పప్పు కాదు నిప్పు.. ఒప్పుకున్న ఏ2.. లోకేశ్ అదుర్స్-వైసీపీ బెదుర్స్..
posted on Nov 15, 2021 @ 2:00PM
బాడీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు భాషనూ మార్చేశారు నారా లోకేశ్. ఇన్నాళ్లూ పప్పు-పప్పు అని సెటైర్లు వేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు లోకేశ్ డైలాగ్స్‌కి గిలగిల కొట్టుకుంటున్నారు. వాళ్లూ వీళ్లూ అని కాదు.. ఏకంగా నెంబర్ 2 విజయసాయిరెడ్డినే ప్రెస్‌మీట్ పెట్టి మరీ.. నారా లోకేశ్ బాషపై విమర్శలు చేశారంటే.. చినబాబు వాడివేడి ఏ రేంజ్‌లో పెరిగిందో తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌రెడ్డిపై లోకేశ్ చేస్తున్న విమర్శలు, ట్వీట్లు.. అధికార పార్టీని తూట్లు పొడుస్తున్నాయి. ఈ తిట్లు, తూటాల్లాంటి మాటలు భరించలేక.. తిక్కరేగిన విజయసాయి మీడియా ముందు లోకేశ్ మీద ఏడుపందుకున్నారు. బాబ్బాబు ప్లీజ్.. మరీ అంతగా తిట్టమాకు అని ఎలాగూ బతిమిలాడలేరు కాబట్టి.. లోకేశ్ వాడుతున్న భాష బాగాలేదంటూ విమర్శించారు విజయసాయి.
అబ్బా..చా.. వైసీపీ వాళ్లా.. భాష గురించి మాట్లాడేదంటూ తెగ నవ్వుకుంటున్నారు జనాలు. ఇన్నాళ్లూ పప్పూ అన్నారుగా.. ఇప్పుడేంటి నిప్పూ అంటున్నారంటి రివర్స్ అటాక్ చేస్తున్నారు. లోకేశ్ డైలాగ్స్‌కు వైసీపీ బ్యాచ్‌కు ఎక్కడో కాలుతున్నట్టుంది.. అది తట్టుకోలేకే ఇలా గింజుకుంటూ.. బూతులు మాట్లాడే పార్టీ నేతలు నీతులు చెబుతున్నారంటూ తెలుగు తమ్ముళ్లు సెటైర్లు వేస్తున్నారు. విజయసాయిరెడ్డిలాంటి లీడరే.. లోకేశ్ మాటలు భరించలేకుండా ఉంటున్నాయని.. ఆయనసలు విదేశాల్లో చదువుకున్నారా? అన్నారంటే.. నారా వారి అబ్బాయి.. అదుర్స్ అన్నట్టేగా. అంతేగా.. అంతేగా.
లోకేశ్ లోకేశ్ కాదు. అప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఇన్నాళ్లూ ఓ లెక్క.. ఇప్పటినుంచీ ఇంకో లెక్క. అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా హుందాగా ఉన్నారు. జెంటిల్‌మెన్‌గా మాట్లాడారు. ప్రతిపక్షం అయ్యాక.. అధికారపక్షం రెచ్చిపోతుంటే.. లోకేశ్ రూటు మార్చారు. బాడీ, బాడీ లాంగ్వేజ్‌తో పాటు భాషనూ మార్చేశారు. బస్తీమే సవాల్ అంటూ బరిలో దిగారు. మామలా తొడగొట్టకున్నా.. సింహంలా గర్జిస్తున్నారు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే అక్కడ ప్రత్యక్షమవుతున్నారు. లోకేశ్ ఫలనా చోటికి వస్తున్నారంటే.. ప్రభుత్వం ఉలిక్కిపడుతోంది. ముందస్తుగా పోలీసులు మోహరిస్తున్నారు. అడుగడుగునా అడ్డుకుంటున్నారు. కేసులూ పెడుతున్నారు. లోకేశ్‌కు పాలకులు ఇంతలా భయపడుతున్నారంటే.. లోకేశ్ పప్పు కాదు ఫైర్‌బ్రాండ్ అని తేలిపోతోందిగా.
వరుస ట్వీట్లతో లోకేశ్.. జగన్‌రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతలు పెడుతున్నారు. పదాలను పదునైన ఆయుధాల్లా వాడుతున్నారు. జగన్‌రెడ్డికి అనేక పేర్లు పెట్టారు. సైకోరెడ్డి, తుగ్లక్ రెడ్డి, వసూల్ రెడ్డి, కంసమామ లాంటి బిరుదులతో జగన్‌ను ప్రజాబోనులో దోషిగా నిలబెడుతున్నారు. తాలిబన్ల పాలన, నరకాసుర పాలన, జగనన్న కాదు.. జగన్ దున్న.. ఏం పీకలేడు.. లాంటి మాటలతో మంటపుట్టిస్తున్నారు. బూతులే మాట్లాడే పార్టీకి వారి భాషలోనే గట్టిగా బదులిస్తున్నారు. పప్పులాంటి వాడనుకుంటే.. పోటుగాడిలా మారి పోట్లగిత్తెలా కుమ్మేస్తుంటే.. వైసీపీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతోంది. అందుకే, విజయసాయిరెడ్డి అంతటి నాయకుడే మీడియా ముందుకొచ్చి.. ఆ భాష ఏంటి బాబూ.. మేం వినలేకపోతున్నామంటూ దండం పెట్టిపోయారు. ఇలా లోకేశ్ దెబ్బకు.. విజయసాయి అబ్బ అనడం చూసి.. అసలు సినిమా ముందుంది అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే, లోకేశ్ ట్రాన్స్ఫర్మేషన్ అయినట్టుగానే.. మిగతా టీడీపీ యువనేతలూ దూకుడు పెంచితే.. అప్పుడిక వైసీపీకి దబిడి దిబిడే.