జగన్ భక్తుడిగా ఏపీ బీజేపీ ఇంఛార్జ్!.. అమరావతిపై డబుల్ గేమ్!
posted on Nov 15, 2021 @ 12:20PM
అధికార వైసీపీ మినహా అన్నిపార్టీలూ అమరావతి రైతుల మహాపాదయాత్రకు మద్దతు ప్రకటించాయి. టీడీపీ శ్రేణులు మాత్రమే బహిరంగంగా మహాపాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇక, బీజేపీ ఎప్పటిలానే డబుల్ గేమ్ ఆడుతోంది. అవుననకా.. కాదనకా.. అమరావతినే ఏపీకి ఏకైక రాజధాని అని పోరాడకుండా.. కాలం గడిపేస్తోంది. ఇక, రైతుల మహా పాదయాత్ర విషయంలోనూ డివైడ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మద్దతు ప్రకటిస్తారు.. కానీ, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోదర్ మాత్రం మహాపాదయాత్రలో పాల్గొనవద్దంటూ నేతలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఆదివారం నాడు పాదయాత్రలో బీజేపీ నేతలు పాల్గొనాల్సి ఉంది.. కానీ ఆ పార్టీ వాళ్లెవరూ రాలేదు. సునీల్ ధియోధర్ ఆదేశాల మేరకే కమలనాథులు సైడ్ అయిపోయారని తెలుస్తోంది. ఎప్పటిలానే అమరావతి విషయంలో బీజేపీ మరోసారి మేక వన్నె నక్కలా బిహేవ్ చేస్తోందని అంటున్నారు.
అమరావతి రైతుల మహాపాదయాత్రకు తమ పార్టీ మద్దతు ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చెప్పారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెల కిశోర్ బాబుతో పాటు మరికొందరు నేతలు.. పాదయాత్ర ప్రారంభం రోజున స్వయంగా వెళ్లి సంఘీభావం ప్రకటించారు. విషయం తెలిసి.. బీజేపీ ఇన్‌చార్జ్ సునీల్ ధియోధర్ ఓవరాక్షన్ చేశారట. పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నాయకులకు ఫోన్ చేసి.. మీరెందుకు వెళ్లారని ప్రశ్నించారట. అమరావతికి బీజేపీ సపోర్ట్ కాబట్టి.. స్థానికంగా ప్రజలంతా అటువైపే ఉన్నారు కాబట్టి.. ప్రజానాడి ప్రకారం తాముసైతం పాదయాత్రలో పాల్గొన్నామని వారు వివరణ ఇచ్చుకున్నారని తెలుస్తోంది. బీజేపీ వాళ్లు ఎవరూ పాదయాత్రలో పాల్గొనవద్దంటూ సునీల్ ధియోధర్ పార్టీ వర్గాలకు హుకూం జారీ చేశారని చెబుతున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా ఉండే విష్ణువర్థన్‌రెడ్డిలాంటి నేతలే.. వెనకుండి సునీల్ దేవధర్‌తో ఇలా చెప్పిస్తున్నారని పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి.
అధ్యక్షుడి మాట ప్రకారం పాదయాత్రలో పాల్గొనాలా.? ఇన్‌చార్జ్ చెప్పినట్టు ఆగిపోవాలా.? అనే గందరగోళం నాయకులు, కార్యకర్తల్లో నెలకొంది. ‘మా వాళ్లు ఏపీలో పార్టీని ఎదగనివ్వరు.. ఎవరి అజెండాలో వాళ్లున్నారు.. వైసీపీతో అంటకాగుతున్నారు’ అంటూ సొంతపార్టీ వారే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విష్ణు, సునీల్‌లు కలిసి బీజేపీని ఆగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజధానిని జగన్ ప్రభుత్వం మూడుముక్కలు చేస్తోంది. అడ్డుకోవాల్సిన కేంద్రం చేతులెత్తేసింది. పోరాడవలసిని బీజేపీ.. అధికారపార్టీతో కుమ్మక్కు అవుతోంది. ఆ పార్టీ నేత విష్ణువర్థన్‌రెడ్డి చాలా నీచంగా మాట్లాడుతున్నారు. ఓ టీవీ డిబేట్‌లో జేఏసీ నేతతో చెప్పు దెబ్బలు కూడా తిన్నారు. అయినా, ప్రజావ్యతిరేకతను కమలనాథులు గుర్తించలేకపోతున్నారు. డబుల్ గేమ్ పాలిటిక్స్‌ను ఆపడం లేదంటూ ఆ పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. అటు విష్ణు.. ఇటు సునీల్.. ఇద్దరూ కలిసి.. బీజేపీని భ్రష్టుపట్టిస్తున్నారంటూ కేడర్ మండిపడుతోంది.