వెంకట్రామిరెడ్డి.. కేసీఆర్ బినామీనా? రేవంత్ రెడ్డి ఆరోపణలు నిజమేనా?
posted on Nov 15, 2021 @ 3:19PM
ఐఏఎస్ కు వాలంటరీ రిటైర్మెట్ తీసుకున్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఇటీవల కాలంలో వివాదాస్పదమయ్యారు. విపక్షాలకు టార్గెట్ అయ్యారు. జిల్లాల విభజన తర్వాత సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా నియమించబడ్డారు వెంకట్రామ్ రెడ్డి. తర్వాత అక్కడే ఎక్కువ కాలం పని చేశారు. మిగితా జిల్లాల కలెక్టర్లను బదిలీ చేసిన ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిని మాత్రం కదల్చలేదు. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ఈసీ కారణంగా సంగారెడ్డికి బదిలీ చేశారు. ఎన్నిక ముగియగానే తిరిగి మళ్లీ సిద్ధిపేటకు ట్రాన్స్ ఫర్ చేశారు. విపక్షాలకు ఇదే అస్త్రంగా మారింది.
అంతేకాదు గత లోక్ సభ ఎన్నికల్లో వెంకట్రామిరెడ్డిని ఏదో ఒక స్థానం నుంచి టీఆర్ఎస్ తరపున పోటీ చేయిస్తారనే ప్రచారం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నిక సమయంలోనూ వెంకట్రామి రెడ్డి పేరు వినిపించింది. దీంతో వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కు తొత్తు అని విపక్షాలు ఆరోపించాయి. అందువల్లే ఆయనను సిద్ధిపేట జిల్లా కలెక్టర్ గా సుదీర్ఘకాలం కొనసాగించారని పలు పార్టీలు నేతలు ఆరోపించారు. ఆయన వ్యవహారశైలి కూడా అలానే ఉండేది. విపక్ష పార్టీలను అసలు ఆయన పట్టించుకునే వారు కాదని చెబుతారు. మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలోనూ ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం రైతుల పట్ల దారుణంగా వ్యవహరించారనే ఆరోపణలు వెంకట్రామిరెడ్డిపై ఉన్నాయి.
ఇక సిద్ధిపేట కొత్త కలెక్టరేట్ ప్రారంభోత్సం సందర్భంగా వెంకట్రాం రెడ్డి వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. జిల్లా కలెక్టర్ చైర్ లో కూర్చున్న ఆయన.. సీఎం కేసీఆర్ పాదాలు మొక్కడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తర్వాత ఆయనను విపక్షాలు మరింతగా టార్గెట్ చేశాయి. సిద్దిపేట కలెక్టర్ ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీగా వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ల్యాండ్ మాఫియాకి హెడ్ అంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. భూముల అమ్మకంలో రూ.1000 కోట్లు నష్టం జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కోకాపేట భూముల వేలం విషయంలోనూ వెంకట్రామిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. కేసీఆర్ తన బంధువులు, బినామీలు,తనతో సంబంధాలు ఉన్నవారికే భూములను విక్రయించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో ఎకరా రూ.60 కోట్లకు అమ్ముడు పోయిన చోట కేవలం రూ.40 కోట్లకు ఎకరా చొప్పున విక్రయించారని ఆరోపించారు.దేశ,విదేశీ కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయని ప్రభుత్వం చెప్పిందని... కానీ వాస్తవం మరోలా ఉందని అన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి అన్ని ప్రధాన కంపెనీలకు ఫోన్లు చేసి టెండర్లు వేయవద్దని బెదిరించాడని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకవేళ అక్కడ భూములు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వదని చెప్పి భయపెట్టారని చెప్పారు. గండిపేటకు సమీపంలో ఉన్నందునా జీవో.111 ప్రకారం అనుమతులు సాధ్యం కావని చెప్పి.. ఎవరూ టెండర్ వేయకుండా వెంకట్రామి రెడ్డి కుట్రలు చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కోకాపేటలో భూములు కొనుగోలు చేసిన కంపెనీల్లో మై హోం రామేశ్వరరావు,సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి,మహబూబ్ నగర్ ఎంపీ సోదరుడు మన్నె సత్యనారాయణ రెడ్డిలకు చెందిన కంపెనీలు ఉన్నట్లు రేవంత్ తెలిపారు. రామేశ్వరరావుకు చెందిన కంపెనీలు 17.30 ఎకరాలు కొనుగోలు చేయగా.. రూ.1060 కోట్లకు గాను రూ.663కోట్లు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించారని అన్నారు. కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చెందిన కంపెనీలు తొమ్మిదన్నర ఎకరాలు కొనుగోలు చేయగా... రూ.500 కోట్లకు గాను రూ.400 కోట్ల పైచిలుకు మాత్రమే చెల్లించారని ఆరోపించారు. భూముల వేలంపై వెంకట్రామిరెడ్డిని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి.
రైతులకు వరి విత్తనాలు విక్రయిస్తే షాపులు సీజ్ చేయిస్తానంటూ సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చెండాడుతా.. వేటాడుతానంటూ ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర విమర్శలకు దారితీశాయి. హైకోర్టు కూడా ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే కేసీఆర్ మెప్పు కోసమే వరి ధాన్యం విషయంలో వెంకట్రామ్ రెడ్డి అలా రియాక్ట్ అయ్యారనే టాక్ ఉంది.