వరి వద్దు పత్తి ముద్దు.. తెరాస సర్కార్ కొత్త మంత్రం
posted on Dec 6, 2021 @ 10:47AM
చివరాఖరుకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికుండ బద్దలు కొట్టారు. యాసంగిలో వరి సాగు చేస్తే ప్రభుత్వం కొనదని ఖరాఖండిగా తేల్చిచెప్పారు. ఆఫ్కోర్సే ఇప్పటికే, ప్రభుత్వ పెద్దలు వరి వేస్తే ఉరే’ అని తేల్చి చెప్పారు అనుకోండి. అయినా, ఇప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి మరో మారు మరింత ‘ఘట్టి’గా అదే విషయం చెప్పారు. ఇంత చెప్పినా వినకుండా రైతులు వరి సాగు చేస్తే అందుకు రైతులే బాధ్యత వహించవలసి ఉంటుందని కూడా మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. పండిన పంటను ప్రభుత్వం కొనక పోతుందా, అనుకుంటే నష్టపోక తప్పదని హెచ్చరిక కూడా చేశారు. మిల్లర్లతో ముదస్తూ ఒప్పందం ఉన్నరైతులు మాత్రమే వరి వేయాలన్నారు. రైతులు కేంద్రాన్ని నమ్మి యాసంగిలో వరి వేస్తే నిండుగా మునుగడం ఖాయమని, కేంద్రానిది తడిబట్టతో గొంతుకోసే విధానమని ఆరోపించారు.
బాగుంది. కేంద్రానికి తడిగుడ్డతో గొంతు కోసే విధానమే కావచ్చును. కేంద్రం మీద నమ్మకం లేకనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వరి వద్దన్నారని అనుకుందాం. మరి యాసంగిలో రైతులు ఏ పంటలు వేయాలి, ఏ పంటలు పండించాలి? అంటే దానికి కూడా, మంత్రి నిరంజన్ రెడ్డి ముచ్చటైన సమాధానమే ఇచ్చారు. గతంలో ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు, ఏ విధంగా అయితే,శాసన సభ సాక్షిగా లెక్కలు చెప్పి మరీ ,60 లక్షలు 80ల క్షలు కాదు కోటి ఎకరాల్లో వరి సాగు చేసినా ‘ఐ యామ్ హ్యాపీ.’ .చివరి గింజ వరకు కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని బల్ల గుద్దారో అంతకంటే గట్టిగా మంత్రి నిరంజన్ రెడ్డి 80 లక్షల నుంచి కోటి ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలని రైతులకు సూచించారు. అంతే కాదు, అప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి వరిసాగుకున్న ఉజ్వల భవిష్యత్, వరి రైతుల బంగారు భవిష్యత్ గురించి ఎలాగైతే బ్రహ్మాండ ఉపన్యాసం ఇచ్చారో .. ఎంత చక్కటి భరోసా ఇచ్చారో, పత్తి రైతు బంగారు భవిష్యత్ గురించి వ్యవసాయ మంత్రి అంతే చక్కటి భరోసా ఇచ్చారు.
ఇప్పుడు పత్తి కనీస మద్దతు ధర కన్నా రూ.3వేల వరకు ఎక్కువ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పత్తిని కొంటోందన్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో పత్తికి డిమాండ్ ఉందని, ఎంత పంట వచ్చినా కొనే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. సీసీఐ కొనుగోలు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర ఇచ్చి పత్తిని కొంటుందని చెప్పారు. అయితే వరి (బియ్యం) కానీ, పత్తి కానీ, ఏదైనా చివరకు కొనవలసింది, కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలే కానీ రాష్ట్ర ప్రభుత్వం కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా మాత్రమే పని చేస్తుంది. ఇదే విషయాన్ని మంత్రి నిరంజన్ రెడ్డి కూడా,స్పష్టం చేశారు “ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గానే వ్యవహరిస్తుంది” అని చెప్పారు.. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం కొనేది ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎఫ్-సీఐ అయితే,పట్టిని కొనేది కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (సీసీఐ). అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థే, రేపు సీసీఐ కూడా ఎఫ్సీఐ లానే చేతులు ఎత్తేస్తే , ఎవరిదీ భరోసా, కోటి ఎకరాలలో వరి పండిన కొంటామని ముఖ్యమంత్రి నిండుసభలో ఇచ్చిన హమీకే దిక్కులేనప్పుడు, మంత్రి నిరంజన్ రెడ్డి పత్తి విషయంలో ఇస్తున్న హామీని నమ్మేదేలా, అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మరో వంక పట్టి పంటకు సంబంధించి తెలంగాణ రైతులకు చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. పత్తి రైతులతోనే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. ఆత్మ హత్యలు చేసుకున్న రైతుల్లో అత్యధిక మంది పట్టి రైతులే ... అని గుర్తుచేస్తున్నారు రైతులు.