హైదరాబాద్ నెంబర్ వన్‌.. ఎన్వీ రమణ కితాబు..

కృష్ణ పరమాత్మ.. కౌరవులకు, పాండవులకు మధ్యవర్తిత్వం చేశాడని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో ఎన్వీ రమణ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆర్బిట్రేష‌న్ ప్రాధాన్య‌త‌ను, హైద‌రాబాద్ ఇంపార్టెన్స్‌ను జ‌స్టిస్‌ ర‌మ‌ణ వివ‌రించారు.  "ఎవరికైనా వ్యక్తి గత జీవితంలో సమస్యలు వస్తే వారిని మనం దూరంగా పెడుతాం. ప్రతిరోజూ సమస్యలు వస్తూనే ఉంటాయి. సమస్యలు లేకుండా మనిషి ఉండడు. ప్రతి మనిషి జీవితంతో లీగల్ సిస్టం ముడి పడి ఉంటుంది. బిజినెస్‌లో సమస్యలు వస్తే కోర్టులకు వస్తారు. 40 సంవత్సారాల అనుభవంతో చెప్తున్నా.. ఆర్బిట్రేషన్ చివరి దశలో జరగాలి. అంతర్జాతీయ పారిస్, సింగపూర్, లండన్, హాంగ్‌కాగ్‌లలో ఆర్బిట్రేషన్ సెంటర్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఈ సెంటర్‌ను పెట్టడం చాలా సంతోషం. సింగపూర్, సీజేతో కూడా మాట్లాడాను. వారి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు." తెలిపారు ర‌మ‌ణ‌.   "హైదరాబాద్‌లో ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ పెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఫార్మా కంపెనీలు, ఐటి కంపెనీల సహకారం కూడా ఎంతో అవసరం. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ నెంబర్ వన్‌గా ఉంది. తెలంగాణ ప్రజలు దేన్నైనా స్వాగతిస్తారు. జూన్‌లో సీఎం కేసీఆర్‌తో సెంటర్ గురించి చర్చించినప్పుడు మంచి సహకారం అందించారు. డిసెంబర్ 18న ఆర్బిట్రేషన్ సెంటర్ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం. ఆర్బిట్రేషన్ సెంటర్‌ను నెలకొల్పడంలో జస్టిస్ హిమా కోహ్లీ సహకారం మర్చిపోలేను" అని సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. 

62 పరుగులకే కివీస్ అలౌట్.. ముంబై టెస్టులో భారత్ కు భారీ లీడ్ 

న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో టీమిండియా పట్టు బిగించింది. బౌలర్ల విజృంభణతో తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యత సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసిన భారత్.. బౌలింగ్ లో అదరగొట్టింది. సీమర్లు, స్పిన్నట్లు పోటీ పడి మరీ బౌలింగ్ చేశారు. కివీస్ ఆటగాళ్లను ఆటాడుకున్నారు. పేసర్ సిరాజ్ టాప్ ఆర్డర్ నడ్డి విరిచాడు.  17 పరుగులకే తొలి మూడు వికెట్లు పడగొట్టాడు. తర్వాత స్పిన్నర్లు మిడిలార్డర్ పని పట్టారు. దీంతో కేవలం 28.1 ఓవర్లలో 62 పరుగులకు న్యూజీలాండ్ అలౌట్ అయింది. భారత్ కు తొలి ఇన్నింగ్సులో 263 పరుగుల భారీ లీడ్ లభించింది. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా సిరాజుద్దీన్ మూడు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ రెండు వికెట్లు, జయంత్ యాదవ్ కు ఒక వికెట్ దక్కింది.  తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 325 పరుగులకు ఆలౌటైంది. అజాజ్‌ పటేల్‌ (10/119) చరిత్ర సృష్టించాడు. అయితే ఈ ఆనందం కివీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కివీస్‌ను పేస్‌ బౌలర్‌ సిరాజ్‌ (3/19) బెంబేలెత్తించాడు.  టామ్‌ లేథమ్‌ 10, విల్‌ యంగ్ 4, డారిల్‌ మిచెల్ 8, రాస్‌ టేలర్‌ 1, హెన్రీ నికోల్స్ 7, రచిన్‌ రవీంద్ర 4 పరుగులు చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత జయంత్‌ యాదవ్‌ టెస్టుల్లో వికెట్‌ పడగొట్టారు. 

గ్రీజ్ లేదు కానీ.. మూడు రాజధానులా?

తెలిసో తెలియకో ఓట్లేసిన పాపానికి ప్రజల ప్రాణాలు తీస్తారా? ప్రభుత్వ తప్పిదం వల్లే వరదల్లో 62 మంది చనిపోయారు. వరదల్లో రూ.6 వేల కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాణనష్టమని కేంద్రమంత్రి చేసిన ప్రకటనకు ఏం సమాధానం చెబుతారు?. జ్యుడీషియల్ ఎంక్వయిరీ అడిగితే ఎందుకు అంగీకరించలేదు?.. అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు మొత్తం కొట్టుకుపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు గేట్లకు కూడా మరమ్మతులు చేయించలేదు. గతంలో వరదలు వచ్చినప్పుడు అన్నమయ్య ప్రాజెక్ట్ గేటు క్లోజ్ అవ్వలేదు.. నీరు వృధాగా పోయింది. ఈ సారి వరదలకు అదే గేట్ ఓపెన్ అవ్వలేదు.. గేట్ సమస్య అప్పటికప్పుడు వచ్చింది కాదు. ఇసుక కోసం నదిలోకి వెళ్లిన టిప్పర్‌ల కోసమే నీటిని విడుదల చేయలేదు. ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం అయిన జగన్ ముఖ్యమంత్రి పదవిలో ఉండడానికి అనర్హులు. ప్రాజెక్ట్ గేటుకు గ్రీజ్ వెయ్యలేని సీఎం.. మూడు రాజధానులు కడతారా?.. అంటూ జ‌గ‌న్‌రెడ్డిపై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు.  ‘వర్షాలు భారీగా పడి రెండుసార్లు వరదలొచ్చాయి. ప్రాజెక్టులన్నీ అప్పటికే పూర్తిగా నిండిపోయాయి. మళ్లీ వరద వస్తుందని వాతావరణశాఖ ముందే హెచ్చరించింది. అయినా స్పందించకపోవడం వల్లే విపత్తు జరిగింది. విపత్తుకు బాధ్యులైన వారందరినీ శిక్షించాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.  ‘ఒక వ్యక్తి 9 మందిని ఎక్కించుకుని చాలావరకు కాపాడాడు. ఏడుగురిని కాపాడగలిగాడు.. శ్వాస ఆడక ఇద్దరు చనిపోయారు. వరదలతో పరిస్థితి సీరియస్‌గా ఉంటే చర్చించకుండా మాపై దాడి చేస్తారా..?. సీఎం జగన్ సొంత జిల్లాకు వెళ్లి ఏం చేశారు?. ఎవరూ మాట్లాడకుండా ముందే బాధితులను బెదిరించారు. ఎవరిని బయటకు రాకుండా.. బాదితులకంటే ఎక్కువ పోలీసులను పెట్టి ఓదార్పు చేస్తారా? తిరుపతి తుమ్మలగుంట చెరువును క్రికెట్‌ స్టేడియం చేశారు. దీంతో పద్మావతి వర్సిటీ నుంచి ఆటోనగర్‌ వరకు వరద వచ్చింది. రాయలచెరువు తెగి ఉంటే 35 గ్రామాల జలమయం అయ్యేవి. మామూలు వ్యక్తులతో రాయలచెరువుకు మరమ్మతులు చేయిస్తారా..?’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. పెన్నా నదిలో కరకట్టలకు ప్రమాదం జరిగేలా ఇసుక తవ్వకాలు జరిపారు. ఒక్క నెల్లూరులోనే రూ. 2 వేల కోట్ల నష్టం జరిగింది. ప్రాణాలకు రక్షణ కాదు.. డెడ్ బాడీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. రాష్ట్రంలో ఈ స్థాయి వరదలు ఉంటే సీఎం సిగ్గులేకుండా నాడు పెళ్లికి పోయాడు. వేరే ప్రభుత్వం అయితే ఇలాంటి ఘటనకు సిగ్గుతో తల వంచుకుంటారు. విశాఖ విషాదంలో బాధితులకు కోటి పరిహారం ఇచ్చారు.. ఇక్కడ బాధితులకు కోటి ఇవ్వాలి. జ్యుడీషియల్ విచారణ జరిపించాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.  

సంతాప దినాలు ప్రకటించని ఏపీ! రోశ‌య్య చావులోనూ జగన్ క‌క్ష సాధింపులా?

