యూనివర్సిటీ ఫండ్స్ నూ వదలని జగనన్న.. అప్పుల కోసం ఎందాకైనా..!
posted on Nov 12, 2021 @ 1:56PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇది జగత్ విదిత వాస్తవం. ఈ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం లేదు. అయితే ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదనే నిజం మెల్ల మెల్లగా బయటకు వస్తోంది. ఓ వంక అప్పు లేనిదే పూట గడవని పరిస్థితి. రోజువారీ చేతి ఖర్చులకు కూడా చేయి చాపక తప్పని దుస్థితి. మరో వంక ఎంతో కాలంగా ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్న విధంగా, రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి దివాలా దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది.అయితే ప్రభుత్వం నోటితో వాస్తవ పరిస్థితి ఇదని చెప్పక పోయినా చర్యల ద్వారా అదే నిజమని తేలుతోంది. తాజా పరిణామాలను గమనిస్తే, రాష్ట్రం దివాలా తీసే రోజు ఇంకా ఎంతో దూరంలో లేదని అర్థమవుతోందని నిపుణులు అంటున్నారు. అప్పుల తలుపులు ఒకటొకటిగా మూసుకు పోతున్నాయి కాబట్టే, ప్రభుత్వం ఫండ్స్ కోసం పక్క చూపులు చూస్తోంది.
గత వారం పది రోజుల్లో ప్రభుత్వం ‘అన్యధా శరణం నాస్తి’ అన్న విధంగా నియమ నిబంధనలు పక్కన పెట్టి పైసా కోసం పడరాని పాట్లు పడుతోంది. అడ్డదారులు/అక్రమ దారులు తొక్కుతోంది. ఎక్కడ రూపాయి కనిపిస్తే అక్కడ చేతులు పెడుతోంది. నియమ నిబంధనలు, పరిపాలనా నియమావళి ఏవీ లేవన్న విధంగా ఎక్కడెక్కడి నిధులను, సర్కార్ ఖాతాలోకి లాగేసుకుంటోంది. కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ నిదులను ఉద్యోగులకు సమాచారం లేకుండానే ప్రభుత్వం లాగేసుకుంది. అలాగే, ఇప్పుడు జగన్ రెడ్డి ప్రభుత్వం కన్ను, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం మీద పడింది. అర్జెంటుగా రూ. 250 కోట్లు కావాలి ఇస్తావా చస్తావా అంటూ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, యూనివర్సిటీ అధికారుల మెడ మీద కత్తి పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. దబాయిస్తున్నారు.
నిజానికి, విశ్వవిద్యాలయాల ఆర్థిక, పరిపాలనా వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం పెద్దగా ఉండదు.నియామకాలు చేపట్టాలన్నా, నిధులు ఖర్చు చేయలన్నా, కార్యనిర్వాహక మండలి అనుమతి అవసరం. యూనివర్సిటీ ఫండ్స్ ఒక పరిమితికి మించి అదనంగా ఖర్చు చేసే అధికారం, యూనివర్సిటీ రిజిస్ట్రార్’ కూడా ఉండదు. అయితే, గత కొంత కాలంగా ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వర్సిటీ అధికారుల మధ్య,రూ. 250 కోట్ల యూనివర్సిటీ నిధులను రాష్ట్ర అభివృద్ధి సంస్థకు బదిలీ చేయలనే విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుస్తున్నాయి. అయినా యూనివర్సిటీ అధికారులు ఎదో విధంగా పని కాకుండా నెట్టుకొస్తున్నారు. అయితే, గత రెండు రోజుల నుంచి సీఎంవోలో కీలక అధికారి రంగంలోకి దిగితొందర చేస్తున్నట్లు సమాచారం.
నో.. రూల్స్ నథింగ్ ఏమిచేస్తారో చేయండి, శనివారం నాటికీ, రూ.250 కోట్లు ప్రభుత్వ చేతోల్లో పెట్టవలసిందే అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం వర్సిటీకి రూ.450 కోట్లు నిధులున్నాయి. జాతీయ బ్యాంకులో ఎఫ్‌డీల రూపంలో ఉన్న వీటిని బయటకు తీసుకురావడం రోజుల వ్యవధిలో ఆయ్యే పని కాదు. పైగా వర్సిటీ నుంచి రూపాయి తీసుకోవాలన్నా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్(ఈసీ) అనుమతి తప్పనిసరి. ఇదే విషయాన్ని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు వర్సిటీ అధికారులు మోర పెట్టుకుంటున్నా, ఫలితం కనిపించడంలేదని అంటున్నారు. మరోవైపు సీఎంవోలో కీలకమైన ఐఏఎస్ అధికారి నేరుగా వర్సిటీ ఉన్నతాధికారులతో ఫోన్లలో మాట్లాడుతూ మరింతగా ఒత్తిడి తెస్తున్నారు.
ఈ పరిస్థితిలో శనివారం రూ.250కోట్ల నిధులు రాష్ట్రాభివృద్ధి సంస్థకు బదలాయించడానికి ఆమోదం కోసం విశ్వవ విద్యాలయం కార్య నిర్వహక అత్యవసర సమావేశం శనివారం ఏర్పాటు చేశారు.అంతే కాదు,సమావేశానికి ఎవరు వచ్చినా ఎవరు రక పోయినా చివరకు రిజిస్ట్రార్’రాకపోయినా, మన అనిపించి రూ. 250 కోట్లు ముడుపు కట్టి జగన్ రెడ్డి ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని , ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఆదేశాలు జరీ చేసినట్లు సమాచారం .
అదలా ఉంటే ప్రస్తుతం వర్సిటీ వద్ద ఉన్న రూ.450కోట్లలో విభజన చట్టం కింద తెలంగాణ ప్రభుత్వానికి రూ.170 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.250 కోట్లు బదలాయిస్తే మిగిలేది కేవలం రూ.30కోట్లు మాత్రమే. ఈ నిధులతో వర్సిటీ నిర్వహణ కష్టంగా మారుతుందని అధికారులు అంటున్నారు. వర్సిటీకి ఏటా దాదాపు రూ.70కోట్లు అవసరం. ఈ నిధులు ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితి లేదు. కౌన్సెలింగ్ సమయంలో విద్యార్థులు కట్టే ఫీజులు, పరీక్షల ఫీజులు, ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీతో వర్సిటీ నిర్వహణ, ఇతర కార్యక్రమాలు నడుస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు రూ.250 కోట్లు తీసుకుపోవడం వల్ల ఈ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు ఏటా వచ్చే వడ్డీ పరంగా కూడా వర్సిటీకి తీవ్రమైన నష్టం వస్తుందని ఉద్యోగులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.అంతే కాదు, అవసరం అయితే ఆందోళన చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్నఆర్ధిక అరాచకానికి అడ్డు కట్ట వేయక పోతే.. రాష్ట్రం అర్తికంగానే కాదు, అన్ని విధాల అనాధగా మిగులుతుందని నిపుణులు అంటున్నారు.