భీమ్ లాంటి ఘటనలే తెలంగాణలో వరుసగా వెలుగు చూస్తుండటం కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లాలో గిరిజనుడిపై పోలీసుల దాడిని మరువకముందే, కామారెడ్డి జిల్లాలో పోలీసుల లాఠీలకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన ఒడింటి భూమాబాయి(50) దీపావళి పండుగ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ఊరిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చున్నారు. ఇదే సమయంలో ఆలయానికి సమీపంలోనే కొందరు పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ముందుగా హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న వారిని కొట్టారు. ఇదే క్రమంలో భూమాబాయిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. దీంతో 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయారు.
పోలీసుల దెబ్బలకు రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్టు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా చావుదెబ్బలు కొట్టడం ఎంత వరకు సమంజసం అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై సదరు పోలీసు స్టేషన్ ఎస్సైను ఆరా తీయగా.. దాడి చేయలేదని, మూర్చ రావడంతో పడిపోయాడంటూ చెప్పుకున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెలంగాణ పోలీసులు గొప్పగా ప్రచారం చేసుకుంటుండగా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలపై జనాలు తీవ్రంగా ఫైరవుతున్నారు.