ఓ హీరోకి ₹3 కోట్లు మ‌స్కా.. కిలేడీ శిల్పా...

శిల్పా చౌద‌రి. వారం రోజులుగా న్యూస్‌లో ట్రెండ్ అవుతున్న కి..లేడీ. చిన్నాచిత‌కా చీటింగ్ కేసులు కావు ఆమెవి. కొడితే కోట్లు వ‌చ్చిప‌డాల‌నేదే ఆమె టార్గెట్‌. అందుకే శిల్పా చౌద‌రి మోసాలన్నీ కోట్ల‌లోనే. తాజాగా, ఆమె చేతిలో మోస‌పోయిన వారిలో ఓ సినీ హీరో కూడా చేరారు. ఆ హీరో నుంచి ఏకంగా 4 కోట్లు కొట్టేసింది. ఆ మేర‌కు పోలీసుల‌కు మ‌రో ఫిర్యాదు అందింది.  సినీ హీరో హర్ష.. శిల్పా చౌద‌రిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెహరి చిత్రంలో హీరోగా నటించిన హర్ష.. శిల్పా చౌదరి తన ద‌గ్గ‌ర‌ ₹3 కోట్లు తీసుకొని తిరిగి ఇవ్వ‌లేదంటూ పోలీసుల‌కు కంప్లైంట్ చేశారు. ఇక్క‌డ మ‌రో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.. హ‌ర్ష హీరోగా చేసిన‌ సెహ‌రి సినిమాకు నిర్మాత శిల్పా చౌద‌రీనే.  హ‌ర్ష ఫిర్యాదుతో ఇప్పటివరకు శిల్పా చౌద‌రి చేసిన‌ మోసాల విలువ‌ ₹10 కోట్లుగా తేలింది. అంతకు ముందు.. శిల్పాచౌదరిపై నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ముగ్గురు మహిళలు ఫిర్యాదు చేయగా.. వారి నుంచి ₹7.05 కోట్లు తీసుకుందని పోలీసులు తేల్చారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లలోనూ ఆమెపై కేసులు నమోదయ్యాయి.  కిట్టీ పార్టీల పేరుతో మహిళలను ఆకట్టుకున్న శిల్ప.. స్థిరాస్తి వ్యాపారం కోసం డబ్బు తీసుకొందని పోలీసులు గుర్తించారు. భారీగా లాభాలు ఇస్తామని నమ్మించి మోసం చేసిందని ఆమెపై ఫిర్యాదులు అందాయి. వీకెండ్‌ పార్టీల పేరుతో తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చేశారు. దివానోస్‌ పేరుతో క్యాసినో స్టార్ట్ చేశారు. సంపన్న కుటుంబాలకు చెందిన 90 మంది మ‌హిళ‌ల‌ను సభ్యులుగా చేర్పించుకున్నారు. వారాంతాల్లో విందులు, వినోదాల పేరుతో జ‌ల్సాలు చేయిస్తూ.. అప్పుల పేరుతో డ‌బ్బులు లాగేసేవారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని నుంచి 2 కోట్లు వ‌సూలు చేశారు. తాజాగా, హీరో హ‌ర్ష త‌నను 3 కోట్ల‌కు మోసం చేసిందంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. శిల్పా చౌద‌రి బాధితుల సంఖ్య పెరుగుతుండ‌టంతో.. తదుపరి విచారణకు 7 రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. అయితే, రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఆమె ఎవరెవరి వద్ద నుంచి ఎంత సొమ్ము తీసుకుందనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే, ఆ డబ్బును ఎక్కడికి మళ్లించారు? బ్యాంకు ఖాతాలకు సంబంధించిన లావాదేవీలపైనా లోతుగా ఆరా తీస్తున్నారు.  విచార‌ణ‌లో భాగంగా శిల్పాచౌద‌రికి చెందిన రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. అయితే వాటిలో అంతగా డబ్బు లేదని తెలిసింది. దీంతో మ‌రి కొల్ల‌గొట్టిన కోట్ల‌న్నీ ఆమె ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హ‌వాలా మార్గంలో విదేశాల‌కు పంపించార‌ని అంటున్నారు. మ‌రోవైపు, శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఆయ‌న‌ ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు.  

రాక్షస జాతిలా ప్ర‌జ‌ల‌ను పీల్చుకుతింటోన్న జ‌గ‌న్ ప్ర‌భుత్వం..

రాక్షస జాతిలా జ‌గ‌న్‌రెడ్డి ప్రభుత్వం ప్రజలను పీల్చుకుతింటోందని టీడీపీ అధినేత చంద్ర‌బాబు మండిప‌డ్డారు. అధికారంలోకి వచ్చిన తరువాత కమిషన్ వేయడం ఖాయం.. ఇప్పుడు తప్పు చేసిన వారిపై అప్పుడు చర్యలు తప్పవని హెచ్చ‌రించారు. ఏపీ ప్రజలు నవరత్నాలను నమ్మి.. నవగ్రహాలు చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు చంద్ర‌బాబు. ఎప్పుడో ఎన్టీఆర్ కట్టించిన ఇంటికి.. ఇప్పుడు జగన్ పట్టా ఇస్తాను అంటున్నాడు. డ్వాక్రా మహిళపై వేధింపులు మొదలు పెట్టారు. రాజ్యాంగం ఇంకా బతికే ఉంది.. తప్పును ప్రశ్నించే హక్కు అందరికీ ఉంది.. అన్నారు చంద్ర‌బాబు.   టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ‘ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం’ కార్యక్రమంలో చంద్ర‌బాబు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి దివ్యాంగులు తరలివచ్చారు. దివ్యాంగుడైన కోటేశ్వరరావు ఎన్టీఆర్‌కు, తనకు పైలట్‌గా ఉండేవారని చెప్పుకొచ్చారు. ప్రతి టూర్‌లో కోటేశ్వరరావు ముందు వెళ్లేవారన్నారు. దివ్యాంగుల కోసం ఒక కార్పొరేషన్ పెట్టి లక్షల మందికి సాయం చేసిన విషయాన్ని చంద్ర‌బాబు గుర్తు చేశారు. ‘విభిన్న ప్రతిభావంతులకు రూ.500 ఉండే పెన్షన్..3 వేలు చేశాం. చట్ట సభలకు దివ్యాంలను పంపే బాధ్యత నేను తీసుకుంటా!. దివ్యాగులకు రిజర్వేషన్‌లు ఇచ్చే ప్రయత్నం చేస్తాను’ అని చంద్రబాబు చెప్పారు. 

నాలుగు పోయి నాలుగొచ్చింది.. గుర్తుందా సీఎం సారూ..

నవంబర్ 4 వెళ్ళిపోయింది. డిసెంబర్ 4 వచ్చేసింది. కానీ, దళిత బంధు గొంగళి మాత్రం  ఎక్కడవేసింది అక్కడే, ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోడ్ కారణంగా ఎక్కడ ఆగిపోయిందో, అక్కడే నిలిచి పోయింది. అప్పట్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ‘ఆన్ గోయింగ్ స్కీమ్’ పై అంక్షలేంటి అటూ ఎన్నికల సంఘంపై మండిపడ్డారు. ప్రతిపక్షాలు కుట్రలుచేసి దళితులను మోసం చేస్తున్నాయని, విపక్షాలపైనా విరుచుకు పడ్డారు. అయినా, ఎన్ని కుట్రలు చేసినా ఎంతకాలం ఆపుతారు? అక్టోబర్ 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2 న హుజూరాబాద్ ఓట్ల లెక్కింపు అయిపోతుంది. గెల్లు శ్రీను గెలుస్తారు.  నాల్గవ తేదీతో కోడ్ ‘వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు ఎవరూ ఆపలేరు. నవంబర్ 4 నేనే హుజూరాబాద్ వచ్చి కుర్చుంటా.. మిగిలిన నియోజక వర్గాలకు ఒక ఆదర్శంగా నిలిచేలా పథకం అమలుచేస్తాము..అంటూ తెరాస ప్లేనరీ వేదిక నుంఛి ముఖ్యమంత్రి బహిరంగ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే, అక్టోబర్ 30 న హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ జరిగింది. రెండవ తేదీన ఓట్ల లెక్కింపు జరిగింది. గెల్లు గెలవ లేదు, ఈటల గెలిచారు.ఆ ఒక్క విషయంలో ముఖ్యమంత్రి లెక్క తప్పినా, ముఖ్యమంత్రి చెప్పింట్లుగానే 4 కోడ్ వెళ్ళిపోయింది. కానీ, మళ్ళీ మరో 4 తేదీ వచ్చినా, ముఖ్యమంత్రి హుజూరాబాద్ వెళ్ళలేదు. దళిత బంధు చెక్కులు పంచలేదు. అంతే కాదు, ముఖ్యమంత్రి ఈ నెలరోజుల్లో ఒక్క సారంటే, ఒక్కసారి,ఒక్క ముక్కంటే ఒక్క ముక్క దళిత బంధు గురించి మాట్లాడలేదు. ఈ  నెల రోజుల కాలంలో గంటల గంటలు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించారు. రాబోయే వేసంగిలో కేంద్ర ప్రభుత్వం వరిధాన్యం కొంటుందా లేదా అనే విషయంలో తాడో పేడో  తేల్చుకునేందుకు హైదరాబాద్’లో ఆందోళన చేశారు .. యుద్ధానికి ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఇంకా  చాలా విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు. అయినా, దళిత బంధు అనే మాట మాత్రం ముఖ్యమంత్రి నోటి నుంచి రాలేదు. ముఖ్యమంత్రే కాదు, అదేదో నిషేధిత పదమా  అన్నట్లుగా అధికార పార్టీ నాయకులూ ఎవరూ కూడా దలిత్ బందు ప్రస్తావన చేయలేదు.  అందుకే, దళిత బంధు కూడా, దళిత ముఖ్యమంత్రి ,మూడు ఎకరాలు, అంబేద్కర్ విగ్రహం, డబల్ బెడ్ రూమ్ జాబితాలో చేరిపోయిందని అనుకుంటున్నారు. మూడు ఎకరాల విషయంలో అసలు అలాంటి వాగ్దానమే ఏదీ చేయనేలేదని సెలవిచ్చిన విధంగా, ముఖ్యమంత్రి  ఎప్పుడో మరో మంచి ముహూర్తం చూసుకుని, దళిత బందా, అదేమిటి, ఆలాంటి హామీ ఇవ్వనే లేదు అని చెప్పగలరు. చెప్పి ఒప్పించనూ గలరు. దటీజ్ కేసీఆర్. మాటల గారడీలో కేసీఆర్’ ను కొట్టే వారు లేరు. మసిపూసి మారేడు కాయ చేయడం, తిమ్మిని బమ్మిని చేయడం, కేసీఆర్’కు కొట్టిన పిండి. అందుకే చెప్పేవి పచ్చి అబద్ధాలని తెలిసినా ఏ మాత్రం  తడుముకోకుండా ఆయన చెప్పదల్చుకున్నది చెప్పేస్తారు. ఆ విషయంలో ఆయన  దిట్ట అనిపించుకున్నారు.  అయితే,హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్  దళిత బందును ఆటకెక్కిస్తారని అందరూ అనుకున్నా, ప్రతిపక్షాలు కూడా ఆ విషయాన్ని అసలు పట్టించుకోక పోవడమే విచిత్రంగా ఉందని సామాన్య జనం విస్మయం వ్యక్త పరుస్తున్నారు. ఉప ఎన్నిక సమయంలో ఇదే విషయంపై ఎంతో రాద్ధాంతం చేసిన బీజేపీ అధ్యక్షుడు బడి సంజయ్, ఆ పార్టీ ఇతర నాయకులు అదే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏ ఒక్కరూ కూడా దళిత బందు పేరిట మరో మారు, దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించక పోవడం ఏమిటి? అని జనం ప్రశ్నిస్తున్నారు.అలాగే, మీడియా కూడా దళిత బంధు గురించి ముఖ్యమంత్రిని, మంత్రులను ప్రశ్నించక పోవడం.. ఏమిటి ? దళితులను దగా చేయడంలో అంతా ఒకటయ్యారా .. అంటే .. కాదనే పరిస్థితి కనిపించడం లేదు.

