ముందస్తు ఎన్నికలతో మెరుపు దాడి .. పీకే ప్లాన్ అదేనా ?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు సిద్డంవుతున్నారా? ఐదేళ్ళు పూర్తయ్యే వరకు ఆగితే, ఇక ఆ తర్వాత పోటీ చేయడమే అనవసరమనే నిర్ణయానికి వచ్చారా? విపక్షాలకు సమయం ఇవ్వకుండా ఎన్నికలకు వెళితేనే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని, పీకే (ప్రశాంత్ కిశోర్) సలహా ఇచ్చారా? ఆ సలహా మేరకు ... వచ్చే మార్చిలో బడ్జెట్ ప్రవేశశ పెట్టి ఆ వెంటనే ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ రెడ్డి సిద్దమవుతున్నారా?అంటే అవుననే అంటున్నారు రాష్ట్ర రాజకీయాలను దగ్గరగా చూస్తున్న రాజకీయ విశ్లేషకులు, ఫోర్త్ ఎస్టేట్ పండితులు.
జగన్ రెడ్డి ప్రభుత్వం ఓటు బ్యాంకును నిలుపుకేందుకు నవరత్నాలను నమ్ముకుని, అనుసరించిన తప్పుడు విధానాలు, రెండున్నరేళ్ళకేసర్కార్ మెడకు గుదిబండగా మారాయి. మరో వంక ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పేద ప్రజల వరకు అన్ని వర్గాల ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత దినదినాభివృద్ధి చెందుతోంది. ఇలా పెల్లుబుకుతున్న ప్రభుత్వ వ్యతిరేకత ఇంకా ఇంకా పెరిగి కొంప ముంచక ముందే ఇల్లు చక్క పెట్టుకునే ఆలోచనలతో ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, మూడు రాజధానుల రద్దు నిర్ణయం మొదలు ఇటీవల ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం అదే సూసుచిస్తోందని, విశ్లేషకులు అంటున్నారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా పట్టాలు తప్పింది. అప్పుల కుప్ప కొండలా పెరిగి పోతోంది. రెండున్నరేళ్ళ పాలనలో జగన్ రెడ్డి ప్రభుత్వం, మూడున్నర లక్షల కోట్ల అప్పుచేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నెత్తిన ఐదున్నర లక్షల రూపాయల అప్పు ఉందని లెక్కలు చెపుతున్నాయి. అంతే కాదు ఇలా అడ్డగోలుగా, పరిమితులను దాటి చేసిన అప్పులకు, రూ.60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను కుదువ పెట్టింది. ఇక కుదువ పెట్టేందుకు అనువైన ఆస్తులు లేవు ... అప్పులు పుట్టే మార్గం లేదు.మరో వంక అప్పు పుట్టనిదే పూట గడిచే పరిస్థితి లేదు. ఈ పరిస్థితులలో జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచింది ... ట్రూఅప్’ పేరిట అదనపు వడ్డన విదించింది. ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచింది. ఇక మద్యం రేట్ల సంగతి అయితే చెప్పనే అక్కర లేదు.
అలాగే జనలా కళ్ళకు గంతలు కట్టి, జేబులకు కత్తెరలు వేస్తూనే ఉంది. ఇవేవీ చాలావన్నట్లుగా, కొత్తగా, జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ ఒకటి తెచ్చింది. 1983 నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు కట్టించి ఇచ్చిన 40 లక్షల ఇళ్ళ రిజిస్ట్రేషన్ చేస్తామంటూ వన్ టైమ్ సెటిల్మెంట్(ఓటీపీ) ఫిక్స్ చేసింది. గ్రామాల్లో ఇంటికి రూ. 10.000 వేలు, పట్టణాల్లో రూ.15000 నగరాల్లో రూ.20,000 చెల్లించాలని ‘పెడల్ మెడ మీద కట్టి పెట్టింది. ఒకే సారి, రూ. 6000 కోట్ల రూపాయాలను కాజేసే పథకాన్ని తెచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకు టార్గెట్లు ఫిక్స్ చేసి జనం జేబులు కొట్టేందుకు సిద్దమయింది. ఇలా ఎన్నిరకాలుగా, జనం నడ్డి విరిచినా ఖజానాలో కాసులు నిలవడం లేదు. నవరత్నాలు, ఓటు బ్యాంకు పథకాలు ఖజానాలో పడిన పైసాను పడినట్లుగానే మింగేస్తున్నాయి.
ఈనేపధ్యంలో ఇక ప్రభుత్వాన్ని నడపడం అయ్యేపని కాదని జగన్ రెడ్డికి అర్థమై పోయింది. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే, సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలను జనంలో ఉండాలని, ఎన్నికలకు సిద్ధమవ్వాలని సూచించినట్లు సమాచారం.మరో వంక పీకే టీమ్, ఇప్పటికే రంగంలోకి దిగి పని మొదలు పెట్టింది. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం ముందు వైసీపీ ప్రభుత్వం నిలబడే పరిస్థితి లేదు. అయితే, ఎన్నికలను ఎదుర్కునేందుకు, ప్రతిపస్ఖాలు కూడా అంత సన్నద్ధంగా లేవు. ఇలా ప్రతిపక్షాలు ఎన్నికలకు సన్నద్ధంగా లేక పోవడం ఒక్కటే, అధికార ప్రభుత్వానికి దింపుడు కళ్ళెం ఆశగా కనిపిస్తోందని అంటున్నారు అంటున్నారు.అందుకే, ఆ దింపుడు కళ్ళెం ఆశకూడా కరిగి పోకముందే ముందస్తు ఎన్నికలతో మెరుపు దాడి చేయాలని పీకే ఇచ్చిన సలహాకు ముఖ్యమంత్రి ఓకే అన్నారని, ముందస్తుకు వెళ్ళాలనే నిర్ణయానికి వచ్చారని, అందుకే రూట్ మార్చి జనంలోకి వెళ్లేందుకు జగన్ రెడ్డి సిద్డమవుతున్నారని అంటున్నారు.