ప్రభుత్వ దీవెనలతో అక్రమ చర్చిల క్రమబద్ధీకరణ!..ఇందులో ఏ కుంభకోణం దాగుందో ?
posted on Nov 15, 2021 @ 12:16PM
ఓవంక ఏకంగా వెంకన్న దేవుని భూములను రక్షించలేమన్న నెపంతో అమ్మేసేందుకు ఏపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే ఒక ప్రయత్నం చేశారు. వర్కవుట్’ కాలేదు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ‘బాబాయ్’ ఓకే అన్నా, శిలువ దేవుని దయలేక అది కాస్తా బ్యాక్ఫైర్’ అయింది. వెంకన్న స్వామి భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు వీధుల్లోకొచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడంతో జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పటికి తాత్కాలికంగా దేవుని భూముల విక్రయం నుంచి వెనకడుగు వేసింది.కానీ, గుట్టు చప్పుడు కాకుండా, సెక్యూరిటీ బాండ్స్ రూపంలో ఇతర అక్రమ మార్గాలలో టీటీడీ నిధులను జగన్ రెడ్డి ప్రభుత్వం ఖజానాలో కలిపేసుకుంటోందనే ఆరోపణ లున్నాయి. అలాగే, సింహాచలం భూములు ఇతర దేవాలయాల ఆస్తులు, ఆదాయాలను దారి మళ్ళించేందుకు, అధికార అనధికార మార్గాలలో ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. ఇక దేవాలయాల పై దాడులు.విగ్రహాల ద్వంస రచన గురించి అయితే వేరే చెప్పనక్కరలేదు.
ఇలా ఓవంక హిందువుల విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు సాగిస్తూ మరో వంక రాష్ట్రంలో క్రైస్తవ మత ప్రచారానికి, జగన్ రెడ్డి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందనే ఆరోపణలు అనేకం ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ చర్యలుంటున్నాయని, అనేక సందర్భాలలో రుజువైంది. పాస్టర్ల జీతాలు, చర్చిల నిర్మాణానికి నిధులు, ఇలా, జగన్ రెడ్డి ప్రభుత్వం అనేక విధాలుగా క్రైస్తవ మత ప్రచారానికి ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు సమకూరుస్తోందనే ఆరోపణలున్నాయి.
ఇపుడు జగన్ రెడ్డి ప్రభుత్వం, అదే దిశలో మరో తప్పటడుగు వేసింది. పేద మధ్య తరగతి ప్రజలు తెలిసో తెలియకో, ఎవరో చేసిన మోసాల ఫలితంగానో ప్రభుత్వ భూములలో కట్టుకున్న ఇళ్ళ స్థలాల క్రమబద్ధీకరణకు వెనకాముందు అవుతున్న జగన్ రెడ్డి ప్రభుత్వం, చర్చిల కోసం ఆక్రమించుకున్న భూములను మాత్రం ఆగమేఘాలపై రెగ్యులరైజ్ చేయడానికి సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఉత్తర్వులు, ఆదేశాలను చాలా గుట్టుగా ఉంచేసింది. రిపోర్టులు, రికార్డులు, ఉత్తర్వులు బయటకు రాకుండా పనులు జరిగిపోవాలని అధికార యంత్రాంగాన్ని ‘ప్రభువా ముఖ్య నేతలు మౌఖికంగా ఆదేశించారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ఇదే పనిలో తలమునకలైందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
జగన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో క్రైస్తవ జనాభా ఉన్న లేక పోయిన, ఊరూరా చర్చిలు వెలిశాయి. ఒకే ఊర్లో రెండు మూడు చర్చిల నిర్మాణం కూడా జరిగింది.ఆ చర్చిలు ఎవరు కట్టారో, ఎదుకు కట్టారో, చర్చిలు నిర్మించిన భూములు ఎవరివో..ఏమిటో ఏ అధికారీ పట్టించుకోలేదు.నిజానికి ఎలాంటి నిర్మాణం చేపట్టాలన్న సంబందిత అధికారుల అనుమతి అవసరం. ఆలాగే చర్చి లేదా మరే ఇతర ప్రార్ధనా మందిరం నిర్మాణానానికి అయినా కూడా అనుమతులు అవసరం. ఇందుకు సంబంధించి ఖచ్చితమైన నిబంధనలున్నాయి. ముఖ్యంగా స్థానిక ప్రజల అభ్యర్ధన, అనుమతి ఉండాలని సంబందిత చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అయినా ముఖ్యమంత్రి అండ చూసుకుని రాష్ట్రంలో అక్రమంగా చర్చిల నిర్మాణాలు జరుగుతున్నాయని, అనేక ఆరోపణలున్నాయి. అయినా అవేవీ పట్టించుకోకుండా, చాలా గ్రామాలలో చర్చిల నిర్మాణం జరిగింది. చర్చిల నిర్మాణం జరిగిన గ్రామాల్లో మత మార్పిడులు జోరుగా సాగాయి, సాగుతున్నాయి. గ్రామాలకు గ్రామాలే క్రైస్తవ గ్రామాలుగా మారి పోతున్నాయని, హిందూ సమాజం, హిందూ ధార్మిక సంస్థలు ఆరోపిస్తున్నాయి.
