పీవీకి దండేయ లేదు, దండం పెట్టలేదు! శత జయంతి ఉత్సవాలు ప్రచారానికేనా?
దివంగత, మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు వర్ధంతిని పురస్కరించుకుని అటు ఢిల్లీలో ఇటు రాష్ట్రంలో పలువురు రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. ఆయన రాష్ట్రానికి దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు కాంగ్రెస్ తదితర పార్టీల నాయకులు, జ్ఞాన భూమిలో యోగ నిద్రలో ఉన్న తెలంగాణ బిడ్డ, పీవీకి నివాళులర్పించారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ, పీవీ కుమార్తె సురభి వాణీదేవి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌజ్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, కాంగ్రెస్ సీనియర్ వి.హన్మంతురావుతో పాటు పలువురు ప్రముఖులు పీవీ ఘాట్ వద్ద పుష్పాంజలి ఘటించారు.అయితే, ఎంత మంది వచ్చినా రావలసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రాలేదు. నివాళులు అర్పించలేదు.
అలాగని పీవీ నరసింహ రావు పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కు గౌరవం లేదని కాదు. పీవీ శత జయంతి ఉత్సవాలను, 2020 జూన్ 28 నుంచి 2021 జూన్ 28 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో మాత్రమే కాదు, విదేశాల్లో కూడా, ‘కోట్ల’ పండగగా పీవీ శత జయంతి ఉత్సాలను నిర్వహించారు. కేకే, రమణాచారి వంటి పెద్దల సారధ్యంలో ఏర్పడిన కమిటి చాలా చాలా ‘ఘనం’ గా ఏడాది పొడుగునా ఉత్సవాలను నిర్వహించింది. అందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. గత సంవత్సరం జూన్ 28 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన పీవీ శత జయంతి ముగింపు వేడుకలను కుడా అంతే ఘనంగా నిర్వహించారు. జ్ఞానభూమిలో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. నక్లెస్ రోడ్డుకు పీవీ మార్గ్’ గా నామకరణం చేశారు.ఆ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు అని పొగిడారు. పీవీని ఎంత గౌరవించుకున్నా తక్కువే అని కేసీఆర్ అన్నారు. పీవీ ఒక కీర్తి శిఖరమని కొనియాడారు.
అంత గౌరవం ఉన్న ఆయన ఇంతలోనే అంతటి మహనీయుని ఎందుకు మరిచి పోయారు? ఎందుకు విస్మరించారు.. ప్రగతి భవన కు కూతవేటు దూరంలో ఉన్న జ్ఞానభూమికి వెళ్లి గుప్పెడు పూలేసి.. ఓ దండం పెట్టి వచ్చేందుకు కేసీఆర్’ కు ఎందుకు మనసు రాలేదు ? అంటే, సమాధానం అందరికీ తెలిసిందే. రేవు దాటే దాకా ఓడ మల్లయ్య .. రేవు దాటిన తర్వాత బోడి మల్లయ్య ఇదే కదా .. కేసీఆర్ నైజం, అన్ని అనేవాళ్ళు అంటున్నారు. అప్పటి అవసరాల కోసం కేసీఆర్ పీవీని గౌరవించారు. శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడమే కాదు, పీవీ కుమార్తె, సురభి వాణీదేవికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి. పీవీ సెంటిమెంట్’ ప్లస్ క్యాస్ట్ ఈక్వేషన్’ కలిపి ఆమెను గెలిపించుకోవడమే కాదు, దుబ్బాక, జీహెచ్ ఎంసీ వరస ఓటముల నుంచి కాసింత ఉపశమనం పొందారు. ఇప్పుడు అలాటి అవసరం ఏదీ లేదు కాబట్టి .. పీవీ పుష్పగుచ్చానికి కూడా నోచులోలేదు. కేసీఆర్ మాత్రమే కాదు, కేకే కూడా ..పీవీ విగ్రహనికి దండేయ లేదు .. దండం పెట్టలేదు.