ప్రపంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్‌.. వచ్చిందంటే ఆగదు..

వచ్చేసింది. కరోనా మహమ్మరి మరో రూపం ఒమిక్రాన్‌ వచ్చేసింది. మన దేశంలోకి మాత్రమే కాదు ప్రపంచం మొత్తన్ని చుట్టేస్తోంది. ఇప్పటికే  30కి పైగా దేశాల్లో 370కి పైగా ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌’ పుట్టిల్లు దక్షిణాఫ్రికాలో కీలకమైన సార్స్‌కోవ్‌-2 ఆర్‌నాట్‌ విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వ్యాప్తిని అడ్డుకోవడం మరింత కష్టం కానుంది. భారత్‌లో కూడా ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించారు. వీరిలో ఒకరు డాక్టర్‌ కాగా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న ఐదురుగు కూడా తాజాగా కొవిడ్‌ పాజిటివ్‌గా తేలారు. వీరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందో లేదో మాత్రం తేలలేదు.కాగా, దక్షిణాఫ్రికాలో  ఒమిక్రాన్‌ వేరియంట్‌ను  విస్తరణ వేగాన్ని గమనిస్తే, ఒకసారి సారి దేశంలో ప్రవేశిస్తే ఇక కట్టడి చేయడం అయ్యేపని కాదని, అంటున్నారు. దక్షిణాఫ్రికా విషయాన్నే తీసుకుంటే,   నవంబర్‌ 16న ఆ దేశంలో  మాత్రమే   కేవలం 136 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, నవంబర్‌ 24న ఒమిక్రాన్‌ వేరియంట్‌తోలి కేసు నమోదు అయితే, రెండే రెండు రోజుల్లో నవంబర్‌ 26 నాటికి అక్కడ రోజువారీ కేసుల సంఖ్య 3,402కు పెరిగింది. అదే డిసెంబర్‌ 1 నాటికి 8,561కి చేరినట్లు లెక్కలు చెబుతున్నాయి.  కొత్త కేసులు ఎక్కువగా నమోదవుతున్న గౌటెంగ్‌ ప్రావిన్స్‌లో ఆర్‌నాట్‌ విలువ 2గా ఉందని  నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌ (ఎన్‌ఐసీడీ) వెల్లడించినట్లు నేచర్‌ పత్రిక కథనం పేర్కొంది. వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సామర్థ్యాన్ని ఆర్‌నాట్‌గా పేర్కొంటారు.ఆర్‌నాట్‌ విలువలో ఈ స్థాయి పెరుగుదలను కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో చూసినట్లు నిపుణులు చెపుతున్నారు.  కాగా, మన దేశంలో పరిస్థితిపై ఇంకా పూర్తి స్పష్టత రక పోయినా, ఇప్పటికే బెంగుళూరులో రెండు కేసులు నమోదిన నేపద్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పార్లమెంట్’లోనూ చర్చ జరిగింది.  రెండో విడత ఉద్ధృతిమిగిల్చిన చేదు అనుభవాల నేపధ్యంలో, ఒమిక్రాన్‌ను సకాలంలో కట్టడి చేసేందుకు కదలాలని విపక్షాలు ప్రభుత్వానికి సూచించాయి. టీకా బూస్టర్‌ డోస్‌పై స్పష్టతనివ్వాలని డిమాండ్‌ చేశారు. వృద్ధులు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్న వారికి మూడో డోసు ఇవ్వడంపై ప్రభుత్వం విధాన నిర్ణయాన్ని ప్రకటించాలని కోరారు. కొవిషీల్డ్‌ రెండు డోసుల మధ్య వ్యవధిని 86 రోజుల నుంచి తగ్గించాలని సూచించారు. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ వ్యాపిస్తున్నందున దేశంలోకి వచ్చే అంతర్జాతీయ విమానాలను నిషేధించాలని కోరారు.అయితే, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తూనే ఆచి తూచి అడుగులు వేస్తోంది.

అడ్డగోలు చలానాలపై హైకోర్టు అక్షింతలు..

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవుండదు..ఉండ కూడదు. ఆంద్ర ప్రదేశ్’లో పోలీసులు తలచు కున్నా, అంతే, ఎందుకు ఏమిటీ అన్న ప్రశ్నలు ఉండవు. అవును ఏపీలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన పేరిట, కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న విధంగా పోలీసులు అడ్డగోలు చలనాలు వాసులు చేయడం పై రాష్ట్ర హై కోర్టు విస్మయం వ్యకతంచేయడంతో పాటుగా అక్షింతలు కూడా వేసింది. విషయంలోకి వెళితే, ఏపీలో సర్కార్ వారి, ఆదేశాల మేరకో లేక వసూలు టార్గెట్లు మీట్ అయ్యేడుకో, ప్రజల జేబులకు చిల్లులు కాదు ఏకంగా కంతలే పెడుతున్నారు. అవసరం అయితే జేబులకు కత్తెర్లు కూడా వేస్తున్నారు.  అది మీ వాహనం అయినా కాకున్నా, అది మీదే అని పోలీసులు అంటే, ఓ ఫోటో తీసి దాని ఆధారంగా చలాన చెల్లించాలంటే, అంతే నోరుమూసుకుని చెప్పించవలసిందే. అంతే కాదు, బండి ఫోటో చూపించి డ్రైవర్’కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని చలానా పంపినా చచ్చుకుంటూ కట్టవల్సిందే కానీ, మారు మాట్లాడితే అది నేరం వుతుంది అన్నట్లుగా ఏపీ పోలీసుల వ్యవహారం నడుస్తోంది. అంతే కాదు చలనాలు ఇంటికి పంపించి ఊరుకోవడం కాదు, పోలీసులే వసూలు బాధ్యతలు కూడా తీసుకుని, ఫోన్లు చేసి జనాలను వేదిపులకు గురిచేస్తున్నారు. అయితే, ఈవిధంగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదంటూ ఓ ఫొటో తీసి, దాని ఆధారంగా చలాన్‌ చెల్లించాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదనడానికి ‘ఫొటో’ ఎలా సాక్ష్యం అవుతుందని పోలీసులను ప్రశ్నించింది.  లైసెన్స్‌ చూపలేదన్న కారణంతో పాటు హెల్మెట్‌ పెట్టుకోలేదని, సెల్‌ మాట్లాడుతూ వాహనం నడుపుతున్నానన్న కారణాలతో చల్లపల్లి పోలీసులు తనకు చలాన్‌ విధించడాన్ని సవాలు చేస్తూ కృష్ణాజిల్లా, మొవ్వ గ్రామానికి చెందిన తాతినేని లీలాకృష్ణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, పిటిషనర్‌ తరపు న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపలేదని ఆరోపిస్తున్న పోలీసులు.. అందుకు వారు తీసిన ఫొటోను సాక్ష్యంగా చూపుతున్నారని తెలిపారు. పోలీసులు చూపుతున్న ఫొటో లైసెన్స్‌ అడిగిన దానికి రుజువు కాదన్నారు. పోలీసులు చూపుతున్న ఫొటోలోని వ్యక్తి పిటిషనర్‌ కాదన్నారు. ఆ వాహనం కూడా పిటిషనర్‌ది కాదని, కేవలం వాహన నంబర్‌ మాత్రమే పిటిషనర్‌కు చెందిందన్నారు. పోలీసులు రోజూ ఫోన్‌ చేస్తూ చలాన్‌ చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు.   ఉమేష్ చంద్ర వాదనలతో ఎకీభవించిన న్యాయస్థానం, మోటారు వాహన చట్ట నిబంధలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశాన్ని చట్టం కల్పిస్తున్నప్పుడు, ఫోన్‌ చేసి చలాన్‌ మొత్తం చెల్లించాలంటూ ఒత్తిడి ఎలా చేస్తారంటూ నిలదీసింది. ఈ మొత్తం వ్యవహారంలో కౌంటర్‌ దాఖలు చేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కృష్ణా జిల్లా ఎస్‌పీని హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.  ఇదలా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పోలీసు చనాలాను, ప్రజలలో క్రమ శిక్షణ పెంచి ప్రమాదాలు తగ్గించేందుకు కాకుండా, ఒక ఆదాయ మార్గంగా చూస్తోందని ప్రతిపక్షాలు ప్రజలు  ఆరోపిస్తున్నారు. 2019లో  అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం ముందు చూపుతో  2020 నూతన సంవత్సర కానుకగా, ఆ సంవత్సరం జనవరి ఫస్ట్ నుంచి, (బహుశా వాహన చోదకులకు క్రమ శిక్షణ అలవరచేందుకు కావచ్చు) ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘినకు భారీ జరిమానాల వడ్డన కానుకగా ఇచ్చింది.  హెల్మెంట్ లేకపోయినా, సీటు బెల్ట్ పెట్టుకోకపోయినా, లైసెన్స్ లేకపోయినా, వేగంగా వాహనం నడిపినా అప్పటికున్నజరిమానాను,తక్కువలో తక్కువ పదిరెట్లు పెంచింది. పదుల్లో వందల్లో ఉన్న ఫైన్’ను వందలు కాదు వేలలోకి పెంచేసింది. రూ.1,000 నుంచి లక్ష రూపాయల వరకు జరిమానాలతో వాహనదారుల వెన్నులో వణుకుపుట్టించింది. దీని ప్రకారం, హెల్మెట్ లేకుండా బైక్, సీటు బెల్ట్ లేకుండా కారు నడిపితే వెయ్యి రూపాయల ఫైన్ తప్పదు. ఇక సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ బండి నడిపితే, ఏకంగా రూ.10,000 ఫైన్ కడితేనే బండి చేతికొస్తుంది. ఈ లెక్కన చూస్తే, ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏపీ పోలీసు చలానాల రూపంలో ఎంత మొత్తాన్ని దోచుకుందో అనే ప్రశ్నకూడా ఉదయిస్తోంది...చట్ట వ్యతిరేకంగా వసూలు చేసిన కోట్ల రూపాయల ప్రజాధనానికి ఎవరు బాధ్యులు .. అనేడి కూడా న్యాయ స్థానమే తేల్చాలని అంటున్నారు.

