పసుపు రంగు మాయం.. శిల్పా కేసులో ట్విస్ట్.. గ్రేట్ విక్టరీ..
posted on Dec 6, 2021 @ 11:49AM
కడప జిల్లా కమలాపురం, బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కడప జిల్లా కమలాపురం, నెల్లూరు జిల్లా బుచ్చి మున్సిపల్ ఎన్నికలపై.. ఆ జిల్లాకు చెందిన నేతలతో చంద్రబాబు సమీక్షించారు. ఇటీవల జరిగిన ఎన్నికలపై అభ్యర్థులు, నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ బలోపేతానికి నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు .
---
ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు బస్సులకు రంగును మార్చాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సులకు ఆకుపచ్చ, పసుపు, తెలుపు, నలుపు రంగులు ఉన్నాయి. వీటిలో పసుపు రంగును మాత్రం తొలగించనున్నారు. పసుపు రంగు బదులుగా గచ్చకాయ రంగును వినియోగించబోతున్నారు.
--------
అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర 36వ రోజు నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం వెంగమాంబపురం నుంచి మహా పాదయాత్ర ప్రారంభమైంది. బంగారుపేట మీదుగా వెంకటగిరికి చేరుకోనుంది. రాజధాని రైతులకు సంఘీభావంగా ప్రజలు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి రథానికి పూజలు చేసి, మంగళహారతులు ఇచ్చి, రైతులపై పూలవర్షం కురిపిస్తూ సంఘీభావం తెలుపుతున్నారు.
------
నిత్య చైతన్య మూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పవన్ ఆయనను స్మరించుకున్నారు. ‘‘నేను ఆరాధించే గొప్ప సంఘ సంస్కర్త అంబేద్కర్. రాజ్యాంగంలో ఆయన కల్పించిన పౌర హక్కులు ఆదేశిక సూత్రాలు ప్రజలకు రక్షణగా నిలుస్తున్నాయి. అంబేద్కర్ గారు చూపిన మార్గంలోనే జనసేన ప్రస్థానం కొనసాగుతుంది’’ అని పవన్ చెప్పారు.
-----
అణగారిన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ ఒక్క ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కాదన్నారు. ఎస్సీలకు మూడు ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా.. గ్రామాల్లో భూమి అమ్మే వాళ్ళు లేరని అన్నారు. దళిత బంధు పథకం ద్వారా దళితులకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు.
-------
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన శిల్పా చౌదరి కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకొస్తోంది.కోట్ల రూపాయలు వసూలు చేసి మోహం చాటేశారు శిల్పా దంపతులు. వసూలు చేసిన కోట్ల రూపాయలను ఎక్కడ, ఏం చేసిందన్నదాని పై ప్రస్తుతం విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటి వరకు నాలుగు అకౌంట్లు గుర్తించినా.. ఆ అకౌంట్లో కేవలం వేలల్లోనే నగదు ఉన్నట్లు గుర్తించారు. దీంతో నగదును ఎక్కడికి తరలించారన్న దానిపై విచారణ జరుపుతున్నారు.
----------
అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కోడిపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వైసీపీ నేతకు చెందిన కారు ఢీకొని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి గాయపడ్డారు. ప్రయాణికులతో వెళుతున్న ఆటోను కోడిపల్లి సమీపంలో వైసీపీ నేతకు చెందిన కారు అతివేగంగా ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
---
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ 2లో అర్థరాత్రి సమయంలో డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంగా కారు నడిపి ఇద్దరిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ఎవరిది? కారు నడిపిన వ్యక్తులు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
------
కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం, దిగ్విజయ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సింధియా విశ్వాస ఘాతుకుడని అన్నారు. సింధియాకు కాంగ్రెస్ పార్టీ ఎంతో ఇచ్చిందని... అయినప్పటికీ పార్టీకి ద్రోహం చేసి బీజేపీలో చేరారని మండిపడ్డారు. డబ్బు ఇచ్చి తమ పార్టీ ఎమ్మెల్యేలను కూడా వెంట తీసుకెళ్లారని విమర్శించారు. ద్రోహులను చరిత్ర క్షమించదని డిగ్గీ అన్నారు.
-----
న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత జట్టు 372 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. 140/5 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగోరోజు ఆట ప్రారంభించిన న్యూజిలాండ్ మరో 27 పరుగులే జోడించి చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. నాలుగవ రోజు ఆటలో జయంత్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా అశ్విన్ చివరి వికెట్ తీశాడు. టెస్టుల్లో పరుగల పరంగా భారత్‌కిది అత్యంత భారీ విజయం.