ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి సెగ.. నగరి వైసీపీలో రచ్చ రచ్చ
posted on Dec 23, 2021 @ 2:46PM
ఫైర్ బ్రాండ్ లీడర్, నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు అసమ్మతి నేతలు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. అసమ్మతి నేతలు అయిదుగురు పోటాపోటీగా సీఎం జగన్ జన్మదిన వేడుకలను నిర్వహించడంతో .. అసలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు అనే డైలమాలో కేడర్ పడిపోయింది. దీంతో నగరిలో అసమ్మతి రాజకీయం ముదిరి పాకాన పడింది. ఎమ్మెల్యే రోజా అన్నీ తానే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అయితే తమ వల్లే ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే అయిందంటూ.. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన అసమ్మతి నాయకులు బాహటంగా చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఓ వీధి నాటకంగా మారిందనే టాక్ వైరల్ అవుతోంది.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో రోజా కేవలం ఎనిమిది వందల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైయస్ జగన్ ప్రభంజనం కనిపిస్తున్నా ఆమె కేవలం రెండు వేల మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం రోజాపై తిరుగుబాటు చేస్తున్న సదరు నాయకులు గత రెండు ఎన్నికల్లోనూ రోజా గెలుపు కోసం కృషి చేశారు. కానీ 2019 ఎన్నికల తర్వాత రోజా కుటుంబ పాలనకు తెర తీశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ఈ అయిదు మండలాలకు అయిదుగురు కుటుంబ సభ్యులను ఇన్‌ఛార్జ్‌లుగా రోజా నియమించారని సమాచారం. దీంతో ఈ మొత్తం వ్యవహారాలన్నీ వీరే చూసుకుంటున్నారు.
ఇప్పటి వరకు పార్టీ కోసం పని చేసిన నేతలు.. పార్టీ కోసం తమ చేతి చమురు వదిలించుకున్న నేతల.. మాటలు ప్రభుత్వ కార్యాలయాల్లో చెల్లుబాటు కాని విధంగా తయారైందని సదరు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ పార్టీ గాలే వీచింది. అలాగే నగరి నియోజకవర్గంలో కూడా ఏకపక్షంగా వైయస్ఆర్ సీపీ గెలుపొందింది. సదరు ఎన్నికల్లో అసమ్మతి నాయకులు ఫ్యాన్ పార్టీకీ వ్యతిరేకంగా పనిచేశారని.. అయినా తమ పార్టీ సునాయసంగానే గెలుపొందిందని రోజా వర్గం భావిస్తుంది. ఆ క్రమంలో సదరు అయిదు మండలాల నేతలను ఈ రోజా వర్గం దూరంగా పెట్టింది.
స్థానిక సంస్థలో నిండ్ర మండలం నుంచి మెజార్టీ ఎంపీటీసీలను చక్రపాణి రెడ్డి వర్గం కైవసం చేసుకుంది. అయినప్పటికీ రోజా తన వర్గానికి చెందిన వ్యక్తిని ఎంపీపీ చేసింది. ఇది అప్పట్లో పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో మొత్తం అసమ్మతి నాయకులంతా ఏకమై పోయి.. రోజా నాన్ లోకల్ అనే అంశాన్ని తెరపైకీ తీసుకు వచ్చి రచ్చ రచ్చ చేస్తున్నారు. అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో స్థానికులకే టిక్కెట్ ఇవ్వాలంటూ.. వారికే తాము సహకరిస్తామంటూ అసమ్మతి నేతలు బల్లగుద్దీ మరి అధిష్టానానికి చెబుతున్నారు. ఆ క్రమంలోనే ఇటీవల జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఈ రెండు వర్గాలు పోటా పోటీగా భారీ ఎత్తున నిర్వహించాయి.
