జగన్ సర్కార్ కు కేంద్రం బిగ్ షాక్.. పంచాయతీ నిధుల డ్రాకు చెక్ 

పంచాయతీ నిధులకు లాగేసుకున్న జగన్ సర్కార్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రం చెక్‌ పెట్టింది. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 14, 15వ ఆర్ధిక సంఘం నిధులను విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట రూ. 1300 కోట్లను జగన్ సర్కార్ లాగేసుకున్నది. 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 944 కోట్లను వారం రోజుల క్రితమే పంచాయతీ అకౌంట్ల నుంచి ఆర్ధిక శాఖ మళ్లించుకున్నది. దీంతో ఈ వరుసగా నిధుల మళ్లింపుపై కేంద్ర ప్రభుత్వానికి కుప్పులు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై కేంద్రం చాలా సీరియస్‌గా స్పందించింది.  కేంద్రం ఆదేశాలతో అలెర్టయిన పంచాయతీ రాజ్‌ కమీషనర్‌.. జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అకౌంట్లు గ్రామ పంచాయతీ పేరు మీద, యూనియన్‌ బ్యాంక్‌లో ప్రారంభించాలని ఆదేశించారు. ఇకపై అన్ని పంచాయతీలు వెంటనే అకౌంట్లు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు ఇక నుంచి ఈ అకౌంట్‌లో వేస్తామని ప్రభుత్వం పేర్కొంది.  పంచాయతీ నిధులు పక్కదారి పడుతున్నాయంటూ ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల బకాయిల పేరిట 14, 15వ ఆర్థిక సంఘం నిధులు జమ చేసుకుంది.  రిజిస్ట్రేషన్‌ సర్‌చార్జి నిధులను పంచాయతీలకు జమచేయకుండా ఇతర కార్యక్రమాలకు ఉపయోగించుకుంటోంది. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెబుతున్న ప్రభుత్వం..  తమ ప్రమేయం, పంచాయతీల తీర్మానం లేకుండానే నిధులు జమచేసుకొంటోందని సర్పంచ్‌లు తీవ్రనిరసన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ ఆర్థిక వనరులు పెరగడానికి ప్రతేక నిధులు ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చే నిధులను బకాయిలకు జమచేసుకొంటూ తమ చేతులు కట్టేసిందని సర్పంచ్‌లు ఆరోపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో పీకే పాలిటిక్స్.. ఎవరు దోస్త్.. ఎవరు దుష్మన్ ? ప్రభుత్వం స్థానిక సంస్థలపై పెత్తనం చేస్తోందని ఏపీ పంచాయతీ పరిషత్‌ చైర్మన్‌ ఆరోపించారు. గ్రామ అవసరాలు, అభివృద్ధి, ఆర్థిక వనరులు ఇతర అంశాలను సర్పంచ్‌లు, పాలకవర్గం చర్చించి నిధులు ఖర్చుచేయాలని  దీనికి విరుద్ధంగా ప్రభుత్వం బకాయిల పేరుతో జమ చేసుకోవటం సరికాదన్నారు. దీనిపై సర్పంచ్‌లతో చర్చించి కోర్టుకు వెళతామని ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలోనే కేంద్రంకు ఫిర్యాదులు రావడంతో సీరియస్ గా స్పందించి తాజా ఆదేశాలు జారీ చేసింది.

తెలంగాణలో ఒమిక్రాన్ తొలి కేసు? మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్..

ఒమిక్రాన్ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ప్రాణాంతంక వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది. మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా కచ్చితంగా వసూలు చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చింది. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన వారిలో ఒక మహిళకు పాజిటివ్గా తేలిందని తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. ఆమె పరీక్షల నమూనాను జినోమ్కు పంపించామని ఆయన తెలిపారు. బ్రిటన్ నుంచి వచ్చిన ఆ మహిళను రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఇంకా పూర్తిగా నివారణ కాలేదు… కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ వేస్తున్న వ్యాక్సిన్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్న వారిలో 25 లక్షల మంది ఇంకా రెండో డోస్ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లో 5.90 లక్షల మంది, మేడ్చల్ జిల్లాలో 4.80 లక్షల మంది, రంగారెడ్డి జిల్లాలో ఇంకా 4.10 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందని డీహెచ్ చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 25 లోక్షల మంది వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకోవాల్సి ఉందన్నారు. ఒమిక్రాన్ వైరస్ డెల్టా వైరస్ కన్నా ఆరు రెట్లు వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరుగుతున్న ప్రాంతాల నుంచి మూడు రోజుల్లో మూడు దేశాల నుంచి 24 దేశాలకు వైరస్ వ్యాప్తి చేందిందని తెలిపారు. మాస్క్ ధరించడంతో పాటు ఇతర కోవిడ్ నిబంధనలను కూడా కచ్చితంగా ప్రజలంతా పాటించి తీరాల్సిందే అని డీహెచ్ తెలిపారు. వైరస్ నుంచి ముప్పు తెచ్చుకోకూడదంటే జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నారు. వ్యాక్సిన్ తీసుకుని ఎవరి ప్రాణాలను వారే కాపాడుకోవాలని డీహెచ్ హితవు పలికారు. ఒమిక్రాన్పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. బహిరంగ ప్రదేశాలు, ఆపీసులలో కూడా మాస్క్ ధరించి తీరాల్సిందే అని ఆయన వార్న్ చేశారు. వ్యాక్సిన్పై కచ్చతమైన నిబంధనలు కూడా ప్రభుత్వ అనుమతితో రూపొందించనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.

శిల్పాచౌద‌రి క్రైం లీల‌లు మామూలుగా లేవుగా.. ఆమె చాలా ముదురు..

అడ‌గ్గానే అప్పు ఇచ్చేయాలి. అడిగినంత చేతిలో పెట్టేయాలి. అలా జ‌ర‌గాలంటే, మ‌నం చాలా రిచ్ అని అంద‌రికీ తెలియాలి. స‌రిగ్గా ఇదే స్ట్రాట‌జీ ఫాలో అయ్యారు శిల్పాచౌద‌రి. ద‌ర్పంగా, ద‌ర్జాగా క‌నిపించేలా బిల్డ‌ప్ ఇచ్చారు. సంప‌న్నులు నివాసం ఉండే హైద‌రాబాద్‌లోనే ఖ‌రీదైన గండిపేట‌లోని సిగ్నేచ‌ర్ విల్లాస్‌లో మ‌కాం వేశారు. కోటీశ్వ‌రులా క‌నిపించ‌డానికి ఖ‌రీదైన ప‌ట్టు చీర‌లు క‌ట్టేవారు. క‌ట్టిన చీర క‌ట్ట‌కుండా.. క‌లరింగ్ ఇచ్చేశారు. ప్రత్యేక ఫ్యాషన్‌ డిజైనర్‌ను కూడా నియమించుకుంది. ఒంటినిండా బంగారం. పెద్ద పెద్ద ఆభ‌ర‌ణాలు. అయితే, అవ‌న్నీ గిల్ట్ న‌గ‌లు అని అనుమానం రాకూడ‌దు.  ప‌రీక్ష చేసి చూస్తే కానీ అవి రోల్డ్‌గోల్డ్ అని తెలీకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.   ఇక కోట్ల‌లో అప్పు రాబ‌ట్టాలంటే.. ఇచ్చేవారూ కోటీశ్వ‌రులై ఉండాలి. అందుకే, డ‌బ్బు బాగా ఉండే సినీ ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేసుకున్నారు. వ్యాపారవేత్త‌లు, రియ‌ల్ ఎస్టేట్ వాళ్ల‌ను వ‌ల‌లో వేసుకున్నారు. అంతా మ‌హిళ‌లే టార్గెట్‌. వారిని అట్రాక్ట్ చేసేలా.. వీకెండ్ కిట్టీ పార్టీల పేరుతో ఖ‌రీదైన పార్టీలు ఇచ్చేవారు.  గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్నారు శిల్పాచౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులు. తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి.. సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను ప‌రిచ‌యం చేసుకున్నారు. వీకెండ్‌ పార్టీల పేరుతో తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చేశారు. దివానోస్‌ పేరుతో క్యాసినో స్టార్ట్ చేశారు. సంపన్న కుటుంబాలకు చెందిన 90 మంది మ‌హిళ‌ల‌ను సభ్యులుగా చేర్పించుకున్నారు. వారాంతాల్లో విందులు, వినోదాల పేరుతో జ‌ల్సాలు చేయిస్తూ.. అప్పుల పేరుతో డ‌బ్బులు లాగేసేవారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని నుంచి 2 కోట్లు వ‌సూలు చేశారు. ఓ యువ‌హీరో భార్యను 3 కోట్లుకు మోసం చేశారు.   స‌ర్కారు వారి దెబ్బ‌.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముస‌ళ్ల పండుగ‌.. విచార‌ణ‌లో భాగంగా శిల్పాచౌద‌రికి చెందిన రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. అయితే వాటిలో అంతగా డబ్బు లేదని తెలిసింది. దీంతో మ‌రి కొల్ల‌గొట్టిన కోట్ల‌న్నీ ఆమె ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హ‌వాలా మార్గంలో విదేశాల‌కు 50 కోట్లు పంపించార‌ని అంటున్నారు. మ‌రోవైపు, శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఆయ‌న‌ ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలలో పీకే పాలిటిక్స్.. ఎవరు దోస్త్.. ఎవరు దుష్మన్ ?

ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త మలుపులు తీసుకుంటోంది. ఎవరు ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు, ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు, అనేది ఎవరికీ అంతు చిక్కని వింత రాజకీయంగా  కనిపిస్తోంది. గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ అనేది నిన్నటివరకు, బీజేపీ- తెరాస సంబంధాలకు సంబదింఛి కాంగ్రెస్ ప్రయోగించిన స్లోగన్. అయితే, ఈరోజు అదే స్లోగన్ కొత్తగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్-తెరాసల మధ్య  బలపడుతున్న సంబంధ బాంధవ్యాలకు కూడా అతికినట్లు సరిపోతుందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.   బీజేపీ-తెరాస చీకటి సంబంధాలకు ఎలాగైతే ప్రత్యక్ష ఆధారాలు లేవో అలాగే, కాంగ్రెస్-తెరాస కొత్త ప్రేమకు కూడా, పెద్దగా ఆధారాలు లేవు. కాంగ్రెస్ సహా వివిధ పార్టీలకు చెందిన 12 మంది పెద్దల సభ సభ్యుల సస్పెన్షన్  కు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ ప్రాంగణంలో గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నాయి. పార్లమెంట్ లో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుసరించవలసిన వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రతి రోజు సమావేశం కావడం గత ఒకటి రెండు సెషన్లగా ఆనవాయితీ వస్తోంది.అయితే ఇంతవరకు ఈ సమావేశాలకు ఎప్పుడు హాజరు కాని, తెరాస పార్లమెంటరీ పార్టీ తొలిసారిగా పాల్గొంది. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవ రావు, మరో ఇద్దరు ఎంపీలు ధర్నా కార్యక్రమంలో పాల్గొనారు. కేశవ రావు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పక్కనచేరి ప్రేమగా ముచ్చట్లు చెప్పుకున్నారు. అందులోంచి, కాంగ్రెస్-తెరాస కొత్త స్నేహం కథ పుట్టుకొచ్చింది.   కాంగ్రెస్ సారధ్యంలో సాగుతున్న అపోజిషన్ ఆందోళనకు ఇంతవరకు దూరంగా ఉండి బుధవారం  ఎంట్రీ ఇచ్చింది, ఒక్క తెరాస మాత్రామే కాదు, సస్పెండ్ అయిన సభ్యుల్లో ఇద్దరు తమ పార్టీ సభ్యులు ఉన్నా, సోమ మంగళ వారాలలో అపోజిషన్ ఆందోళనలకు దూరంగా ఉన్న తృణమూల్ కూడా  బుధవారం  ఎంట్రీ ఇచ్చింది. నిజానికి, పార్లమెంట్’లో జరిగే ఉమ్మడి ఆందోళనకు, రాష్ట్ర్లాలలో రాజకీయ శతృమిత్ర సంబంధాలకు ఎలాంటి సంబంధం లేదని, అక్కడ రాష్ట్రాలలో  కొట్టుకున్నా, తిట్టుకున్నా పార్లమెంట్’లో మాత్రం ఉమ్మడి శత్రువు (బీజేపీ)ను ఉమ్మడిగా ఎదుర్కుందామని, ఈ సమావేశాలకు నయకత్వం వహిస్తున్న రాజ్యసభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే స్పష్టంగా చెప్పారు. అంటే తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, అనేది ఖర్గే చెప్పిన , అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.  ఢిల్లీ నుంచి ముంబై వెళితే, అసలు రాజకీయం అక్కడ కనిపిస్తుంది. దేశంలో బీజేపీకి ప్రత్యాన్మాయంగా బలమైన ఫ్రంట్’ను ఏర్పాటుచేసే ప్రయత్నాలలో ఉన్న, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, మమతా బెనర్జీ ముంబై వెళ్లారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్’తో సమావేసమయ్యారు. ఆతర్వాత ఇద్దరు కల్సి మీడియా ముందుకు వచ్చి, ,గతంలో కాంగ్రెస్ సారధ్యంలో దేశాన్ని పదేళ్ళు పాలించిన యూపీఏ ఇక లేదు ...అని గంభీరంగా ప్రకటించారు. సో ..కాంగ్రెస్ సహా బీజేపీ వ్యతిరేక పార్టీలు అన్నటికీ తమ కొత్త కూటమి స్వాగతం పలుకుతోందని అన్నారు. అంటే, బీజేపే వ్యతిరేక కూటమి సారధ్యం నుంచి కాంగ్రెస్ పార్టీని పక్కకు తప్పించి, ఉమ్మడి నాయకత్వం పేరిట కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి చక్రం తిప్పేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు, అని అర్థం చేసుకోవచ్చును. నిజానికి కొంచెం అటూ, ఇటూ తిప్పినా  ఆమె అదే విషయం చెప్పారు.   అక్కడ కట్ చేసి తెలుగు రాష్ట్రలకు వస్తే, జాతీయ స్థాయిలో సాగుతున్న ఈ మొత్తం పొలిటికల్ డ్రామా సూత్రధారి, ఎన్నికల వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్, ఏపీలో అధికార వైసీపీతో ఇప్పటికే డీల్ కుద్రుచుకున్నారు. అ విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడోనే మంత్రివర్గ సమావేశంలోనే ప్రకటించారు. . తెలంగాలో జగన్ రెడ్డి సోదరి, వైఎస్ షర్మిల పార్టీ వైఎస్సార్ టీపీతో డీల్ కుదుర్చుకున్నారు. ఆ విషయం, మనసు విప్పి మాట్లాడే ‘ఆర్కే ఓపెన్ హార్ట్’ కార్యక్రమంలో షర్మిల స్వయంగా చెప్పారు. ఇప్పుడు తాజగాగా పీకే. కేసీఆర్ తో డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు ...అలాగే, కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్నా,కాంగ్రెస్’ను కూడా బీజేపే వ్యతిరేక కూటమిలోకి తెచ్చే ప్రయత్నాలు మాత్రం విరమించుకోలేదు. సో .. రెండు రోజుల్లో  కొలకటా టూ ఢిల్లీ టూ హైదరాబాద్ .. వయా  ముంబై .. సాగిన పొలిటికల్ జర్నీ ‘డాట్స్’ కలుపుకుంటే, అసలు బొమ్మ బయటకు వస్తుంది. ఇప్పటికిప్పుడు ఏమీ జరగక పోవచ్చును కానీ, చివరకు, ఎన్నికల నాటికి, బీజీపీ వ్యతిరేక పార్టీలు అన్నీ మమతా-పవార్ ఫ్రంట్ వైపు ర్యాలీ కావడం ఖాయంగా కనిపిస్తోంది.  అదే జరిగితే, తెరాస ఆ కూటమిలో చేరితే  కాంగ్రెస్ ఎటుంటుంది ? మమతా బెనర్జీ నాయకత్వాన్ని అంగీకరించి, బీజేపీ వ్యత్రిరేక కూటమిలో చేరుతుందా?  మరో కూటమిని ఏర్పాటు చేస్తుందా? ఏమి జరుగు తుంది? అదొక మిలయన్ డాలర్ల ప్రశ్న. తెలంగాణలో తెరాస తృణమూల్ కూటమిలో చేరితే కాంగ్రెస్ ఏమి చేస్తుంది, అనేది మరో  మిలయన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీని కాపాడుకునేందుకు థర్డ్ ఫ్రంట్’గా ఏర్పడినా, అల్టిమేట్’గా బీజేపీ వ్యతిరేక శక్తులు అన్నీ, అది కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, వైసీపీ అయినా  చివరకు  తెరాసనే  అయినా, చేరేది ఒకటే గూటికి అందులో  సందేహం లేదు.

కాంగ్రెస్ పని అయిపోయినట్టే..! ఆజాద్ కామెంట్లతో కలకలం..

“కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తేనే కానీ, ప్రస్తుత బీజేపీ  ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్ 370 పునరుద్దరణ సాధ్యంకాదు అది జరిగితేనే కానీ, జమ్ము కశ్మీర్ రాష్ట్రం స్వయంప్రతిపత్తి పునరుద్దరణ జరగదు. అయితే, ప్రస్తుత పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ, ఒంటరిగా 300 స్థానాలు గెలిచి, అధికారంలోకి రావడం అయ్యే పని కాదు. కాంగ్రెస్ అంత భారీ మెజారిటీతో గెలవాలని ప్రార్ధన అయితే చేయగలను కానీ, కాంగ్రెస్ గెలుస్తుందని మాత్రం చెప్పలేను కాబట్టి, ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరగదు”... కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ జమ్ము కశ్మీర్లోని పూంఛ్లో నిర్వహించిన ర్యాలీలో చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఒక రకంగా దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏర్పడిన అసమ్మతి బృందం -  జీ 23 – బృందంలో కీలక నేతగా ఉన్న ఆజాద్ ఉద్దేసపూర్వకంగానే కాంగ్రెస్ పార్టీని, నాయకత్వాన్ని పలచన చేసి విధంగా మాట్లాడారని, కాంగ్రెస్ నేతలు కొందరు ఆక్షేపిస్తున్నారు.   ఇటీవల జమ్మూ కశ్మీర్’లో పర్యటించిన రాహుల గాంధీ కూడా, జమ్మూ కశ్మీర్’ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలని మాత్రమే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 ప్రస్తావన  తీసుకురాలేదు. అది అయ్యేపని కాదు కాబట్టే రాహుల్ గాంధీ ఆ ప్రస్తావన తీసుకురాలేదు.అయితే,ఆర్టికల్ 370 పునరుద్ధరణ డిమాండ్’తో ఆందోళన చేస్తున్న, వివిధ సంస్థల నుంచి అదే విధంగా ప్రాతీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆర్టికల్ 370 విషయంలో  చేతులు ఎత్తేసిందనే విమర్శలు ఎదుర్కుంటోంది. కాంగ్రెస్ పార్టీకి 370 విషయంలో చిత్తశుద్ది లేదని ఆరోపిస్తున్నాయి. ఈ  నేపధ్యంలోనే గులాం నబీ ఆజాద్’ 370 పునరుద్దరణ అయ్యే పని కాదని వివరణ ఇచ్చారు తప్ప కాంగ్రెస్ నాయకత్వాన్ని పలచన చేసే ఉద్దేశం ఆయనకు లేదని ఆజాద్ వర్గం ఎదరు దాడి  చేస్తోంది.  రాహుల్ గాంధీ చెప్పిన విషయాన్నే ఆజాద్ చెప్పారని అంటున్నారు. అయితే, 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపించడం లేదని ఆజాద్ పేర్కొనడం పార్టీ ఇమేజిని దెబ్బ తీసేవిధంగా ఉందని అంటున్నారు. మరో వంక, కారణాలు ఏవైనా గత కొంత కాలంగా స్తబ్దుగా ఉన్న  జీ -23 ఈ వివాదంతో మరోమారు తెరమీదకు వచ్చే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.    కాగా జమ్ము కశ్మీర్ కు  ప్రత్యేక అధికారాలు కల్పించే 370వ అధికరణాన్ని 2019లో బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. జమ్ము కశ్మీర్ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. తగిన సమయంలో కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం ఇటీవల పేర్కొంది.కొద్దిరోజుల క్రితం ఈ అంశంపైనా ఆజాద్ విమర్శలు కురిపించారు. సాధారణంగా కేంద్ర పాలిత ప్రాంతాలను రాష్ట్రాలుగా మార్చడం జరుగుతుందని, కానీ మోదీ సర్కారు రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతానికి దిగజార్చిందని వ్యాఖ్యానించారు.  నిజానికి ఆజాద్ ఉద్దేశం ఏమైనప్పటికీ, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో గత కొంత  కాలంగా నివురుగప్పిన నిప్పులా స్తబ్దుగా ఉన్న అంతర్గత విభేదాలను మళ్ళీ తెర పైకి తెస్తుందని అంటున్నారు.

