సంక్రాంతి తర్వాత పెను గండమే! దేశాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్..
posted on Dec 6, 2021 @ 9:30AM
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అత్యంత వేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్.. కొద్ది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. డిసెంబర్ 5 నాటికే కొత్త వేరియంట్ దాదాపు 40 దేశాలకు పాకింది. ఒమిక్రాన్ ను మొదట గుర్తించిన సౌతాఫ్రికాలో అయితే దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వారం రోజుల్లోనే అక్కడ కొవిడ్ కేసులు దాదాపు నాలుగు రెట్లు పెరిగాయి. మన దేశంలోనూ ఒమిక్రాన్ డేంజర్ బెల్స్ మిగిస్తోంది. ఇప్పటికే 21కేసులు నమోదయ్యాయి. ఇంకా చాలా మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. ఇందులో రాజస్థాన్ లో 9, మహారాష్ట్రలో 6, గుజరాత్, ఢిల్లీలో ఒక్కో కేసు ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ భయం వెంటాడుతోంది. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రోజూ ఒమిక్రాన్ రిస్క్ దేశాల నుంచి వందలాది మంది వస్తున్నారు. వాళ్లలో ఇప్పటికే 13 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది. అయితే వాళ్ల శాంపిల్స్ ను జీనోమ్ టెస్టుకు పంపగా.. ఇక్కడ రిపోర్టులు రాలేదు. ఆ ఫలితాలు వస్తేకాని విదేశాల నుంచి వచ్చిన వాళ్లకు సోకింది ఒమిక్రానా లేదా మరో వైరస్ అన్నది తేలనుంది. ఒమిక్రాన్ కు సంబంధించి తెలంగాణ హెల్త్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనవరి 15 తర్వాత కరోనా కేసులు పెరుగుతాయని.. ఫిబ్రవరి నాటికి పతాక స్థాయికి చేరే అవకాశం ఉందని తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో కరోనా పాజిటివ్‌లు పెరుగుతున్నాయన్నారు. ఒకటి, రెండు నెలల్లో భారత్‌లోనూ ఒమైక్రాన్ కేసులు పెరిగే అవకాశం ఉందని డాక్టర్ గడల పేర్కొన్నారు. ప్రజలు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. అర్హులంతా టీకా తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. కరోనా మూడో దశ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పా రు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ముప్పు జాబితా లోని 12 దేశాల నుంచి ఇప్పటివరకు హైదరాబాద్‌కు 900 మందిపైగా వచ్చారని తెలిపారు. విమానాశ్రయంలో నిర్వహించిన టెస్టుల్లో 13 మందికి కరోనా నిర్ధారణ అయిందన్నారు. వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణకు పంపామని చెప్పారు. ఫలితాలు ఒకటి, రెండు రోజుల్లో వస్తాయన్నారు. ‘‘ఏ క్షణమైనా ఒమైక్రాన్ వచ్చే ప్రమాదం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు శ్రీనివాస రావు.
ఒమైక్రాన్ కేసులను దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు శ్రీనివాస రావు. తప్పుడు ప్రచారంతో వైద్య ఆరోగ్య శాఖ మనోస్థైర్యం దెబ్బతింటుందన్నారు. ప్రభుత్వం కొవిడ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నదని.. ప్రతి రోగికి చికిత్స అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. వైరస్ వ్యాప్తి పెరిగినా రాబోయే రోజుల్లో లాక్‌డౌన్ విధించేంతటి ప్రభావం ఉండదని చెప్పారు.. ఒమైక్రాన్ సోకినవారిలో ఒళ్లు నొప్పులు, తల నొప్పి, నీరసం ఉంటాయని.. ఈ లక్షణాలున్నవారు దగ్గర్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వేరియంట్ తీవ్రతపై అధ్యయనాలు జరుగుతున్నాయని, పూర్తి స్పష్టత వచ్చేందుకు మరో వారం పడుతుందని తెలిపారు. ఒమైక్రాన్ ప్రభావంతో దక్షిణాఫ్రికాలో కేసులు పెరుగుతున్నాయన్నాయని.. కాని ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండడం ఊరట కలిగించే అంశమని శ్రీనివాసరావు చెప్పారు.