ప్రత్యేక హోదాపై జగన్ హ్యాండ్సప్.. ఢిల్లీ అంటే ఎందుకంత భయం?
posted on Nov 12, 2021 @ 11:14AM
ప్రత్యేక హోదా.. ఆంధ్రప్రదేశ్ ప్రజల వాంఛ. విభజనతో నష్టపోయిన ఏపీకి ప్రత్యేక హోదానే శరణ్యమని ప్రజలు భావిస్తున్నారు. విభజన చట్టంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. కాని ఏడున్నర ఏండ్లు ప్రత్యేక హోదాకు అతీగతీ లేదు. ఏపీ ప్రజలు ఎంతగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 2017లో ప్రత్యేక హోదా డిమాండ్ తోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం నుంచి టీడీపీ బయటికి వచ్చింది. మోడీ ప్రభుత్వంపై పెద్ద యుద్ధమే చేశారు చంద్రబాబు. ఇక వైసీపీ తమ ఎన్నికల ఎజెండాలో ప్రత్యేక హోదానే ప్రధానమని ప్రకటించింది. తమకు అధికారం ఇస్తే కేంద్రం మెడలు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రకటించారు జగన్.
కాని మడమ తిప్పును... మాట తప్పను అనే జగన్.. అధికారంలోకి వచ్చాకా వరుసగా మాటలు మారుస్తూనే ఉన్నారు. తాజాగా ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ హ్యాండ్సప్ అయినట్లు తెలుస్తోంది. ఆదివారం తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న సదరన్ కౌన్సిల్ సమావేశంలో ప్రత్యేకహోదాను అడుగాలని సీఎం జగన్ పట్టుదలగా ఉన్నారని వైసీపీ వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వ వర్గాలూ అదే చెప్పాయి. దీంతో ఏపీ ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వస్తుందని అంతా భావించారు. తీరా చూస్తే.. జగన్ సర్కార్ బండారం బయటపడింది. సదరన్ కౌన్సిల్ సమావేశ ఏజెండాలో ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాల్లో ప్రత్యేకహోదా ఎక్కడా కనిపించలేదు.
సదరన్ కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ఏడు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినవే ఉన్నాయి. అందులో తమిళనాడు నుంచి రావాల్సిన నిధుల గురించి ఉంది కానీ కేంద్రం నుంచి రావాల్సిన వాటి గురించి కనీస ప్రస్తావన కూడాలేదు. తమిళనాడు బోట్లు ఏపీ జలాల్లోకి రావడం వల్ల ఘర్షణ, కుప్పంలో పాలార్ ప్రాజెక్టుపై తమిళనాడు అభ్యంతరం , తెలుగుగంగ నీరిచ్చినందుకు తమిళనాడు ఇవ్వాల్సిన రూ.338 కోట్లు, తెలంగాణ విద్యుత్ బకాయిలు, జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్రానికి కేంద్రం కేటాయింపులు అలాగే ఏపీలో జాతీయ పోలీస్ అకాడమీ పెట్టాల్సిన విజ్ఞప్తులు ఎజెండాలో ఉన్నాయి. ప్రత్యేక హోదా విషయం మాత్రం లేదు.
అమిత్ షా సమావేశంలో విభజన హామీలను ప్రస్తావిస్తామని జగన్ ప్రభుత్వం చెబుతోంది. అయితే ఎజెండాలో పెట్టకుండా ఏం మాట్లాడినా ప్రయోజనం ఉండదు. ఒక్క ఏపీ అంశాలపైనే సమావేశంలో చర్చ జరగదు. దక్షిణాది రాష్ట్రాల సమస్యలన్నింటినీ చర్చిస్తారు. ఇతర రాష్ట్రాలుకూడా ఏపీ విషయంలో తమకు ఉన్న సమస్యలను ప్రస్తావిస్తారు. విద్యుత్ సమస్యలను తెలంగాణ కూడా చర్చించనుంది. దీంతో ప్రత్యేక హోదాపై మాట్లాడుతామంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ఉత్తవేనని తేలింది.
దీంతో ప్రత్యేక హోదా విషయంలో జగన్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని స్పష్టమవుతోంది. కేంద్రానికి భయపడుతుండటం వల్లే ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. కేసుల భయంతో కేంద్రానికి ఏపీని జగన్ రెడ్డి తాకట్టు పెట్టారని విపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తున్నాయి. తాజా ఘటనతో అది నిజమేనని అర్ధమవుతోందని రాజకీయ వర్గాలు కూడా చెబుతున్నాయి.