అఖండకు దెబ్బ.. వంశీ సారీ.. వామ్మో చెడ్డీ గ్యాంగ్  మండలి ట్విస్ట్.. టాప్ న్యూస్ @1PM

రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ’అఖండ’ సినిమా విడుదలైంది. ఏపీ ప్రభుత్వం బెన్ ఫిట్ షోలకు అనుమతి రద్దు చేసింది. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన రేట్ల ప్రకారం ధియేటర్లను నడపలేమని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో సింగిల్ ధియేటర్‌లు పూర్తిగా మూత పడతాయన్నారు  ఎగ్జిబిటర్ విజయ్ కుమార్.  పది మంది చేసే తప్పు చూపించి వేల మంది కడుపు కొడుతున్నారన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తప్పులను సరి చేయాలి గానీ.. అసలు వ్యవస్థనే నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు ------- చంద్రబాబు సతీమణిపై వ్యాఖ్యల విషయంలో వంశీ చెప్పిన క్షమాపణలను నమ్మలేమని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ‘‘వంశీ సారీ కాదు... మాకు చంద్రబాబు కన్నీళ్లు కనిపిస్తున్నాయి’’ అని తెలిపారు. వంశీ ఇటు సారీ అంటారు...కొడాలి మళ్ళీ మీదే తప్పు అంటారని మండిపడ్డారు. వల్లభనేని 5 శాతమే తప్పు చేసారని కొడాలి అనడాన్ని ఎలా చూడాలని ప్రశ్నించారు. వైసీపీ నేతలు క్షమాపణలు చెప్పినట్లు తాము భావించడం లేదని అనిత అన్నారు.  ------- మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో గంగిరెడ్డి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన డ్రైవర్ దస్తగిరి కావాలనే తనను కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని గంగిరెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. గంగిరెడ్డి తరుపున సీనియర్ న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు పిటిషన్ ధాఖలు చేశారు.  ----- అమరావతి రాజధాని రైతుల మహాపాదయాత్ర 32వ రోజు కొనసాగుతోంది. గురువారం నెల్లూరు జిల్లా, మరిపల్లి నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. ఈ రాత్రికి తురిమేర్లలో అమరావతి రైతులు బస చేయనున్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీజేపీ నేత ఆంజనేయులు పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా ఆంక్షలతో పోలీసులు, వైసీపీ నేతలు పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.  ------ ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. పాడైన ధాన్యం నుంచి ఆర్ఎస్ స్పిరిట్ తయారు చేసే పరిశోధనలు చేయించాలని సూచించారు. పరిశోధనలు ఫలిస్తే జిల్లాకొక స్పిరిట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని లేఖలో ప్రస్తావించారు. తద్వారా ధాన్యానికి మద్దతు సమస్య ఉండదన్నారు.  --- తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రిలో రోగులకు భోజనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఏరియా ఆసుపత్రిలో భోజనాలను నిలుపుదల చేశారు. నెలల తరబడి కాంట్రాక్టరుకు బిల్లులు అందడం లేదు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోని పరిస్థితి. భోజనాలు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రూ.12 లక్షల మేర బిల్లు పెండింగ్‌లో ఉండడంతో ముందస్తుగా సూపరింటెండెంట్‌కు కాంట్రాక్టర్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.  ------ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం గుంటుపల్లిలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. బుధవారం రాత్రి గుంటుపల్లి గ్రామంలో ఒక అపార్ట్మెంట్‌లోకి చెడ్డి గ్యాంగ్‌కు చెందిన ఐదుగురు దోపిడీకి యత్నించారు. అలికిడి వినిపించి లైట్లు వేయటంతో దొంగలు పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  ------ కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. బెంగుళూరులో అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ పెట్టింది. మంథని నుంచి క్యాంపునకు 35 మంది ప్రజాప్రతినిధులు వెళ్లారు. పోటీలో లేని కాంగ్రెస్.. క్యాంపు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ మద్దతు ఎవరికో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ---- హైదరాబాద్  శివార్లలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ, రాధానగర్‌ కాలనీలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదారు 200 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు. ---- ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఆందోళనలు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌తోపాటు విపక్షాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు ధర్నా చేయనున్నారు. అదేవిధంగా రాజ్యసభలో 12 మంది సభ్యులను అకారణంగా సస్పెండ్‌ చేశారని, వారిపై నిషేదాన్ని ఎత్తివేయాలని సభలో, బయట నిరసన తెలపనున్నారు.

సారీనా? వ‌ర్రీనా? వంశీ వ్యూహ‌మేంటి? మ‌రో ముగ్గురి సంగ‌తేంటి?

నోటికొచ్చిన‌ట్టు కూశారు. అన‌రాని మాట‌లు అన్నారు. మీడియా మైక్ ముందు రెచ్చిపోయారు. అర్థంప‌ర్థం లేని నీచ ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయంగా ఆదుకున్న అధినాయ‌కుడినే అవ‌మానించారు. ఆయ‌న అర్థాంగిపై అసంబ‌ద్ధ వ్యాఖ్య‌లు చేశారు. వ‌ల్ల‌భ‌నేని వంశీ నిప్పు రాజేస్తే.. కొడాలి నాని, అంబ‌టి రాంబాబు, ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిలు ఆ అగ్గి మ‌రింత రాజేశారు. చంద్ర‌బాబు వెక్కి వెక్కి ఏడ్చేలా చేశారు. ఆ త‌ర్వాత ఆ న‌లుగురు అబాసు పాల‌య్యారు.  వారు చేసిన చెండాలానికి.. ప్ర‌జాగ్ని ఓ రేంజ్‌లో ఎగిసింది. భువ‌నేశ్వ‌రి మీద వాగిన వాగుడుకు.. అంతా దుమ్మెత్తిపోశారు. చీద‌రించుకున్నారు. అస‌హ్యించుకున్నారు. శాప‌నార్థాలు పెట్టారు. ఆందోళ‌న‌లు చేశారు. నిర‌స‌న‌ల‌కు దిగారు. ఆ ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు ఆ న‌లుగురిలో ఒక‌రు దిగొచ్చారు. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న‌ట్టు.. వ‌ల్ల‌భ‌నేని వంశీ సారీ చెప్పారు. క్ష‌మించండి అంటూ త‌ప్పుఒప్పుకున్నారు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై తాను పొరబాటున వ్యాఖ్యలు చేశానని.. అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, ఆత్మసాక్షిగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని వల్లభనేని వంశీ అన్నారు. తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని.. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, తన నుంచి మరోసారి ఇలాంటి పొరబాటు వ్యాఖ్యలు రావని అన్నారు. ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని.. ఓ మీడియా ఛానెల్ డిస్కషన్ లో వల్లభనేని వంశీ.. చంద్రబాబు, భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు. కులం నుంచి వెలివేస్తారన్న కారణంతో తాను క్షమాపణలు చెప్పడం లేదంటూ కొస‌మెరుపు ఇచ్చారు.  ఇంత‌కీ వంశీ త‌ప్పుతెలుసుకున్నారా? త‌ప్పు చేశారు కాబ‌ట్టే క్ష‌మాప‌ణ‌లు చెప్పారా? అంటే అనుమాన‌మే అంటున్నారు. వైసీపీ నేత‌లు బాగా ముదురు. జ‌గ‌న్ నుంచి షంటింగ్స్ ప‌డితేనో.. ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తేనో త‌ప్ప‌.. సారీ చెప్పే ర‌కం కాదు. భువ‌నేశ్వ‌రి విష‌యంలో అదే జ‌రిగింద‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల నుంచి ఆ రేంజ్‌లో వ్య‌తిరేక‌త‌ను జ‌గ‌న్‌రెడ్డి ఊహించ‌లేక‌పోయారు. మొద‌ట్లో వారిని ఎంక‌రేజ్ చేసినా.. వెన‌కేసుకొచ్చినా.. ఆ త‌ర్వాత ఇదేదో తేడా కొట్టేలా ఉంద‌ని భ‌య‌ప‌డ్డారు. వెంట‌నే అంతా మౌన‌ముద్ర‌లోకి వెళ్లిపోయారు. అయినా, ఆ అప‌వాదు ఇంకా ర‌గులుతూనే ఉండ‌టంతో.. వైసీపీ అనుకూల ప్ర‌ముఖ ఛానెల్‌లో కావాల‌నే డిష్క‌ష‌న్ పెట్ట‌డం.. అందులో వంశీని గెస్ట్‌గా పిల‌వ‌డం.. ఆయ‌న‌తో సారీ చెప్పించ‌డం.. అంతా జ‌గ‌న్‌రెడ్డి స్క్రిప్ట్ ప్ర‌కారమే జ‌రిగింద‌ని అంటున్నారు.  నిజంగా వారంతా త‌ప్పు చేసుకున్నామ‌ని అనుకుంటే.. ఆ న‌లుగురు క‌లిసి ప్రెస్‌మీట్ పెట్టి.. బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి ఉంటే జ‌నం న‌మ్మేవారు. రాజ‌కీయంగా తీవ్ర‌ డ్యామేజ్ జ‌రుగుతోంది కాబ‌ట్టి.. వైసీపీ మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకం, ఆడ‌ప‌డుచుల‌ను కించ‌ప‌రుస్తోందంటూ ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నారు కాబ‌ట్టి.. ఇలా క్ష‌మాప‌ణ‌ల ప‌ర్వానికి తెర లేపారని భావిస్తున్నారు. క‌మ్మ కుల‌మంతా వ‌ల్ల‌భ‌నేని వంశీని వెలి వేసినంత ప‌ని చేయ‌డమూ ఆయ‌న దిగొచ్చేలా చేసింద‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే టీడీపీ ఆధ్వ‌ర్యంలో ఆడ‌ప‌డుచుల ఆశీర్వాద యాత్ర‌ల‌కు చంద్ర‌బాబు శ్రీకారం చుట్ట‌నుండ‌ట‌మూ వైసీపీ నేత‌ల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసింద‌ని చెబుతున్నారు. అందుకే, జ‌గ‌న్‌రెడ్డి ఆదేశాల మేర‌కే.. వ‌ల్ల‌భ‌నేని వంశీతో త‌మ‌ అనుకూల‌ మీడియాలో సారీ చెప్పించి.. మ‌మ అనిపించి.. ఈ ఎపిసోడ్‌ను ముగించాల‌ని స్కెచ్ వేశార‌ని తెలుస్తోంది. కానీ, వంశీ క్ష‌మాప‌ణ‌లు చెబితే స‌రిపోతుందా? పోయిన ప‌రువు తిరిగి వ‌స్తుందా? నోరు పారేసుకున్న‌ మిగ‌తా ముగ్గురు నేత‌లు బ‌హిరంగంగా సారీ చెప్పే వ‌ర‌కూ వ‌దిలేది లేదంటున్నారు మ‌హిళాలోకం.