కొణిజేటి రోశ‌య్య‌. మంత్రిగా, ముఖ్య‌మంత్రిగా తెలుగునేల‌తో విడ‌దీయ‌రాని బంధం. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయాల్లో కొన‌సాగిన వైనం. సుదీర్ఘ‌కాలం ఆర్థిక మంత్రిగా.. 15సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన వ్య‌క్తిగా.. రాష్ట్ర ఆర్థిక సుస్థిర‌త‌లో రోశ‌య్య పాత్ర ఎన‌లేనిది. క‌రుడుగ‌ట్టిన‌ కాంగ్రెస్ నేత‌గా.. వైఎస్సార్‌కు చాలా స‌న్నిహితుడుగా.. ఉన్నారు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కాంగ్రెస్‌కు చుక్కానిలా మారారు. రాజ‌శేఖ‌ర్‌రెడ్డి స్థానంలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించి.. రాష్ట్రంలో రాజ‌కీయ, పాల‌నా సంక్షోభం త‌లెత్త‌కుండా మేనేజ్ చేశారు. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా సేవ‌లు అందించారు. తెలుగు రాజ‌కీయాల్లో రోశ‌య్య ఓ మేరుప‌ర్వ‌తం అంటారు. అలాంటి రోశ‌య్య మ‌ర‌ణంతో తెలుగుజాతి ఓ రాజ‌కీయ కుర‌వృద్ధిడిని కోల్పోయింది. రోశ‌య్య మృతికి సంతాపంగా తెలంగాణ స‌ర్కారు మూడు రోజులు సంతాప దినాలు ప్ర‌క‌టించింది. కానీ..  గుంటూరు జిల్లా వాస్త‌వ్యుడైన రోశ‌య్య మ‌ర‌ణించినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం మాత్రం ఇప్పటివరకు సంతాప దినాలు ప్రకటించకపోవడం విమ‌ర్శ‌ల‌పాల‌వుతోంది.  ఓవైపు తెలంగాణ గ‌వ‌ర్న‌మెంట్ అధికారికంగా అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేయ‌డంతో పాటు సంతాప దినాలు ప్ర‌క‌టించింది. సీఎం కేసీఆర్.. రోశయ్య పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. రోశయ్య మరణంపై ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు పార్టీలకతీతంగా నేతలు స్పందించారు. కాని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ప‌ట్టించుకుంటున్న‌ట్టు లేదు. రోశయ్య లాంటి సీనియర్ నేత చనిపోతే.. సొంత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు నివాళి అర్పించేందుకు రాకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు.  బ‌హుశా.. జ‌గ‌న్‌రెడ్డికి రోశ‌య్య‌పై ఇంకా కోపం త‌గ్గిన‌ట్టు లేదంటున్నారు.  రోశయ్య నివాసంలో ఏర్పాట్లన్ని వైఎస్సార్ ఆత్మగా చెప్పుకునే కేవీపీనే చూస్తున్నారు. రోశయ్య మరణవార్త తెలియగానే... మొదట హాస్పిటల్ కు వెళ్లింది కూడా కేవీపీనే. బహుశా ఇది కూడా జగన్ రాకపోవడానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  2009, సెప్టెంబ‌ర్ 2.. పావురాల‌గుట్ట‌లో హెలికాప్ట‌ర్ కూలి అప్ప‌టి ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. యావ‌త్ రాష్ట్రం ఒక్క‌సారిగా షాక్‌. వైఎస్సార్ ఆక‌స్మిక మ‌ర‌ణం ప్ర‌భుత్వాన్ని, ప్ర‌జ‌ల‌ను ఉలిక్కిపాటుకు గురి చేసింది. అయితే, ఎలాంటి ప‌రిపాల‌నా సంక్షోభం త‌లెత్త‌కుండా కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. ముఖ్య‌మంత్రి పీఠంపై పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడు, వివాదర‌హితుడు, మంత్రిగా సుదీర్ఘ అనుభ‌వం ఉన్న రోశ‌య్య‌ను కూర్చోబెట్టింది. ఈ ప‌రిణామం దివంగ‌త వైఎస్సార్ త‌న‌యుడు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డికి అస‌లేమాత్రం మింగుడుప‌డ‌లేదని అంటారు. రాచ‌రిక వార‌స‌త్వ‌ పాల‌న త‌ర‌హాలో తండ్రి త‌ర్వాత త‌న‌నే ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. తండ్రి డెడ్‌బాడీ సాక్షిగానే త‌నకు సీఎం ప‌ద‌విపై సంత‌కాలు సేక‌రించార‌ని కూడా అంటారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం జ‌గ‌న్‌రెడ్డిని డోంట్‌కేర్ అంది. జ‌గ‌న్‌ను ప‌క్క‌న‌పెట్టి.. అనుభ‌వ‌జ్ఞుడైన రోశ‌య్య‌నే అంద‌ల‌మెక్కించింది. అప్ప‌టి నుంచి రోశ‌య్య‌పై జ‌గ‌న్‌రెడ్డి ర‌గిలిపోతుంటార‌ని అంటారు. వైఎస్సార్‌కు రోశ‌య్య ఎంతో స‌న్నిహితుడైనా.. వైఎస్‌కు చేదోడువాదోడుగా ఉంటూ ద‌న్నుగా నిలిచినా.. జ‌గ‌న్‌రెడ్డి మాత్రం రోశ‌య్య సీఎం కావ‌డాన్ని త‌ట్టుకోలేక‌పోయార‌ని చెబుతుంటారు. బ‌హుషా ఆ కోపంతోనే కాబోలు.. రోశ‌య్య మ‌ర‌ణం త‌ర్వాత ఏపీ ప్ర‌భుత్వం క‌నీసం సంతాప దినాలు కూడా ప్ర‌క‌టించ‌లేని అంటున్నారు. ఆంధ్రులంతా గ‌ర్వ‌ప‌డే స్థాయిలో రాజ‌కీయాల్లో రాణించిన రోశ‌య్య మ‌ర‌ణంతోనూ జ‌గ‌న్‌రెడ్డి రాజ‌కీయం చేస్తుండ‌టాన్ని అంతా త‌ప్పుబ‌డుతున్నారు. క‌నీసం, తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చూసైనా.. జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం సంతాప దినాలు ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని సూచిస్తున్నారు.    

రోశయ్యకు ప్రముఖుల నివాళి.. ఒకేసారి సీఎంలుగా పనిచేశామన్న మోడీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతికి రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢసానుభూతి తెలియజేశారు.   రోశయ తమకు  చిరకాల మిత్రుడన్నారు వెంకయ్య నాయుడు.  విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని చెప్పారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య  అందరి అభిమానాన్ని చూరగొన్నారని వెంకయ్య తెలిపారు. రోశయ్య, తాను  ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ఆయనతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. తమిళనాడు గవర్నర్‌గా పనిచేసినప్పుడు ఆయనతో అనుబంధం ఉందన్నారు.  రోశయ్య సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబసభ్యులకు  ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.     రోశయ్య మృతి పట్ల కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ సంతాపం తెలిపారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. స్వయంగా పోన్ చేసి రోశయ్య కుటుంబ సభ్యులతో సోనియా, రాహుల్‌ మాట్లాడారు. రోశయ్య భౌతికకాయానికి సీఎం కేసీఆర్‌ నివాళులర్పించారు. అమీర్‌పేటలోని ఆయన నివాసానికి వచ్చిన కేసీఆర్.. రోశయ్య పార్థివదేహం వద్ద పుష్పగుచ్చంఉంచి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోశయ్య మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.  మాజీ ముఖ్యమంత్రి రోశయ్య  అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్‌లోని మహాప్రస్తానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి, హైదరాబాద్‌ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఒక్కడికే పదికి పది వికెట్లు.. టీమిండియాపై కివీస్ స్పిన్నర్ రికార్డ్ ఫీట్ 

న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ముంబయి వాంఖడే మైదానంలో జరుగుతున్న రెండో టెస్టులో మాయాజాలం చేశాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ చేశాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు అజాజ్ పటేల్.  కివీస్‌ తరఫున (10/119) అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ఆటగాడిగా నిలిచాడు.  1999లో పాకిస్థాన్‌పై అనిల్‌ కుంబ్లే సాధించిన ఈ ఘనతను మళ్లీ ఇన్నాళ్లకు అజాజ్ పటేల్ నమోదు చేశాడు.  అంతకుముందు ఇంగ్లాండ్‌ బౌలర్‌ జిమ్‌ లేకర్‌ 1956లో ఆస్ట్రేలియాపై తొలిసారి ఈ రికార్డు సృష్టించాడు.  221/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ మరో 104 పరుగులు జోడించి మిగతా ఆరు వికెట్లు కోల్పోయింది. ఆట ప్రారంభమైన రెండో ఓవర్‌లోనే అజాజ్‌.. సాహా(27; 62 బంతుల్లో 3x4, 1x6), రవిచంద్రన్‌ అశ్విన్‌(0)లను వరుస బంతుల్లో ఔట్‌ చేసి మరోసారి గట్టిదెబ్బ తీశాడు.  తర్వాత క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. మయాంక్‌తో కలిసి ఏడో వికెట్‌కు 67 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. రెండో సెషన్‌లో మయాంక్‌ 150 పరుగులు పూర్తి చేసిన మరుసటి బంతికే అజాజ్‌ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. తర్వాత టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్‌ 325 పరుగులకు ఆలౌటైంది.   ఈ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (150; 311 బంతుల్లో 17x4, 4x6), అక్షర్‌ పటేల్‌ (52; 128 బంతుల్లో 5x4, 1x6) రాణించారు.   

