వైసీపీ అరాచకాలు.. అమిత్ షా హామీ.. అమ్మకానికో బడి.. టాప్ న్యూస్@7PM
posted on Nov 14, 2021 @ 6:54PM
కుప్పం ఎన్నికల్లో అరాచకాలపై ఎస్ఈసీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా వైసీపీకి చెందిన స్థానికేతరులు తిష్ట వేశారని ఆక్షేపించారు. బోగస్ ఓట్లు, ఓటర్లను భయపెట్టేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోందని ఆరోపించారు. దొంగ ఓటర్లను అడ్డుకోవడంలో పోలీస్‌శాఖ తీవ్ర వైఫల్యం చెందిందని దుయ్యబట్టారు. ఎస్ఈసీ, డీజీపీలు వెంటనే చర్యలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
------------
తిరుపతిలోని తాజ్ హోటల్ వేదికగా జరుగుతున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పలు కీలక అంశాలపై ప్రస్తావించారు. ఆయన ప్రస్తావనకు తెచ్చిన అంశాలపై కేంద్ర మంత్రి, సదరన్ జోనల్ కౌన్సిల్ చైర్మన్ అమిత్ షా స్పందించి.. హామీ ఇచ్చారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అంశాలు రెండు రాష్ట్రాలవే కాదని.. ఇవి జాతీయ అంశాలని షా పేర్కొన్నారు.
-------
ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకంపనలు సృష్టిస్తోంది. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు సమాధానం దొరికిందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. జగన్ అండ్ యూ కిల్డ్ వివేకా అని తెలిపోయింది విజయసాయిరెడ్డి అంటూ ట్వీట్ చేశారు. బాబాయ్ పై జగన్ రెడ్డి గొడ్డలిపోటును గుండెపోటు అని కవర్ చెయ్యబోయిన డాక్టర్ వీసా రెడ్డి అడ్డంగా దొరికిపోయాడని అయ్యన్న ఎద్దేవా చేశారు.
-----------
ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు కురిపించారు. అప్పుడు ‘అమ్మఒడి’, ఇప్పుడు ’అమ్మకానికో బడి’ అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎయిడెడ్ స్కూళ్ల విలీనంపై ప్రభుత్వం జీవోను జారీ చేయడం సరైందికాదన్నారు. ఎయిడెడ్ విద్యా సంస్థల సరెండర్‌ను సులభతరం చేయడానికి నాలుగు ఆప్షన్స్ ఇచ్చిందంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
-----------
జగన్ సర్కారుపై బీజేపీ నేత సునీల్ దేవదర్ అతి భక్తి ప్రదర్శించారు. రైతుల మహా పాదయాత్రలోఎవరూ పాల్గొనవద్దని ఏపీ బీజేపీ నేతలపై సునీల్ దేవదర్ ఒత్తిడి చేస్తున్నారు. రైతులకు మద్దతు పలకాల్సిన అవసరం లేదని సునీల్ దేవదర్ ఫోన్ చేసి చెప్తున్నట్లు తెలుస్తోంది. యాత్రను ఆడ్డుకోవాలని చూస్తున్న పోలీసులకు సహకరించేందుకే.. తమను ఆపే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ బీజేపీ నేతలు అంటున్నారు
---------
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వడ్లు కొనేందుకు రూ. 10 వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించలేదా? అని ప్రశ్నించారు. ధర్నాలు చేసేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు బయటకు రాలేదన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ముఖ్యమంత్రి ఎందుకు దీక్ష చేయడం లేదన్నారు. వడ్లు కొనలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు.
-----------
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతోన్న బంజారా ఉత్సవ్ లో బండి సంజయ్, ఈటల తదితరులు పాల్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతీ తండాల్లో సేవాలాల్ దేవాలయాన్ని నిర్మిస్తామని బండి చెప్పారు. గిరిజన రిజర్వేషన్లు కోసం పోరాడిన రవీంద్ర నాయక్ ను కేసీఆర్ అవమానించాడని బండి సంజయ్ మండిపడ్డారు. గిరిజనులను వేదిస్తోన్న కేసీఆర్ కుటుంబాన్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని సంజయ్ అన్నారు.
-----------
గ్యారాపత్తి ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది. సీపీఐ మావోయిస్టు భద్రాద్రికొత్తగూడెం-తూర్పుగోదావరి డివిజన్ కమిటీ పేరుతో లేఖను విడుదల చేశారు. ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. మావోయిస్టు ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పోలీసుల ద్వారా ఇన్‌ఫార్మర్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నాయని మవోలు మండపడ్డారు.
----------
విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించడంతో పంజాబ్‌లో పెట్రోలు ధర, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో డీజిల్ ధర భారీగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వం ఎక్సయిజ్ డ్యూటీని పెట్రోలుపై లీటరుకు రూ.5 చొప్పున, డీజిల్‌పై లీటరుకు రూ.10 చొప్పున తగ్గించిన తర్వాత కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ఉపశమనం కల్పించాయి
----------
మధ్యప్రదేశ్ లోని భింద్ జిల్లాలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. తన గేదె పాలివ్వడంలేదంటూ ఓ రైతు పోలీసులను ఆశ్రయించాడు. నవగాం గ్రామానికి చెందిన బాబూలాల్ జటావ్ వ్యవసాయదారుడు. ఆయనకు కొన్ని పాడిగేదెలు ఉన్నాయి. అయితే వాటిలో ఒకటి కొన్ని రోజులుగా పాలివ్వడంలేదంటూ బాబూలాల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. గేదెను కూడా పోలీస్ స్టేషన్ కు తోలుకు వెళ్లాడు. తన గేదెకు ఎవరో చేతబడి చేసి ఉంటారని, అందుకే పాలివ్వడంలేదని తెలిపాడు.