వివేకా కేసుపై వైసీపీ మౌనం.. కుప్పంలో దొంగలు.. మంత్రి పాలేర్లుగా పోలీసులు.. టాప్ న్యూస్@1PM
posted on Nov 15, 2021 @ 11:48AM
వైఎస్ వివేకా హత్య కేసులో తాము సానుభూతి వ్యక్తం చేస్తే.. వైసీపీ రాజకీయం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అన్నారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ చదువుతుంటే.. మానవత్వమున్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు వస్తాయన్నారు. వివేకా హత్యపై వైసీపీ నేతల్లో ఎలాంటి చలనమూ లేదన్నారు. ఏదైనా ఆరోపణ చేస్తే టీడీపీ నేతలకు నోటీసులు ఇస్తున్నారన్నారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లోని పెద్దలను ఎందుకు ప్రశ్నించరని జీవీ రెడ్డి ప్రశ్నించారు.
----------
కుప్పంలో అధికార పార్టీ వైసీపీ బరితెగిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. కుప్పంలోకి వైసీపీ దొంగ ఓటర్లు చొరబడుతున్నారు. టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండటంతో ఉద్రిక్తతలు తలెత్తున్నాయి. ఐడీ కార్డు అడిగితే దొంగ ఓటర్లు సమాధానం చెప్పడం లేదు. టీడీపీ శ్రేణులపై ఎదురు దాడులకు దిగుతున్నారు. యథేచ్ఛగా దొంగ ఓట్లు పోల్ అవుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. వైసీపీ శ్రేణులకు పోలీస్ యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని అంటున్నారు.
----
కుప్పం మున్సిపల్ పోలింగ్‌లో వైసీపీ దొంగ ఓట్లతో దౌర్జన్యానికి పాల్పడుతోంది. ఆరో వార్డులో మదనపల్లికి చెందిన వైసీపీ నాయకుడు దండు శేఖర్ రెడ్డి మీడియా అవతారంలో పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించాడు. వాహనానికి మీడియా బోర్డు వేసుకుని దొంగ ఓటర్లను అందులో ఎక్కించుకుని వెళ్లి ఓట్లు వేసేందుకు శేఖర్‌రెడ్డి ప్రయత్నించాడు. కాగా దొంగఓటర్లను గుర్తించిన టీడీపీ శ్రేణులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
----
బాబాయ్‌ని గొడ్డలి పోటుతో బలిచేసినట్టే.. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్ల వేటుతో జగన్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. కుప్పంలో దొంగ ఓట్లు, మాఫియా డబ్బుతో అత్యంత పవిత్రమైన ఎన్నికల వ్యవస్థని జగన్‌రెడ్డి నడిబజారులో అంగడి సరుకు చేశారని విమర్శించారు. టీడీపీ నేతలను నిర్బంధించి, ఏజెంట్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వైసీపీ తీసుకొచ్చినవారిని కుప్పం ఎలా రానిచ్చారని ప్రశ్నించారు.
----------
ఎన్నికల నిర్వహణలో ఎస్ఈసీ, పోలీసులు విఫలమయ్యారని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. ఎస్‌ఈసీ, డీజీపీ.. పదవులు కట్టబెట్టిన సీఎం జగన్ రుణం తీర్చుకుంటున్నారన్నారు. పోలీసులు.. మంత్రి పెద్దిరెడ్డి పాలేర్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మారువేషంలో ఇంకా కుప్పంలోనే ఉండి ఉంటారని వర్ల రామయ్య ఆరోపించారు. దొంగ ఓటర్లకు రక్షణ కల్పించే దౌర్భాగ్యం పోలీసులకు ఎందుకని ప్రశ్నించారు.
---------
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ ఉందా అని ప్రశ్నించారు. ఇవాళ ఎన్నికలు ఈసీ కాకుండా వైసీపీ నాయకులు నిర్వహిస్తున్నారని అన్నారు. బయటి నుంచి వచ్చి ఓటు వేసేవాళ్లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బయటి వ్యక్తుల వీడియోలను ఎన్నికల కమిషన్‌కు అందిస్తామని... లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా ఆ వీడియోలు సరిచూసుకోవాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.
---
టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ జాబితాపై సస్పెన్షన్ కొనసాగుతోంది. గులాబీ బాస్ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేశారని, నామినేషన్ పత్రాలు కూడా సిద్ధం చేసినట్లు తెలియవచ్చింది. ఇంకా అభ్యర్థులకు ఈ సమాచారం అందలేదు. దీంతో అటు సిట్టింగ్స్.. ఇటు ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. మధుసూదనాచారి, పాడి కౌశిక్ రెడ్డి, ఎంసి కోటిరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్ రావు, ఎల్.రమణ, కడియం లేదా ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్లు ఫైనల్ జాబితాలో ఉండే అవకామున్నట్లు సమాచారం.
--------
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్ ఆసుపత్రిలో వార్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి నగరం నలువైపులా సీఎం కేసీఆర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించనున్నారని చెప్పారు. పెద్ద ఎత్తున్న మెడికల్ కాలేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారన్నారు.
---
కేబీఆర్ పార్క్ వద్ద నటి చౌరాసియాపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో చౌరాసియాపై దాడి చేయగా.. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వాకింగ్‌కు వెళ్లగా గుర్తు తెలియని ఆకతాయిలు ఆమెపై దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఈ పెనుగులాటలో నటి తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. ఓ ఆకతాయి ఆమె ముఖంపై పిడిగుద్దులు, బండరాయితో దాడి చేశాడు. అనంతరం ఆమె వద్ద ఉన్న 8 ప్లస్ ఫోన్, నగలు, నగదు తీసుకుని వారు పరారయ్యారు.
---------
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జవహార్‌లాల్ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి సంఘానికి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్‌కి మధ్య ఆదివారం రాత్రి జరిగిన గొడవలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడ్డ విద్యార్థుల్ని ఢిల్లీ ఎయిమ్స్‌కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు యూనివర్సిటీ యాజమాన్యం తెలిపింది. ఆదివారం రాత్రి 9:45 గంటలకు ఇరు విద్యార్థి నేతల మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.