కేసీఆర్ వచ్చారు.. గవర్నర్ రాలేదు! ఇద్దరూ ఒకే వేదిక పంచుకోరా..? 

తెలంగాణ గవర్నర్ తమిళి సైతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు విభేదాలు ముదిరిపోయాయా? ఒకే వేదిక పంచుకోవడానికి ఇద్దరూ ఇష్టపడటం లేదా? అంటే ఇటీవల కాలంలో జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ సాగుతోంది. వరుసగా జరుగుతున్న ఘటనలు ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి. ఇటీవల కాలంలో గవర్నర్, ముఖ్యమంత్రి కలుసుకున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఇద్దరూ కలిసి పాల్గొనడం లేదు. గవర్నర్ వచ్చిన సమావేశానికి కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. ఇక కేసీఆర్ వస్తే .. ఆ కార్యక్రమానికి గవర్నర్ దూరంగా ఉంటున్నారు.  తాజగా శనివారం హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో  సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. గవర్నర్ తమిళి సై మాత్రం హాజరు కాలేదు.  ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ చాలా ముఖ్యమైన అంశం. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఏర్పాటైంది. సీజేఐ జస్టిస్ రమణ కృషితో ఇది సాధ్యమైంది. ఇటీవలే జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీజేఐ హాజరయ్యారు. ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ ఆధ్వర్యంలోనే శనివారం సదస్సు నిర్వహించారు. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి గవర్నర్ ఎందురు రాలేదన్నది ఇప్పుడు చర్చగా మారింది. దీనిపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ వచ్చారు కాబట్టే గవర్నర్ రాలేదని కొందరు చెబుతున్నారు. కొంత కాలంగా గవర్నర్ తో కేసీఆర్ కు విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుండగా.. తాజాగా జరిగిన ఘటన మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.  నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ వేడుకలో గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌, హైకోర్టు చీఫ్ జస్టిస్ పాల్గొన్నారు. కాని సీఎం  కేసీఆర్‌ మాత్రం డుమ్మా కొట్టారు. రాజ్ భవన్ లో జరిగే రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరవుతున్నట్లు సీఎంవో నుంచి రాజ్ భవన్ వర్గాలకు ముందు సమాచారం వచ్చింది.  కాని చివరి నిమిషంలో కేసీఆర్ హాజరుకాలేదు. గవర్నర్ తో విభేదాల వల్లే రాజ్ భవన్ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్లలేదనే ప్రచారం జరిగింది. అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ దినోత్సవ వేడుకకు ముఖ్యమంత్రి హాజరుకాకపోవడంపై విమర్శలు వచ్చాయి.  గతంలో నరసింహన్ గవర్నర్ కు ఉన్నప్పుడు తరుచూ రాజ్ భవన్ వెళ్లేవారు కేసీఆర్. వారం వారం వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. పండుగలు, ముఖ్యమైన రోజులు ఏమొచ్చినా రాజ్ భవన్ వెళ్లి నరసింహన్ కు కేసీఆర్ విషెస్ చెప్పేవారు. ప్రభుత్వ కార్యక్రమాలకు గవర్నర్ నరసింహన్ ను ఆహ్వానించేవారు. అయితే తమిళి సై గవర్నర్ గా వచ్చిన కొన్ని రోజులకే సీన్ మారిపోయింది. రాజ్ భవన్ వైపే వెళ్లడం లేదు కేసీఆర్. పండుగల సమయంలోనూ ఆమెకు విషెస్ చెప్పడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు. మహాత్మ గాంధీ జయంతి రోజున ప్రతి ఏటా బాపుఘాట్ లో గవర్నర్ తో కలిసి సీఎం నివాళి అర్పిస్తారు. కాని ఈసారి గాంధీ జయంతి రోజున బాపుఘాట్ వెళ్లలేదు కేసీఆర్. గవర్నర్ తో విభేదాల కారణంగానే ఆయన గాంధీకి నివాళి అర్పించేందుకు వెళ్లలేదనే ప్రచారం జరిగింది.  మరోవైపు గవర్నర్ తమిళి సై కూడా కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ పలు సార్లు ప్రకటనలు చేసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేసింది. యూనివర్శిటీ వీసీల నియామకంలోనూ ప్రభుత్వ తీరును తప్పుపట్టింది. రాజ్ భవన్ లో ప్రజా దర్బార్ నిర్వహించి.. కేసీఆర్ సర్కార్ వార్నింగ్ సిగ్నల్ పంపించిందనే చర్చ ఉంది. పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ కేసీఆర్ కేబినెట్ తీర్మానం చేసినా.. గవర్నర్ తమిళి సై ఆమోదించ లేదు. రెండు నెలల పాటు ఆ పైల్ ను పెండింగులో పెట్టారు. అయినా గవర్నర్ ను వెళ్లి కలవలేదు కేసీఆర్. చివరకు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపించారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణమాలతో గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిపోయిందని, అందుకే ఇద్దరూ ఒకే వేదిక పంచుకోవడం లేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.    

రోశ‌య్య‌కు ఎన్టీఆర్ భ‌య‌ప‌డ్డారా? అందుకే మండ‌లి ర‌ద్దు చేశారా?

