సీక్రెట్ సీఎం.. బొమ్మ సీజ్.. లాక్ డౌనేనా.. టాప్ న్యూస్@7PM
posted on Dec 23, 2021 @ 6:31PM
రైతులకు ప్రభుత్వం అండగా ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్షకులకు చంద్రబాబు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటాయన్నారు. రుణాలు, విత్తనాలు, ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉందని, కనీస మద్దతు ధర లేక వ్యవసాయం సంక్షోభంలో ఉందన్నారు.
------
రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని, రాష్ట్ర బాగుంటేనే దేశం బాగుంటుంది అనేదే తమ విధానమని ట్విట్టర్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా అన్నదాతలకు ట్విట్టర్ ద్వారా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగులో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని ఆయన తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని కోరామన్నారు
----
జగనన్న రహస్య పాలన ఎందుకో అర్ధం కావడం లేదని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఏపీలో రెండేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెప్పారని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తైన ఇళ్లను కూడా ఎవరికి ఇవ్వడం లేదని విమర్శించారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సీఎం జగన్ ఏదో దేవాలయాలకు చేస్తున్నారని అంటున్నారని, దేవాలయాలకు, చర్చిలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకూడదని చెప్పారు.
-------
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ పర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా ఓటీఎస్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని విమర్శించారు.కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇస్తున్నా ఉపయోగించుకోవడం లేదని విమర్శించారు.
--------
చిత్తూరు జిల్లాలో పలు థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. కుప్పంలో నాలుగు సినిమా థియేటర్లను సీజ్ చేశారు. బీ ఫామ్ లైసెన్స్ రెన్యువల్ కాకపోవడమే సీజ్‌కు కారణమని తెలుస్తోంది. మ్యాట్నీ ఫస్ట్ షో టికెట్లను ఆన్‌లైన్లో బుక్ చేసుకున్న ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే పలమనేరులోనూ మూడు సినిమా థియేటర్లను అధికారులు మూసివేశారు.
----
హీరో నాని వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. ‘‘ప్రేక్షకులను మేమెందుకు అవమానిస్తాం. సినిమా సామాన్యులకు అందుబాటులో ఉండాలి. అందుకే సినిమా టికెట్ల ధరలు తగ్గించాం. మాకు ఇబ్బందులు ఉన్నాయని చెబితే అప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తుంది. మార్కెట్‌లో ఏదైనా కొంటే దానికి ఎమ్మార్పీ ఉంటుంది కదా. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా? అని బోత్స అన్నారు.
----
సినీ హీరోలను దెబ్బ తీయడం, ఇండస్ట్రీని నాశనం చేయడమే జగన్ లక్ష్యమని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. సినిమా వారి నుంచి కమిషన్లు రావడం లేదనే జగన్ వారిపై కక్ష కట్టారని చెప్పారు. థియేటర్లపై దండయాత్ర చేసేందుకు అధికారులను పంపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే పట్టించుకోని జగన్... సినిమా టికెట్ల అంశానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నారని విమర్శించారు.
------
ఒమైక్రాన్ కట్టడి విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను గౌరవిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఒమైక్రాన్ కట్టడికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎయిర్‌పోర్ట్‌లో విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ టెస్ట్ చేస్తామన్నారు. కేంద్రం బూస్టర్ డోస్, చిన్న పిల్లల వ్యాక్సినేషన్‌పై స్పందించడం లేదన్నారు. ఇతర దేశాలు బూస్టర్ డోస్ ఇవ్వాలని చెబుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు.
-----
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తమిళనాడులో తాజాగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 30 మంది విదేశాల నుంచి రాగా, ఒకరు కేరళ నుంచి వచ్చారు. మరో ఇద్దరు తమిళనాడులోనే ఒమిక్రాన్ బారినపడినట్టు తెలుస్తోంది. ఈ 33 మందిలో ఇద్దరు తప్ప మిగిలినవారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. అయినప్పటికీ కొత్త వేరియంట్ సోకడం ఆందోళన కలిగిస్తోంది.
----
సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. మాజీ ప్రధాని చౌధరీ చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చరణ్ సింగ్ జయంతిని రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయనను అఖిలేశ్ గుర్తు చేసుకున్నారు. రైతుల కోసం సర్వస్వాన్ని అర్పించిన వ్యక్తి చరణ్ సింగ్ అని... ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు.
--
సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం రాబోయే సీజన్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాటింగ్ కోచ్ గా వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ బ్రియాన్ లారాను నియమించింది. అసిస్టెంట్ కోచ్ గా ఆసీస్ మాజీ ఆటగాడు, బెంగళూరు మాజీ చీఫ్ కోచ్ సైమన్ కటిచ్ ను తీసుకువచ్చింది. బౌలింగ్ కోచ్ గా సఫారీ దిగ్గజం డేల్ స్టెయిన్ ను నియమించింది. హెడ్ కోచ్ గా టామ్ మూడీ, స్పిన్ బౌలింగ్ కోచ్ గా, వ్యూహ బృందంలో సభ్యుడిగా ముత్తయ్య మురళీధరన్ ను కొనసాగించాలని నిర్ణయించింది.