మల్లన్న బీజేపీలో చేరడం లేదా?.. 4 ఆప్షన్లపై ఫోకస్.. మర్డర్ స్కెచ్ రివీల్..
posted on Nov 15, 2021 @ 11:08AM
తీన్మార్ మల్లన్నపై కేసుల మీద కేసులు పెట్టారు. జైల్లోనే బంధించాలని చూశారు. బెయిల్ రాకుండా చేసేందుకు మాగ్జిమమ్ ట్రై చేశారు. అయినా.. మల్లన్న ముందు ప్రభుత్వ కుట్రలు వర్కవుట్ కాలేదు. బలంగా పోరాడి.. అతికష్టం మీద జైలు నుంచి బయటికొచ్చారు. జైల్లోనే తనను చంపేందుకు కుట్ర చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా, ఆ వివరాలు బయటపెట్టారు తీన్మార్ మల్లన్న.
తనను హత్య చేయడానికి అధికార పార్టీ భారీ కుట్ర చేసిందని తీన్మార్ మల్లన్న ఆరోపించారు. అక్టోబరు 2, గాంధీ జయంతి రోజున జైలులో పాత నేరస్థులతో తనను చంపాలని కుట్ర చేశారని.. అయితే తాను చాకచక్యంగా తప్పించుకున్నట్టు తెలిపారు. మరుసటి రోజు చీకటి గదిలో బంధించి ఎర్రగడ్డలోని మానసిక రోగులకు ఇచ్చే మత్తుమందు మాత్రలు ఇచ్చి పిచ్చివాడిని చేయాలని ప్రయత్నించినట్టు మల్లన్న చెప్పారు. అధికార పార్టీ తనను అనేక ఇబ్బందులకు గురిచేసిందని, ఎక్కడా లేని విధంగా కేసులు పెట్టి 74 రోజులు జైలుకు పంపిందన్నారు. జైలు నుంచి తనను బయటకు తీసుకురావడానికి బలమైన, బయటి వ్యక్తులతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని చెప్పారు.
జైలు నుంచి వచ్చాక తీర్మార్ మల్లన్న మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటానంటున్నారు. తీన్మార్ మల్లన్న టీం తరఫున భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు. ప్రధానంగా నాలుగు ఆప్షన్లపై అనుచరులతో కసరత్తు చేస్తున్నారు.
1. కొత్త పార్టీ పెట్టడం
2. ఇతర పార్టీలకు బయట నుంచి మద్దతు ఇవ్వడం
3. పాత పద్ధతిలోనే కొనసాగడం
4. వేరే పార్టీలో చేరడం
ఇలా, ఈ నాలుగు ఆప్షన్లలో ఏది బెటరనే దానిపై తీర్మార్ మల్లన్న టీం జిల్లా కన్వీనర్లు, కో-కన్వీనర్లతో అభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణ చేపట్టి.. రాష్ట్ర కమిటీలో అందరి అభిప్రాయాలు తీసుకొని.. త్వరలోనే ఓ స్పష్టమైన రాజకీయ నిర్ణయాన్ని తీసుకుంటానని తీర్మార్ మల్లన్న తెలిపారు.
అయితే, మల్లన్న జైల్లో ఉన్నప్పుడు.. తన భర్త బీజేపీలో చేరేందుకు సిద్ధమంటూ ఆయన భార్య కమలం పార్టీ పెద్దలకు లేఖ రాశారు. దీంతో మల్లన్న బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు మళ్లీ భవిష్యత్ కార్యచరణ పేరుతో సమావేశాలు పెడుతుండటం కన్ఫూజన్‌కు కారణమవుతోంది. మల్లన్న బీజేపీలో చేరడం లేదా? అనే అనుమానం తలెత్తుతోంది. లేదంటే, తాను బీజేపీలో చేరాలని ఇప్పటికే డిసైడ్ కాగా, తన టీం సభ్యుల నుంచి వ్యతిరేకత రాకుండా.. ఇలా అభిప్రాయ సేకరణ చేపడుతున్నారా? అని కూడా అంటున్నారు. ఏదిఏమైనా.. ఇన్నాళ్లూ కేవలం క్యూ న్యూస్ ద్వారా మాత్రమే కేసీఆర్‌పై ఒంటరి పోరాటం చేస్తూ వచ్చిన తీన్మార్ మల్లన్న.. ఇకపై బలమైన రాజకీయ వేదికగా సర్కారుతో సమరం చేసేందుకు సమాయత్తం అవుతున్నారని స్పష్టం అవుతోంది.