పుత్తూరులో ఎలుమలై పట్టణం మొత్తం భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని అర్ధరాత్రి మరో వర్గం వారు చింపి వేయడంతో పోలీస్ స్టేషన్ ఎదుట నిరసనకు దిగగా.. వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నగరి, నిండ్ర ,వడమాలపేట ,పుత్తూరు, విజయపురం మండలాలకు చెందిన ఐదుగురు నేతలు తమ అనుచరులతో భారీగా ర్యాలీ నిర్వహించి.. ఎమ్మెల్యే రోజాపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీకి గత పది సంవత్సరాలుగా పనిచేసిన వారిని కాకుండా ఇప్పుడు పార్టీలో చేరిన వారికి ఇక్కడ న్యాయం జరుగుతుందంటూ వారు విమర్శులు గుప్పించారు. రాష్ట్రమంతా జగనన్న పాలన జరుగుతుంటే.. నగరి నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే రోజా కుటుంబ పాలన నడుస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యే రోజా తన బలాన్ని నిరూపించుకోవడానికే సీఎం జగన్ జన్మదిన వేడుకలను ఉపయోగించుకున్నారు.. ఆ క్రమంలో విందు వినోదాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగనన్నకు ప్రియమైన చెల్లెలనని.. తాను ఏమి చెప్తే అది జగనన్న వింటారని, అందువల్లనే అసమ్మతి నాయకులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టానని రోజా పేర్కొంటుండగా...
మరోవైపు నగరి నియోజకవర్గంలోని ఆసమ్మతి నాయకులకు మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి, ఆమె భర్త కుమార్‌కు ఈడిగా కార్పొరేషన్ పదవి కట్టబెట్టడంతోపాటు అదే మండలానికి చెందిన చక్రపాణి రెడ్డిని శ్రీశైలం ఆలయ పాలక మండలి ఛైర్మన్‌గా నియమించడంలో మంత్రి పెద్దిరెడ్డి కీలకంగ వ్యవహరించారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. అయితే ఎమ్మెల్యే రోజా మాత్రం తనకు ఎదురే లేదనే ధోరణిలో ముందుకు దూసుకుపోతున్నారు.
చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను విమర్శించడంలో ఎమ్మెల్యే రోజా ముందు ఉన్నారు. కానీ రోజా విమర్శలకు ప్రతి విమర్శలు చేసే నాయకులు మాత్రం చిత్తూరు జిల్లా టీడీపీలో కనిపించడం లేదనేది సుస్పష్టం. కానీ రోజా విమర్శల ఎఫెక్ట్ ఆమెకే ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయని రాజకీయ విశ్లేషఖులు పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడుపై రోజా విమర్శల వర్షం కురిపించినా అంతా లైట్‌గానే తీసుకున్నారు. కానీ నారా భువనేశ్వరిపై రోజా కామెంట్స్‌ను మాత్రం ప్రజలు తీవ్రంగా పరిగణిస్తున్నారన్న సంగతి తెలిసిందే.
మరోవైపు కేబినెట్ విస్తరణలో రోజాకు మంత్రి పదవి గ్యారెంటీ అని అనుచరులు ప్రచారం అయితే చేసుకుపోతున్నారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడం.. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ భారీగా నగదు ఖర్చు చేయడంతో జగన్ పార్టీ గెలుపు నల్లేరు మీద నడక అయింది. కానీ వాపును చూసి బలుపు అనే రీతిలో రోజాతోపాటు ఆమె అనుచర గణం వ్యవహరిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు గత ఎన్నికల్లో గాలి ముద్దుకృష్టమ్మనాయుడు రెండో కుమారుడు జగదీష్ తన సోదరుడు భాను ప్రకాష్‌కి వ్యతిరేకంగా పని చేశారు. ఈ నేపథ్యంలో రోజా గెలుపు సాధ్యమైందనే ప్రచారం అయితే నియోజకవర్గంలో బలంగా ఉంది. మొత్తం మీద రోజాకి మాత్రం ఈ అయిదుగురు నేతల వల్ల నగరి నియోజకవర్గంలో తీవ్ర ఎదురుగాలి వీస్తుందనేది మాత్రం స్పష్టమవుతోంది.