జ‌గ‌న్ నోట‌ పీఆర్సీ.. ఒమిక్రాన్ వ‌ర్రీ.. ఓటీఆఎస్ టెన్ష‌న్‌.. టాప్‌న్యూస్ @ 1pm

1. తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ నోట మరోసారి పీఆర్సీ మాట వచ్చింది. ముఖ్య‌మంత్రిని ఉద్యోగులు కలిసారు. పీఆర్సీ ప్రకటించాలని కోరారు. పది రోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చినట్టు ఉద్యోగులు తెలిపారు.  2. పీఆర్సీపై తిరుపతిలో సీఎం జగన్ చేసిన ప్రకటనపై ఉద్యోగ సంఘాలు స్పందించాయి. సీఎం ప్రకటనపై అధికారికంగా తమకు ఇంకా స‌మాచారం లేద‌ని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పారాజు అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట నిజమైతే స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే పీఆర్సీ ఒక్కటే ఉద్యోగుల సమస్య కాదన్నారు. సీపీఎస్ రద్దు, జీపీఎఫ్ నిధులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ లాంటి అనేక సమస్యలు ఉన్నాయని, వాటన్నింటిపైనా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో చర్చిస్తామని బొప్పారాజు చెప్పారు.  3. సీఎం జ‌గ‌న్‌ నెల్లూరు జిల్లా పర్యటన సంద‌ర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరద బాధితులు సీఎంను నిలదీస్తారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనను అడ్డుకుంటే అరెస్టు చేస్తామంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలపై ప్రశ్నిస్తారని అనుమానం ఉన్న వారందరికీ పోలీసుల వేధింపులు తప్పడంలేదు.  4. తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో 10 మందికిపైగా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. టిమ్స్‌లో చికిత్స పొందుతున్న మహిళ రిపోర్టు శుక్రవారం రానున్న క్రమంలో టెన్షన్ నెలకొంది. బ్రిటన్ నుంచి వచ్చిన వారందరినీ సర్వేలెన్స్‌లో పెట్టారు. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. 5. ఏపీలో వరదలు, వర్ష నష్టాల్లో మానవ తప్పిదం స్పష్టంగా కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. జగన్ సీఎం అయ్యాక.. ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం లేదని, అన్నమయ్య ప్రాజెక్ట్ మరమ్మతులు చేయలేదని విమ‌ర్శించారు. పంట రుణాలు మాఫీ చేయాలని, ఎకరాకు రూ. 50 వేలు పరిహారం ఇవ్వాలని, చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలన్నారు. 6. జవాద్ తుఫాన్ రాత్రికి తీరం దాటే అవకాశం ఉందని.. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ  సీఎం కృష్ణదాసు ఆదేశించారు. 11 తీర ప్రాంత మండలాల్లో ప్రభావం ఉండవచ్చన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. తుఫాన్ అనంతర చర్యలపై ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కంట్రోల్ రూమ్స్ ద్వారా పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.  7. ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్-ఓటీఎస్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. ఓటీఎస్‌పై కాకినాడలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించిన టీడీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 15 మంది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలపై తహశీల్దారు ఫిర్యాదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 34 రెడ్ విత్ 353, 109 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. 8. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డ్ ద‌గ్గ‌ర మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆందోళనకు దిగారు. అకాల వర్షాల తడిసిన ధాన్యాన్ని అధికారులు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఆఖరి  గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనని పక్షంలో రైతులతో కలిసి ఎంతవరకైన పోరాటం చేసేందుకు సిద్ధమని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. రైతులకు నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.  9. నెల్లూరు జిల్లాలో రాజధాని రైతుల మహాపాదయాత్ర మహా సంగ్రామంగా సాగుతోంది. శుక్రవారం నాటికి 33వ రోజుకు చేరుకుంది. శుక్రవారం వెంకటగిరి నియోజకవర్గం తురిమెర్ల నుంచి సైదాపురం వరకు పాదయాత్ర కొనసాగనుంది. ప్రతిపక్ష పార్టీల శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి రైతులకు మద్దతు తెలుపుతున్నారు. మ‌రోవైపు, పాదయాత్ర జరుగుతున్న ప్రాంతాల్లో ఆ పరిధి పోలీస్ స్టేషన్లలో కేసులు పెడుతున్నారు. మద్దతు తెలుపుతున్న నేతలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. 10. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 20న  శీతాకాల విడిది కోసం హైద‌రాబాద్ రానున్నారు. నాలుగు రోజులపాటు రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఆ మేర‌కు రాష్ట్రపతి నిలయంలో మౌలిక సదుపాయాలు మెరుగు ప‌రుస్తున్నారు. రాష్ట్రపతి నిలయాన్ని ఆనుకొని ఉన్న ఈఎంఈ పరేడ్‌ గ్రౌండ్‌లో హెలీప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రపతి న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్‌ఫోర్సు స్టేషన్‌లో దిగుతారు.  

వ‌ర‌ద యాత్రా? విహార యాత్రా? జ‌గ‌న‌న్నా సెల్ఫీ ఏంట‌న్నా?

రాయ‌ల‌సీమ‌పై ప్ర‌కృతి ప‌గ‌బ‌ట్టింది. వ‌రుణుడు విరుచుకుప‌డ్డాడు. వాగులు పొంగాయి. చెరువుల‌కు గండిప‌డ్డాయి. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతో అన్న‌మ‌య్య‌ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఊళ్ల‌కు ఊళ్లు కొట్టుకుపోయాయి. ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డారు. వేలాదిమంది నిరాశ్ర‌యుల‌య్యారు. సీఎం సొంతజిల్లా క‌డ‌ప జిల్లా క‌న్నీరు సంద్ర‌మైంది. క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు పాల‌కులు ప‌ట్టించుకోలేదు. అటువైపు కూడా తొంగి చూడ‌లేదు. ముఖ్య‌మంత్రికి త‌న‌ సొంత ప్రాంతమ‌నే మ‌మ‌కారం కూడా లేకుండా పోయింది. వాన‌లు వెలిశాక‌.. వ‌ర‌ద త‌గ్గాక‌.. ప‌రిస్థితి కుద‌ట‌ప‌డ్డాక‌.. తీరిగ్గా ప‌ర్య‌టించారు సీఎం జ‌గ‌న్‌రెడ్డి. అయితే, ఆయ‌న‌ వ‌ర‌ద ప్రాంత సంద‌ర్శ‌ణ‌కు వ‌చ్చారో లేక‌, విహార యాత్ర‌కు విచ్చేశారో అన్న‌ట్టు ఉంది వ్య‌వ‌హారం అంటున్నారు. సీఎం జ‌గ‌న్‌ హెలికాప్ట‌ర్ టూర్‌, సెల్ఫీ సంద‌డిపై సోష‌ల్ మీడియాలో తెగ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. జ‌గ‌న‌న్న ఇందేంద‌న్నా.. అంటూ కామెంట్ల‌తో కుళ్ల‌బొడుస్తున్నారు.  అస‌లే వాన‌లు, వ‌ర‌ద‌లు. స‌ర్వం కోల్పోయి క‌డ‌ప జిల్లా వాసులు దిగాలు. తిన‌టానికి తిండి లేక‌, తాగ‌డానికి మంచి నీరు లేక‌.. ఉండ‌టానికి ఇల్లు లేక‌.. ఉన్న‌దంతా వ‌ర‌ద పాలై.. జ‌నం విల‌విల్లాడుతుంటే.. జ‌గ‌న్‌రెడ్డి మాత్రం ఎంచ‌క్కా హెలికాప్ట‌ర్‌లో విహ‌రిస్తూ.. చిరున‌వ్వులు చిందిస్తూ.. స్వ‌యంగా సెల్ఫీలు తీసుకోవ‌డంపై.. స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఓ వైపు క‌డ‌ప ప్ర‌జ‌లు క‌న్నీరు కారుస్తుంటే.. మీ ముఖాల‌పై చిరున‌వ్వులు ఎలా వ‌స్తున్నాయి జ‌గ‌న‌న్న అంటూ నిల‌దీస్తున్నారు. తాము నిలువ నీడ లేకుండా బాధ‌ప‌డుతుంటే.. మీరు హెలికాప్ట‌ర్‌లో సెల్ఫీలు దిగుతూ సంద‌డి చేయ‌డమేంటని ప్ర‌శ్నిస్తున్నారు. విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మైన సెల్ఫీ ఇదే. సీఎం జ‌గ‌న్‌రెడ్డినే స్వ‌యంగా ఈ సెల్ఫీ తీశారు. హెలికాప్ట‌ర్‌లో సీఎంతో పాటు మంత్రి సురేశ్‌, ఎంపీ మిథున్‌రెడ్డి, సీఎంవో కార్య‌ద‌ర్శి ధ‌నుంజ‌య‌రెడ్డిలు ఉన్నారు. సెల్ఫీ క‌దా.. అందుకేనేమో అంతా న‌వ్వుతూనే ఉన్నారు. బ‌హుషా.. హెలికాప్ట‌ర్‌లో విహ‌రిస్తున్నాన‌నే సంతోషాన్ని ప‌దిలంగా సెల్ఫీలో దాచుకోవాల‌నుకున్నారో ఏమో.. ఇలా ముచ్చ‌ట‌ప‌డి ఫోటో తీసుకున్నారు. సెల్ఫీలు తీసుకోవ‌డం త‌ప్పేమీ కాదు. కానీ, ఆ స‌మ‌యం, సంద‌ర్భ‌మే అస్స‌లు బాగోలేద‌ని త‌ప్పుబ‌డుతున్నారు. వ‌ర‌ద బాధితులు విషాదంలో మునిగి ఉంటే.. ఆ వ‌ర‌ద ప్రాంతాల‌కు వెళుతూ ఇలా ఎంజాయ్ చేయ‌డ‌మేంట‌నేదే విమ‌ర్శ‌కులు ప్ర‌శ్న‌. 

ఏపీకి తుపాను గండం.. 'జ‌వాద్‌'తో జ‌ర జాగ్ర‌త్త‌..