50 మంది విదేశీయులు అరెస్ట్.. హైదరాబాద్ లో కలకలం

హైదరాబాద్ లో విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నారనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ఫేక్ వీసాలతో ఇండియాకు వచ్చిన విదేశీయులు హైదరాబాద్ శివార్లలో తల దాచుకుంటున్నారని తెలుస్తోంది. చదువు కోసం వచ్చి కొందరు, టూరిస్టుల వీసాలతో వచ్చి మరికొందరు.. అక్రమంగా ఇక్కడే నివాసం ఉంటున్నారని సమాచారం. విదేశీయుల ద్వారానే డ్రగ్స్ రవాణా సాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో పోలీసులు నిర్వహించిన కార్డన్ సెర్చ్ లో 50 మంది విదేశీయులు పట్టుబడటం సంచలనం రేపుతోంది.  నగర శివార్లలోని రాజేంద్రనగర్ బండ్లగూడలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. విదేశీయులే లక్ష్యంగా బండ్లగూడ, రాధానగర్‌ కాలనీలో 150 మంది పోలీసులతో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. దాదారు 200 ఇండ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది నైజీరియన్లను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. వీరంతా వీసా గడువు ముగిసినప్పటికీ దేశంలో అక్రమంగా ఉంటున్నారని పోలీసులు చెప్పారు. అయితే తామంతా విద్యార్థులమని, తమనెందుకు తీసుకెళ్తున్నారని విదేశీయులు పోలీసులతో గొడవకు దిగారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 

జగన్ పాలన వైఎస్ పేరుకు మచ్చ.. ఆత్మీయుల  ఆవేదన  

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో, ఆ మాట కొస్తే జాతీయ రాజకీయాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అది ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అయినా కాదనలేని నిజం. అప్పుడే కాదు, ఇప్పటికి  కూడా, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఆయన్ని అభిమానించే నాయకులున్నారు. ఆదరించే జనం ఉన్నారు. నిజానికి, ఈరోజు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి అయ్యారంటే అది అయన చలవే. జగన్ రెడ్డి, వైఎస్’ఆర్ పేరునే పార్టీ పేరుగా పెట్టుకున్నది కూడ అందుకే, వైఎస్ పేరును ఉపయోగించుకునే,జగన్ రెడ్డి  రాజకీయాల్లో నిలదొక్కుకున్నారు. ఆయన పేరు చెప్పుకునే ముఖ్యమంత్రి అయ్యారు.  అలాగే, వైఎస్ కుమార్తె షర్మిల సాహసించి తెలంగాణలో పార్టీ పెట్టారంటే అది కూడా, వైఎస్ పుణ్యమే. అందుకే ఆమె కూడా అన్న బాతాలోనే  ఆయన పేరునే (వైఎస్సార్ టీఎస్) రాజకీయ పార్టీ పెట్టారు. నిలదొక్కుకున్నారు. రాజన్నపాలన అనే ఏక వాక్య అజెండాతో ముందుకు సాగుతున్నారు.  అయితే అదేమీ విచిత్రమో వైఎస్ ముఖ్య రాజకీయ సహచరులు ఎవరూ, జగన్ రెడ్డి వెంట రాలేదు. వైఎస్ ఆత్మ అనుకున్న, అయన జీవితకాల మిత్ర్ఫుడు, రాజకీయ సహచరుడు, కేవీపీ రామ చంద్ర రావు మొదలు, చివరు క్షణం వరకు అయన వెన్నంటి ఉన్న సూర్యుడు వరకూ ఏ ఒక్కరూ జగన్ రెడ్డి వెంట రాలేదు. అందుకు ఇతర కారణాలు ఏమున్నా, జగన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, రాజకీయ దురాస, అన్నిటినీ మించి తండ్రి శవం పక్కన పెట్టుకుని, ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాల సేకరణ చేయడం ప్రధాన కారణమని అంటారు. అయినా, జగన్ రెడ్డి దూరంగా ఉన్నా లేక ఆయనే కొందరిని దూరంగా పెట్టినా, ఉండవల్లి అరుణ్ కుమార్  వైఎస్ సన్నిహితులు చాలా వరకు జగన్ రెడ్డిని, వైఎస్ కుమారుడు అన్న ఒకే ఒక్క కారణంగా  పరోక్షంగానే అయినా సమర్ధిస్తూ వచ్చారు. అయితే, 30 నెలల జగన్ రెడ్డి అరాచక పాలన చూసిన తర్వాత,ఇక ఉపేక్షించి లాభం లేదని, కొంచెం ఆలస్యంగానే అయినా గుర్తించారు. కొద్ది రోజుల క్రితం, రాజశేఖర రెడ్డికి వీర్ విధేయుడుగా గుర్తింపు పొందిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జగన్ రెడ్డి పాలన విఫలమయిందని విరుచుకు పడ్డారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.  ఏపీ అసెంబ్లీలో అధికార పార్టీ కొత్త సంప్రదాయం ప్రారంభించిందని.. విపక్షం లేకుండా సభ నిర్వహించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్లేనని అన్నారు. అంతేకాకుండా కేంద్రం షరతులకు అనుగుణంగా పన్నులు పెంచి అప్పులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటేనని అప్పులపై నియంత్రణ లోపించిందని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి పాలనలో రెండేళ్ళలోనే, రూ.3 లక్షలకు పైబడి అప్పులు చేశారని, ముందు ముందు అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుందని ఉండవల్లి మండిపడ్డారు. జగన్ రెడ్డి పాలన ఇదే రీతిలో, ఇంతే సుందర ముదనష్టంగా సాగితే, రాష్ట్ర భవిష్యత్ మరిక లేవలేని స్థితికి చేరుకుంతుందని చాలా తీవ్రంగా హెచ్చరించారు.  వైఎస్ మంత్రివర్గ సహచరుడు, డీఎల్ రవీంద్ర రెడ్డి అయితే, జగన్ రెడ్డి తండ్రి పేరును చెడగొడుతున్నారని  అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకటికి రెండుసార్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక విధానాలను తూర్పార పట్టిన, డీఎల్, తాజగా, రాజకీయ లబ్దికోసం ప్రతి పథకానికి వైయస్సార్ పేరు పెట్టి ఆయన పేరును చెడగొడుతున్నారని విమర్శించారు.గత ప్రభుత్వాలు పేద ప్రజల కట్టించి ఇచ్చిన ఇళ్ళకు, ఇప్పుడు, జగనన్న సంపూర్ణ గృహ హక్కు  అంటూ, వన్ టైంమ్ సెటిల్’మెంట్ పేరున పేదల నుంచి వేలరూపాలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. జగన్ రెడ్డి పాలనలో కేవలం కొంతమందికి మాత్రమే న్యాయం జరిగిందన్నారు. ప్రజలందరూ జగన్ పాలనలో ఓడిపోయారని రవీంద్రా రెడ్డి ఎద్దేవా చేశారు.ముఖ్యమంత్రి ఏది చెపితే దానికి తలలు ఊపుతూ అధికారులు సంతకాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. పద్ధతిని మార్చుకోకపోతే రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు గుణపాఠం చెపుతారని డీఎల్ రవీంద్ర రెడ్డి జోస్యం చెప్పారు. నిజానికి, ఒక్క ఉండవల్లి, ఒక్క డీఎల్ మాత్రమే కాదు, వైఎస్ తో కలిసి పనిచేసిన అనేకమంది, జగన్ రెడ్డి పరిపాలాన వైఎస్కు తలవంపులు తెచ్చేలా, ఆయన ఆత్మఘోషించే విధంగా ఉందని అంటున్నారు.

డప్పు కొట్టనందుకు పింఛన్ కట్.. వైసీపీ నేత ఓవరాక్షన్

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ నేతల ఆగడాలకు హద్దు లేకుండా పోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లపై కక్షకు దిగుతున్నారనే విమర్శలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాలంటీర్లపై ఒత్తిడి తెస్తూ టీడీపీ కార్యకర్తలు, సానుభూతి పరులకు పింఛన్ కట్ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఘటన మరీ దారుణంగా ఉంది. వైసీపీ నేత పర్యటనలో డప్పు కొట్టలేదని కారణంలో కొందరు దళితులకు పెన్షన్ నిలిపివేయడం తీవ్ర దుమారం రేపుతోంది.  అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో గ్రామ వైసీపీ నేత పర్యటనకు దళితులు డప్పు కొట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ దళితులకు పింఛన్ కట్ చేశారు. విడపనకల్లు మండలం, డోనేకల్లులో ఇటీవల పర్యటించిన ఓ వైసీపీ నేత పర్యటనలో డప్పు వాయించని దళిత సామాజిక వర్గానికి చెందిన ఎర్రిస్వామి, అతని సోదరుడు సుంకప్పల పింఛన్ నిలిపివేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో అధికారులు పింఛన్ నిలిపేశారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపుతోంది. చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు వినడం లేదనే, తమకు మద్దతుగా ఉండటం లేదనే కారణంతో పింఛన్లు కట్ చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.  ఏడాదిలో లక్ష కిలోలకుపైగా గంజాయి పట్టివేత.. పార్లమెంట్ సాక్షిగా ఏపీ పరువు గోవిందా..

స‌ర్కారు వారి దెబ్బ‌.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముస‌ళ్ల పండుగ‌..

