పాలిటిక్స్ లోకి సోనూసూద్! పంజాబ్ ఎన్నికల్లో పోటీ..
posted on Nov 14, 2021 @ 8:28PM
సినిమాల్లో విలన్.. కాని నిజ జీవితంలో మాత్రం ఆయన హీరో.. ఇదంతా చెబుతోంది ఎవరి గురించో తెలిసింది కదూ... రీల్ విలన్.. రియల్ హీరోగా జనాల నుంచి నీరాజనాలు అందుకుంటున్న సోనుసూద్ గురించే. కరోనా టైమ్‌లో సోనూ సూద్ చాలా సేవ చేశారు. సాయం అంటే సోనూ సూద్.! సోనూ సూద్ అంటే సాయం అన్న రేంజ్‌లో మార్మోమోగింది.
లాక్‌డౌన్‌లో చిక్కుకుపోయిన నిస్సహాయంగా ఉన్న వందలాది మంది వలసదారులను వారి స్వంత రాష్ట్రానికి తీసుకెళ్లడానికి సోనూ సూద్ బస్సులు, రైళ్లు, విమానాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం ప్రారంభంలో రెండవ వేవ్ సమయంలో, అతను కోవిడ్ రోగులకు ఆక్సిజన్‌ను సరఫరా చేశారు.ఏకంగా ఢిల్లీ ప్రభుత్వం బ్రాండ్ అంబాసిడర్‌గానూ నియమించింది. స్టార్‌హీరోలకు లేని క్రేజ్ ఆయన సొంతమైంది. సెలబ్రెటీలు సైతం సాహో అన్నారు. వెల్‌డన్ అంటూ అప్రిషియేట్ చేశారు.
తన అద్భుతమైన నటనతో పాటు కొవిడ్ సమయంలో విశేష సేవాకార్యక్రమాలతో ప్రజాదరణ పొందిన సోనూ సూద్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. సోను రాజకీయాల్లోకి రావాలంటూ కొందర డిమాండ్ కూడా చేశారు. కొన్ని పార్టీలు కూడా ఆయనను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే తనపై వస్తున్న రాజకీయ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు సోనుసూద్. తనను రాజకీయ నాయకులు, పార్టీలు సన్మానించినప్పటికీ, తన స్వచ్ఛంద సంస్థకు రాజకీయాలతో సంబంధం లేదని సోనూసూద్ ఎప్పుడూ చెబుతూనే ఉన్నారు.
ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సోనూసూద్ పొలిటికల్ ఎంట్రీపై ఆదివారం కీలక ప్రకటన చేశారు. తన సోదరి మాళవిక సూద్ రాబోయే పంజాజ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, ఆమె ఏ పార్టీలో చేరనున్నారనే అంశాన్ని మాత్రం సోనూసూదా వెల్లడించలేదు.‘‘మాళవిక పోటీకి సిద్ధమయ్యారు. ప్రజలకు సేవ చేయాలన్న ఆమె నిబద్ధత సాటిలేనిది. రాజకీయ పార్టీలో చేరాలనుకోవడం జీవితంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం. కేవలం సాధారణ సమావేశాలు మాత్రమే కాదు. ఇది పూర్తిగా సిద్ధాంతాలతో ముడిపడిన అంశం. ఏ పార్టీలో చేరనున్నారనేది సరైన సమయంలో ప్రకటిస్తాం’’ అని మోగాలోని తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో సోనూ సూద్ ప్రకటించారు.
సోనూ సూద్ ఆయన సోదరి మాళవికతో కలిసి ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జీత్ సింగ్ చన్నీని కలిశారు. గతంలో సోనూ సూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అలాగే దిల్లీ ప్రభుత్వం చేపట్టిన ‘దేశ్ కా మెంటార్స్’ అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గానూ వ్యవహరిస్తున్నారు. దీంతో సోనూ సోదరి మాళవిక కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఆప్ నుంచి పోటీ చేస్తారా అన్నదానిపై క్లారిటీ రావడం లేదు. ఇండిపెండెంట్ గానూ పోటీ చేసే అవకాశం ఉందనే చర్చ కూడా సాగుతోంది. మొత్తంగా సోనూసూద్ సోదరి పొలిటికల్ ఎంట్రీ రాజకీయ వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ గా మారింది.