ఏపీకి ఏ గ్ర‌హ‌ణ‌మో ప‌ట్టిన‌ట్టుంది. తీర‌ప్రాంతాన్ని ఏ శాప‌మో వెంటాడుతున్న‌ట్టుంది. పాల‌కులు చేస్తున్న పాపాలో.. ప్ర‌కృతి ప్ర‌కోప‌మో.. కార‌ణం ఏమో తెలీదు కానీ.. నిన్న‌టి వ‌ర‌కూ సీమ జిల్లాల‌ను వ‌రుణుడు దారుణంగా దెబ్బ తీస్తే.. తాజాగా ఉత్త‌రాంధ్ర‌పై జ‌వాద్ తుపాను విరుచుకుప‌డేందుకు రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. ఇది విశాఖకు 650 కి.మీ.. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 850 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.  బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గంటకు 32 కి.మీ వేగంతో ముందుకు కదులుతోంది. శ‌నివారం ఉదయానికి ఉత్తరాంధ్ర-ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. జ‌వాద్‌ ప్రభావంతో శుక్ర‌వారం నుంచే వ‌ర్షాలు కురువ‌నున్నాయి. ఉత్తరాంధ్రలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. భారీ వర్ష సూచనతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. శుక్ర‌వారం అర్ధరాత్రి నుంచి తీరం వెంబడి గంటకు 45-65 కి.మీ వేగంలో ఈదురుగాలులు వీయ‌నున్నాయి. శ‌నివారం ఉదయం నుంచి 70-90 కి.మీ వేగంలో బలమైన గాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు సోమవారం వరకు చేపల వేటకు వెళ్లరాదని తెలిపారు.  తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు జీవీఎంసీ, పోలీస్‌, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున అధికారులకు సూచించారు. తుపాను ప్రభావంతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. తుపాను సహాయక చర్యల కోసం 66 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌, 55 ఎస్డీఆర్‌ఎఫ్‌ సభ్యులను సిద్ధం చేసినట్లు చెప్పారు.    

మాస్క్ లేక‌పోతే వెయ్యి ఫైన్‌.. ప్ర‌జ‌ల‌కేనా? పాల‌కుల‌కు వ‌ర్తించ‌దా?

ప్ర‌పంచానికి ఒమిక్రాన్ భ‌యం. ఇండియాలోనూ ఆ మ‌హ‌మ్మారి ఎంట్రీ ఇవ్వ‌డంతో మ‌రింత క‌ల‌క‌లం. మ‌న ప‌క్క‌నే ఉన్న బెంగ‌ళూరులో అఫిషియ‌ల్‌గా రెండు కేసులు. ఇక అన‌ధికారికంగా? ఎన్నున్నాయో ఎవ‌రికీ తెలీదు. ఒమిక్రాన్ టెన్ష‌న్‌తో తెలంగాణ ప్ర‌భుత్వం సైతం అప్ర‌మ‌త్త‌మైంది. అనూహ్యంగా డీహెచ్ శ్రీనివాస‌రావు మీడియా ముందుకు వ‌చ్చి.. మ‌రింత భ‌య‌పెట్టారు. థ‌ర్డ్ వేవ్ ఎప్పుడైనా రావొచ్చ‌ని.. ఒమిక్రాన్ య‌మ డేంజ‌ర్ అని హెచ్చ‌రించారు. ప‌నిలో ప‌నిగా మ‌రుగున ప‌డిన రూల్‌ను మ‌రోసారి గుర్తు చేశారు. తెలంగాణ‌లో మాస్క్ పెట్టుకోక‌పోతే వెయ్యి రూపాయ‌ల ఫైన్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అదేంటి.. తెలంగాణ‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క ఒమిక్రాన్ కేసు కూడా రాలేదు.. అప్పుడే మాస్క్ లేక‌పోతే వెయ్యి ఫైన్ ఎందుకంటూ ప్ర‌జ‌లు విసుక్కుంటున్నారు.  ఇలా డీహెచ్ ప్ర‌క‌టించారో లేదో.. అలా పోలీసులు రోడ్ల‌పై వాలిపోయారు. మాస్క్ లేని వారిని ప‌ట్టుకుని ఫైన్లు బాదేస్తున్నారు. దొరికితే వెయ్యి. వామ్మో అంటున్నారు జ‌నాలు. సోష‌ల్ మీడియాలోనైతే మ‌రో ర‌క‌మైన డిమాండ్ వినిపిస్తోంది. మాస్క్ లేక‌పోతే ఫైన్లు మాకేనా? పాల‌కుల‌కు వేయ‌రా? రూల్స్ సామాన్యుల‌కేనా? రాజ‌కీయ నాయ‌కుల‌కు వ‌ర్తించ‌వా? అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా ఎందుకంటే... గురువారం నుంచి మాస్క్ లేక‌పోతే వెయ్యి ఫైన్ నిబంధ‌న అమ‌లు చేస్తున్నారు. ఇదే గురువారం సీఎం కేసీఆర్ గ‌ద్వాల జిల్లాకు వెళ్లారు. ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. చాలా మందితో క‌లిశారు. గ‌ద్వాల్ నుంచి హైద‌రాబాద్ తిరిగి వ‌స్తూ.. మార్గమధ్యలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. అంతా బాగానే ఉంది కానీ, ఆ ప‌ర్య‌ట‌న మొత్తంలో సీఎం కేసీఆర్ ఎక్క‌డా మాస్క్ ధ‌రించ‌లేదు. ఆయ‌న ప‌క్క‌న ఉన్న మంత్రులు, అధికారులు సైతం ఎలాంటి మాస్క్ పెట్టుకోలేదు. మ‌రి, వారికి ఫైన్ వేసే సాహ‌నం అధికారులు చేయ‌గ‌ల‌రా? సామాన్యుల నుంచి వెయ్యి వ‌సూలు చేసిన‌ట్టు కేసీఆర్ నుంచి ఫైన్ వ‌సూలు చేయ‌గ‌ల‌రా? అంటూ సోష‌ల్ మీడియాలో తెగ కుమ్మేస్తున్నారు.   కేసీఆర్ అనే కాదు.. ఏ రాజ‌కీయ నాయ‌కుడూ మాస్క్‌లు పెట్టుకోవ‌డం లేదు. మాస్క్ పెట్టుకుంటే మీడియాలో ఫేస్ స‌రిగ్గా క‌నిపించ‌ద‌నుకుంటారో ఏమో.. ఆద‌ర్శంగా నిల‌వాల్సిన నాయ‌కులు, అధికారులే మాస్క్‌ను ఎప్పుడో ప‌క్క‌న‌పెట్టేశారు. తాజాగా, కొత్త రూల్ తీసుకొచ్చినా.. వాళ్లంతా మాస్క్‌లు పెట్టుకుంటార‌నే న‌మ్మ‌కం లేదంటున్నారు. స్వ‌య‌నా సీఎస్ సైతం మాస్క్ లేకుండా క‌నిపిస్తుంటారు. ఆయ‌న‌కు కొవిడ్ వ‌చ్చిన‌ప్పుడు కూడా రెండు రోజుల‌కే మాస్క్ లేకుండా అధికారుల‌తో రివ్యూ నిర్వ‌హించ‌డం అప్ప‌ట్లో వివాదాస్ప‌ద‌మైంది. మాస్క్‌ను కంపల్స‌రీ చేయ‌డం.. ఫైన్ వేయ‌డంపై ఎవ‌రికీ అభ్యంత‌రం లేక‌పోవ‌చ్చు. అయితే, ఆ రూల్ అంద‌రికీ వ‌ర్తింప‌చేయ‌క‌పోవ‌డ‌మే వివాదాస్ప‌దం..అంటున్నారు.    

ప్రతిపక్ష శిబిరంలో మమత మంటలు...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ విపక్ష శిబిరంలో అగ్గి రాజేశారు. ప్రశాంత్ కిశోర్ పెట్రోల్ పోశారు. ప్రతిపక్ష కూటమిలో మంటలు భగ్గుమంటున్నాయి. అందరి లక్ష్యం ఒక్కటే, ‘బీజేపీని ఓడించాలి... మోడిని గద్దె దిచాలి’. అయినా, ఆలు లేదు .. చూలు లేదు .. కొడుకు పేరు సోమలింగం, అన్నట్లుగా, మోడీ దిగిన (?) కుర్చీలో ఎవరు కుర్చోవాలనే విషయంలో, కిస్సా కుర్సీకా’ ఆట మొదలైంది. మాటల యుద్ధం సాగుతోంది.  ప్రత్యర్ధిని పక్కన పెట్టి, విపక్షాలు తమలో తాము కుస్తీపట్లు పడుతున్నాయి. నాయకుకులు ఒకరిపై ఒకరు విరుచుకు పడుతున్నారు.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి ముచ్చటగా మూడవ సారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, జాతీయ రాజకీయాలపై మనసు పారేసుకున్నారు. మమతా బెనర్జీ ఆశకు, కిరాయి వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తోడయ్యారు. మమతా బెంనేర్జీ గతాన్ని మరిచి పోయి, దేశాన్ని మన్మోహన్ సింగ్ సారధ్యంలో  పదేళ్ళు పాలించిన, అందులో  స్వయంగా తాను  రైల్వే శాఖ మంత్రిగా పనిచేసిన కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి (యూపీఏ),అది ఎక్కడుంది... అదిప్పుడు లేదంటూ  చేసిన వ్యాఖ్య ప్రతిపక్ష పార్టీల మధ్య, ముఖ్యంగా కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ మధ్య చిచ్చు పెట్టింది. ప్రతిపక్ష కూటమి నాయకత్వం కోసం సిగపట్లకు తలపడేలా చేసింది.  ఇంతకాలం మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకులను ఎగరేసుకు పోతున్నా,అంతగా పట్టించుకోని కాంగ్రెస్ అధినాయకత్వం, మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యలతో ఇక ఉపేక్షించి లాభం లేదనే నిర్ణయానికి వచ్చింది. మమతకు గతాన్ని గుర్తు చేసి ఎదురు దాడికి దిగింది. చివరకు కాంగ్రెస్ పార్టీలో జీ 23 అసమ్మతికుంపటి రాజేసిన కపిల్ సిబల్ కూడా, ‘కాంగ్రెస్ లేని ప్రతిపక్ష కూటమి ఆటం లేని శరీరం వంటిద’ని ఘాటుగా స్పందించారు. మరో వంక ప్రశాంత కిశోర్, కూడా కాంగ్రెస్పై విమర్శలు గుప్పించారు. విపక్షాలకు నాయకత్వం వహించడం..ఆ పార్టీకి దేవుడు ఇచ్చిన హక్కుగా కాంగ్రెస్ భావిస్తుందని ఆరోపించారు. విపక్షాలకు ఎవరు నేతృత్వం వహించాలో వారే నిర్ణయించుకుంటారని ట్వీట్ చేశారు.దీంతో, రెండు కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరిగింది.   అయితే, మమతా బెనర్జీ కాంగ్రెస్ ముక్త విపక్ష కూటమి కోసం ఆశపడితే పడవచ్చును కానీ, కాంగ్రెస్ లేకుండా, ఆమె కలలు కంటున్నప్రాంతీయ పార్టీల కూటమి బీజేపీని ఎదుర్కోవడం అయ్యే పని కాదని, రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దేశం మొత్తంలో, ఐదు పది అటూ ఇటుగా  190 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. బీహార్ , తమిళనాడు సహా మరికొన్ని రాష్ట్రాలలోని  వందకు పైగా స్థానాల్లో కాంగ్రెస్ భాగస్వామ్య పార్టీగా ఉన్న కూటమి ప్రధాన ప్రతిపక్ష భూమికను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ 190 స్థానాల్లో ... కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాలకు పరిమితం అయ్యింది. మొత్తంగా చూసినా జతేఅయ్ స్థాయిలో తృణమూల్ కంటే కాంగ్రెస్ ‘స్పేస్’ ఎక్కువగా ఉందనేది కాదన లేని నిజం. మధ్య ప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్, కొంతవరకు కర్ణాటక, ఛత్తీస్ ఘర్ రాష్ట్రాలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్యనే  ఉంటుంది.కాబట్టి, కాంగ్రెస్ పక్కన పెట్టి, బీజేపీ  మీద  పై చేయి సాధించడం అయ్యే పనికాదు. నిజానికి, మమతా బెనర్జీని ముందుండి నడిపిస్తున్న వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, కూడా రెండుమూడు నెలల క్రితం  కాంగ్రెస్ లేకుండా ఏర్పడే ఫ్రంట్ ఏదీ బీజేపీని ఎదుర్కోలేదని అన్నారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా ఇంచుమించుగా ఇదే, అభిప్రాయం వ్యక్త పరిచారు.సో.. మమతా బెనర్జీ ప్రదాని కావాలని ఆశ పడితే ఆశ పడవచ్చును కానీ,అత్యాశకు పోతే మాత్రం భంగపాటు తప్పదని అంటున్నారు.

