హే అన్నమయ్యా.. ఇంత వైఫల్యమా?
posted on Dec 6, 2021 @ 11:05AM
వాన కురిసింది. వరద ముంచెత్తింది. ప్రాజెక్టు నిండింది. ఇంత వరకూ సాధారణమే. ఆ తర్వాతే తేడా కొట్టింది. విపత్తా? వైఫల్యమా? అనే ప్రశ్న తలెత్తింది. ఎగువ నుంచి అన్నమయ్య ప్రాజెక్టును వరద ముంచెత్తుతున్నా కొద్దీ.. దిగువకు అదే స్థాయిలో నీళ్లు వదలాలి. కానీ, అలా జరగలేదు. ప్రాజెక్టు నిండి డ్యాం కొట్టుకుపోయే వరకూ దోబూచులాడారు. గేట్లు ఎత్తాలనే చిన్న లాజిక్ అధికారులు ఎలా మిస్ అయ్యారు? పైనుంచి ఆదేశాలు వచ్చాయని అంటున్నారు. ఇసుక లారీల కోసమే గేట్లు ఎత్తకుండా విలయానికి కారణమయ్యారని చెబుతున్నారు. కేంద్రం సైతం ఈ విషయంలో ఏపీని గట్టిగా నిలదీస్తుండటంతో జల విషాదం.. వివాదంగా మారింది. ఇంతకీ అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులో ఆ రోజు అసలేం జరిగింది...?
అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి.. ఊళ్లకు ఊళ్లు మునిగిపోయాయి. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. కేవలం రెండు, మూడు గంటల్లోనే వచ్చిన అనూహ్య వరద.. ప్రకృతి విపత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అంటున్నారు. సామర్థ్యానికి మించిన వరదతో డ్యాంలు తెగిపోవని, నిర్వహణ వైఫల్యాలు కూడా తోడవడమే పెను ప్రమాదానికి కారణమని జలవనరుల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, వరదల సమయంలో చూపించాల్సిన అప్రమత్తత విషయంలో వైఫల్యమే కారణమని చెబుతున్నారు.
అన్నమయ్య జలాశయాన్ని ఖాళీ చేసే విషయంలో, గేట్లు ఎత్తే విషయంలో జలవనరులశాఖ అధికారులకు.. రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయ లోపం కనిపించింది. ప్రవాహాల తీరుపై రెవెన్యూ అధికారులకు వర్తమానం పంపామని, ముందస్తు అనుమతి లేకుండా జలాశయాలు ఖాళీ చేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండటంతో రెవెన్యూ అధికారుల అనుమతి కోసం ఎదురు చూశామని జల వనరుల శాఖ అధికారులు అంటున్నారు. అందుకే, సకాలంలో ప్రాజెక్టు ఖాళీ చేసేందుకు నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందంటున్నారు.
అన్నమయ్య, పింఛ ప్రాజెక్టులకు గతేడాది నవంబరులో వచ్చిన వరదలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్నమయ్యలో అయిదో గేటు పని చేయట్లేదు. మరమ్మతు పనుల కోసం రూ.4 కోట్లు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదన వెళ్లినా, నిధులు మంజూరు కాలేదు. ఆ పాపం ఇప్పుడు శాపంగా మారిందని అనుమానిస్తున్నారు.
అన్నమయ్య జలాశయంలో నవంబరు 18 రాత్రి 8.30 సమయంలో 1.590 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఒక గేటు పని చేయకపోయినా 1.80 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు పంపవచ్చు. మూడు రోజులు అతిభారీ వర్షాలని ప్రభుత్వమే చెబుతోంది. 87,296 క్యూసెక్కుల ప్రవాహాలు ప్రాజెక్టులోకి వస్తున్నాయి. మరి ఆ సమయంలో 1.20 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? అదేరోజు అర్ధరాత్రి ప్రాజెక్టులో నీటి నిల్వ 1.805 టీఎంసీలకు పెరిగింది. మరోవైపు ప్రాజెక్టులోకి 1.71లక్షల క్యూసెక్కుల ప్రవాహాలు వస్తుంటే 1.46 లక్షల క్యూసెక్కులే ఎందుకు వదిలారు? భారీ వరద వస్తున్నప్పుడు జలాశయంలో నీటి నిల్వ పెంచేలా ప్రాజెక్టు గేట్ల నిర్వహణ చేయడం ఏమిటి? ఆ తర్వాత రెండు మూడు గంటలకు కట్ట కొట్టుకుపోతే దీన్ని ప్రకృతి విపత్తు అనాలా? ప్రాజెక్టు నిర్వహణలో లోపం అనాలా? అనే చర్చ జరుగుతోంది.
అధికారుల వాదన: కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో నవంబరు 16, 17, 18 తేదీల్లో కుండపోత వర్షాలు కురిశాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో వర్షాలు పడ్డాయి. భారీ వరద ముంచెత్తడంతో, ప్రకృతి విపత్తు వల్ల ఈ ప్రాజెక్టులకు ప్రమాదం సంభవించింది.
నిపుణుల మాట: మూడు రోజులు అతి భారీవర్షాలు కురిశాయని ప్రభుత్వమే చెబుతోంది. అన్నమయ్య జలాశయానికి పైన బాహుదా, పింఛ, మాండవ్య మీదుగా నీటి ప్రవాహాలుంటాయి. ఆ మూడు కలిసిన చెయ్యేరు మీదే అన్నమయ్య జలాశయం ఉంది. అతి భారీవర్షాల వల్ల వరద వస్తుందని ఇంజినీరింగు అధికారులు అంచనా వేయగలరు. ఆ పరీవాహకంలో ఎక్కడ ఎంత వర్షం పడిందో లెక్కలూ అందుబాటులో ఉంటాయి. భారీవర్షాలు ప్రారంభమైన మూడోరోజు అర్ధరాత్రి తర్వాత రెండు జలాశయాల కట్టలు తెగాయి. అన్నమయ్య జలాశయంలో నిల్వ ఉన్న 1.590 టీఎంసీల నీటిని ముందే ఖాళీ చేసి వరద నీటిని నింపేందుకు సిద్ధంగా ఉండాలి కదా? అలా ఎందుకు చేయలేదన్నది జలవనరుల నిపుణుల ప్రశ్న.
అనిల్ కుమార్ కు అన్నమయ్య సెగ.. కేంద్రం యాక్షన్ తప్పదా?