కొణిజేటి రోశ‌య్య‌. మాట‌ల మాంత్రికుడు. రాజ‌కీయ ఉద్దండుడు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ చాణ‌క్యుడు. అధికారం ఏ పార్టీదైనా.. ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా.. స‌భ‌లో మాత్రం రోశ‌య్య‌దే అప్ప‌ర్ హ్యాండ్‌. కాంగ్రెస్‌ ప‌వ‌ర్‌లో ఉంటే.. ప్ర‌తిప‌క్షం ఫ‌స‌క్‌. కాంగ్రెస్ విప‌క్షంలో ఉంటే.. ప‌వ‌ర్‌లో ఉన్న పార్టీ ఫ‌స‌క్‌. ద‌టీజ్ రోశ‌య్య‌. స‌భ‌లో ఆయ‌న మైక్ అందుకున్నారంటే.. ఇక ఏక‌పాత్రాభిన‌య‌మే. ప్ర‌త్య‌ర్థి పార్టీకి ద‌బిడి దిబిడే. అందుకే అంటారు.. తింటే గారెలు తినాలి.. వింటే రోశ‌య్య ప్ర‌సంగం వినాలి అని.  ఇక‌.. వాగ్ధాటికి, అన‌ర్గ‌ళ‌ ప్ర‌సంగాల‌కి, దూకుడుకి.. పెట్టింది పేరైన టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షులు నంద‌మూరి తార‌క రామారావు సైతం రోశ‌య్య ధాటికి ఇబ్బంది ప‌డేవార‌ని అంటారు. 1983లో తొలిసారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్టీఆర్‌కు.. స‌భ‌లో రోశ‌య్య చుక్క‌లు చూపించే వార‌ని చెబుతారు. తొలినాళ్ల‌లో ఎన్టీఆర్ బాగా దూకుడుగా ఉండేవారు. అనేక సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్నారు. లాభ‌న‌ష్టాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోకుండా.. అది ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తుంద‌ని తాను భావిస్తే చాలు.. ఆ నిర్ణ‌యాన్ని అమ‌లు ప‌రిచేవారు. అప్ప‌ట్లో ఆయ‌న‌కు ఎదురుచెప్ప‌డ‌మంటే పెద్ద శాహ‌స‌మే. అలాంటిది రోశ‌య్య మాత్రం త‌న‌దైన ప్ర‌శ్న‌ల‌తో, ప్ర‌సంగాల‌తో స‌భ‌లో ఎన్టీఆర్‌ను నిల‌దీస్తుంటే.. అన్న‌గారే ఉక్కిరిబిక్కిరి అయ్యేవార‌ని ఆ నాటి నేత‌లు గుర్తు చేస్తున్నారు.  అయితే, నాదెండ్ల వెన్నుపోటు త‌ర్వాత మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లి.. 1985లో అఖండ మెజార్టీతో రెండోసారి ముఖ్య‌మంత్రి అయ్యారు రామారావు.  సీఎం అయిన వెంట‌నే.. 1985, మే 31న శాస‌న మండ‌లిని ర‌ద్దు చేస్తూ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆ స‌మ‌యంలో అది ఊహించ‌ని ప‌రిణామం. రాష్ట్రానికి మండ‌లి అన‌వ‌స‌ర‌మ‌ని.. అద‌న‌పు ఖ‌ర్చు అని.. చేతికి ఆరోవేలు లాంటిదంటూ.. ఒక్క నిర్ణ‌యంతో శాస‌న‌ మండ‌లిని క్యాన్సిల్ చేసేశారు ఎన్టీఆర్‌. అయితే, ఆ నిర్ణ‌యం రోశ‌య్య అంటే భ‌యంతోనే తీసుకున్నార‌ని అనేవారు.  ఆ స‌మ‌యానికి మండ‌లిలో టీడీపీకి మెజార్టీ సంఖ్యాబ‌లం లేదు. పైగా మండ‌లిలో కాంగ్రెస్ ప‌క్ష నాయ‌కుడిగా కొణిజేటి రోశ‌య్య ఉన్నారు. మండ‌లిలో రోశ‌య్య‌ను త‌ట్టుకొని నిల‌వ‌డం అంత ఈజీ కాద‌ని ఎన్టీఆర్‌కు బాగా తెలుసు. తాను తీసుకురాద‌ల‌చుకున్న ప‌లు బిల్లుల‌ను, కొత్త చ‌ట్టాలు, ప‌థ‌కాల‌ను.. రోశ‌య్య నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ పార్టీ మండ‌లిలో అడ్డుకుంటుంద‌ని ఎన్టీఆర్ భావించార‌ని అంటారు. అందుకే, మండ‌లిలో రోశ‌య్య దూకుడును ఎదుర్కోలేకే.. ఎన్టీఆర్‌ ఏకంగా మండ‌లినే ర‌ద్దు చేశారని చెబుతారు. అలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారి శాస‌న మండ‌లిని ర‌ద్దు చేసి సంచ‌ల‌నంగా నిలిచారు ఎన్టీఆర్‌. అప్పుడు ఆయ‌న ర‌ద్దు చేసిన మండ‌లిని.. 22 ఏళ్ల త‌ర్వాత‌ మ‌ళ్లీ 2007లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పున‌రుద్ద‌రించారు. అయితే, దాదాపు 15 ఏళ్ల త‌ర్వాత తండ్రి తీసుకొచ్చిన మండ‌లిని.. వైఎస్ జ‌గ‌న్‌రెడ్డి ర‌ద్దు చేసేందుకు ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. తాజాగా, మండ‌లి ర‌ద్దు నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకుంది వైసీపీ స‌ర్కారు. అప్ప‌ట్లో రోశ‌య్య భ‌యానికి ఎన్టీఆర్ పెద్ద‌ల స‌భ‌ను ర‌ద్దు చేస్తే.. ఇప్పుడు టీడీపీ భ‌యానికి జ‌గ‌న్ మండ‌లిని ప‌డ‌గొట్టాల‌ని ప్ర‌య‌త్నించి తోక‌ముడిచారు. 

విజ‌య‌సాయిని సైడ్ చేస్తున్నారా? ఢిల్లీలో ప్రాధాన్య‌త త‌గ్గించేశారా? 

ఢిల్లీలో వైసీపీ ఎంపీలు మీడియా స‌మావేశం పెట్టారు. రొటీన్‌గానే టీడీపీపై, బీజేపీపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏపీకి ఏం ఒరగబెట్టిందని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నించారు. టీడీపీ అధికారంలో ఉండగా 4 లక్షల కోట్లు అప్పులు చేసిందన్నారు. బీజేపీతో అంటకాగినప్పుడు టీడీపీకి ఏపీ ప్రయోజనాలు గుర్తుకు రాలేదా అని నిల‌దీశారు. అంతా బాగానే ఉంది. వైసీపీ ఎంపీలు స్క్రిప్ట్‌ను బ‌ట్టీప‌ట్టి బాగానే అప్ప‌జెప్పారు. కానీ, ఢిల్లీలో ఈ విమ‌ర్శ‌లన్నీ చేయాల్సింది ఫ‌స్ట్‌టైమ్ ఎంపీ అయిన మార్గాని భ‌ర‌త్ కాదుగా..?  వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ లీడ‌ర్ విజ‌య‌సాయిరెడ్డి క‌దా ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌శ్న‌లు సంధించాల్సింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌. విజ‌య‌సాయికి వ్య‌తిరేఖంగా సంథింగ్ సంథింగ్ అనే చ‌ర్చ‌. అవును, ఉత్త‌రాంధ్ర‌కైనా, ఢిల్లీకైనా.. జ‌గ‌న్‌రెడ్డికి సామంత‌రాజు విజ‌య‌సాయిరెడ్డినే అంటారు. విజ‌య‌సాయికి ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ను ధార‌ద‌త్తం చేసేశారనే ప్రచారం ఉంది. ఢిల్లీ పాలిటిక్స్‌ను కూడా ఆయ‌న చేతిలోనే పెట్టేశారు. అయితే విజ‌య‌సాయి తానే సొంతంగా ఎదిగే ప్ర‌య‌త్నం చేశారంటారు. ఢిల్లీలో బీజేపీకి, మోదీకి స‌న్నిహితుడిగా మారాడు. ప‌ర్స‌న‌ల్‌ ఇమేజ్ పెంచుకున్నారు. స్వ‌యానా.. ప్ర‌ధాని మోదీనే.. హౌ ఆర్ యూ సాయిరెడ్డి అని పిలిచేంత చ‌నువు సంపాదించారు. అందుకే, విజ‌య‌సాయిరెడ్డి ఎదుగుద‌ల‌ జ‌గ‌న్‌లో అనుమానం పెరిగిందని అంటారు. ర‌ఘురామ కేసులో జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దై.. జైలుకు వెళ్లాల్సి వ‌స్తే.. త‌మిళ‌నాడు త‌ర‌హాలో జ‌గ‌న్ ప్లేస్‌లో విజ‌య‌సాయిరెడ్డితో బీజేపీ గేమ్ ప్లాన్ చేసింద‌నే ప్ర‌చార‌మూ జ‌రిగింది. అందుకే ఎప్ప‌టినుంచో విజ‌య‌సాయిపై జ‌గ‌న్‌రెడ్డి ఓ క‌న్నేసి ఉంచారంటారు. అటు, ఉత్త‌రాంధ్ర జిల్లాలో విజ‌య‌సాయి అరాచ‌కాల‌పై ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు అందుతూనే ఉన్నాయ‌ని చెబుతారు.  ఇలా చాలా కార‌ణాలు, అంత‌కుమించి అనుమానాల‌తో క్ర‌మ‌క్ర‌మంగా విజ‌య‌సాయిరెడ్డి ప్రాధాన్యం త‌గ్గిస్తూ వ‌స్తున్నారు జ‌గ‌న్‌రెడ్డి. ఢిల్లీలో విజయసాయి ఇప్పటివరకు చూస్తున్న బాధ్యతలు.. కొత్తగా సలహాదారుగా నియమించిన వ్యక్తికి కట్టబెట్టారు. ఇటీవ‌ల రెండేళ్ల పాల‌న సంద‌ర్భంగా తాడేప‌ల్లి ప్యాలెస్‌లో జ‌రిగిన వేడుక‌ల‌కూ విజ‌య‌సాయికి ఎంట్రీ ద‌క్క‌లేదు. తాజాగా, ఢిల్లీలో సైతం కేవ‌లం పార్ల‌మెంట్ హౌజ్ లోప‌లి వ‌ర‌కే ఆయ‌న ప‌వ‌ర్‌ను ప‌రిమితం చేశార‌ని చెబుతున్నారు. అందుకే, విజ‌య‌సాయిరెడ్డితో కాకుండా.. ఎంపీ భ‌ర‌త్‌తో వైసీపీ త‌ర‌ఫున ఎంపీల ప్రెస్‌మీట్ పెట్టించార‌ని.. కావాల‌నే విజ‌య‌సాయిరెడ్డిని త‌ప్పించార‌ని అంటున్నారు. క్ర‌మ‌క్ర‌మంగా ఎన్నిక‌ల నాటికి విజ‌య‌సాయిరెడ్డి ప్రాధాన్య‌త‌ను పూర్తిగా త‌గ్గించేసి.. ప‌క్క‌న‌పెట్టేయాల‌నేది జ‌గ‌న్ భావ‌న‌లా క‌నిపిస్తోంది. 

