రఘురామ వర్సెస్ వైసీపీ.. లోక్‌సభలో డైలాగ్ వార్..
posted on Dec 6, 2021 @ 1:34PM
ఎంపీ రఘురామ ప్రశ్నించారు. లోక్‌సభలో జగన్‌రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిలదీశారు. నిజం మాట్లాడితే ఎవరికైనా ఉలుకెక్కువ అంటారుగా.. అలానే జరిగింది. రఘురామ వ్యాఖ్యలపై లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి కౌంటర్లు వేశారు. పరస్పరం సీబీఐ కేసులనూ తవ్వుకున్నారు. అలా అలా సభలో ఆ ఇద్దరు వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో నడిచింది. ఎవరూ తగ్గకపోవడంతో.. మాటల యుద్ధం పీక్స్‌కు చేరింది. ఇంతకీ లోక్‌సభలో అసలేం జరిగిందంటే....
అమరావతి రైతుల మహాపాదయాత్రకు పోలీసులు అడ్డంకులు కల్పించడాన్ని జీరో అవర్‌లో ఎంపీ రఘురామ లేవనెత్తారు. గాంధేయ పద్ధతిలో రైతులు చేస్తున్న మహాపాదయాత్రను అడ్డుకోవడం అన్యాయమన్నారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని.. అలాంటి రైతులను పోలీసులు తీవ్రంగా హింసిస్తున్నారని రఘురామ తప్పుబట్టారు. శాంతి భద్రతలు క్షీణించాయని.. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని రఘురామ సభ దృష్టికి తీసుకొచ్చారు.
అయితే, రఘురామ ప్రసంగాన్ని వైసీపీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు ఎంపీ రఘురామ అధికార బీజేపీలో చేరేందుకు తహతహలాడుతున్నారని ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మిథున్‌రెడ్డి వ్యాఖ్యలకు అంతే స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు రఘురామ. తన మీద రెండు సీబీఐ కేసులు మాత్రమే ఉన్నాయని.. సీఎం జగన్ పైన వంద సీబీఐ కేసులున్నాయని.. ముందు వాటి సంగతి తేల్చాలని ఎంపీ రఘురామ అనడంతో వైసీపీ సభ్యులు ఇరకాటంలో పడ్డారు. ఇలా, లోక్‌సభలో రఘురామ వర్సెస్ మిథున్‌రెడ్డి ఎపిసోడ్ కాసేపు హాట్ హాట్‌గా కొనసాగింది.