బాల‌య్య‌-బోయ‌పాటి కాంబినేష‌న్‌లో హ్యాట్రిక్ హిట్‌. అఖండ.. అఖండ విజ‌యం సాధిస్తుందంటూ రివ్యూలు. బాల‌కృష్ణ యాక్ష‌న్ అదుర్స్ అంటున్నారంతా. థియేట‌ర్ల‌లో ఫ్యాన్స్ గోల మామూలుగా లేదంట‌. ఇలా, అఖండ హిట్‌తో అంతా సంబ‌రాలు చేసుకుంటున్నారు కొంద‌రు త‌ప్ప‌. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్‌తో.. బెనిఫిట్ షోలు లేక బేజార‌వుతున్నారు. టికెట్ ధ‌ర‌లు మ‌రీ చీప్‌గా ఉండ‌టంతో హౌజ్‌ఫుల్ అవుతున్నా క‌లెక్ష‌న్లు యావ‌రేజ్‌గా ఉంటున్నాయి. మ‌రీ 5 రూపాయ‌ల‌కే నేల టికెట్ దొరుకుతోంది. క‌నీసం క‌రెంట్ బిల్లుల‌కు కూడా వ‌ర్క‌వుట్ అవ‌డం లేదంటూ గ‌గ్గోలు మొద‌లైంది. బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాత‌.. అంతా దిగాలుగా ఉన్నారు. అఖండ ఫ్యాన్స్‌కు మాత్ర‌మే హిట్‌. సినిమాకు, ఇండ‌స్ట్రీకి పెద్ద న‌ష్టం. జ‌గ‌న‌న్న కొట్టిన తొలిదెబ్బ అఖండ‌ను ఆగ‌మాగం చేస్తోంది. ఇక ముందుముందు పుష్ప‌, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్‌, రాథేశ్యామ్‌, ఆచార్య‌ల‌పైనా దారుణంగా ప్ర‌భావం చూప‌నుంది. ఇలా, జ‌గ‌న్‌రెడ్డి చేతివాటానికి ఏపీలో టాలీవుడ్ ల‌బోదిబోమంటోంది.  సినిమాపై జ‌గ‌న్‌రెడ్డికి ఎందుకింత క‌క్ష్య‌? ఎందుకింత మొండి ప‌ట్టుద‌ల‌? ఎందుకింత‌లా వేధింపులు? ఇండ‌స్ట్రీ ఏమ‌న్నా గొంతమ్మ కోరిక‌లు కోరిందా? ఫ‌స్ట్ వీక్ కొన్ని బెనిఫిట్ షోస్‌.. టికెట్ రేట్ల‌లో కాస్త పెంపుద‌ల‌.. అంతేగా. ఆన్‌లైన్ టికెటింగ్‌కు ఓకే అన్నారుగా. అయినా, ఎందుకోగాని జ‌గ‌న్‌రెడ్డి పంతం వీడ‌టం లేదు. చిరంజీవి వేడుకున్నా క‌నిక‌రించ‌లేదు.. నాగార్జున స్వయంగా వెళ్లి రిక్వెస్ట్ చేసినా దిగిరాలేదు.. సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్రరావు విజ్ఞప్తి చేసినా ఉప‌యోగం లేదు. ప‌రిశ్ర‌మ‌ను స‌ర్వ‌నాశ‌నం చేయ‌డ‌మే ఆయ‌న టార్గెట్ కావొచ్చు అంటున్నారు.  గ్రామ పంచాయతీల్లోని నాన్‌ ఏసీ థియేటర్లలో ఎకానమీ టికెట్‌ ధర 5 రూపాయలే! అదే ఏసీ థియేటర్‌ అయితే.. 10 రూపాయలు. పట్టణాలు, నగరాల్లోని మల్టీప్లెక్స్‌ల లో ప్రీమియం, డీలక్స్‌ క్లాస్‌ల ధరల పట్ల కొంత సంతృప్తిగానే ఉన్నప్పటికీ.. మిగిలిన అన్ని ధరలు గిట్టుబాటు కావని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో మొత్తం 1200కి పైగా థియేటర్లున్నాయి. వాటిని ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. వ‌కీల్‌సాబ్ నుంచి బెనిఫిట్‌ షోలకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. రోజుకు నాలుగు ఆటలకు మించకూడదని తేల్చి చెప్పింది. ఆన్‌లైన్‌ టికెటింగ్‌ ప్రవేశపెడుతూ సినిమాటోగ్రఫీ చట్టంలో సవరణలు చేసింది. సినిమా టికెట్ల కొత్త రేట్లను నిర్ణయించింది. అఖండ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా.. పాత సర్క్యులర్‌ను మరోసారి థియేటర్ల యజమానులకు గుర్తు చేసింది వైసీపీ ప్ర‌భుత్వం.  క‌ఠిన రూల్స్‌తో సర్కారు వారి తొలిదెబ్బ ‘అఖండ’కే తగులుతోంది. బయ్యర్లు ‘అఖండ’ నిర్మాత మిరియాల రవీందర్‌రెడ్డి మీద ఒత్తిడి తెచ్చి.. సినిమా రేట్‌ను 20 నుంచి 25 శాతం వరకూ తగ్గించేలా ఒత్తిడి చేశారు. దీంతో.. అఖండ‌తో పది కోట్ల టేబుల్‌ ప్రాఫిట్‌ వస్తుందనుకున్న నిర్మాత‌.. 5 కోట్లతో స‌రిపెట్టుకోవాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు. ఈ న‌ష్టం ‘అఖండ’తోనే ఆగిపోయేలా లేదు. త్వ‌ర‌లోనే రానున్న‌ ‘పుష్ప’, ‘భీమ్లా నాయక్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, రాథేశ్యామ్ లాంటి భారీ బడ్జెట్ సినిమాల‌ను దారుణంగా దెబ్బ‌తీయ‌నుంది. సినిమాను దెబ్బ తీసి.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం బాగుప‌డేది ఏముందో ఆయ‌న‌కే తెలియాలి అంటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు మండిప‌డుతున్నాయి. సీఎం జ‌గ‌న్‌ను సినిమా పాలిట‌ విల‌న్‌గా చూస్తున్నారు. 

సైకిల్ పార్టీలో ’అశోక చక్రవర్తి’

పూసపాటి అశోక్ గజపతి రాజు నీతి నిజాయితీ, నికార్సయిన నిండు మనస్సుకు నిలువెత్తు రూపం. టీడీపీ పుట్టిన నాటి నుంచి సైకిల్ పార్టీపైనే సవారీ చేస్తున్న అతి కొద్దిమంది పార్టీ నాయకుల్లో ఆయన ఒకరు. ఆయన మనస్సు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో... ఆయన మాటకు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటుందని ఆయన మనస్సేరిగిన వారు చెబుతారు. కానీ రాజుగారు కదా.. కొద్దిగా కోపం జాస్తి.. అది కూడా జస్ట్ పాలపొంగే అనే వారు కూడా ఉన్నారు.  మొత్తం 10 సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎనిమిది సార్లు విజయం సాధించారు. ఆ క్రమంలో వాణిజ్య పన్నులు,  ఎక్సైజ్, ఆర్థిక, శాసన సభ వ్యవహారాలు, రెవెన్యూ ఇలా ఏ శాఖా మంత్రిగా పని చేసినా.. అలాగే కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహించినా.. ఆయన సింప్లిసిటీ సింప్లిసిటినే. స్వయంగా ఆయన సొంత కారులోనే విజయనగర పుర వీధుల్లో చక్కర్లు కొట్టేస్తారీ అశోక గజపతి రాజుగారు.   విజయం వచ్చినప్పుడు పొంగిపోకుండా... ఓడిపోయినప్పుడు కుంగిపోకుండా స్థిత ప్రజ్ఝతను పాటిస్తూ.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మహామనిషి ఈ రాజుగోరు అని జిల్లా ప్రజలు చెప్పుకుంటారు. ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఓడిందంటే.. అందుకు కారణాలు విశ్లేషించి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు చెప్పడంలో ఈ రాజుగారు ఘనాపాటి. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతూ...పార్టీకి సేవలు అందిస్తున్న తీరుపై సైకిల్ పార్టీలోని లీడర్ నుంచి కేడర్ వరకు అంతా ఆయనను గౌరవిస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు.  ప్రస్తుతం జగన్ ప్రభుత్వ పాలన ఎలా ఉందంటే మాత్రం.. వాల్మీకి.. దొంగ నుంచి మహార్షిగా మరినట్లు.. వైయస్ జగన్ కూడా మారతారని ప్రజలు భావించి.. ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారని.. కానీ దాని పలితం ఇప్పుడు చూస్తున్నామని అశోక్ గజపతి రాజు వ్యంగ్యంగా అంటారు. ప్రస్తుత రాజకీయాలు దిగజారాయా ? అని ప్రశ్నిస్తే మాత్రం రాజకీయాలు దిగజారాయి.. కానీ అవి దిగజారాయి కదా అని మనం దిగజారనవరం లేదని ఈ అశోక చక్రవర్తి క్లియర్ కట్‌గా జవాబు ఇస్తారు. అశోక్ గజపతి రాజు ఎంత పెద్ద రాజుగారు అయినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాటే ఈయనకు వేదవాక్కు అంటే అతిశయోక్తి కాదేమో. ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంటే..  కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి పదవికీ రాజీనామా చేయమని ఇలా చంద్రబాబు ఆదేశిస్తే.. అలా రాజీనామా చేసిన అశోక చక్రవర్తి ఈ పూసపాటి వారు.     మాన్సాస్ ట్రస్ట్ అంటే మహారాజా అలక్ నారాయణ సొసైటి ఆఫ్ ఆర్ట్ అండ్ సైన్స్. దీనిని అశోక్ గజపతి రాజు తండ్రి  పీవీజీ రాజు.. 1958, నవంబర్ 12న స్థాపించారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 14800 ఎకరాల భూమి ఈ ట్రస్ట్ కింద ఉంది.  తమిళనాడులోని చెన్నైలో సైతం ఈ ట్రస్ట్‌కు భారీగా భూములు ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూముల విలువ అనధికారికంగా 50 వేల కోట్ల రూపాయిలపైనే ఉంటుందని ఓ అంచనా. ఇక సింహాచలంలోని శ్రీ వరాహా లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంతోపాటు మరో 107 దేవాలయాలు ఈ ట్రస్ట్ కింద ఉన్నాయి. ఇక ఎల్ కే జీ నుంచి పీజీ వరకు  12 విద్యా సంస్థలను సైతం ఈ మాన్సాస్ ట్రస్ట్ నడుపుతోంది. ఉత్తరాంద్రలో  వేల మంది విద్యార్థులకు ఈ విద్యా సంస్థలు విద్యను అందిస్తున్నాయి. భారత మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి సైతం ఈ విద్యాసంస్థల్లోనే చదువుకున్నారు.  అయితే ఈ మాన్సాస్ ట్రస్ట్‌కు గతంలో పీవీజీ రాజు ఛైర్మన్‌గా ఉండే వారు. ఆయన మృతితో అశోక్ గజపతి రాజు సోదరుడు ఆనంద గజపతి రాజు ఆ బాధ్యతలు చేపట్టారు. ఆయన 2016లో మరణించడంతో అశోక్ గజపతి రాజు చైర్మన్‌ అయ్యారు. అయితే వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. అశోక్ గజపతి రాజు నేతృత్వంలోని మాన్సాస్ ట్రస్ట్‌ కమిటీని రద్దు చేసి... అనంద గజపతి రాజు కుమార్తె సంచయితను తెరపైకీ తీసుకు వచ్చి.. ఆమెకు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌ పీఠాన్ని అప్పగించారు. అందుకు జగన్ ప్రభుత్వం జీవో 72ను జారీ చేసింది. దాంతో అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించడంతో.. సదరు జీవో 72ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో మాన్సాస్ ట్రస్ట్ బాధ్యతలు మళ్లీ ఈ అశోకుడుకే దాఖలు పడ్డాయి. అయితే జగన్ ప్రభుత్వం.. విశాఖను ఎగ్జిక్యూటీవ్ క్యాపిటల్‌గా చేసుకుని పరిపాలన సాగించాలని నిర్ణయించింది. ఆ క్రమంలో మాన్సాస్ ట్రస్ట్ భూములపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ అండ్ కో కళ్లు పడ్డాయని.. అందుకే సంచయితను వైయస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి తెరపైకీ తీసుకు వచ్చారనే టాక్ అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది.  అయితే ఈ అంశం చిచ్చుబుడ్డిలా ఓ వెలుగు వెలిగి.. ఆ తర్వాత తుస్సు మంది. దీంతో వ్యక్తిగతం కానీ... రాజకీయంగా కానీ ఒక్క అవినీతి మచ్చ లేని విజయనగరం పూసపాటి  అశోకగజపతి రాజా వారు నిజంగా రాజుగారే అని ఇప్పటికీ అటు టీడీపీలో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఓ టాక్ వైరల్ అవుతోంది.