రైతులతో కేసీఆర్ మాట ముచ్చట.. వరి సాగు వద్దని సూచన

తెలంగాణ రైతులు వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న వేరుశనగ, పత్తి, మినుములు, పెసర్లు, శనగలు వంటి పంటల సాగు ద్వారా పంట మార్పిడి విధానాన్ని ఎంచుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. వరి వంటి ఒకే తరహా పంట వేసి ఇబ్బంది పడే కంటే ఇతర పంటల సాగు మీద కూడా దృష్టి కేంద్రీకరించాలని సీఎం పేర్కొన్నారు. గురువారం జోగులాంబ గద్వాల్ జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ వెళ్తూ.. ఆకస్మికంగా మార్గమధ్యంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్, కొత్తకోట మండలం విలియం కొండ తండా గ్రామ పంచాయతీ ఫరిధిలోని రైతులు సాగు చేసిన మినుము, వేరుశనగ పంటలను పరిశీలించారు. మొదట రంగాపూర్ దగ్గర ఆగిన సీఎం కేసీఆర్ రోడ్డు నుండి లోపలికి నడుచుకుంటూ వెళ్లి మహేశ్వర్ రెడ్డి అనే రైతు సాగు చేస్తున్న మినుము పంటను, రాములు అనే మరో రైతు సాగు చేస్తున్న వేరుశనగ పంటను పరిశీలించారు. మినుములు, వేరుశనగ దిగుబడి ఎంత వస్తుంది? మార్కెట్లో ధర ఎంత ఉంది? ఎన్ని తడులు నీళ్లు పెట్టాలి? అని రైతులను వివరాలు అడిగారు. మినుములు ఎకరానికి 8 నుండి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందనీ, క‌నీస మ‌ద్ధ‌తు ధర క్వింటాల్‌కు రూ. 6,300 ఉండగా, మార్కెట్‌లో ధర రూ. 8 వేలకు పైనే ఉందని రైతులు వివరించారు. వేరుశనగ 10 నుండి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనీ, క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌ క్వింటాల్‌కు రూ. 5550 ఉండగా, మార్కెట్‌లో రూ. 7 వేలకు పైనే ఉందని సీఎంకు రైతులు వివరించారు. పంటల మార్పిడి వల్ల భూసారం పెరిగి దిగుబడి బాగా వస్తున్నదని తెలిపారు. ఆ తర్వాత కొత్తకోట మండలం విలియం కొండ తండా రోడ్డు వద్ద కళ్ళంలో ఆరబోసిన వరి ధాన్యాన్ని సీఎం పరిశీలించారు. గోకరి వెంకటయ్య అనే రైతు వేరుశనగ పంట దగ్గరికి వెళ్లి పరిశీలించారు. సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ చెట్లను భూమి నుండి తీసి వేరుశనగ కాయలను స్వయంగా పరిశీలించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అకస్మాత్తుగా తమ పంట చేలల్లోకి రావడంతో రైతులు, గిరిజనులు సీఎంతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని సీఎం ఆదేశించారు.   

జగన్ కు బిగ్ షాక్.. తాకట్టులో హోదా.. సారీతో సరా..ఒమిక్రాన్ వచ్చేసింది.. టాప్ న్యూస్@8PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. పంచాయతీ నిధులను డ్రా చేస్తున్న ఏపీ ప్రభుత్వానికి  కేంద్రం చెక్‌ పెట్టింది. ఆర్థిక సంఘం నిధులు పంపేందుకు ప్రత్యేక అకౌంట్లను పంచాయతీ పేరిట ప్రారంభించాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో అలెర్టయిన పంచాయతీ రాజ్‌ కమీషనర్‌.. జడ్పీ సీఈఓలు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.--కడప జిల్లాలో వరద బీభత్సానికి గురైన వారి పట్ల సీఎం జగన్ ఉదారంగా స్పందించారు. రాజంపేట మండలం పులపుత్తూరులో పర్యటించిన ఆయన వరద బాధితులతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద బాధితులకు ఊరటనిచ్చేలా పలు హామీలు ఇచ్చారు. భారీ వర్షాలు, వరదలతో ఇళ్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు.  -------- వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం ఒక్క పోరాటం అయినా చేసిందా? అని టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై వైసీపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరని నిలదీశారు. టీఆర్ఎస్‌ ఎంపీల సంఖ్య తక్కువగా ఉన్నా పోరాడుతున్నారని, ఏపీ సమస్యలను వైసీపీ ఎంపీలు ఎందుకు ప్రస్తావించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  --- ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలిచ్చే పరిస్థితి లేదని పార్లమెంట్‌లో వైసీపీ ఎంపీ భరత్‌ చెప్పారని టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంధ్ర కుమార్ అన్నారు. చంద్రబాబు వల్లే ఈ ఆర్థిక పరిస్థితి అని సభను తప్పుదారి పట్టించారన్నారు. 63 ఏళ్లలో రాష్ట్రానికి రూ. 3 లక్షల 14 వేల కోట్ల అప్పు మాత్రమే ఉందని, జగన్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ. 3 లక్షల 8 వేల కోట్ల అప్పు చేశారని ఆరోపించారు. --- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ క్షమాపణలు చెప్పడంపై  సీపీఐ నేత నారాయణ స్పందించారు. అసెంబ్లీ ఘటనపై వంశీ క్షమాపణలు చెప్పడం స్వాగతించదగ్గ విషయమన్నారు. ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారం తీరు అన్యాయం, దురదృష్టకరమన్నారు. కుటుంబ పెద్దగా వ్యవహరించి కంట్రోల్ చేసి ఉండాల్సిందన్నారు నారాయణ.  ------- తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్ ఒమైక్రాన్ భారత్‌లో ప్రవేశించింది. కర్ణాటకలో ఇద్దరికి ఇది సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. ఈ రెండు కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్ బాధితులని తెలిపారు. -- తెలంగాణలో ఒమైక్రాన్ వేరియంట్‌ టెన్షన్‌ మొదలైంది. బ్రిటన్‌ నుంచి వచ్చిన ఓ మహిళకు ఒమైక్రాన్ పాజిటివ్‌ వచ్చినట్లు తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె నుంచి శాంపిల్స్‌ సేకరించిన అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపారు. అలాగే ఆ మహిళను టిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. బుధవారం విదేశాల నుంచి వచ్చిన 320 మందికి అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించారు. --- తెలంగాణకు చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణ ఈరోజు మంత్రి కేటీఆర్ ను ప్రగతిభవన్లో కలిశారు. ఈ సందర్భంగా తన జీవితం ఆధారంగా వచ్చిన "పూర్ణ" పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ కి అందించారు. ఈ సందర్భంగా పూర్ణ ప్రస్థానాన్ని అభినందించిన మంత్రి కేటీఆర్, ఆమె భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకున్నారు. పూర్ణ భవిష్యత్ ప్రయత్నాలకు సైతం గతంలో మాదిరే ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు.  ----- దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం గుట్టు రట్టు చేశామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. లోన్ బజార్, ద లోన్ ఇండియా, ఎస్బీఐ ధనీ బజార్ పేర్లతో నకిలీ కాల్ సెంటర్లను ఏర్పాటు చేసి వందల కోట్ల మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక స్ఫూఫింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ వస్తున్నట్టు నమ్మిస్తూ జనాలను వీరు మోసం చేస్తున్నారు. ---- 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కష్టమేనని కాంగ్రెస్ సీనియర్ సీనియర్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ అజాద్ అన్నారు. 300 ఎంపీ సీట్లను సాధించి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారాన్ని చేపట్టే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. 300 సీట్లలో కాంగ్రెస్ గెలుపొందాలని తాను కోరుకుంటున్నానని... అయితే అది సాధ్యమయ్యేలా లేదని చెప్పారు.  

బ‌స్సు కిటికీ నుంచి త‌ల బ‌య‌ట‌కి.. ఘాట్‌రోడ్‌లో యువ‌తి బ‌లి..

ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణం సుర‌క్షితం అంటారు. నిజ‌మే.. సుర‌క్షిత‌మే కావొచ్చు. కానీ, మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటేనే. లేదంటే.. బ‌స్సులో ఉన్నా ప్ర‌మాదం త‌ప్ప‌దు. అందుకు ఈ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం.  బ‌స్సు కిటికీలోంచి చేతులు బ‌య‌ట‌కు పెట్ట‌రాదు.. అని పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో రాసుంటుంది. పెద్ద‌లు చిన్న‌పిల్ల‌ల‌కు ప‌దే ప‌దే ఇలా జాగ్ర‌త్త‌లు కూడా చెబుతుంటారు. చేతులు బ‌య‌ట‌కు పెడితేనే ప్ర‌మాదమంటే.. ఇక త‌ల బ‌య‌ట‌కి పెడితే ఇంకెంత డేంజ‌ర్‌?  చిన్న పిల్ల‌నే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తుంటే.. మ‌రి పెద్ద‌లే అలాంటి అజాగ్ర‌త్త ప‌నులు చేస్తే ఎలా? శ్రీశైలం ఘాట్‌రోడ్డులో అదే జ‌రిగింది. ఓ యువ‌తి చ‌ర్య‌.. ఆమె నిండు ప్రాణం పోవ‌డానికి కార‌ణ‌మైంది. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే....  కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ప్రయాణంలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఆ యువతి తల బయటకు పెట్టింది. ఘాట్ రోడ్ అందాల‌ను ఆస్వాదిస్తోంది. కానీ, తాను చేస్తున్న ప‌ని ఎంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌దో ఆ స‌మ‌యానికి ఆమెకు తెలీదు. ఆ త‌ర్వాత తెలుసుకునేందుకు ఆమె ప్రాణాల‌తో లేదు.  యువ‌తి బ‌స్సు కిటికీ నుంచి త‌ల బ‌య‌ట‌పెట్టిన సమయంలో.. మలుపు ద‌గ్గ‌ర‌ ఎదురుగా వస్తున్న లారీ ఆమె తలకు బలంగా తగిలింది. త‌ల‌కే నేరుగా లారీ త‌గ‌ల‌డంతో.. తీవ్ర గాయాలతో.. ర‌క్త‌స్రావంతో.. ఆ యువ‌తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. శ్రీశైల యాత్ర అలా శోక‌సంద్రంగా మారింది. చిన్న నిర్ల‌క్ష్యం నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకున్న ఘ‌ట‌న ఆ కుటుంబంలో విషాధం నింపింది.

ఓ డ్రగ్స్ బానిస.. ఇద్ద‌రు మోడల్స్ మృతి ఘ‌ట‌న‌.. ఏంటా క్రైం క‌థ‌?

సీన్ ఓపెన్ చేస్తే.. అంద‌మైన కేర‌ళ‌. రాత్రి వేళ‌ హైవేపై ఓ కారు ర‌య్‌న దూసుకుపోతోంది. లాంగ్‌షాట్‌లో కారు లైట్స్ ఫోక‌స్ త‌ప్పా మ‌రేమీ క‌నిపించ‌డం లేదు. కారులోకి జూమ్ ఇన్ చేస్తే.. అందులో ఇద్ద‌రు అంద‌మైన మోడ‌ల్స్‌. వాళ్లు మామూలు మోడ‌ల్స్ అస‌లే కాదు. ఒక‌రు మాజీ మిస్ కేర‌ళ అన్సీ కబీర్‌ (24), ఇంకొక‌రు అదే పోటీలో రన్నరప్ అంజనా షాజన్ (25). వారితో పాటు మ‌రో ఇద్ద‌రు ఫ్రెండ్స్‌. కారును వేగంగా న‌డుపుతున్నాడు ఆ ఫ్రెండ్‌. సైడ్ మిర్ర‌ర్‌లోకి ప‌దే ప‌దే చూస్తూ.. కాస్త కంగారు ప‌డుతున్నారు. వారి కారు వెనుకే మ‌రోకారు త‌మ‌ను ఫాలో అవుతుంద‌ని గుర్తించి.. ఆ కారుకు చిక్క‌కుండా మ‌రింత స్పీడ్ పెంచుతున్నాడు. ఆ ఇద్ద‌రు మోడ‌ల్స్ సైతం వేగంగా పోనీయ్ అంటూ ఆరాట‌ప‌డుతున్నారు. క‌ట్ చేస్తే.. ఆ కారు రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఆ ఘ‌ట‌న‌లో ఆ ఇద్ద‌రు మోడ‌ల్స్ దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. వారి స్నేహితుడు తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. డ్రైవింగ్ చేస్తున్న అత‌ను సీట్ బెల్ట్ పెట్టుకోవ‌డంతో సేఫ్‌. యాక్సిడెంట్ స్పాట్ బీభ‌త్సంగా ఉంది. అక్క‌డితో సీన్ క్లోజ్ అయింది. పోలీసులు స‌మాచారం అందింది. వారు ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేశారు. నెల త‌ర్వాత కానీ.. అస‌లేం జ‌రిగిందో.. కార్ యాక్సిడెంట్ ఎలా, ఎందుకు జ‌రిగిందో.. ఆ కారును వెంబ‌డించిన ఇంకో కారు ఎవ‌రిదో.. అంతా డీటైల్డ్‌గా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పారు కేర‌ళ పోలీసులు. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..... నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేరళ మోడల్స్ మృతిచెందిన ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. డ్రగ్స్‌కు బానిసైన సాయిజు థంకచన్‌ అనే వ్యక్తే ఈ కేసులో ప్రధాన నిందితుడని తెలిపారు. అక్టోబర్ 31 రాత్రి జరిగిన కారు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్‌ (24), అదే పోటీలో రన్నరప్‌గా నిలిచిన అంజనా షాజన్ (25) దుర్మరణం చెందారు. కోచికి సమీపంలోని వైటిల్లా వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఓవ‌ర్ స్పీడ్‌తో ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే ప్ర‌య‌త్నంలో కారు బోల్తా కొట్టింది. ఇంత‌కీ అంత ఓవ‌ర్ స్పీడ్‌గా ఎందుకు వెళ్లాల్సి వ‌చ్చిందంటే... వారి కారును వెంబ‌డించింది ఎవ‌రంటే.... అన్సీ, అంజనా ఫ్రెండ్స్‌తో కలిసి అక్టోబర్ 31న ఒక పార్టీకి వెళ్లారు. అక్కడే డ్ర‌గ్గిస్ట్‌ సాయిజు థంకచన్‌ కూడా ఉన్నాడు. నిందితుడు సాయిజు.. ఆ ఇద్ద‌రు మోడల్స్‌తో అస‌భ్యంగా ప్రవర్తించాడు. రాత్రికి హోట‌ల్ రూమ్ బుక్ చేస్తా.. వ‌స్తారా.. అంటూ వేధించాడు. అందుకు ఒప్పుకోని మోడ‌ల్స్‌.. వారి స్నేహితులతో కలిసి హోటల్‌ నుంచి బయటకు వచ్చేశారు. కారులో ఇళ్లకు వెళ్లిపోతుండగా.. సాయిజు మ‌రో కారులో వారిని వెంబ‌డించాడు. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి.. సాయిజు కారును గమనించి మ‌రింత వేగంగా కారు నడపడం ప్రారంభించాడు. అదే ప్రమాదానికి కార‌ణ‌మైంది. కారు కంట్రోల్ త‌ప్పి.. బోల్తా ప‌డి.. ముగ్గురి ప్రాణాలు పోయాయని పోలీసులు ప్ర‌క‌టించారు. ఒమిక్రాన్ మన దగ్గరకు వచ్చేసింది.. మాస్క్ ఉంటేనే బయటికి రండి అయితే, డ్ర‌గ్స్‌కు బానిసైన సాయిజు థంక‌చ‌న్ ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడంటూ బాధిత కుటుంబ స‌భ్యుల ఆరోప‌ణ‌. ఈ ఘటనలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని, హోటల్ యజమాని భయపడుతున్నారని మోడ‌ల్‌ అంజన సోదరుడు అర్జున్‌ ఆరోపించారు. ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నారు. నిందితుడు సాయిజు థంక‌చ‌న్‌పై కేసు న‌మోదు చేసి.. కోర్టులో హాజరుపర్చారు.

ఒమిక్రాన్ మన దగ్గరకు వచ్చేసింది.. మాస్క్ ఉంటేనే బయటికి రండి

భయపడుతున్నట్లే జరిగింది. మాయదారి కొవిడ్ కొత్త వేరియంట్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది.  తీవ్ర కలకలం రేపుతున్న కోవిడ్-19 వైరస్ కొత్త రూపాంతరం ఒమైక్రాన్ మనదగ్గరకు వచ్చేసింది.కర్ణాటకలో ఇద్దరికి కొత్త వైరస్ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం ధ్రువీకరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఒమైక్రాన్ వేరియంట్ కేసులు రెండు మన దేశంలో నమోదయ్యాయని చెప్పారు. అత్యంత వేగంగా వ్యాపించే ఈ కేసులు మన దేశంలో నమోదవడం ఇదే తొలిసారి.  ఈ రెండు ఒమిక్రాన్ కేసులు కర్ణాటకలోనే ఉన్నట్లు లవ్ అగర్వాల్ తెలిపారు. 46 సంవత్సరాలు, 66 ఏళ్ళు వయసుగల ఇద్దరు పురుషులు ఈ వైరస్ బాధితులని తెలిపారు. వీరిలో ఒకరు నవంబరు 11న, మరొకరు నవంబరు 20న దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు తెలిపారు.  ఒమైక్రాన్ లక్షణాలు మన దేశంలో ఇప్పటి వరకు మరీ అంత తీవ్రంగా లేవని వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ వైరస్‌కు సంబంధించిన కేసులన్నిటిలోనూ చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇప్పటి వరకు మన దేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెల్లడైన ఈ కేసుల్లో తీవ్రమైన లక్షణాలు కనిపించలేదని తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలపై అధ్యయనం జరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిందన్నారు.  ఒమైక్రాన్ రూపాంతరాన్ని మొదట దక్షిణాఫ్రికాలోని బోట్స్‌వానాలో గుర్తించారు. ఆ తర్వాత ఇది సుమారు 10 దేశాలకు వ్యాపించింది. ఇది మరింత విస్తరించకుండా మన దేశం కఠిన చర్యలు అమలు చేస్తోంది. అంతర్జాతీయ ప్రయాణికులపై దృష్టి పెట్టింది. ఒమిక్రాస్ తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వాళ్లపై ప్రత్యేక నిఘా పెట్టింది కేంద్రం. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది. 

ఎస్బీఐ, ధ‌నీ బ‌జార్‌, లోన్ బ‌జార్‌.. న‌కిలీల ఖేల్ ఖ‌తం.. వారెవా స్టీఫెన్..