రోశయ్య ఇక లేరు.. జవాద్ గండం.. అఖండకు అఘోరాలు.. ఒమిక్రాన్ వర్రీ.. టాప్ న్యూస్@1PM

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. లోబీపీతో అకస్మాత్తుగా రోశయ్య పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. రోశయ్య 4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ----- మాజీ సీఎం రోశయ్య మృతి పట్ల  ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్  గాంధీ సంతాపం ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు. ఈ మేరకు రోశయ్య కుమారుడు శివతో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి రోశయ్యకు ఉన్న అనుబంధాన్ని కాంగ్రెస్ నేత గుర్తు చేసుకున్నారు. ఆపై కేవీపీ రామచందర్ రావ్‌తో రాహుల్ ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా రోశయ్య మృతి వివరాలను  రాహుల్‌కు కేవీపీ వివరించారు. ------- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా సంతాపం తెలిపారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. ------ మచ్చలేని రాజకీయ యోధుడు రోశయ్య అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొనియాడారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటన్నారు. నిష్కళంక రాజకీయ యోధుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారన్నారు. తనకు రోశయ్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. ఆయన మరణం తనను వేదనకు గురి చేసిందన్నారు.  ----- హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌, మీడియేషన్‌ సెంటర్‌ సదస్సులో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ప్రభుత్వం, ప్రజల తరఫున సీజేఐ జస్టిస్ రమణకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యవర్తిత్వం దేశంలో రచ్చబండ వంటి రూపాల్లో ఎప్పటి నుంచో ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. వివిధ కారణాల వల్ల పరిశ్రమలు వివాదాలు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆలస్యమైనా హైదరాబాద్‌లో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కేంద్రం రావటం సంతోషమన్నారు.  --- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని  భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.  గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.   క్రమంగా దిశ మార్చుకుని ఆదివారం మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది. ----- సీబీఐ పేరిట మోసాలకు పాల్పడుతున్న నలుగురు ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెల 23దీన ఖాజీపేట మండలం పత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్‌ను విచారణ పేరిట నిందితులు కారులో తీసుకెళ్లారు.  అక్కడక్కడా తిప్పుతూ అతని వద్ద నుండి 1.14 లక్షల రూపాయలను దండుకున్న దుండగులు మరుసటి రోజు వదిలిపెట్టారు. ఈ వ్యవహారంపై బాధితుడు ఉదయ్ కుమార్ చెన్నూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ---- నటుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. నర్సీపట్నంలో బాలయ్య అఖండ సినిమాకి అఘోరాలు తరలివచ్చారు. నర్సీపట్నం బంగార్రాజు ధియేటర్‌లో అఘోరాలు సందడి చేశారు. అఖండ సినిమాతో బాలయ్య అఘోరాలు కూడా ఫ్యాన్స్ అయ్యారంటూ అభిమానులు థియేటర్‌లో కేకలు వేశారు. కాసేపు బాలయ్య అభిమానులతో మాట్లాడి, శివ నామం పలుకుతూ  అఘోరాలు బయటకి వెళ్లారు.  --- ఒమైక్రాన్ వేరియెంట్ టెన్షన్‌తో డిప్రెషన్‌కు గురైన ఓ డాక్టర్ తన భార్యాపిల్లలను చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరంలో వెలుగుచూసింది. కాన్పూర్ నగరంలోని కళ్యాణ్ పూర్ ప్రాంతానికి చెందిన ఓ డాక్టర్ కరోనా కొత్త వేరియెంట్ ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో టెన్షన్‌తో డిప్రెషన్‌కు గురయ్యాడు. డాక్టర్ తన ఇంట్లో శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలను చంపి పారిపోయాడు. డిప్రెషన్‌లో తాను భార్య పిల్లలను హత్య చేశానని పరారీలో ఉన్న డాక్టర్.. సోదరుడికి వాట్సాప్‌లో సందేశమిచ్చాడు. --- దేశంలోని సైనికాధికారులపై ఢిల్లీకి చెందిన ఓ మహిళా న్యాయవాది వలపు వల (హనీట్రాప్) విసిరిందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) విభాగం ఢిల్లీకి చెందిన మహిళా న్యాయవాది నుంచి దూరంగా ఉండాలని భద్రతా అధికారులను హెచ్చరిస్తూ మెమోరాండం జారీ చేసింది. 

200 కోట్ల మోసం!.. సీబీఐ త‌ర‌హా ఎంక్వైరీ.. శిల్పాచౌద‌రి ఉక్కిరిబిక్కిరి..

శిల్పాచౌద‌రి ప‌క్క ప్రొఫెష‌న‌ల్ క్రిమిన‌ల్‌లా స‌మాధానాలు చెబుతోంది. పోలీసులు ప‌క్కా స‌మాచారంతో ప్ర‌శ్న‌లు అడుగుతున్నారు. ఆమె మాత్రం పొంత‌న‌లేని ఆన్స‌ర్స్ చెబుతున్నారు. ఏమో.. తెలీదు.. గుర్తులేదు.. ఇలా పొడిపొడిగా మాట్లాడుతున్నారు. పోలీసులు ఊరుకుంటారా? ఎంత‌మంది క్రిమిన‌ల్స్‌ను చూసుంటారు. అందుకే, ఆధారాల‌ను ఆమె ముందు ఉంచి.. సీబీఐ త‌ర‌హాలో గుచ్చి గుచ్చి విచారిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నార్సింగిలోని ఎస్‌వోటీ కార్యాలయంలో మహిళా పోలీసు అధికారి సమక్షంలో విచారణ జరిపారు. క‌ళ్ల ముందే సాక్షాలు ఉంచి.. స‌మాధానాలు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయినా, మొండిఘ‌టం అంత ఈజీగా దారికి రావ‌ట్లేద‌ట‌. ముందు త‌న‌కేం తెలీదంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసినా.. ఆ త‌ర్వాత కాస్త ఎమోష‌న‌ల్ అయ్యార‌ట‌. మ‌ధ్య‌లో ఓసారి ఏడ్చారు కూడా. అయినా, త‌మ విచార‌ణ‌లో శిల్పాచౌద‌రి చాలా క‌న్నింగ్ ఆన్స‌ర్స్ ఇస్తున్నార‌ని పోలీసులు అంటున్నారు.  బాధితులు శిల్పాకు డ‌బ్బులు ఇచ్చిన‌ట్టు.. ఆమె తీసుకున్న‌ట్టు.. ఎక్క‌డా ప‌క్కా కాగితాలు రాసుకోక‌పోవ‌డంతో కేసు క్లిష్ట‌త‌రంగా మారింది. బాధితులంతా బాగా సంప‌న్నులు కావ‌డం.. అదంతా బ్లాక్‌మ‌నీ కావ‌డంతో.. ఎలాంటి ప‌త్రాలు లేకుండానే డ‌బ్బులు చేతులు మారాయి. అదే ఇప్పుడు శిల్పాచౌద‌రికి అనుకూలంగా మారాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో పెట్టుబడి కోసం వారి నుంచి తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చేశానని పోలీసుల‌తో శిల్పా చెబుతున్నారు. వారి నుంచి డబ్బు తీసుకున్నట్టు.. మళ్లీ ఇచ్చినట్టు ఎలాంటి ఆధారాల్లేవని తేల్చేశారు. ఆ వివరాలను నార్సింగి పోలీసులు రికార్డ్‌ చేసుకున్నారు.  వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడిన శిల్పా చౌదరిని రెండురోజులు పోలీసు కస్టడీకు తీసుకున్నారు. గండిపేట సిగ్నేచర్‌ విల్లాస్‌లో ఉంటున్న శిల్పాచౌదరి దంపతులు కిట్టీ పార్టీలతో ప్రముఖ కుటుంబాలకు చెందిన మహిళలతో స్నేహం చేశారు. భవన నిర్మాణాలు, రియల్‌ ఎస్టేట్‌, సినీ వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాలిస్తామంటూ బురిడీ కొట్టించి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు మూడు కేసులు నమోదు చేసి శిల్పా దంపతులను అరెస్టు చేశారు. క‌స్ట‌డీలో స‌మ‌గ్ర వివరాలు రాబడుతున్నారు.  శిల్పా చౌద‌రి నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు ఎస్వోటీ పోలీసులు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాల కుటుంబాలకు చెందిన మహిళల నుంచి రూ.200 కోట్ల వరకు వసూలు చేసినట్టు భావిస్తున్నారు. ఆ న‌గ‌దంతా ఎక్క‌డ దాచారో పోలీసుల‌కే అంతు చిక్క‌డం లేదు.  బ్యాంక్ ట్రాన్జాక్ష‌న్స్‌తో కాకుండా అంతా బ్లాక్‌మ‌నీ కావ‌డంతో న‌గ‌దు లావాదేవీల గుట్టు వీడ‌టం లేదు. రియ‌ల్ ఎస్టేట్‌, సినిమా పెట్టుబ‌డుల  పేరుతో శిల్పా చౌద‌రినే మోసం చేశారా?  లేక‌, బ్లాక్‌మ‌నీని వైట్‌గా మార్చుకునేందుకు బాధితులు ప్ర‌య‌త్నించారా? అనే కోణంలోనూ విచార‌ణ చేస్తున్నారు పోలీసులు.  బాధితుల నుంచి శిల్పాచౌదరి దంపతులు తీసుకున్న భారీ మొత్తంతో కొనుగోలు చేసిన భూములను కూడా పోలీసు అధికారులు పరిశీలించినట్టు సమాచారం. భూ లావాదేవీలకు సంబంధించిన వివరాలను సంబంధిత శాఖ నుంచి తీసుకోనున్నారు. నిందితుల బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏడాది కాలంలో జరిపిన ఆర్థిక లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. హ‌వాలా మార్గంలో విదేశాల‌కూ భారీ మొత్తాన్ని త‌ర‌లించిన‌ట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. పోలీసులకు కేవ‌లం ముగ్గురు మాత్ర‌మే ఫిర్యాదు చేయ‌గా.. శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య భారీగానే ఉంటుంద‌ని పోలీసులు అంచ‌నా వేస్తున్నారు.   