ఏపీకి ముంచుకొస్తున్న తీవ్ర ముప్పు... విలయం తప్పదా? 

ఇటీవల కురిసిన కుండపోత వర్షాలకు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అపార నష్టం జరిగింది. వర్షాలు తగ్గి పది రోజులైనా నెల్లూరు, కడప జిల్లాలోని పలు ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. వరద బాధితులు సాయం కోసం పడిగాపులు పడుతున్నారు. వర్ష బీభత్సం నుంచి ఇంకా తేరుకోకముందే ఆంధ్రప్రదేశ్ కు మరో గండం ముంచుకొస్తోంది. ఇటీవల జరిగిన వరద బీభత్సం కంటే ఈసారి విలయం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.   ఉత్తరాంధ్ర వైపు తీవ్ర తుఫాను ముంచుకొస్తోంది. థాయ్‌లాండ్‌ పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం బుధవారం అండమాన్‌ సముద్రం మధ్య ప్రాంతంలో ఉంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి గురువారంకల్లా వాయుగుండంగా మారి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఆ తర్వాత  24 గంటల్లోనే శుక్రవారానికి  తుఫాన్‌గా బలపడి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారే క్రమంలో వాయవ్యంగా పయనించి నాలుగో తేదీ ఉదయానికి ఉత్తరాంధ్ర తీరం దిశగా రానుందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాపైఎక్కువ ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తుఫాన్‌కు ‘జవాద్‌’ అని నామకరణం చేయనున్నారు.  జవాద్ తుఫాన్ ప్రభావంతో మూడో తేదీ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, దక్షిణ ఒడిశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో అసాధారణ వర్షాలు, తూర్పు గోదావరిలో అతిభారీ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల్లో 3వ తేదీ  ఉదయం నుంచి గాలుల తీవ్రత పెరుగుతుంది. గంటకు 45 నుంచి 55 కి.మీ., అప్పుడప్పుడు 65 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయి. తీవ్ర తుఫాన్‌ తీరం దిశగా వచ్చే సమయంలో (నాలుగో తేదీ తెల్లవారుజాము నుంచి) గంటకు 80 నుంచి 90 కి.మీ., అప్పుడప్పుడు 100 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది.  3, 4 తేదీల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని పేర్కొంది.  తీవ్ర తుఫాను ఉత్తరాంధ్ర తీరం దిశగా రానున్న నేపథ్యంలో మూడో తేదీ అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షాలు కురుస్తాయని, గాలుల తీవ్రత పెరిగే క్రమంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థపై ప్రభావం పడుతుందని  వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల్లోకి సముద్ర జలాలు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పొలాల్లో ఉన్న వరి కుప్పలను రక్షించుకునేలా రైతులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తీవ్ర తుఫానుతో భారీ నష్టం ఉంటుందని ప్రభుత్వ శాఖలను ఐఎండీ అప్రమత్తం చేసింది. దీంతో ఖరీఫ్‌లో వేసిన వరి పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ సూచించింది.  తీవ్ర తుఫాన్‌ విశాఖకు అతి సమీపంగా వచ్చి, తరువాత దిశ మార్చుకుంటుందని వాతావరణ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వారి అంచనా ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున తీవ్ర తుఫాన్‌ విశాఖ, కాకినాడ మధ్య తీరానికి 40-50 కిలోమీటర్ల దూరంలోకి రానుంది. ఆ తరువాత ఉత్తరంగా, ఉత్తర ఈశాన్యంగా దిశ మార్చుకుని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో తీరానికి ఆనుకుని పయనిస్తుంది. గోపాలపూర్‌, పూరి పరిసరాల్లో తీరం దాటుతుంది. అక్కడ నుంచి పశ్చిమ బెంగాల్‌ వైపు పయనిస్తుంది. ఒకవేళ తీవ్ర తుఫాన్‌ మధ్య బంగాళాఖాతంలో ఉన్నప్పుడే మరింత బలపడితే మాత్రం...తీరానికి దగ్గరగా రాకముందే దిశ మార్చుకుంటుందని చెబుతున్నారు. తీవ్ర తుఫాన్‌ తీరానికి 200 కిలోమీటర్ల దూరానికి వచ్చేసరికి మరింత బలపడుతుందని కొన్ని మోడల్స్‌ చెబుతున్నాయి. దీనిపై గురువారం నాటికి మరింత స్పష్టత వస్తుందని ఇస్రో వాతావరణ నిపుణుడొకరు పేర్కొన్నారు.  

ఏడాదిలో లక్ష కిలోలకుపైగా గంజాయి పట్టివేత.. పార్లమెంట్ సాక్షిగా ఏపీ పరువు గోవిందా..

ఆంధ్రప్రదేశ్ గంజాయి ప్రదేశ్ గా మారింది.. ఇదీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ గురించి వినిపిస్తున్న మాట. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా ఏపీలో గంజాయి సాగు పెరిగిందని, రవాణా విచ్చలవిడిగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో రోజూ ఏదో ఒక చోటు గంజాయి పట్టుబడుతూనే ఉంది. హైదరాబాద్ సహా దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా... దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటున్నాయి. దీంతో ఏపీ గంజాయి కేరాఫ్ గా మారిందనే విమర్శలు వస్తున్నాయి. జగన్ సర్కార్ చేతగానిగతనం వల్లే ఏపీ అరాచకాలకు అడ్డాగా మారిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే విపక్షాల ఆరోపణలను ఖండిస్తోంది వైసీపీ. ఏపీ గంజాయి సాగు నియంత్రణలోనే ఉందని చెబుతోంది. గంజాయి రవాణాను అడ్డుకుంటున్నామని, ఇటీవల కాలంలో బాగా కట్టడి చేశామని పోలీస్ శాఖ ప్రకటిస్తోంది. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఏపీ సర్కార్ బండారం బయటపడింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ఈ విషయమై చేసిన ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ లో గంజాయి ఏ రేంజ్ లో సాగవుతుందో తెలిసిపోయింది. అందరిని విస్తుపోయేలా చేస్తోంది.అంతేకాదు గత టీడీపీ పాలనకు జగన్ పాలనకు ఎంత తేడా ఉందో స్పష్టం చేసింది.  ఏపీ అప్పులపై కేంద్రం నజర్.. జగన్ సర్కార్ కు ఐక్స్ చిక్కులు తప్పవా? ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన గంజాయి పరిమాణం మూడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు కేంద్ర మంత్రి రాజ్యసభకు తెలిపారు. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు. 2018లో 33,930.5 కిలోల గంజాయి ఆధారిత మాదకద్రవ్యాలును స్వాధీనం చేసుకోగా, 2019లో అది రెండింతలై 66,665.5 కిలోలకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక గతేడాది ఇది ఏకంగా మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్న మంత్రి.. 1,06,042.7 కిలోలను ఎన్‌డీపీఎస్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేంద్ర మంత్రి ప్రకటనతో జగన్ సర్కార్ పాలన ఎంత అస్తవ్యస్థంగా ఉందో అర్ధమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ఏపీ అప్పులపై కేంద్రం నజర్.. జగన్ సర్కార్ కు చిక్కులు తప్పవా?

