కుప్పంలో మందలు మందలుగా దొంగ ఓటర్లు.. మంత్రి పెద్దిరెడ్డి పాలేర్లుగా పోలీసులు!
posted on Nov 15, 2021 @ 11:58AM
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. కుప్పంలో మరీ దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైసీపీ భారీగా దొంగ ఓట్లు వేయిస్తోంది. మీడియా, పోలీసు వాహనాల్లో దొంగ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. మందలు మందలుగా వస్తున్న దొంగ ఓటర్లను పోలీసులే దగ్గరుండి పోలింగ్ కేంద్రాలకు చేరుస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. పలు కేంద్రాల దగ్గర దొంగ ఓటర్లను అడ్డుకునేందుకు టీడీపీ నేతలు ప్రయత్నించగా.. పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో గొడవలు జరిగాయి. పోలీసులు టీడీపీ నేతలపై నిఘా పెట్టి.. వైసీపీ లీడర్లను వదిలేస్తున్నారని అంటున్నారు. అధికారులు, పోలీసుల తీరుపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది
బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే.. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జగన్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని విమర్శించారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు.
ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, పోలీసులు విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎస్‌ఈసీ, డీజీపీ.. పదవులు కట్టబెట్టిన సీఎం జగన్ రుణం తీర్చుకుంటున్నారన్నారు. పోలీసులు.. మంత్రి పెద్దిరెడ్డి పాలేర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మారువేషంలో ఇంకా కుప్పంలోనే ఉండి ఉంటారని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ ఓటర్లకు రక్షణ కల్పించే దౌర్భాగ్యం పోలీసులకు ఎందుకని ప్రశ్నించారు. పోలీసుల దౌర్జన్యాలపై అసోషియేషన్ ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. ఇలా గెలిచేది గెలుపు కాదని.. దాని కంటే చెక్క భజన చేసుకోవాలంటూ వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.
రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ ఉందా అని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. ఎన్నికలు ఈసీ కాకుండా వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నారని అన్నారు. బయటి నుంచి వచ్చి ఓటు వేసేవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బయటి వ్యక్తుల వీడియోలను ఎన్నికల కమిషన్‌కు అందిస్తామని... లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ వీడియోలు సరిచూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.