ఇసుకతో దాడి చేసిన అధికారికి ప్రమోషన్.. జగనన్న పాలన స్పెషల్..
posted on Nov 12, 2021 @ 2:56PM
ఏపీలోని పలు ప్రభుత్వ విభాగాల్లో అవినీతి, అరాచకాలు పెచ్చు మీరిపోతున్నాయి. దేవాదాయశాఖ ఇందుకేమీ మినహాయింపు కాదు. చిత్ర విచిత్ర ధోరణులకు దేవాదాయశాఖ ఆలవాలంగా మారిపోయింది. ఉన్నతస్థాయి అధికారిపై ఇసుక చల్లిన కిందిస్థాయి అధికారి చేతికే ఏకంగా తాళం అప్పగించిన వైనం ఇది. విశాఖపట్నం అసిస్టెంట్ కమిషనర్ శాంతికి పాడికుండలాంటి ఎర్నిమాంబ ఆలయం ఈఓగా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశం అయింది. ఈ మొత్తం వ్యవహారం వెనక అధికార పార్టీ నేత హస్తం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వివాదాస్పద అధికిరా శాంతిని అందలం ఎక్కించడంతో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. అధికార పార్టీ నేత అండదండలు ఉన్న ఏసీ శాంతి ఆపై మరింతగా చెలరేగిపోయారు. కొందరు దిగువస్థాయి సిబ్బందిపై వేధింపులకు దిగారు. ఒక ఉద్యోగిని కలెక్టరేట్ కు సరెండర్ చేశారు. మరో ఇద్దరిపై క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేశారు. ఏసీ శాంతి వేధింపుల కారణంగా కార్యాలయ ఉద్యోగులు, ఆలయ ఈఓలు సెప్టెంబర్ లో మూడు రోజులు సామూహిక సెలవు పెట్టారు.దీంతో రాజమండ్రి ప్రాంతీయ అధికారితో దేవాదాయశాఖ ఉన్నతాధికారులు విచారణ చేయించారు. ఆ తర్వాత వచ్చిన దేవాదాయశాఖ కమిషనర్ అక్టోబర్ 13న శాంతికి చార్జిమెమో ఇచ్చారు. చార్జిమెమోలో కమిషనర్ అడిగిన తొమ్మిది అంశాలకు ఆమె వివరణ ఇచ్చారో లేదో గానీ.. ఆమెను నెల రోజుల్లో బదిలీ చేస్తామని కార్యాలయ సిబ్బందికి హామీ ఇచ్చారు.
ఒక పక్కన శాంతి తీరుపై కిందిస్థాయి సిబ్బంది ఆందోళనలు, ఇంకో పక్కన విచారణ జరిగిన నేపథ్యంలో ఆమెకు ఎర్నిమాంబ ఆలయం ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి ఎర్నిమాంబ ఆలయమే వివాదాలకు మూలం. ఈ ఆలయానికి ఏటా కోటి రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. సంవత్సరం క్రితం అనకాపల్లి ఇన్ స్పెక్టర్ శ్రీనివాసరాజుకు అసిస్టెంట్ కమిషనర్ శాంతి బాధ్యతలు అప్పగించారు. శ్రీనివాసరాజు హయాంలో హుండీ ఆదాయం దారిమళ్లుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను తప్పించి రాజగోపాలరెడ్డిని కొత్త ఈఓగా నియమించారు. కోవిడ్ కారణంగా రాజగోపాలరెడ్డి 15 సెలవుపై వెళ్లారు. ఆ సమయంలోనే ఆయన ఆర్డర్ రద్దుచేసి మళ్లీ శ్రీనివాసరాజునే ఈఓగా ఏసీ శాంతి నియమించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరాజును డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ సస్పెండ్ చేశారు. ఇదే పోస్టులో సీతమ్మధార షిర్డీసాయి ఆలయం ఈఓ శిరీషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సెక్రటేరియట్ స్థాయిలో ప్రయత్నాలు చేసి ఎర్నిమాంబ ఆలయాన్ని శాంతి తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు.
పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తర్వాత విశాఖపట్నానికి మంత్రి, ఇతర ఉన్నతాధికారుల వస్తుండడంతో, ఎర్నిమాంబ ఆలయం బాధ్యత తనకు అప్పగిస్తే వారి ప్రోటోకాల్ ఖర్చుల్ని తాను చూసుకుంటానని శాంతి చెప్పినట్లు తెలుస్తోంది. ఏసీ శాంతి ఇచ్చిన ఆ హామీతోనే ఎర్నిమాంబ ఆలయం బాధ్యతలను అధికారపార్టీ నేత అండదండలతో ఆమెకు అప్పగించినట్లు దేవాదాయశాఖ వర్గాల కథనం. ఇంకా ప్రొబేషన్ కూడా పూర్తవని అధికారిణి శాంతికి ఆమె కోరిన పోస్టింగ్ ఇవ్వడం వెనక అధికారపార్టీ నేత హస్తం ఉందనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీ నేత దన్నుతోనే శాంతి పై అధికారులపై ధిక్కార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి.