వందల కోట్లలో మోసం.. అకౌంట్లలో కేవలం 4 వేలు! పోలీసులకు సవాల్ గా శిల్పా చౌదరి కేసు..
posted on Dec 6, 2021 @ 11:19AM
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన శిల్పా చౌదరి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకొస్తోంది. కీలక మలుపులు తిరుగుతోంది. ఆమె మోసాల బాధితుల లిస్ట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. తాజాగా శిల్ప వర్సెస్ రాధికారెడ్డి ఇష్యూ నడుస్తోంది. ఇప్పటికే రెండ్రోజుల పాటు శిల్పను విచారించిన పోలీసులు.. రాధికారెడ్డిని విచారించనున్నారు. అటు శిల్పాచౌదరిని కూడా మరోసారి కస్టడీకీ తీసుకోవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఉప్పర్‌పల్లిలో సోమవారం కస్టడీ పిటిషన్ వేశారు. రాధికారెడ్డికి కోట్ల రూపాయలు ఇచ్చానని శిల్ప చౌదరి చెబుతుంటే.. శిల్పనే తనను మోసం చేసిందని అంటోంది రాధికారెడ్డి. ఆధారాలతో సహా శిల్ప మోసాలను పోలీసుల ముందు బయటపెడతానంటోంది. దీంతో అసలేం జరిగిందన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శిల్పా బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికే సీజ్ చేసిన శిల్పా ఫోన్ నుండి పలు నెంబర్ల గుర్తించారు పోలీసులు. శిల్పా బాధితుల్లో ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కోట్ల రూపాయల డబ్బులను వసూలు చేసిన శిల్పా… అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పేరుతో వసూలు చేసింది.కోట్ల రూపాయలు వసూలు చేసి మోహం చాటేశారు శిల్పా దంపతులు. వసూలు చేసిన కోట్ల రూపాయలను ఎక్కడ, ఏం చేసిందన్న దాని పై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు నాలుగు అకౌంట్లు గుర్తించినా… ఆ అకౌంట్లో కేవలం వేలల్లోనే నగదు ఉన్నట్లు గుర్తించారు.
శిల్ప అకౌంట్లను ఫ్రీజ్ చేసిన పోలీసులు.. వసూలు చేసిన కోట్ల రూపాయల పైనే దృష్టి సారించారు. ఆ డబ్బుతో ఏం చేసింది.. ఎక్కడైనా బిజినెస్‌పెట్టిందా... లేక భూములు కొనుగోలు చేసిందా అన్న అంశాలపైనే నిఘా పెట్టారు పోలీసులు. తమ దగ్గరి నుండే కోట్ల రూపాయలు తీసుకుందంటూ శిల్పా పై ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. అయితే ఈ కేసులో మరి కొంత మందిని విచారించే అవకాశం ఉంది.
శిల్ప చౌదరి మోసాలు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. అధిక వడ్డీ ఇస్తానని ఆశచూపి బడా బాబుల దగ్గర కోట్లలో డబ్బులు లాగేసింది. కిట్టి పార్టీలు ఫేజ్ త్రీ పార్టీలతో ఆమె తమ పని కానిచ్చిందియ ఆమె విలాసవంతమైన జీవితం చూసి నమ్మేసిన కొందరు ప్రముఖులు కోట్లాది రూపాయలు సమర్పించుకున్నారు. తీరా అధిక వడ్డీ కాదు కదా.. అసలు కూడా తిరిగిరాకపోవడంతో పోలీస్ స్టేషన్‌కు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఫైనాన్సియర్స్‌తో పాటు ఉన్నతాధికారులు కూడా వీరి బాధితుల లిస్ట్‌లో ఉన్నారు. అయితే ఆమె బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, బ్లాక్ మనీ ఇవ్వడంతో కొందరు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదని అనుమానిస్తున్నారు.