టీట్వంటీ వరల్డ్ కప్ విజేత ఆసీస్.. ఫైనల్లో వార్నర్, మార్ష్ సూపర్ షో
posted on Nov 14, 2021 @ 9:28PM
టీట్వంటీ విశ్వ విజేతగా ఆసీస్ నిలిచింది. కివీస్ తో జరిగిన ఫైనల్ పోరులో విజయం సాధించి మరోసారి వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది కంగారుల జట్టు. న్యూజిలాండ్ నిర్దేశించిన 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా తొలి ఓవర్ నుంచే ధాటిగా అడింది. అయితే ఆరోన్ ఫించ్ 7 బంతుల్లో 5 పరుగులు చేసి బౌలర్ ట్రెంట్ బౌల్ట్ చేతిలో ఔటయ్యాడు. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ మాత్రం రెచ్చిపోయాడు. కేవలం 37 బంతుల్లో 53 పరుగులు చేశాడు. వార్నర్ కు మార్ష్ తోడయ్యాడు. 29 బంతుల్లో మిచెల్ మార్ష్ 46 పరుగులు చేశాడు. ఇద్దరు ధాటిగా ఆడటంతో ఆసిస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 13 ఓవర్ లో వార్నర్ అవుటయ్యాడు.
వార్నర్ అవుటైనా మార్ష్ జోరు మాత్రం ఆపలేదు. మరింత ధాటిగా షాట్లు కొట్టాడు. దీంతో ఆసీస్ ఈజీగానే లక్ష్యంగా దిశగా పయనించింది. 14 ఓవర్ లో హాప్ సెంచరీ పూర్తి చేశాడు మార్ష్. మూడో వికెట్ కు మ్యాక్స్ వెల్ తో కలిసి కేవలం 23 బంతుల్లోనే 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 17, 18 ఓవర్లలో పరుగులు తక్కువగా వచ్చినా.. 19 ఓవర్ లో బౌండరీలు కొట్టడంతో ఆసిస్ విజయం పూర్తైంది. మార్ష్ 77 పరుగులు చేయగా.. మ్యాక్స్ వెల్ 28 పరుగులు చేశాడు. కివీస్ బౌలర్లలో బౌల్డ్ రెండు వికెట్లు తీశాడు.
టీ 20 ప్రపంచకప్ ఫైనల్‌లో న్యూజిలాండ్ 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ దెబ్బకు ఆసీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మిచెట్ స్టార్క్ బాధితుడిగా మారాడు.4 ఓవర్లు వేసిన స్టార్క్ ఒక్క వికెట్ కూడా తీసుకోకుండా ఏకంగా 60 పరుగులు సమర్పించుకున్నాడు. క్రీజులో ఉన్నంత సేపు చెలరేగిపోయిన విలియమ్సన్ ఆసీస్ ఫీల్డింగ్‌ను చెల్లాచెదురు చేశాడు. మైదానం నలువైపులా బంతులను తరలిస్తూ ఫీల్డర్లను పరుగులు పెట్టించాడు. 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న కివీస్ కెప్టెన్.. ఆ తర్వాత మరింతగా చెలరేగిపోయాడు. ఆ తర్వాత మరో 5 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. మొత్తంగా 48 బంతులు ఎదుర్కొన్న విలియమ్సన్ 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 85 పరుగులు చేసి అవుటయ్యాడు. ఓపెనర్లు మార్టిన్ గప్టిల్ 28, మిచెల్ 11, ఫలిప్స్ 18, నీషమ్ 13 పరుగులు చేశారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3 వికెట్లు తీసుకోగా, జంపాకు ఒక వికెట్ దక్కింది.