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకు పోయింది.ఇది అందరికీ తెలిసిన నిజం.అయినా ఎడాపెడా కొత్త అప్పులు చేస్తూనే ఉంది. ఆలాగే, అప్పుల వేటలో  ఏపీ ప్రభుత్వం  తప్పులు చేస్తోంది. చట్టాలను ఉల్లంఘిస్తోంది. ఓ వంక రిజర్వు బ్యాంక్ వద్ద బాండ్ల వేలం ద్వారా వారంవారం తెచ్చిన అప్పులను మాత్రమే పద్దులో చూపించి, ఇతరత్రా కార్పొరేషన్ ద్వారా తెచ్చిన వేలకోట్ల అప్పులను దాచేసినా , రాష్ట్రం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఎప్పుడోనే  దాటిపోయింది.అయినా దర్జా చట్టాలను ఉల్లంగించి అప్పుల వేట కొనసాగిస్తోంది.  రాష్ట్ర ప్రభుత్వాల అప్పులను అదుపులో ఉంచి ఆర్థిక క్రమశిక్షణ పాటించేలా చేయడం కోసం, తద్వారా ద్రవ్య లోటును అదుపు చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం 2003లో ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ చట్టం) చట్టం చేసింది. ఎఫ్‌బీఎం చట్టాల ప్రకారం, ప్రభుత్వాలు రాష్ట్ర స్థూల ఉత్పత్తి అంటే జీఎస్‌డీపీలో 4శాతం రుణాలు తీసుకునే అవకాశం ఉంది. ఇటీవల కరోనా పరిస్థితులు, వివిధ సంస్కరణల అమలు వంటివి చేయడం వల్ల కొంత మేర వరకూ అదనపు రుణాలు తీసుకోవచ్చు. కానీ అది పూర్తిగా ఒక  శాతం కూడా ఉండదని, అర శాతం.. పావు శాతం వరకే ఉంటుదాని ఆర్ధిక నిపుణులు అంటున్నారు.అయితే అవును ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం 4 శాతం దాటకూడని,కానీ ఇప్పుడు, రుణాలు 11 శాతం దాటాయని నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, శాసన సభకు తెలిపారు. ఈ మేరకు ఆయన సభలో ప్రకటన చేశారు. అంతేకాదు, “ఏకంగా ఏడు శాతం పెరిగిన రుణ పరిమితి పై కేంద్రం నోటీసులు పంపుతుంది. వివరణ ఇస్తాం..." అంటూ ఆయన ధీమాగా చెప్పుకొచ్చారు.  చంద్రబాబు, భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణలు.. ఆర్థికమంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు ఆర్థిక నిపుణుల్లో చర్చనీయాంశం అయ్యాయి.  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంతో కాలంగా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్ననేపధ్యంలో,బుగ్గన చేసిన వ్యాక్యాలు ఆర్థిక నిపుణుల్లో మరిన్ని అనుమానాలకు ఆస్కారం కల్పించాయి. ముక్కున వేలేసుకునేలా చేశాయి.నిజానికి  రాష్ట్ర ప్రభుత్వం ఏ లెక్కల్లోనూ చూపని అప్పులు మరో రూ.82 వేల కోట్ల వరకు ఉంటాయని ఆర్థిక నిపుణులు, అధికారులు అంటున్నారు.ఈ లెక్కన చూస్తే,  ఆర్థిక  పరిస్థితి దివాలా అంచున కాదు, లోతుల్లోకి జారిపోయింది. ఇక కోలుకోవడం కూడా కష్టమనే స్థాయికి చేరింది. అయినా, రాష్ట్ర ప్రభుత్వం అప్పుల వేట మానలేదు. నిజానికి ఇప్పుడు అప్పులు చేయక పొతే,పూట కాదు ఘడియ కూడా గడిచే పరిస్థితి లేదు.   భారతీయ  రిజర్వు బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం అదుపుతప్పిన ఏపీ ఆర్థిక పరిస్థితిని కట్టడి చేసేందుకు ఉద్రిక్త మవుతున్నాయి. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇటీవల భారీ షాక్‌ ఇచ్చింది. మొన్నటికి మొన్న ఏపీకి రావాల్సిన రూ.3,470 కోట్లను ఓవర్‌డ్రాఫ్ట్‌ బకాయిల కింద ఆర్బీఐ జమ చేసుకుంది.అలాగే, గత ఆర్థిక సంవత్సరంలో అప్పుల లెక్కలు దాచిపెట్టి  పరిమితికి మించి అప్పులు చేశారని ఈ ఏడాది రుణ పరిమితిలో కేంద్రం కోత విధించింది. అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా విజ్ఞప్తులు చేసుకుని అదనపు రుణాలకు పర్మిషన్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో త్వరలో ఇక అప్పులు చేయకుండా కేంద్రం పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే ప్రభుత్వం నడవడం కష్టమైపోతుందని ఆర్థిక శాఖ  ధికారులు హెచ్చరిస్తున్నారు.  నెలకు రూ. పది వేల కోట్లు అప్పులు చేస్తే తప్ప.. ఇప్పటి వరకూ చేసిన అప్పులకు వడ్డీలు, జీతాలు ఇతర ఖర్చులకు సరిపోవడం లేదన్న లెక్కలు బయటకు వస్తున్నాయి.  ఈ నేపధ్యంలో వైసీపీ తిరుగుబాటు ఎంపీ, రఘురామ కృష్ణం రాజు  లోక్  సభలో ఏపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని ఉల్లంఘిస్తోందని, ఈ కారణంగా దివాలా తీయకుండా చూడాలని ప్రధానికి విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.  బుధవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ పరిమితికి మించి ఇప్పటికే ప్రభుత్వం రూ.7లక్షల కోట్ల రుణాలు తీసుకుందని, ఇప్పుడు మరో రూ.లక్ష కోట్ల అప్పు చేయడానికి ప్రయత్నస్తున్నదని వివరించారు. పరిమితికి మించి రాష్ట్రాలు అప్పులు చేయడం రాజ్యాంగంలోని 293వ అధికరణను ఉల్లంఘించడమేని పేర్కొన్నారు. రుణ పరిమితిని పెంచుకునేందుకు, రాష్ట్ర ప్రభుత్వం. చట్ట విరుద్ధంగా చేసిన ఎఫ్‌బీఎం పరిమితుల సవరణను అడ్డుకోవాలని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాదు, రాజ్యంగ విరుద్ధమైన ఈ అంశాన్ని ప్రధానమంత్రి పరిగణలోకి తీసుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితులను అతిక్రమించి చేస్తున్న అప్పులకు అనుమతిస్తే, రాష్ట్రంతో పాటు బ్యాంకులు కూడా కుప్పకూలడం ఖాయమని, రాష్ట్రం, బ్యాకులు కుప్పకూలకుండా చూడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని వైసీపీ ఎంపీ పేర్కొన్నారు. అయితే లోక్ సభలో ఈ పలికింది రఘురామకృష్ణం రాజే అయినా పలికించింది మాత్రం బీజేపీ పెద్దలే అని ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. రాజకీయంగా బీజేపీకి దగ్గరవుతున్న రఘురామకృష్ణం రాజు బుజాన తుపాకీ పెట్టి జగన్ రెడ్డి  ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచ్చులు బిగిస్తోందని అంటున్నారు. ఇటీవల ఎంపీ లాడ్స్ నిధులను వైసీపీ ఎంపీలు చర్చిల నిర్మాణానికి వినియోగించిన విషయాన్ని రఘురామరాజు ప్రధాని దృష్టికి తెచ్చిన తర్వాతనే కేంద్రం రాష్ట్రానికి తాఖీదులు ఇచ్చిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.  అదే నిజమైతే, జగన్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో పడడమే కాదు, కేంద్రం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.

చంద్రబాబు, భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణలు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా వైసీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై తాను పొరబాటున వ్యాఖ్యలు చేశానని, తీవ్ర భావోద్వేగాల నడుమ ఒక మాట తప్పుగా దొర్లిందని అంగీకరించారు. అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, ఆత్మసాక్షిగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని వల్లభనేని వంశీ వెల్లడించారు. తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని వివరించారు వంశీ. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, తన నుంచి మరోసారి ఇలాంటి పొరబాటు వ్యాఖ్యలు రావని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కులం నుంచి వెలివేస్తారన్న కారణంతో తాను క్షమాపణలు చెప్పడం లేదని, ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని వల్లభనేని వంశీ ఉద్ఘాటించారు.ఓ మీడియా ఛానెల్ డిస్కషన్ లో వల్లభనేని చంద్రబాబు, భువనేశ్వరికి క్షమాపణలు చెప్పారు.  ఇటీవల మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ మోహన్, అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీవ్ర రాజకీయ దుమారం రేగింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉద్దేశించి అవమానకరంగా మాట్లాడారంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మంత్రి కొడాలి నానితో పాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భద్రత పెంచింది.  లేపేస్తే 50 లక్షలు.. క‌మ్మ కులంలో చీడ‌పురుగులు.. ప‌రిటాల బ‌తికుంటేనా.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మధిరలో జరిగిన కమ్మ కులస్తుల వనసమారాధనలో స్థానిక కౌన్సిలర్ మల్లాది వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును హత్య చేయాలంటూ కామెంట్ చేశారు, కులంలో ఉన్న చీడపురుగులు కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి చీడపురుగులను భౌతికంగా నిర్మూలించాల్సిన అవసరముందన్నారు. ఇప్పటి నుంచే అలాంటి ఆపరేషన్ మొదలు పెట్టాల్సిన అవసరముంది. ఈ పనికి ఎవరన్నా ముందుకు వస్తే వారికి రూ.50 లక్షలు ఇస్తానని ప్రకటించారు.

శిల్పాచౌద‌రి దోచిందంతా బ్లాక్‌మ‌నీనేనా? 50 కోట్లు హ‌వాలా?

సంప‌న్నులే టార్గెట్‌. కోట్లు పోయినా కుర్రోమొర్రో అంటూ అర‌వ‌ని వారే ల‌క్ష్యం. వాళ్ల ముందు తానూ రిచ్‌గా బిల్డ‌ప్ కొడుతుంది. మ‌నం మ‌నం కోటీశ్వ‌రుల‌మంటూ ఫోజులు కొడుతుంది. ముందు క్లోజ్ అవుతుంది. ఆ త‌ర్వాత క‌న్నింగ్‌గా మారుతుంది. క‌ట్‌చేస్తే.. శిల్పాచౌద‌రి మోసాలు పోలీసుల‌కే దిమ్మ‌తిరిగేలా బ‌య‌ట‌ప‌డుతున్నాయి. పోలీస్ స్టేష‌న్ల‌కు బాధితులు క్యూ క‌డుతున్నారు. తాము 3 కోట్లు ఇచ్చామ‌ని ఒక‌రు ఫిర్యాదు చేస్తే.. మా నుంచి కోటి తీసుకుంద‌ని ఇంకొక‌రు. ఆ త‌ర్వాత మ‌రొక‌రు. ఇలా అంతా కోట్ల‌లోనే లెక్క‌లు చెబుతున్నారు. కంప్లైంట్ రాసివ్వండంటూ పోలీసులు అడిగితే.. బాధితులంతా సైలెంట్‌గా స్టేష‌న్ నుంచి జారుకుంటున్నార‌ని తెలుస్తోంది. కార‌ణం.. శిల్పాచౌద‌రి కొల్ల‌గొట్టిందంటే బ్లాక్‌మ‌నీనే కావ‌డం. ఇచ్చిందంతా బడాబాబులే కావ‌డం. అదంతా లెక్క‌లు లేని న‌ల్ల‌ధ‌న‌మే అవ‌డం. కోటిన్న‌ర మోస‌పోయిన దివ్యారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో శిల్పాచౌద‌రి ఎపిసోడ్ మొద‌టిసారి వెలుగులోకి వ‌చ్చింది. దివ్యారెడ్డి ఫిర్యాదు తర్వాతే.. శిల్పాచౌదరిపై కేసులు పెరిగాయి. ఒక్కొక్కరుగా బాధితులు బయటకు వస్తున్నారు. మౌఖికంగా ఫిర్యాదు చేస్తున్నారే తప్ప.. లిఖితపూర్వకంగా కంప్లైంట్‌ ఇవ్వడానికి వెనకంజ వేస్తున్నారు. బ్లాక్‌ మనీ కావడం వల్లే.. వారు శిల్పపై కేసుకు సిద్ధపడడం లేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఓ బడా సినీ నిర్మాత కుమార్తె కూడా శిల్పాచౌదరికి రూ. 3 కోట్లు ఇచ్చి మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.  మ‌రి, కొల్ల‌గొట్టిన సొమ్మంతా ఏం చేసిన‌ట్టు? ఓ ల‌గ్జ‌రీ విల్లా కొన్న‌ట్టు.. హవాలా మార్గంలో రూ. 50 కోట్లు విదేశాలకు మళ్లించినట్టు ద‌ర్యాప్తులో తేలుతోంది. అంత పెద్ద మొత్తంలో విదేశాల్లో ఎవ‌రికి పంపారు? ఆ న‌గ‌దంతా అక్క‌డే ఉందా?  తిరిగి మ‌రో రూపంలో ఇండియాకు తిరిగొచ్చిందా? అనే కోణంలోనూ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అవ‌స‌ర‌మైతే ఈడీ సాయం తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. శిల్ప దంపతుల మొబైల్‌ ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా పోలీసులు త‌దుప‌ర‌ దర్యాప్తు చేస్తున్నారు.

ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం.. సిరివెన్నెల‌నే సాక్షం..

చెంబోలు సీతారామ‌శాస్త్రి. అలియాస్ సిరివెన్న‌ల సీతారామ‌శాస్త్రి. సినీ సాహిత్యంలో మేరుప‌ర్వ‌తం. అక్ష‌రాల‌ను శిల్పాలుగా అందంగా పేర్చేవారు. ప‌దాల‌తో విస్పోటాలు సృష్టించేవారు. సిగ్గులేని స‌మాజాన్ని నిగ్గ‌దీసి అడిగేవారు. అర్థ శ‌తాబ్ద‌పు అజ్ఞానాన్ని నిప్పుల‌తో క‌డిగేవారు. జ‌గ‌మంత కుటుంబంలో ఏకాకి జీవితాన్ని చూపించేవారు. విధాత త‌ల‌పున జీవ‌న వేదాన్ని వినిపించేవారు. అర్థ‌రాత్రి-అప‌రాత్రి తేడా లేకుండా సాహిత్య మ‌ధ‌నం చేసేవారు. అక్ష‌రాల‌తో పోరాటంలో గెలిచేవారు..ఓడేవారు..న‌లిగేవారు. ఆ ఒత్తిడిని త‌ట్టుకోలేకో, లేక అల‌వాటో తెలీదు కానీ.. ధూమ‌పానాన్ని ఆశ్ర‌యించారు సీతారామ‌శాస్త్రి.  అద్భుత సినీ సాహితీవేత్త సిరివెన్నెల ఓ చైన్ స్మోక‌ర్‌. స‌మాజంలోని కుళ్లును క‌డిగేసేవారు కానీ, త‌న‌కున్న చెడు అల‌వాటును మాత్రం అస్స‌లు వ‌దిలించుకోలేక‌పోయారు. సిగ‌రేట్ల మీద సిగ‌రేట్లు కాల్చేవారు. బ‌హుషా ఆయ‌న పొగ త్రాగుతూ రిలాక్స్ అయ్యేవారేమో. చిన్న వ‌య‌సులోనే సినీ ప‌రిశ్ర‌మ‌కు రావ‌డం.. అలా అలా సిగ‌రెట్ అల‌వాటు కావ‌డం.. ఆ అల‌వాటు కూడా ఆయ‌న కెరీర్‌తో పాటే ఎద‌గ‌డం.. ఆ త‌ర్వాత వ్య‌స‌నంగా మార‌డంతో.. ఇంకా ఎంతో ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు ఉన్నా.. 66 ఏళ్ల‌లోనే కాలం చేశారు సీతారామ‌శాస్త్రి. సిగ‌రెట్ వ్య‌స‌నం వ‌ల్లే.. ఆయ‌న రెండు ఊపిరితిత్తులు పాడ‌య్యాయ‌. గ‌తంలోనే ఓ ఊపిరితిత్తును స‌ర్జ‌రీ చేసి స‌గం వ‌ర‌కూ తీసేశారు వైద్యులు. ఇటీవ‌ల రెండో ఊపిరితిత్తుకు సైతం ఇన్ఫెక్ష‌న్ రావ‌డంతో అది కూడా స‌గం తొల‌గించారు. ఆ త‌ర్వాత హార్ట్‌ ప్రాబ్ల‌మ్ కూడా వ‌చ్చింది. చివ‌ర‌కు ఇలా సినీలోకాన్ని.. మ‌న లోకాన్ని.. జ‌గ‌మంత కుటుంబాన్ని అర్థాంత‌రంగా విడిచి.. అనంత‌తీరాల‌కు ప‌య‌న‌మ‌య్యారు. విధాతలో విలీన‌మ‌య్యారు. స్వ‌ర్గలోకాన్ని త‌న మ‌రో సాహితీ లోకంగా మార్చుకునేందుకు మ‌న నుంచి దూర‌మ‌య్యారు. సిరివెన్నెల మ‌ర‌ణంతో ధూమ‌పానం ఆరోగ్యానికి హానిక‌రం అని మ‌రోసారి గుర్తు చేసుకుందాం. ఆ చెడు అల‌వాటుకు దూరంగా ఉందాం. ధూమ‌పానంతో కాకుండా.. అంత‌కంటే ఎక్కువ ద‌మ్ము ఇచ్చే.. మ‌త్తెక్కించే.. సీతారామ‌శాస్త్రి పాట‌ల‌తో సేద‌తీరుదాం..ఎంజాయ్ చేద్దాం.

ఉద్యోగుల గర్జన.. నిధులు స్వాహా... మరో గండం.. బస్సు బాదుడు.. టాప్ న్యూస్@7PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ కార్యాచరణకు సంబంధించి  సీఎస్ సమీర్ శర్మకు ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఐక్య వేదిక నేతలు నోటీస్ ఇచ్చారు. జేఏసీ నేతలు బొప్పారాజు, బండి శ్రీనివాసులు ఈ నోటీస్‌ను సీఎస్ కు అందించారు. 11 పీఆర్సీ అమలు, డిఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్టు గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్స్‌ల చెల్లింపు షెడ్యూల్‌ వంటి డిమాండ్లు అందులో ఉన్నాయి.-----ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ నిధులు రూ. 400 కోట్లను ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్‌లోకి మార్చిన వీసీ చర్యను వ్యతిరేకిస్తూ వర్శిటీ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. యూనివర్శిటీని మరింత అభివృద్ధి చేయాల్సిన అధికారులే... దెబ్బ కొడుతున్నారని, నిబంధనలు పట్టించుకోకుండా వీసీ.. ఏకపక్షంగా రూ. 400 కోట్లు బదలాయించారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అసలు వీసీకి నిధులు మళ్లించే అధికారం లేదన్నారు. ----- గుంటూరు జిల్లా దాచేపల్లిలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. వడ్డెర కార్మికులపై రాజకీయ వివక్ష చూపించారు. ఇటీవల జరిగిన దాచేపల్లి నగర పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేశారన్న కక్షతో 70 వడ్డెర కుటుంబాలను బహిష్కరించారు. క్వారీల్లోకి వస్తే చంపేస్తామంటూ బెదిరించారు. తామంతా క్వారీల్లో పని చేసుకుంటున్నామని వడ్డెర సొసైటీ పేరుతో వైసీపీ నేతలు క్వారీయింగ్ చేస్తున్నారని కార్మికులు మండిపడ్డారు. ------ తిరుమల రెండవ ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడ్డాయి. 14వ కిలోమీటరు వద్ద పెద్ద పెద్ద బండరాళ్లు రోడ్డుపై పడ్డాయి. ఆ సమయంలో అటువైపు ఎలాంటి వాహన రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగిపడడంతో రోడ్డు కుంగిపోయింది. దీంతో టీటీడీ అధికారులు వాహన రాకపోకలను నిలిపివేశారు. మొదటి ఘాట్ రోడ్‌లోనే రాకపోకలు కొనసాగుతున్నాయి.  ---- వాతావరణ శాఖ ఏపీలో రాగల మూడ్రోజులకు వర్ష సూచన చేసింది. ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుందని, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది --- కేంద్ర సహాయమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లోక్ సభలో నేడు ధాన్యం సేకరణ అంశంపై వివరణ ఇచ్చారు. ఓ ప్రశ్నకు బదులిస్తూ.... 2020-21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని వెల్లడించారు. 2019-20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని, తెలంగాణ  నుంచి 74.54 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించామని తెలిపారు. -- ఆర్టీసీ ఛార్జీల పెంపుపై టీడీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. ఆర్టీసీ ఆస్తులను టీఆర్ఎస్ నేతలకు కట్టబెట్టేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పట్టించుకోకుండా... నష్టాల పేరుతో పేదవాడి జేబుకు చిల్లు పెడుతూ ఆర్టీసీ ఛార్జీలను పెంచడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ట్వీట్ చేశారు. ----- గవర్నర్ తమిళిసైతో టీపీసీసీ బృందం భేటీ అయింది. ధాన్యం సేకరణ, రైతు సమస్యలపై బృందం వినతిపత్రం అందజేసింది. ధాన్యం కొనుగోలు విషయంలో రైతు సమస్యలను గవర్నర్‌కు విన్నవించామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలవాలని గవర్నర్‌ను కోరామన్నారు. ఇప్పటికే 70% ధాన్యం మిల్లర్లకు వెళ్ళిపోయాయన్నారు. పదమూడు, పద్నాలుగు వందల రూపాయలకు మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేశారన్నారు.  --- బస్సు చార్జీలను పెంచాలని డిసైడ్ అయింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. పల్లె వెలుగులో కిలోమీటర్ కు 25 పైసలు, ఎక్స్ ప్రెస్ తో పాటు ఇతర సర్వీసుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడుకునేందుకు చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది టీఎస్ ఆర్టీసీ.డీజిల్ పెరిగినప్పుడు మాత్రమే ఆర్టీసీ టిక్కెట్ ధరలు పెంచామని చెప్పారు టీఎస్ ఆర్టీసీ ఎంసీ సజ్జనార్.  ---- లెజండరీ లిరిక్ రైటర్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కడసారి వీడ్కోలు నడుమ హైదరాబాద్ జూబ్లీహిల్స్ మహాప్రస్థానం శ్మశానవాటికలో సిరివెన్నెల అంత్యక్రియలు ముగిశాయి. ఆచార సంప్రదాయాల ప్రకారం ఆయన భౌతికకాయాన్ని దహనం చేశారు. సిరివెన్నెలకు కడసారి నివాళి అర్పించేందుకు తెలుగు సినీ ప్రముఖులంతా తరలివచ్చారు. ----------