జగన్ సర్కార్ దే అన్నమయ్య వరద పాపం! గేట్లు ఎత్తకపోవడం వల్లే  కొట్టుకుపోయిందన్న కేంద్రం.. 

కడప జిల్లాలో వరదలు బీభత్సం స్పష్టించాయి. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడంతో గతంలో ఎప్పుడు లేనంతగా వరద విలయం సంబవించింది. 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. వందలాది గ్రామాలు రోజుల తరబడి జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. కడప జిల్లాలో కనివినీ ఎరుగని రీతిలో నష్టం జరిగింది. వరద విలయానికి అన్నమయ్య డ్యాం కారణం కాగా.. అసలు అన్నమయ్య డ్యాం ఎలా కొట్టుకుపోయిందన్నది ప్రశ్నగా మారింది. ప్రాజెక్ట్ నిర్వహణ లోపం వల్లే డ్యాం కొట్టుకుపోయిందనే విమర్శలు వస్తున్నాయి. వరదను అంచనా వేయడంలో యంత్రాంగం విఫలమైందని, సకాలంలో గేట్లు ఎత్తలేదనే ఆరోపణలు వచ్చాయి. తాజాగా కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సాక్షాత్తూ రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సేఫ్టీ బిల్లును ప్రవేశ పెడుతూ అన్నమయ్య ప్రాజెక్టుకు ఒకటిన్నర రెట్లు వరద వచ్చిందని కానీ గేట్లు ఎత్తలేదని కేంద్ర మంత్రి చెప్పారు. చివరికి ఎత్తేందుకు ప్రయత్నించినా ఓ గేటు పని చేయలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పడమే కాదు .. అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే పరువుపోతుందన్నారు.  అన్నమయ్య డ్యాంకు సంబంధించి కేంద్ర జలవనరుల శాఖా మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. జగన్ సర్కార్ వైఫల్యం బట్టబయలైంది.  అన్నమయ్య డ్యాం నిర్వహణ విషయంలో ప్రభుత్వంపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. గేట్ల నిర్వహణ పట్టించుకోలేదని.. మరమ్మతుల గురించి ఆలోచించలేదని.. పైగా వరద ముంచుకొస్తుందని తెలిసినా ఇసుక కోసం నీటిని దిగువకు విడుదల చేయలేదన్న ఆరోపణలు బలంగా వినిపించాయి. డ్యాం దిగువ ప్రాంత ప్రజలకు కనీస సమాచారం కూడా వెళ్లకపోవడం.. వారికి అందిన సమాచారం వల్లనే గుట్టపైకి వెళ్లి మిగిలిన వారు ప్రాణాలు కాపాడుకున్నారు. అందుకే ప్రమాదంలో జ్యూడిషియల్ విచారణ జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు.  అంతర్జాతీయంగా పరిశీలన జరిపితే భారత్ పరువు పోతుందని మంత్రి గజేంద్ర షెకావత్ కామెంట్లపైనా విమర్శలు వస్తున్నాయి. అంతర్జాతీయ పరిశీలన సరే మరి కేంద్రానికి బాధ్యత లేదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఓ కేంద్రం ఎందుకు బాధ్యత తీసుకుని విచారణ జరపదన్న సందేహం సామాన్య ప్రజలకు వస్తుంది. ఇలాంటి సమయంలోనూ కేంద్రం స్పందించకపోతే మొదటికే మోసం వస్తుంది. తీరిగ్గా విచారించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. అందుకే కేంద్రమే మేలుకోవాల్సి ఉందని అంటున్నారు.  

15 సార్లు బడ్జెట్ కూర్పు.. మాటల మాంత్రికుడు! పదవులకే వన్నె తెచ్చిన రోశయ్య..

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కొణిజేటి రోశయ్యది ప్రత్యేక స్థానం. రాజకీయ విలువలకు కట్టుబడి ఆయన ప్రస్థానం కొనసాగించారు. చివరి వరకు నిలుపుకున్నారు. తాను ఏ బాధ్యత తీసుకున్నా.. ఆ పదవికే వన్నె తెచ్చారు రోశయ్య. దాదాపు ఐద దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో కీలక పదవులు నిర్వహించారు .  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య... వైఎస్సార్‌ మరణానంతరం.. 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు పదవిలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు. 1979లో టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణా, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖలు నిర్వహించారు. 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోంశాఖ, 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖలు నిర్వహించారు. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలు, 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్‌ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2004, 2009లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌ను రోశయ్య 15 సార్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 1995-97 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లో నరసరావుపేట నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పేరుపొందినారు. 1968-85: శాసనమండలి సభ్యుడు 1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత 1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి 1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు 1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి 2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు 2004: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి 2009: రాష్ట్ర శాసనమండలి సభ్యుడు 2009: సెప్టెంబరు - 2010 నవంబరు 24:ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 2011: ఆగస్టు 31: తమిళనాడు గవర్నర్‌  

ఉత్తరాంధ్రను వణికిస్తున్న జవాద్.. తీరంలో ప్రచండ గాలులు..

ఉత్తరాంధ్రలో జవాదు తుపాను ప్రభావం తీవ్రంగా ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచే వర్షాలు మొదలు కాగా.. ప్రస్తుతం ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జవాదు తుపాను తీరం వైపు వస్తున్న కొద్ది వర్ష తీవ్రత పెరుగుతోంది. గాలుల ఉధృతి క్రమంగా పెరుగుతోంది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జవాద్ తుపాను మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారదీప్‌కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని  భారత వాతావరణశాఖ(ఐఎండీ) తెలిపింది.  గడచిన కొద్దీ గంటలుగా తుపాను వాయువ్య దిశలో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.   క్రమంగా దిశ మార్చుకుని ఆదివారం మధ్యాహ్ననికి పూరీ తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐంఎండీ వెల్లడించింది.  ఆదివారం రాత్రికి క్రమంగా బలహీన పడి వాయుగుండంగా మారుతుందని వివరించింది.  ఒమిక్రాన్.. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఫుల్ డిటైల్స్‌.. జవాద్ తుపాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తుఫాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. సముద్రపు అలలు 3.5 మీటర్ల  ఎత్తుకు ఎగసిపడే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. జవాద్ తుపానుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. తీర ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆ్రఎఫ్ బృందాలను మోహరించారు. ఎలాంటి పరిస్థితి వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అలర్ట్ చేసింది.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కన్నుమూత 

సీనియర్ రాజకీయ వేత్త, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఉదయం బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడంతో కుప్పకూలిన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందారు. రోశయ్య వయసు 89 సంవత్సరాలు.  4 జులై 1933న గుంటూరు జిల్లా వేమూరులో రోశయ్య జన్మించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితంగా ఉండేవారు. ఆయన మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఎక్కువ కాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడు గవర్నర్‌గానూ సేవలందించారు. గుంటూరు హిందూ కళాశాలలో రోశయ్య విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీగా రోశయ్య సేవలందించారు. 1968, 74, 80లలో శాసనమండలి సభ్యునిగా ఆయన ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రోడ్లు రహదారులశాఖ, రవాణాశాఖా మంత్రిగా పనిచేశారు. 2004లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రోశయ్య విజయం సాధించారు. ఉమ్మడి ఏపీలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రోశయ్య రికార్డు క్రియేట్ చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత అంటే 3 సెప్టెంబర్ 2009-25 జూన్ 2011 వరకూ ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య బాధ్యతలు చేపట్టారు. ఆగస్ట్ 2011 నుంచి ఆగస్ట్ 2016 వరకూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గవర్నర్‌గా రోశయ్య పనిచేశారు

మాజీ స్పీకర్ మండలి చైర్మన్?

రాజకీయాలలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఎప్పుడు ఎవరిని ఏ పదవి ఎప్పుడు ఎలా వరిస్తుందో, కొన్ని కొన్ని సందర్భాలలో ఊహకు కూడా చిక్కదు. తెలంగాణ అసెంబ్లీ తొలి స్పీకర్’గా చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకున్న, మధుసూదనాచారి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా భూపాలపల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడి పోయారు. అప్పటి నుంచి ఏ పదవీ లేక,  ఒక విధంగా విరహ వేదన అనుభవిస్తున్నారు. అయితే ఇప్పుడు అనుకోకుండా, ఆయన్ని ఎమ్మెల్సీ పదవి వరించింది. అది కూడా కొంచెం ఎక్కువ గౌరవప్రదమైన గవర్నర్ నామినేషన్ కోటాలో, ఆయన ఎమ్మెల్సీగా పెద్దల సభలో కాలు పెట్టారు.  నిజానికి ఈ గౌరవం, కాంగ్రెస్ నుంచి తెరాసలో చేరిన పాడి కౌశిక్ రెడ్డికి దక్కవలసింది.  అయన పార్టీలో చేరిన 15 రోజులకే ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన్ని గవర్నర్ కోటాలో నామినేషన్’కు ఎంపిక చేశారు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాష్ట్ర మంత్రి వర్గం కూడా, కౌశిక్ రెడ్డ్డి  పేరును నామినేటెడ్ ఎమ్మెల్సీగా సిఫార్సు చేస్తూ తీర్మానం చేసింది. గవర్నర్’ కు కూడా పద్దతిగానే పంపించారు. అయితే, ముఖ్యమంత్రి ఒకటి తలిస్తే గవర్నర్ వేరోకటి తలిచారో ఏమో కానీ, ఎందుకనో నెలలు గడచినా గవర్నర్ ఆ ఫైల్ క్లియర్ చేయలేదు.  ఇంతలో పుణ్య కాలం కూడా ముగిసి పోయింది . హుజూరాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. తెరాస ఓడిపోయింది. అయినా, ముఖ్యమంత్రి కౌశిక రెడ్డిని మాత్రం బోడి మల్లయ్యను చేయలేదు. ఎమ్మెల్ల్యే కోటాలో ఎమ్మెల్సీగా కౌశిక రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయన  ఏకగ్రీవంగా గెలిచారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అలా కౌశిక రెడ్డికి దక్కవలసిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవి,  మధుసూదనాచారికి దక్కింది . ఆఫ్కోర్సే, అది కాకపోతే, ఎమ్మెల్సీ కోటాలో లేదా స్థానిక కోటలోనో  మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి దక్కితే దక్కేదేమో, కానీ, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావడంతో ఆయనకు ఇంకొంచెం ఎక్కువ   గౌరవం దక్కిందని అనికోవచ్చును .  అదలా ఉంటే, తెలంగాణ తోలి అసెంబ్లీ స్పీకర్’గా చరిత్రలో స్థానం సంపాదించుకున్న మధుసూదనాచారి ఇప్పుడు, ఉభయ సభల అధ్యక్ష పదవిని అందుకున్న తొలి వ్యక్తిగా    మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని సమాచారం. అసెంబ్లీ స్పీకర్’గా పనిచేసిన ఆయన్ని మండలి చైర్మన్’ గా నియమిచాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. మండలి తొలి చైర్మన్  స్వామి గౌడ్ పదవీ కాలం ముగిసిన తర్వాత మండలి చైర్మెన్‌గా ఉన్న ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పదవి కాలం కూడా ముగిసింది. ప్రస్తుతం ప్రొటెం చైర్మెన్‌గా ఉన్న భూపాల్‌రెడ్డి పెద్దల సభను నడిపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆ  స్థానంలో మధుసూదనాచారిని నియమించే అవకాశం ఉన్నట్టు పార్టీ  వర్గాల సమాచారం. గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా మళ్ళీ మండలికి ఎన్నికయ్యారు. అయితే, ఆయనకు  చైర్మన్ పదవి కంటే మంత్రి పదవి పై మక్కువని అంటారు. అందుకే ఆయన ‘ఒక్క అవకాశం’ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా అందుకు సుముఖంగానే ఉన్నారని సమాచారం. సో..ఆయనకు మంత్రి పదివి ఎలా ఉన్నా మధుసూదనాచారికి మాత్రం చైర్మన్ పదవి ఖాయమని అంటున్నారు.  ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి చైర్మెన్‌గా చారిని నియమించడంతోపాటు అసెంబ్లీ మాజీ స్పీకర్‌కు తగిన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంలో సీఎం ఆ బాధ్యతలు ఆయనకు అప్పగిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ కొనసాగుతున్నది. ఎమ్మెల్యే కోటాలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పాడి కౌశిక్‌రెడ్డి, పరుపాటి వెంకట్రా మిరెడ్డి నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ప్రొటెం చైర్మెన్‌ భూపాల్‌రెడ్డి శాసనమం డలిలోని తన చాంబర్‌లో వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ నేపధ్యంలో మధుసూదనాచారి కాబోయే చైర్మన్ అనే ముచ్చట పార్టీ వర్గాల్లో షికార్లు చేస్తోంది. నిజానికి ఇప్పటికే ఆయన అభిమానులు బొకేలు, పూల దండలు సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం ..

ఏపీకి వార్నింగ్‌.. ఓటీఎస్‌తో టోక‌రా.. ఒట్టేసిన జ‌గ‌న‌న్న‌.. టాప్‌న్యూస్ @ 7pm

1. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడం కుదరదని ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్రం తేల్చిచెప్పింది. కేంద్ర పథకాలను జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2021 - 22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్, ఐసీపీఎస్ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్క చూపాలని కేంద్రం ఆదేశించింది. ఎంపీ రఘురామ ఫిర్యాదుపై ఈ మేర‌కు కేంద్రం స్పందించింది. 2. ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి.. ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాక్షస జాతిలా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు.  3. ఓటీఎస్ పేరుతో డ్వాక్రా మహిళలకు జగనన్న టోకరా వేస్తున్నాడని టీడీపీ నాయకుడు నారా లోకేష్‌ ఎద్దేవా చేశారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాలు ఖాళీ అవుతున్నాయన్నారు. జగన్‌రెడ్డి కబంధహస్తాల్లో అభయహస్తం చిక్కిందని లోకేష్‌ ఆరోపించారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఎవరూ కట్టొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇళ్ల పట్టాలను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తుందని లోకేష్‌ ప్రకటించారు.  4. సీఎం జగన్‌ను టీటీడీ కాంట్రాక్ట్ కార్మికురాలు రాధా కలిశారు. టీటీడీ కార్మికుల సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు. తలమీద చేయిపెట్టి ఒట్టేయాలని సీఎంను రాధా కోరారు. 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తానని రాధా తల మీద చేయిపెట్టి జగన్‌ ఒట్టేశారు.  5. ఏపీ సీఎం జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టు కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు జగన్ కోరారు. తన బదులు న్యాయవాది హాజరయ్యేందుకు అనుమతించాలని జగన్ కోరారు. హాజరు మినహాయింపు ఇచ్చేందుకు గతేడాది సీబీఐ కోర్టు నిరాకరించింది.  సీబీఐ వాదనల కోసం విచారణ ఈనెల 6కి హైకోర్టు వాయిదా వేసింది. 6. డిగ్రీ కాలేజీల్లో యాజమాన్య కోటా భర్తీపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. యాజమాన్య కోటాలో 30 శాతం సీట్ల భర్తీకి కన్వీనర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వాలన్న.. ప్రభుత్వ నిబంధనను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీట్ల భర్తీని కన్వీనర్‌ చూస్తారనే నిబంధనను కూడా న్యాయస్థానం కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓబీసీలకు జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని కోర్టు ఆదేశించింది.  7. వడ్లను రోడ్ల మీద, కల్లాల్లో పెట్టుకుని రైతులు నిరీక్షణ చేస్తున్నారని వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ఎప్పుడుకొంటారో తెలియక కుప్పల మీదే రైతుల గుండెలు ఆగిపోతున్నాయన్నారు. యాసంగి వడ్ల మీద రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంకెంత మంది రైతులు చస్తే తమ కండ్లు చల్లబడుతాయి కేసీఆర్ అని ప్రశ్నించారు.  8. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా కలకలం రేపింది. ఒక్కరోజే ఏడుగురు విదేశీ ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. శాంపిల్స్‌ను జినోమ్ సీక్వేన్స్‌కు అధికారులు పంపించారు. ఇప్పటివరకు 12 మంది విదేశీ ప్రయాణికులకు కరోనా నిర్దారణ అయింది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను టిమ్స్ ఆస్పత్రికి తరలించారు.  9. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి కరోనా సోకిన ప్రయాణికురాలు పరార్ అయింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆమెను ఆస్పత్రికి తరలించేలోపు ఎయిర్‌పోర్ట్‌ నుంచి పరారైంది. పాస్‌పోర్ట్‌ ఆధారంగా చిరునామా గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆమె ఇంటికి వెళ్లగా ఇంటి నుంచి కూడా ఆమె త‌ప్పించుకుంది. చివరకు ఎలాగోలా ఆమెను అదుపులోకి తీసుకుని టిమ్స్‌ ఆస్పత్రికి అధికారులు తరలించారు.  10. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతుఫానుగా మారింది. విశాఖకు ఆగ్నేయంగా 420 కి.మీ. దూరంలో , ఒడిషా గోపాల్‌పూర్‌కు 530 కి.మీ. దూరంలో 'జవాద్' తుపాను కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. శ‌నివారం ఉదయానికి ఉత్తర కోస్తాంధ్రకు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత పెరగనుంది.  

