అధికార పార్టీ ఎమ్మెల్యే ధర్నా.. అధికారుల పరేషాన్!
posted on Dec 6, 2021 @ 2:20PM
ఆయనో అధికార పార్టీ ఎమ్మెల్యే. అయినా ఆయన రోడ్డెక్కారు. పార్టీ నేతలు, అనుచరులతో కలిసి రోడ్డుపై ధర్నాకి దిగారు. ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యేనే ధర్నా చేయడంతో పోలీసుల టెన్షన్ పడ్డారు. ఆయనను అక్కడి నుంచే తరలించేందుకు శ్రమించారు.
వివరాల్లోకి వెళితే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య రోడ్డుపై ధర్నాకి దిగారు. అంబేడ్కర్ సెంటర్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేయనున్న అంబేడ్కర్ విగ్రహ భూమి పూజ చేశారు. తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చి ఆందోళనకు దిగారు. జాతీయ రహదారి నిర్మాణం కోసం తొలగించిన అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను వెంటనే ప్రతిష్టించాలని డిమాండ్ చేస్తూ ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన జాతీయ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యేతో పాటు వందలాది ఆయన అనచురులు, టీఆర్ఎస్ నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. జాతీయ రహదారి కోసం తొలగించిన విగ్రహాలను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ రహదారి నిర్మాణం కోసం రోడ్డుపై ఉన్న అంబేడ్కర్, గాంధీ విగ్రహాలను తొలగించిన నేషనల్ హైవే అథారిటీ అధికారులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. విగ్రహాలను తొలగించి నాలుగేళ్లు గడుస్తున్నా వాటి పునరుద్ధరణపై దృష్టి పెట్టకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా జాతీయ రహదారి విస్తరణ అధికారులు స్పందించి జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి నాటికి విగ్రహాలను ప్రతిష్టించాని డిమాండ్ చేశారు.