జగన్ సర్కారుకు ఉద్యోగ సంఘాల షాక్.. మీటింగ్ బైకాట్..
posted on Nov 12, 2021 @ 4:47PM
పీఆర్‌సీ ఇచ్చేదాకా తగ్గేదే లే అంటున్నారు ఉద్యోగులు. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తోంది సర్కారు. అదేమంత పెద్ద విషయం కాదంటూ.. ఇవాళ-రేపు అంటూ.. మాటలు చెబుతున్నారే కానీ.. పీఆర్సీ మాత్రం ప్రకటించడం లేదు. ఇదేదో తేడాగా ఉందని.. ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందంటూ ఉద్యోగ సంఘాలు మరింత ఒత్తిడి పెంచుతున్నాయి. అయినా, పిల్లిమొగ్గలు వేయడం మాత్రం ఆపడం లేదు అధికారులు. అందుకు నిరసనగా.. పీఆర్‌సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీని పలు ఉద్యోగ సంఘాలు బైకాట్ చేసి మధ్యలోనే బయటికొచ్చేశాయి.
ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ భేటీలో సీఎస్ కాకుండా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే హాజరవడాన్ని ఉద్యోగ సంఘాలు అంగీకరించ లేదు. ప్రభుత్వ వైఖరిపై వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమావేశంలో పీఆర్‌సీ నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పినప్పటికీ దానికి సంబంధించి అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు మీటింగ్ నుంచి బయటకు వచ్చాయి. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు సమావేశానికి హాజరు కాగా.. 9 ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆరోపించారు. మరోసారి ఉద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం సమావేశంలో పీఆర్‌సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పీఆర్‌సీ నివేదికపై అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో తాము అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్పలేదన్నారు. అక్టోబరు 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంత వరకు ఇవ్వలేదని, కనీసం తాజా సమావేశంలో అయినా ఇస్తారని ఆశించామని, అయితే అలా జరగలేదని చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు.
రాష్ట్ర, జిల్లా స్థాయి ప్రతినిధులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని ఏపీఎన్జీఓ నేత బండి శ్రీనివాస్ తెలిపారు. పీఆర్సీ రిపోర్ట్ ఇస్తామని నాలుగుసార్లు తిప్పించుకున్నారని ఆయన ఆరోపించారు. గత నెలాఖరు వరకు పీఆర్సీ ఇస్తామని ప్రభుత్వ సలహాదారు చెప్పారన్నారు. పీఆర్సీని ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. పీఆర్సీ రిపోర్ట్ ఇవ్వకపోవడం తమను అవమానించడమేనని ఆయన అన్నారు.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా తమను మోసం చేశారని ఏపీజేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు అన్నారు. లక్షలాది మంది ఉద్యోగులకు ఇప్పుడు ఏం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 13 లక్షల మంది ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారని.. నివేదిక కాలయాపన కోసమే కమిటీ వేశారని బొప్పరాజు ఆరోపించారు.