10 రోజుల్లో పీఆర్సీ.. తెలీద‌న్న‌ జేఏసీ.. మ‌రి, మిగ‌తా డిమాండ్లు?

పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల డిమాండ్ కాదు.. ఇతర డిమాండ్లు కూడా ఉన్నాయి.. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ నిధులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ లాంటి అనేక సమస్యలు ఉన్నాయి.. అంటూ 10 రోజుల్లో పీఆర్సీ అంటూ తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. పీఆర్సీకి సంబంధించి సీఎం చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాల‌కు సమాచారం లేదన్నారు ఏపీ జేఏసీ అమ‌రావ‌తి అధ్య‌క్షుడు బొప్ప‌రాజు వెంక‌టేశ్వ‌ర్లు. తిరుపతిలో తమ సంఘాలకు చెందిన ఉద్యోగులెవరూ సీఎంను కలవలేదని స్పష్టం చేశారు.  పీఆర్సీ సంబంధిత అంశాలపై కార్యదర్శుల కమిటీతో చర్చలకు మాత్రమే ప్రభుత్వం పిలిచిందని బొప్ప‌రాజు వెల్లడించారు. పీఆర్సీ నివేదిక బహిర్గతం చేస్తేనే దానిపై చర్చించేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితేనే ఉద్యమాన్ని విరమించుకుంటామని.. లేదంటే ఉద్యమ కార్యాచరణ యథాతథంగా కొనసాగుతుందని బొప్పరాజు తేల్చి చెప్పారు.   ఉద్యోగుల ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో పీఆర్సీ విషయంలో శుక్ర‌వారం ఉద‌యం సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని చెప్పారు. తిరుపతి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో ఉండగా.. కొందరు ఉద్యోగులు పీఆర్సీ గురించి ప్లకార్డులను ప్రదర్శించారు. వాటిని గమనించిన సీఎం ఉద్యోగులను పిలిచి మాట్లాడారు. పీఆర్సీతో పాటు, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగులు ముఖ్య‌మంత్రిని కోరారు. స్పందించిన జగన్‌.. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యిందని చెప్పారు. పది రోజుల్లో ప్రకటన ఉంటుందని తెలిపారు. అయితే, అధికారికంగా త‌మ‌కు ఎలాంటి స‌మాచారం లేద‌ని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. పీఆర్సీ ఇచ్చినంత మాత్రాన స‌మ‌స్య‌లు తీరిపోవ‌ని.. మిగ‌తా డిమాండ్ల‌నూ నెర‌వేర్చాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నాయి. 

ఒమిక్రాన్.. ఏం చేయాలి? ఏం చేయ‌కూడ‌దు? ఫుల్ డిటైల్స్‌..

1. ఒమిక్రాన్‌. ఇది కొత్త కరోనా వేరియంట్‌. డెల్టా ర‌కం కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగంగా విస్తరిస్తుంది.  2. ఒమిక్రాన్‌ను దక్షిణాఫ్రికా దేశంలో ముందుగా గుర్తించారు. ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్, బ్రిటన్, ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్, బోట్స్వానా, బెల్జియం దేశాల్లో వేగంగా విస్త‌రిస్తోంది.  3. ఒమిక్రాన్ బాధితుల‌ లక్షణాలు:- అలసటగా ఉండడం, కండరాల నొప్పి, గొంతులో గరగర, పొడి దగ్గు. జ్వరం. క‌రోనా వేరియంట్లు అన్నిటికీ ఒకే త‌ర‌హా ల‌క్ష‌ణాలు ఉంటాయి. 4. ఒమిక్రాన్ ఎవ‌రికైనా సోక‌వ‌చ్చు. ఇమ్మ్యూనిటీ బాగా వీక్‌గా ఉంటే మిన‌హా.. దీని ప్రభావం స్వల్పం అంటున్నారు. అసలు వచ్చినట్టే తెలియదని చెబుతున్నారు.  5. ఒమిక్రాన్‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేదు. జాగ్ర‌త్త‌లు మాత్రం త‌ప్ప‌నిస‌రి. నిర్ల‌క్ష్యం మ‌హా ప్ర‌మాదం.  6. రెండు డోసుల వ్యాక్సినేష‌న్ పూర్తి కాని వారు.. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌రోనా సోక‌ని వారు.. ఒమిక్రాన్ బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండాలి. వీలైనంత త్వ‌ర‌గా వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకోవాలి.  7. ప్రస్తుత వ్యాక్సిన్‌ల వల్ల పొందే యాంటీబాడీలు ఒమిక్రాన్‌ ను తటస్థీకరించేందుకు సరిపోయేలా కనిపించడం లేదు. అయినప్పటికీ తీవ్ర వ్యాధి బారినపడే అవకాశాలు మాత్రం తక్కువే. భారత్‌లో 40ఏళ్ల వయసు పైబడిన వారికి బూస్టర్‌ డోసును ఇచ్చే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చని జీనోమ్‌ శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. ఇండియన్‌ సార్స్‌-కోవ్‌-2 జీనోమిక్స్‌ సీక్వెన్సింగ్‌ కన్సార్టియం (INSACOG) విడుదల చేసిన వారాంతపు నివేదికలో ఈ విషయం తెలిపింది. 8. ఒమిక్రాన్‌ వేరియంట్‌ను ఇప్పటికే గుర్తించిన దేశాల నుంచి కొనసాగే రాకపోకలపైనా పర్యవేక్షణ ముమ్మరం చేయాలని ఇన్సాకోగ్‌ సూచించింది. కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ను సమర్థవంతంగా చేపట్టడంతో పాటు నిర్ధారణ పరీక్షలను భారీగా పెంచాలని స్పష్టం చేసింది. 9. అంతర్జాతీయ ప్రయాణికులను నిరంతరం పర్యవేక్షించడానికి సమాయత్తం కావాలి. ప్రధానంగా ముప్పు అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు పరీక్షలు చేయించి, పాజిటివ్‌గా తేలిన అన్ని నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం ఇన్సాకాగ్‌ ఆధ్వర్యంలోని ల్యాబ్‌లకు తప్పనిసరిగా పంపాలి.  10. వైరస్‌ సోకిన వారికి తక్షణం వైద్యసేవలు అందించాలి. నాణ్యమైన వైద్యం అందించడంలో ఏమాత్రం రాజీ పడకూడదు. పాజిటివిటీ రేటు 5% లోపునకు పరిమితం చేసే లక్ష్యంతో పనిచేయాలి. రోగులను ఆదిలోనే గుర్తించి, వారిని ఐసోలేష‌న్‌లో ఉంచి వైరస్‌ వ్యాప్తిని నిరోధించాలి. కొవిడ్‌పై అసత్య ప్రచారాలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తాయి.