ఎక్క‌డో ఉంటారు. ఇంకెక్క‌డికో ఫోన్ చేస్తారు. +1860 180 1290 అనే నంబర్ నుంచి కాల్ వ‌స్తుంది. తాము ఎస్బీఐ కాల్ సెంట‌ర్ నుంచి ఫోన్ చేస్తున్న‌ట్టు న‌మ్మిస్తారు. ట్రూ కాల‌ర్‌లోనూ ఈ నెంబ‌ర్ ఎస్బీఐదేన‌ని సూచిస్తుంది. క‌స్ట‌మ‌ర్లు నిజ‌మేన‌ని భ్ర‌మ‌ప‌డ‌తారు. ఆ త‌ర్వాత భారీగా మోస‌పోతారు. ఇలా 33వేల మందికి కాల్స్ చేసి.. కోట్ల రూపాయ‌లు కొల్ల‌గొట్టారు ఆన్‌లైన్ కేటుగాళ్లు. ఇది ఒక త‌ర‌హా మోసం. ఇక మ‌రో న‌కిలీ ముఠా ఉంది. లోన్లు ఇప్పిస్తామంటూ మోసం చేస్తారు. ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్లతో నకిలీ యాప్‌లు క్రియేట్ చేస్తారు. నకిలీ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యాక వ్యక్తిగత వివరాలు తీసుకొని ఆ తర్వాత రుణం మంజూరైనట్లు చెబుతారు. ప్రొసెసింగ్‌ ఫీజు పేరిట అధిక మొత్తంలో నగదు తీసుకుంటారు. ఆ త‌ర్వాత ఎంత‌కీ లోన్ అమౌంట్ క్రెడిట్ కాదు. తాము మోస‌పోయామ‌ని తీరిగ్గా తెలుస్తుంది.  ఇలా ఎస్బీఐ కాల్ సెంట‌ర్‌, లోన్ యాప్‌లతో దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న అతిపెద్ద సైబ‌ర్ క్రైంను సైబ‌రాబాద్ పోలీసులు ఛేజించారు. ఆ రెండు ముఠాల స‌భ్యుల‌ను అరెస్ట్ చేశారు. ఆ వివ‌రాల‌ను సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్ల‌డించారు.  ఓ ముఠా ఢిల్లీలో ఎస్‌బీఐ నకిలీ కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. ఈ కాల్‌సెంటర్‌ నుంచి దేశవ్యాప్తంగా ఏడాదిలోనే 33 వేల కాల్స్ చేసి రూ.కోట్లు కాజేసినట్లు గుర్తించారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 209 కేసులు నమోదైనట్లు స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. ఎస్‌బీఐ ఏజెంట్ల నుంచి ఖాతాదారుల వివరాల తీసుకొని క్రెడిట్‌కార్డు దారుల నుంచి ముఠా డబ్బులు కాజేస్తున్నట్లు చెప్పారు. అసలైన ఎస్‌బీఐ కస్టమర్‌ కేర్‌ నుంచే ఫోన్‌ వచ్చినట్లు భ్రమింప జేసేందుకు స్ఫూఫింగ్‌ యాప్‌ వాడుతున్నారని.. ఈ యాప్‌ వాడకంలో ఫర్మాన్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. 1860 180 1290 అనే నంబరును స్ఫూపింగ్ చేస్తున్నట్లు వివరించారు. 14 మంది నిందితులను అరెస్టు చేసి 30సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కారు, బైకు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇక.. ధనీ బజార్‌, ద లోన్ ఇండియా, లోన్‌ బజార్ పేర్ల‌తో న‌కిలీ యాప్‌ల‌ను క్రియేట్ చేసి కోట్లు దండుకున్న కేసులో.. ఆ ముఠాలోని 14 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి 17 చరవాణులు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌ వెల్లడించారు. ఇలాంటి మోస‌గాళ్ల నుంచి ప్ర‌జ‌లే జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ క్యాంప్.. ఎమ్మెల్సీ ఎన్నికలో కారుకు షాకేనా?

కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి.  ఇక్కడి రెండు స్థానాలను ఏకగ్రీవం చేసుకుందామని ఆశించిన టీఆర్ఎస్​కు సొంత పార్టీ లీడర్లు షాకిచ్చారు. ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచిన మాజీ మేయర్ సర్దార్​రవీందర్ సింగ్, ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి బరిలో నిలిచారు. అయినా పూర్తి బలం ఉన్నా అధికార పార్టీకి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. రవీందర్ సింగ్  రోజుకో రకంగా రూలింగ్​పార్టీకి చుక్కలు చూపుతున్నారు.  కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతు కూడగడుతూనే రూలింగ్​పార్టీ క్యాంపుల్లోని ఓటర్లతో టచ్​లో ఉన్నారనే వార్తలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి.  కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్సీ పరిధిలో 1,324 ఓట్లు ఉన్నాయి. ఇందులో 994 మంది స్థానిక ప్రతినిధులు అధికార పార్టీ సభ్యులే. మిగితా 330 మంది కాంగ్రెస్‌, బీజేపీ, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారు. సంఖ్యా బలం ఆధారంగా రెండు సీట్లను కారు పార్టీ ఈజీగానే గెలుచుకుంటుంది. అయినా టీఆర్‌ఎస్‌ పార్టీ తన స్థానిక సంస్థల ప్రతినిధులను క్యాంపులకు తరలించింది. బెంగుళూరులో అధికార పార్టీ క్యాంపు రాజకీయాలు  కొనసాగుతున్నాయి. ఇదే ఇప్పుడు  ఆసక్తికరమైన చర్చకు తెరతీసింది. పూర్తి బలం ఉన్నా టీఆర్ఎస్  పార్టీ ఎందుకు క్యాంపు రాజకీయాలను చేస్తున్నది. స్వంత పార్టీ సభ్యులపై నమ్మకం కోల్పోయిందా.. క్రాస్‌ ఓటింగ్‌ జరిగే అవకాశముందా...ఈటల రాజేందర్‌ చెబుతున్నట్లుగా రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌ ఇక్కడ విజయం సాధించబోతున్నారా అన్న చర్చ అన్ని రాజకీయ పార్టీల్లో జోరుగా సాగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు పరోక్ష మద్దతు ఇస్తున్నట్లు తెలిసింది. బీజేపీకి స్థానిక సంస్థల్లో 100 మంది ప్రతినిధులు ఉండగా కాంగ్రెస్‌కు 200 పైచిలుకు ఓట్లు ఉన్నాయి.  టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎల్ రమణ, భాను ప్రసాదరావు పోటీ చేస్తున్నారు ఎల్​రమణ ఈ మధ్యే టీడీపీ నుంచి వలసరాగా,  భానుప్రసాద్​రావు ఒకప్పుడు కాంగ్రెస్​ నేత. ఇద్దరిలో ఏ ఒక్కరూ ఉద్యమ సమయంలో పార్టీ జెండా మోసినవారు కాదు. వీరిద్దరికీ ఫీల్డ్​లెవల్​ టీఆర్ఎస్​ లీడర్లతో గానీ, ప్రస్తుత ఓటర్లతో గానీ ఎమోషనల్​ సంబంధాలు లేవు. కానీ రవీందర్​సింగ్​  ఉద్యమకాలం నుంచి టీఆర్ఎస్​లో ఉండడంతో ఆయన సానుభూతి కలిసివస్తుందనే భయం రూలింగ్​ పార్టీని వెంటాడుతోంది. పార్టీలకతీతంగా లీడర్లను కలిసి మద్దతు కోరుతున్నారు రవీందర్ సింగ్. ఇప్పటికే కాంగ్రెస్​ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంథని ఎమ్మెల్యే, కాంగ్రెస్ లీడర్ శ్రీధర్ బాబును కలిసి తనకు మద్దతు ఇవ్వాలని అడిగారు.  తాజాగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ పెట్టింది. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నారు. మంథని నియోజకవర్గం నుంచి క్యాంపునకు 35 మంది ప్రజాప్రతినిధులు వెళ్లారు. పోటీలో లేని కాంగ్రెస్.. క్యాంపు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.  శ్రీధర్‌బాబు శిబిరం అధికార పక్షాన్ని దెబ్బతీసే లక్ష్యంతో రవీందర్‌సింగ్‌కు ఓటు వేసి గెలిపిస్తుందా అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.  రవీందర్‌సింగ్‌ ఎమ్మెల్సీగా గెలువబోతున్నారంటూ  ఈటల రాజేందర్ ప్రకటిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందు నుంచే ఉమ్మడి జిల్లా పరిధిలోని తన మద్దతుదారులతో స్థానిక సంస్థల ప్రతినిధులను సమీకరించి వారి మద్దతు కూడగట్టారని స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను సూచించిన వారికి ఓటు వేసే విధంగా ఆయన వారిని సంసిద్ధులను చేశారని ప్రచారం జరుగుతోంది. రవీందర్‌సింగ్‌ టీఆర్‌ఎస్‌ పార్టీలో తొలినుంచి ఉన్న వ్యక్తిగా అందరితో విస్తృత సంబంధాలు ఉన్నాయి. ఒక ఓటు టీఆర్‌ఎస్‌ పార్టీకి వేసినా అన్యాయం జరిగిన ఉద్యమసహచరుడిని అయిన తనకు ఇంకో ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా వివిధ రాజకీయ పక్షాల నేతలు, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తివాదులు, ప్రజాసంఘాల నాయకులు రవీందర్‌సింగ్‌ గెలుపుకోసం తమకు పరిచయం ఉన్న, తమ మాట వినే ప్రతినిధులతో మాట్లాడి ఓట్లు వేయించే బాధ్యత తీసుకుని ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు.  మిగితా జిల్లాలతో పోలిస్తే కరీంనగర్​లో రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇటీవల హుజూరాబాద్​ ఫలితమే ఇందుకు నిదర్శనమని  పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో విజయం కోసం రూలింగ్​ పార్టీ వేల కోట్లు ఖర్చు పెట్టినా ఓటుకు రూ.6వేల చొప్పున పంచినా చివరికి ఈటల రాజేందర్​ వైపే జనం మొగ్గుచూపారు. అందుకే తాము క్యాంపులుపెట్టినా, ఓటుకు ఇంత అని ముట్టజెప్పినా చివరకు ఓటర్లు ఏం చేస్తారోననే భయం టీఆర్ఎస్​ లీడర్లను వెంటాడుతోందని అంటున్నారు. 

పీకే టీంతో కేసీఆర్ భేటీ.. అందుకేనా?

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశ పడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకే అయినా ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం నిలుపుకునేందుకు ఆరాట పడుతున్న జగన్మోహన్ రెడ్డికే  అయినా ఎన్టీఆర్ లాగా ఎంట్రీతోనే అధికార పగ్గాలు చేపట్టాలని ఆశ పడుతున్న వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకే అయినా, ఇంకా రాజకీయ అధికారానికి గాలిలో నిచ్చెనలు వేస్తున్న ఇతర నాయకులు, పార్టీలు ఎవరికైనా, చివరకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఒక్కరే దిక్కవుతున్నారు. కొంచెం ముతగ్గా ఉన్నా .. అక్కమొగుడే దిక్కు అన్నట్లుగా, దేశంలో చాలా మంది నాయకులు, పార్టీలకు, రాజకీయ బేహారులకు ప్రశాంత్ కిశోర్, ఆయన బృందమే దికవుతోంది.   ఇప్పుడు పీకే  క్లైంట్స్ జాబితాలో మరో కొత్త పార్టీ, కొత్త నేత పేరు కూడా వినిపిస్తోంది. అవును అత్యంత విశ్వసనీయ వర్గల సమాచరం మేరకు  పీకే బృందానికి చెందిన నలుగురు సభ్యుల బృందం, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమైంది. బెంగుళూరుకు చెందిన సురేష్ అనే పీకే టీమ్ లీడర్ సారధ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసిన ఈ బృందం, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఎన్నికలల్లో తమ క్లైంట్స్ ని గెలిపించేందుకు ఏమి చేస్తారో, ఎలా చేస్తారో, వారి స్ట్రాటజీ ఏమిటో సవివరంగా వివరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది . పీకేతో తెరాస చర్చలు జరపడం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితమే మంత్రి కేటీఆర్ నేరుగా పీకేతోనే ఒకటి కంటే ఎక్కువసార్లే కలిసినట్లు తెలుస్తోంది. అప్పుడే, పీకే తో డీల్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిక్స్ అయింది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం వచ్చిన తర్వాత పరిస్థితినిబట్టి ఫైనల్ నిర్ణయ తీసుకుందామని, అక్కడ ఓ బ్రేక్ తీసుకున్నారని,ఇందుకు సంబదించి ప్రతి అడుగును దగ్గర నుంచి గమనిస్తున్న సన్నిహిత వర్గాల సమాచారంగా తెలుస్తోంది. హుజూరాబాద్ ‘డస్ట్’ కొంత సర్డుమణిగిన నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసేఆర్ సూచనల మేరకు తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కేశవ రావు  మరో ఇద్దరు ఎంపీలు రెండు రోజుల క్రితం ఢిల్లీలో పీకే బృందంతో సమావేశ మయ్యారు. ఢిల్లీలో కేకేతో సమావేశమైన సురేష్ బృందమే, బుధవారం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పవర్ పాయింట్ ప్రేజెంటేషన్ ద్వారా  ‘స్ట్రాటజీ’ మొత్తం వివరించి నట్లు సమాచారం. అయితే ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు.  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వరసగా మూడవసారి గెలిపించడంలో కీలక భూమికను పోషించిన పీకే, ఇప్పుడు జాతీయ స్థాయిలో మమతా బెనర్జీ నాయకత్వంలో ప్రాంతీయ  పార్టీలను ఏకం చేసి పనిలో ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాలో అటు వైసీపీ, ఇటు  తెరాస, వైఎస్సార్ టీపీలతో కుదుర్చుకున్న డీల్, మమతా దీదీతో కుదిరిన హోల్  సేల్  డీల్ లో భాగమా, లేక ఇది సెపరేట్ అది సెపరేట్ ఒప్పందమా అనేది ..కూడా ఇంకా తేల వలసి వుంది. అయితే, పరిణామాలను బట్టి చూస్తే  హుజురాబాద్ ఓటమికి ముందు కుక్కను నిలబెట్టినా గెలుస్తారనే, అతి విశ్వాసం, అహంకారం నుంచి కేసీర్ బయటకు వచ్చారనేది మాత్రం .. నిజం.   ఇప్పటికే  ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీతో . తెలంగాణలో వైఎస్సార్ టీఎస్ తో డీల్ కుదుర్చుకున్న పీకే టీమ్ ఉభయ తారకంగా ఉండేలా ఉభయ తెలుగు రాష్ట్ర్రాలకు ఉమ్మడి స్ట్రాటజీ కూడా ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే, చివరకు ఏమి జరుగుతుంది అనేది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్  అంటున్నారు. 

సాయంలో ముందుండే సినీ స్టార్లు.. జ‌గ‌న్ దెబ్బ‌కు అంతా దిగాలు..

కొవిడ్ వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాల‌ను వ‌ణికించింది. లాక్‌డౌన్‌తో యావ‌త్ స‌మాజం స్థంభించింది. ప్ర‌జ‌లు అల్లాడిపోయారు. ప్ర‌భుత్వాల‌కు చిల్లిగ‌వ్వ కూడా ఆదాయం లేదు. అప్పుడు మేమున్నామంటూ ముందుకొచ్చారు తెలుగు సినిమా హీరోలు. భారీ విరాళాల‌తో రెండు రాష్ట్రాల‌ ప్ర‌భుత్వాల‌కు, ప్ర‌జ‌ల‌కు చేయూత అందించారు. రెబెల్ స్టార్ ప్ర‌భాస్ అంద‌రికంటే అధికంగా 4 కోట్ల విరాళం ఇచ్చారు. పీఎం రిలీప్ ఫండ్‌కు 3 కోట్లు.. ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్‌కు చ‌రో 50 ల‌క్ష‌లు డొనేష‌న్ అందించారు. రియ‌ల్ హీరో అనిపించుకున్నారు. ప్ర‌భాస్ అనే కాదు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ 2 కోట్లు.. మ‌హేశ్‌బాబు కోటి.. రామ్‌చ‌ర‌ణ్ 70 ల‌క్ష‌లు.. బ‌న్నీ 50 ల‌క్ష‌లు.. ఎన్టీఆర్ 25 ల‌క్ష‌లు.. ఇలా ఇలా అనేక మంది టాలీవుడ్ ప్ర‌ముఖులు చేతికి ఎముకే లేన‌ట్టు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చి తెలుగు రాష్ట్రాల‌కు అండ‌గా నిలిచారు. తాజాగా, రాయ‌ల‌సీమ వ‌ర‌ద బాధితుల కోస‌మూ మేముసైత‌మంటూ ముందుకొచ్చారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, మ‌హేశ్‌బాబు, బ‌న్నీ, అల్లు అర‌వింద్ ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు ల‌క్ష‌ల రూపాయ‌లు డొనేష‌న్లు ఇచ్చారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ‌ద‌ర బాధితుల‌కు ఆస‌రాగా నిలిచారు.  ఇంతా చేస్తే.. బ‌దులుగా జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం ఏం చేసింది? తెలుగు సినిమాను చంపే ప్ర‌య‌త్నం చేస్తోందంటున్నారు. అగ్ర హీరోల‌ను, పెద్ద సినిమాల‌ను ఆర్థికంగా దెబ్బ కొడుతోంద‌ని మండిప‌డుతున్నారు. కొవిడ్ క్రైసిస్‌, సీమ ఫ్ల‌డ్స్ అనే కాదు.. గ‌తంలో తెలుగు రాష్ట్రాల‌కు ఎలాంటి క‌ష్టం వ‌చ్చినా.. ఎలాంటి విప‌త్తు దాపురించినా.. అంద‌రికంటే ముందు వ‌రుస‌లో సాయానికి ముందుకొచ్చింది సినిమా వాళ్లే. క‌ష్ట‌ప‌డి సంపాదించిన సొమ్ములో.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చింది టాలీవుడ్ వారే. అలాంటి సినిమానే దెబ్బ తీసే చ‌ర్య‌ల‌కు పూనుకుంటే..? బెనిఫిట్ షోలు ర‌ద్దు చేస్తే..? టికెట్ రేట్లు బాగా త‌గ్గిస్తే..? సినిమా వాళ్ల ఆర్థిక మూలాల‌ను దారుణంగా దెబ్బ కొడితే..? ఎవ‌రికి న‌ష్టం? నేరుగా సినిమా రంగమే నాశ‌నం అయినా.. హీరోలు, నిర్మాత‌లు, ఎగ్జిబిట‌ర్లు, డిస్టిబ్యూట‌ర్లు, థియేట‌ర్లు.. ఇలా అన్నీ వ్య‌వ‌స్థ‌లు ఆర్థికంగా ప‌త‌న‌మైనా.. ఈ న‌ష్టం ప‌రోక్షంగా తెలుగు ప్ర‌జ‌ల‌పైనా ఎంతోకొంత ప్ర‌భావం చూప‌క‌మాన‌దు. టికెట్ మీద వ‌చ్చే రూపాయో, రెండు రూపాయ‌ల ప‌న్ను కోస‌మో.. జ‌గ‌న్‌రెడ్డి ఇంత‌లా పంతానికి పోవ‌డం వ‌ల్ల‌.. మొత్తం ఫిల్మ్ ఇండ‌స్ట్రీ దెబ్బ తినే ప్ర‌మాదం లేక‌పోలేదంటున్నారు.  స‌ర్కారు వారి దెబ్బ‌.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముస‌ళ్ల పండుగ‌.. ప‌రిశ్ర‌మ న‌ష్ట‌పోతే.. ప‌రోక్షంగా హీరోలూ లాస్ అవుతారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు ఇప్ప‌టికే అఖండ క‌లెక్ష‌న్ల‌కు కోత‌లు పెట్టాయంటున్నారు. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న‌.. పుష్ప‌, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయ‌క్‌, రాథేశ్యామ్‌, ఆచార్య‌.. సినిమా వ‌సూళ్లు దారుణంగా దెబ్బతినే ప్ర‌మాదం ఉందంటున్నారు. రాథేశ్యామ్ క‌లెక్ష‌న్లు త‌గ్గితే.. ప్ర‌భాస్ గ‌తంలో మాదిరి మ‌రోసారి 4 కోట్ల విరాళం ఇవ్వ‌గ‌ల‌రా? ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల‌ను జ‌గ‌న్ స‌ర్కార్ టార్గెట్ చేస్తే.. క‌రోనా కాలంలో ఇచ్చిన‌ట్టు 2 కోట్లు డొనేష‌న్ ఇవ్వ‌డం పీకేకు కుదురుతుందా?  పుష్ప బెనిఫిట్ షోలు ఆపితే బ‌న్నీ.. ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్ల‌కు కోత పెడితే రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌లు ఇక‌పై అన్నేసి ల‌క్ష‌లను సాయంగా ఇవ్వ‌డం సాధ్య‌మ‌య్యేనా? ఏళ్లుగా ఆప‌ద వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా మేమున్నామంటూ ముందుకొచ్చే సినీ ప‌రిశ్ర‌మ‌ను జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం ఇంత‌లా టార్గెట్ చేయ‌డం.. టార్చ‌ర్ చేయ‌డం.. స‌మంజ‌స‌మేనా?  సాయం చేసే చేతుల‌ను క‌లెక్ష‌న్ల సంకెళ్లతో బంధించ‌డం జ‌గ‌న‌న్న‌కు త‌గునా? అని ప్ర‌శ్నిస్తున్నాయి సినీ వ‌ర్గాలు. వారి నుంచి సాయం పొందిన బాధిత జ‌నాలు.