వంశీని వాడుకొని వదిలేశారా? వల్లభనేనికి వైసీపీ హ్యాండ్ ఇచ్చేసిందా?
posted on Dec 6, 2021 @ 12:07PM
ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మా పార్టీకి సంబంధం లేదు. భువనేశ్వరికీ, చంద్రబాబుకు ఆయన చెప్పిన క్షమాపణలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. తాజాగా, వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు చేసిన వ్యాఖ్యలు ఇవి. టీడీపీ ఎమ్మెల్యే వంశీని అనధికారికంగా వైసీపీలో చేర్చుకొని.. ఇన్నాళ్లూ ఆయనతో అంటకాగిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు భువనేశ్వరి ఎపిసోడ్ రచ్చ కావడంతో.. ఆ తప్పంతా వంశీపై తోసేసే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వంశీ మా పార్టీ కాదంటూ.. ఆయన వ్యాఖ్యలతో సంబంధం లేదంటూ కొత్త డ్రామా తెరపైకి తీసుకొస్తున్నారని అంటున్నారు. వంశీ మేటర్‌తో పార్టీకి ఇప్పటికే తీవ్ర డ్యామేజ్ జరగ్గా.. తాజాగా నష్టనివారణ ప్రయత్నాల్లో భాగంగా తప్పంతా వల్లభనేనిదే అన్నట్టు వంశీని కరివేపాకులా వాడుకొని వదిలించుకోవాలనేది అధికార పార్టీ పన్నాగంలా కనిపిస్తోందని భావిస్తున్నారు. అంబటి, రాచమల్లు కామెంట్లు అందులో భాగమేనని అంటున్నారు.
భువనేశ్వరి పేరుతో మొదట నిప్పు రాజేసింది వల్లభనేని వంశీని. ఆ నిప్పును సభలో పొగ వచ్చేలా మరింత రాజేసింది మాత్రం అంబటి రాంబాబు, కొడాలి నాని, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలు. ఆ నిప్పును చంద్రబాబు తన కన్నీళ్లతో ఆర్పేయడం.. నందమూరి కుటుంబం వైసీపీ నేతలను దోషిగా నిలబెట్టడంతో ప్రజల్లో, మహిళల్లో వైసీపీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చాయి. ఇదేదో తేడా కొట్టిందని భావించిన వైసీపీ నాయకులు.. ఇక అప్పటి నుంచి ఆ విషయంపై మాట్లాడటం మానేశారు. అయినా, ప్రజల్లో ఆగ్రహావేశాలు తగ్గకపోవడంతో.. ఓ టీవీ డిబేట్‌లో వంశీతో క్షమాపణలు చెప్పించారు. ఇష్యూను కాస్త కూల్ చేసే ప్రయత్నం చేశారు.
ఇంత రచ్చ జరిగిన తర్వాత వల్లభనేని వంశీ వైసీపీతో కొనసాగితే.. రానున్న ఎన్నికల్లో మహిళా ఓట్లు గల్లంతు కావడం తప్పదని జగన్ అండ్ కో లెక్కేస్తోంది. అందుకే, వల్లభనేనిని ఫ్యాన్ గాలికి దూరం చేసేలా.. పొమ్మనకుండా పొగ పెట్టేలా ఉండేలా జగన్‌రెడ్డి స్కెచ్ వేశారని అంటున్నారు. అందులో భాగంగానే సీఎం సొంత జిల్లాకు చెందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఆగమేఘాల మీద రంగంలోకి దించి.. వల్లభనేని వంశీ తమ పార్టీ ఎమ్మెల్యే కాదని.. టీడీపీ ఎమ్మెల్యే అంటూ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.
ఎలాగూ వంశీ క్షమాపణలు చెప్పారు కాబట్టి.. భువనేశ్వరిపై చేసిన ఆరోపణలు పాపాన్ని పూర్తిగా వంశీపైనే తోసేసేలా ఎత్తుగడ వేశారు వైసీపీ నేతలు. టెక్నికల్‌గా వంశీ టీడీపీ ఎమ్మెల్యే కావడమే ఇందుకు కారణమంటున్నారు. భువనేశ్వరి శాపం పార్టీకి తగలకుండా వల్లభనేనిని సేఫ్ గార్డ్‌గా వాడుకుంటున్నట్టు ఉన్నారు. వంశీతో మాత్రమే సారీ చెప్పించి.. అంబటి, కొడాలి, ద్వారంపూడిలు ఇక ఆ మేటర్‌తో తమకెలాంటి సంబంధం లేదంటూ సైడ్ అయిపోయే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న జ్వాలాగ్నికి వల్లభనేని వంశీని బలిపశువు చేశారు. తాజాగా, వంశీకి మా పార్టీతో సంబంధం లేదని.. ఆయన చెప్పిన క్షమాపణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. భువనేశ్వరి ఎపిసోడ్‌లో వైసీపీకి అంటిన మకిలీని వంశీతో కడిగేసుకునే స్కెచ్ వేసిందని అంటున్నారు. ఈ వ్యవహారంలో వల్లభనేని వంశీనే బకరా అయ్యారని.. అంబటి, కొడాలి, ద్వారంపూడిలు తాము జారుకున్నామని అనుకుంటున్నారు కానీ.. ప్రజల దృష్టిలో మాత్రం ఆ నలుగురు ఎప్పటికీ దోషులేననే విషయం మర్చిపోతున్నట్టున్నారని మండిపడుతున్నారు.
భువనేశ్వరి కాళ్లను కన్నీళ్లతో కడుగుతానన్న వైసీపీ ఎమ్మెల్యే