ఈఆరోపణలను నిజం చేస్తూ అక్రమ చర్చిల క్రమబద్ధీకరణకు జగన్ రెడ్డి ప్రభుత్వం రహస్యంగా అనుమతులు ఇచ్చి పచ్చ జెండా ఊపడం పలు అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు. అధికార వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని అనేకచోట్ల చర్చిలు నిర్మించారు. వాటిలో నిత్యం ప్రార్థనలు జరుగుతున్నాయి. అభ్యంతరం లేని భూముల్లో ఉన్న చర్చిలను క్రమబద్ధీకరించాలి. ఆయా ప్రాంతాల ధరలకు అనుగుణంగా రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు మౌఖికంగా ఆదేశించారు.
అయితే క్రమబద్ధీకరణ ఏ ప్రాతిపదికన చేపట్టాలి? ఏ చట్టపరిధిలో క్రమబద్ధీకరణ చేయాలి? ఫీజుల వసూలుకు ప్రామాణికం ఏమిటన్న దానిపై స్పష్టత ఇవ్వకుండానే తాము చెప్పింది చేసి తీరాలని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం రెవెన్యూశాఖ ఆ దిశగా తీవ్ర కసరత్తు చేస్తోంది. భూముల క్రమబద్ధీకరణ పేరిట ఈ ఏడాది ఆగస్టు 23న సర్కారు జీవో 225 జారీ చేసింది. అయితే ఈ జీవోను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేదు. గజిట్‌లోనూ పొందుపర్చలేదు. ఇలా జీవోను రహస్యంగా ఉంచి, చర్చిల వరకు క్రమబద్ధీకరణ క్రతువును రహస్యంగా కానిచ్చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. జీవో అమలుతో పాటు హౌసింగ్ తదితర అంశాలపై సెప్టెంబరు, అక్టోబరుల్లో కీలక సమీక్షలు జరిగాయి. ఈ సందర్భంగానే చర్చిలకు భూ సంతర్పణ అంశం చర్చకు వచ్చింది. నిరభ్యంతరమైన ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని చర్చిలు నిర్మిస్తే వాటిని జిల్లా కలెక్టర్ నిర్దేశించిన ధర ఆధారంగా క్రమబద్ధీకరించాలని విధివిధానాలు రూపొందించారు. ఈ మేరకు జీవో.225కి అనుబంధంగా మరో ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఇళ్లకు, చర్చిలకు ఒకే కటాఫ్ తేదీని నిర్ణయించడంపై రెవెన్యూ వర్గాల్లోనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ పాలనలో విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని చర్చిలు నిర్మిస్తే వాటిని క్రమబద్ధీకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా అనే సందేహాలు తలెత్తుతున్నాయని ఓ సీనియర్ రెవెన్యూ అధికారి పేర్కొన్నారు. మరి, ఇక ఈ వివాదం ఏ మలుపుతిరుగుతుందో చూడవలసి ఉందని అంటున్నారు. అంతే కాదు, ఇద్నులో ఏముందో, ఏకుంభకోణం దాగుందో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి,