నువ్వు నాకు కావాలి.. సీఐడీ ఆఫీసర్ లై*గిక టార్చర్!
posted on Nov 12, 2021 @ 10:42AM
కంచే చేను మేస్తే? తండ్రిలా కాపాడాల్సిన ఖాకీలే కబళించాలని చూస్తే? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రక్షకభటుడే వేధింపులకు పాల్పడితే? ఫ్రెండ్లీ పోలీస్ కాస్తా రొమాంటిక్ కాప్‌గా మారితే? మహిళను లై*గికంగా వేధిస్తే? అంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? హైదరాబాద్‌లో అదే జరిగింది. సీఐడీ ఉన్నతాధికారి ఒకరు యువతిని టార్చర్ చేస్తున్నాడని తెలుస్తోంది. అసభ్య ఫోటోలు, వీడియోలు, వీడియో కాల్స్‌తో లై*గిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఏకంగా పోలీస్ యూనిఫాంతోనే వీడియో కాల్ చేసి.. నువ్వు నాకు కావాలంటూ బెదిరింపులకు దిగడంతో ఆ మహిళ భయపడిపోయింది. ఆ సీఐడీ ఆఫీసర్ టార్చర్ భరించలేక.. సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయడంతో విషయం బయటకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందంటే...
నేను సీఐడీలో ఉన్నతాధికారిని.. నువ్వు ఇష్టమని చెబితే నన్నే కాదంటావా..? నువ్వు నాకు కావాలంతే.. ఇలా ఓ మహిళను లై*గికంగా వేధిస్తున్న ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది. బాధిత మహిళ (30) ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన మహిళకి గత నెల 29న ఓ కొత్త నంబర్ నుంచి వాట్సాప్‌లో హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికి అదే నెంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. నిన్ను ఓ వేడుకలో చూశా. అప్పుడే బాగా నచ్చావు. నీతో గడపాలని ఉంది. ఎక్కడికి రావాలో చెప్పు అంటూ అటువైపు వ్యక్తి వేధించడం స్టార్ట్ చేశాడు. అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలు పంపించాడు. ఆ మహిళ చూసినట్లు డబుల్ బ్లూ టిక్స్ రాగానే వెంటనే డిలీట్ చేసేవాడు.
అవతలి వాడి టార్చర్ భరించలేక అసలు నువ్వెవరు..? ఎందుకిలా చేస్తున్నావంటూ నిలదీసింది ఆ మహిళ. తాను సీఐడీ విభాగంలో ఉన్నతాధికారిని అని చెప్పాడు. కొంతసేపటికి పోలీస్ యూనిఫాంలో వీడియో కాల్ చేయడంతో ఆమె భయపడింది. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసింది. ఆ తర్వాత మరో నంబర్ నుంచి మెసేజ్‌లు, వీడియో కాల్స్ రావడం మొదలైంది. నా నంబర్‌నే బ్లాక్ చేస్తావా..? అంటూ బెదిరింపులకు దిగడంతో ఆమె భయపడిపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కేసు నమోదు చేసి అంతర్గత విచారణ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది.